Jump to content

అబద్ధాల వేట - నిజాల బాట/ఇస్లాం (అరబ్) సామ్రాజ్యవాదం

వికీసోర్స్ నుండి
ఇస్లాం(అరబ్)సామ్రాజ్యవాదం

అన్వర్ షేక్ పాకిస్తాన్ నుండి ఇంగ్లండ్ వచ్చి స్థిరపడి సొంతంగా ఇస్లాం, కొరాన్, సంప్రదాయాలు బాగా చదివాడు. అతడిని దిగ్భ్రాంతిపరచిన విషయాలు బయటపెట్టాడు. అడుగడుగునా మానవహక్కుల్ని వ్యతిరేకిస్తూ, సామ్రాజ్యవాదం స్థాపించే ఇస్లాం ప్రయత్నం అతడికి జుగుస్స కలిగించింది. జీవితమంతా ఇస్లాంలొ కాచివడపోసి గ్రంథస్థం చెయడానికి పూనుకున్నాడు. అతడు కవి కూడా. సొంత ఖర్చులతో పుస్తకాలు వేసి భావప్రచారం సాగిస్తున్నాడు. తాను మానవవాదిని అని సగర్వంగా ప్రకటించుకున్నాడు.

అన్వర్ షేక్ అభిప్రాయాలను తట్టుకోలేని ఇంగ్లండు ఛాందస ముస్లింలు ఫత్వా జారీచేశారు. సమాధానం చెప్పలేక, వాదించలేక బలప్రదర్శనకు దిగడమే ఫత్వా సారాంశం. తస్లీమా నస్రీన్ కు బంగ్లాదేశ్ లో, సాల్మన్ రష్దీపై ఇరాన్ లో ఫత్వాల సారాంశం యిదీ. ముస్లిం ఛాందసులు తమపై వచ్చే విమర్శకు హేతుబద్దంగా ఏమీ చెప్పలేరు. మతాన్ని అడ్డం పెట్టుకొని చంపుతామంటారు. అందుకు నిరసనగా అన్వర్ షేక్ నిలుస్తున్నాడు.

అన్వర్ షేక్ సిద్దాంతం

యూరపు పార్లమెంటులో ఓసోస్టాండ్లర్ నివేదిక చర్చకు వచ్చింది. పాశ్చాత్య ప్రపంచం ఇస్లాం గురించి విపరీత భయాందోళన చెందుతున్నదనడానికి ఆ నివేదిక నిదర్శనం. పెరిగిపోతున్న మతమౌఢ్యం పట్ల ప్రజాస్వామికవాదులు హెచ్చరికలు చేస్తున్నారు.

ముస్లింలలో టెర్రరిస్టులు పెరిగిపోవడం, ముస్లిమేతరుల పట్ల వ్యతిరేకత, అసహనం అధికంగావడం, ఇదంతా ఇస్లాం పేరిట వ్యాపించడం నిత్యకృత్యంగా మారింది.

ఇస్లాం ప్రకారం ముస్లింలందరూ ప్రపంచమంతటా తమ మతాన్ని వ్యాపించేటంత వరకూ వూరుకోరాదు. ముస్లింలు వున్న దేశంలో అధికారం ముస్లిమేతరుల చేతుల్లో వుంటే, ఆ దేశాన్ని దారుల్ హర్బ్ అంటారు. ఆ దేశం ముస్లిం దేశంగా మారేటంతవరకూ నయాన భయాన కృషి సాగించాలి. ఒకసారి ఇస్లాం దేశంగా మారిన తరువాత దారుసలాం అవుతుంది. అంటే శాంతిదేశమన్న మాట.
దేశభక్తి, మాతృదేశం అన్నీ ఏమౌతాయి? ఇస్లాం ప్రకారం ముస్లింలందరూ అరేబియాను మాత్రమే పవిత్రంగా భావించాలి. ముస్లిం తండ్రి, తల్లి, సోదరి, సోదరుడు, ఎవరైనాసరే ఇస్లాంను పాటించకపోతే, వారిని ద్వేషించాలి. ఇస్లాంను స్వీకరించేవరకూ ముస్లింలు తిప్పలు పడాలి. అందుకుగాను టెర్రరిజం ఆచరించినా, చంపినా, దోచినా, నరికినా, మోసగించినా ఫరవాలేదు. అంతిమలక్ష్యం ఇస్లాంగా మారడమే.

ఇస్లాంను వ్యాపింపజేసే ప్రయత్నంలో ముల్లాలు (మతగురువులు) కీలకపాత్ర వహిస్తున్నారు. కీలకమంతా వారి చేతులో వుండడం వలన ఎన్నికైనవారు సైతం వారికి అడుగులకు మడుగులు వత్తాల్సి వస్తున్నది.

ఇస్లాంను వ్యతిరేకించే వారిపై ఫత్వాలు జారీచేసి, రచయితల, తాత్వికుల స్వేచ్ఛను అరికడుతున్నది ముల్లాలే.

ముల్లాలు ఇస్లాం ను పాటిస్తున్నారా? లేదు. వారే ఇస్లాంకు ద్రోహులు.

కొరాన్ లో స్పష్టంగా "మత నిర్బంధం కూడదు" అనీ, "నిజంగా నిలబడదలిస్తే నీ వాదన రుజువు చేసుకో" అనీ వుంది. (Cow : 111)

కొరాన్ ప్రకారం క్రైస్తవులు, హిందువులు, బౌద్ధులు, సిక్కులు, నాస్తికులు, యూదులు అంతా అపనమ్మకస్తులే. వారంతా నరకానికి పోతారు.

ఇస్లాంలో అతిప్రధాన విషయం ప్రవక్త. మహమ్మద్ సమకాలీనులలో తాలిహ, ముసేలిమా అల్ అస్వాద్ అనేవారు తాము ప్రవక్తలమన్నారు. చివరకు పోరాటంలో మహమ్మద్ నెగ్గి నిలిచాడు. జనాన్ని సమ్మోహనంలో పడేయడానికి ప్రవక్త అనేది చక్కని సాధనం. దేవుడు అందరితో మాట్లాడడు. ఎవరికీ కనిపించడు. కనుక తనతో మాట్లాడాడనీ, తన ద్వారా ఆయన సందేశం అందిస్తున్నాడనీ అంటే ప్రవక్త మాటల్ని జనం నమ్ముతారు.

దేవుడు ఒక వ్యక్తిని నియమించినట్లు ఆధారాలు ఏమీ వుండవు. రుజువుకు నిలబడవు. నమ్మేజనం రుజువులు అడగరు. దేవుడు నాకు కనిపించి చెప్పాడంటూ ప్రవక్తలు నమ్మించేవన్నీ తెలివిగా ఆడే అధికార రాజకీయ నాటకమే.

అన్వర్ షేక్ తన "ఇస్లాం" రచనలో మహమ్మదు గురించి వివరంగా పరిశీలించి, ఆశ్చర్యకరమైన వాస్తవాలు బయటపెట్టాడు.

అల్లాను పక్కనబెట్టి మహమ్మదుకే ప్రాధాన్యత సంతరించేటట్లు చేయడం కీలక విషయం. రాజకీయవాదిగాను, జాతీయ సామ్రాజ్యవాదిగాను మహమ్మద్ తన గొప్పతనాన్ని నిలబెట్టుకున్నాడు.

ముస్లింలు రోజూ చేసే ప్రార్ధనలో మహమ్మద్ ను స్తుతించడం అంతర్భాగం.
దారూద్ అనే పేరిట ముస్లింలు మహమ్మద్ ను ఆరాధిస్తారు. నటియకలాం అనే మహమ్మద్ స్తుతిని ప్రత్యక్షంగా పాటిస్తున్నారు. కవాలి కూడా మహమ్మద్ స్తుతిగానే సూరాలు ప్రచారంలో పెట్టారు. అల్లాతోబాటు మహ్మద్ ను చేర్చి షహాదా ప్రమాణం చేస్తారు.

కొరాన్ ప్రకారం అల్లాతోబాటు ఇంకెవరిని చేర్చినా తప్పుగా భావించాలి. దీనికి భిన్నంగా మహమ్మద్ ఆచరణ పేరిట సాధించాడు.

నమ్మకాల గురించి హేతుబద్ధంగా ఆలోచించరాదంటూ మహమ్మదు తెలివిగా తన స్థానాన్ని కాపాడుకున్నాడు. తనను అనుకరిస్తే లాభిస్తుందన్నాడు.

ప్రవక్త అనే భావన మానవుడి తెలివితేటలకు నిదర్శనం. ప్రవక్త చేతిలో దేవుడు కీలుబొమ్మ.

తన కోర్కెలను,లక్ష్యాలను సాధించడానికి దేవుడిని అడ్డం పెట్టుకోవడమే ప్రవక్త చేసిన గొప్ప నాటకం. ఇది అందరు ప్రవక్తలకూ వర్తిస్తుంది.

మహమ్మదు చాలా తెలివిగా కొరాన్ ను వాడుకున్నాడు. తానే చివరి ప్రవక్తను అని చాటుకోవడం అతడి తెలివికి పరాకాష్ఠ. అరబ్బు సామ్రాజ్యవాదానికి పితామహుడు మహమ్మదు ముస్లిం జాతీయవాదం ప్రారంభించాడు. దీని ప్రకారం ప్రపంచంలో ముస్లింలు ఎక్కడున్నా, అరేబియా ఔన్నత్యాన్ని గుర్తించాలి. అదే వారి పవిత్ర మాతృ, పితృభూమి, వారుండే దేశం రెండో స్థానంలో వుంటుంది. జీవితంలో ఒక్కసారైనా అరేబియా యాత్ర చేసి రావాలనే నమ్మకం కలిగించారు. అన్వర్ షేక్ సూత్రాన్ని విడమరచి, ఉదాహరణగా భారతదేశాన్ని స్వీకరించాడు. ముస్లిం లు ఇండియాలో తమ మసీదులను, చారిత్రక కట్టడాలను, ద్వితీయ స్థానంలో వుంచి, అరేబియా వైపు చూడడం ఇస్లాం సామ్రాజ్యవాదంగా చెప్పాడు. దీనివలన రాజకీయ, సామాజిక సంఘర్షణలకు దారితీయడాన్ని ఉదహరించాడు. అలానే ఇతర దేశాలలోనూ జరుగుతున్నది. తమ దేశంలో సంస్కృతిని, నాగరికతను, ఆచారాలను, తక్కువగా చూడడం, అరేబియా సామ్రాజ్యవాదంలో అంతర్భాగమే. ఇది ముస్లింలు ఆలోచించాల్సిన ముఖ్య విషయం.

సాంస్కృతికంగా ముస్లింలు అరేబియా బానిసలుగా మారడానికి ఇస్లాం కారణమని అన్వర్ షేక్ నిర్ధారించాడు. అరబ్బు సంస్కృతిని మాత్రమే పాటించిన మహమ్మదును ముస్లింలు అనుకరించి, ఆరాధించినంత కాలం యీ వైవిధ్యం తప్పదంటున్నాడు.

"ప్రవక్త" అనేది మానవుడి కల్పన అని, రుజువుకు, ఆధారాలకు నిలబడేది కాదని అన్వర్ షేక్ కుండబద్దలు కొట్టాడు. దేవుడి పేరిట నాటకమంతా ప్రవక్త ఆశి, జనం మూఢనమ్మకాన్ని బాగా దిమిస కొట్టాడన్నారు.

దేవుడిని నమ్మేజనం ఎలాగూ అతడిని కనలేరు, వినలేరు, మాట్లాడలేరు. ఆ స్థానంలోకి అతి తెలివిగా ప్రవక్త వచ్చాడు. తనతో దేవుడు అన్నీ చెప్పిస్తున్నాదనీ, కనుక తనను నమ్మి, తాను చెప్పినట్లు నడుచుకోమంటే, జనం అదే నిజం అనుకొని, ఆరాధిస్తున్నారు. ఇదీ అసలు విషయం.

అన్వర్ షేక్ స్పష్టంగా తాను మానవతావాదిననీ, అతీంద్రియశక్తుల పేరిట పాటించదగిందేదీలేదనీ, వివేచనతో మనిషి సాగిపోవాలనీ అన్నాడు. (ఇస్లాం పేజి 149)కొరాన్, బైబిల్, ఇతర "పవిత్ర" గ్రంథాలన్నీ పరస్పర విరుద్ధాలతో వున్నాయి. అవి మనుషుల్ని తప్పు దారిలో నడిపిస్తున్నాయి.

ఇస్లాంలో ముల్లాలు చాలామంది నమ్మకం లేనివారే! కాని ఇస్లాం వారికి కట్టుబాటుగా ఉంది. కనుక అడ్డం పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారని అన్వర్ షేక్ చక్కగా చెప్పారు. (చూడు ఇస్లాం:అరబ్ నేషనల్ మూవ్ మెంట్ పుట 99)

- హేతువాది, డిశంబరు 1999