అబద్ధాల వేట - నిజాల బాట/పరలోక శక్తులు - నిద్ర పక్షవాతం
భూమి మీదకు అప్పుడప్పుడూ వేరే లోకాల నుండి మనుషులు వస్తున్నారని కొందరిని ఎత్తుకుపోయి మళ్ళీ వదలిపెడుతున్నారనే నమ్మకాలున్నాయి. వదంతులూ వున్నాయి. అమెరికా, యూరోప్ లో యీ వింత ప్రచారం అనేక మందిని ఆకట్టుకున్నది. కొన్ని పుస్తకాలు, సినిమాలు వచ్చాయి.
ఇతర లోకాలలో మనుషులు వున్నరా? వారే భాష మాట్లాడుతారు? ఎలా ప్రయాణం చేస్తారు?
ఈ విషయాలపై పరిశోధనలు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. కొందరు వ్యక్తులు తమ వింత అనుభవాలను కధలుగా చెప్పిన ఉదంతాలను కూడా పరిశోధనకు గురిచేశారు. జపాన్ లో యీ పరిశీలన బాగా జరుగుతున్నది. రాత్రిళ్ళు ఏవో దయ్యాలు, భూతాలు, శక్తులు కొన్నిసార్లు ఎవరో దేవుళ్ళు వచ్చి పూనినట్లు, మాట్లాడినట్లు వెంటబెట్టుకొని తిసుకెళ్ళి, మళ్ళీ తీసుకువచ్చి వదలివెళ్ళినట్లు చెబుతున్నారు.
జనాభాలో అనేకమంది ఎప్పుడో ఒకప్పుడు యీ వింత అనుభవాన్ని చవిచూస్తున్నారు. అందుకే యీ విషయానికి ప్రాధాన్యత వచ్చింది. పరలోకాల వ్యక్తులు వచ్చి నిద్రపోతున్న వ్యక్తుల్ని మేల్కొల్పడం, మీదెక్కి కుర్చొనడం యిత్యాది అనుభవాలు తెల్లారి చెప్పిన వారున్నారు.
ప్రాచీనకాలంలో వేరేలోకాల నుండి వచ్చినవారు చీపురుకట్టలు స్వారికి వాడినట్లు, మేఘాల మీద ప్రయాణం చేసినట్లు కధలున్నాయి. సినిమాలు చూచి, పుస్తకాలు చదివి అలాంటి అనుభవాలు మాకు కలిగాయనేవారున్నారు. ఆకాశం నుండి ఎగిరే పళ్లాలలో వచ్చి భూమి మీద వ్యక్తుల్ని కలసినట్లు కూడా కథలున్నాయి. వీటన్నింటిపై పరిశోధనలు జరిగాయి. కెనడాలోని అంటారియోకు చెందిన బ్రాక్ యూనివర్శిటిలో టోమొకాటకూచి యీ ఆకాశవ్యక్తులు ఎగిరే పళ్ళాల వింతలపై గొప్ప పరిశోధకుడు.
పుకుషిమా యూనివర్శిటి (జపాన్)లో కజూహికొపు కూడా వింత వ్యక్తులు భూమిపైకి వచ్చిపడుతున్న విషయం లోతుగా పరిశీలించారు. ఇంతవరకూ జరిగిన శాస్త్రీయ పరిశోధనల వలన తెలిందేమంటే, కొందరు వ్యక్తులకు నిద్రపక్షవాతం వస్తుంది. ఆ స్థితిలో వ్యక్తి నిద్రిస్తున్నాడా, మేల్కొనివున్నాడా అనేది సందేహాస్పదం.
నిద్రపక్షవాతం అంటే ఏమిటి? వ్యక్తి నిద్రిస్తుండగా ఒక్కమారు మెదడుకు శరీరానికే సంబంధం పోతుంది. అలాంటప్పుడు వ్యక్తిని మోకాలిపై కొట్టినా అతడికి తెలియదు. అతడు నిద్రలో కళ్ళు విపరీతంగా కదలిస్తుంటాడు. ఈ స్థితి ఒకటి రెండు నిమిషాలు వుంటుంది. తరువాత మెదడుకు శరీరానికి మళ్ళీ సంబంధం ఏర్పడుతుంది. నిద్రపక్షవాతంలో వ్యక్తి కళ్ళు తెరవకుండానే తన వింత అనుభవాలను చూస్తాడు. ఇది స్త్రీలకు పురుషులకు అన్ని వయస్సులలోనూ రావచ్చు. నిద్రనుండి మేల్కొన్న నిద్రపక్షవాత వ్యక్తి తన నిద్రానుభవాలను నిజమైన సంఘటనలుగా జరిగినట్లుగా చెబుతాడు. ఈ విధంగా ఇతర లోకాల వ్యక్తుల కధలు ప్రచారంలోకి వచ్చాయి.
నిద్ర పక్షపాతం అరుదుగా ప్రమాదానికి దారితీస్తుంది. వుక్కిరి బిక్కిరిగా వూపిరి పీల్చుకోడానికి కొట్టుకుని చనిపోయినవారున్నారు. కాని చాలా మంది ఒకటి రెండు నిమిషాలకే లేస్తారు. నిద్రపక్షపాతం అనుభవ సమయంలో మాట్లాడబోయినా, శబ్దం రాకపోవడం, కదల్చబోయినా చేతులాడకపోవడం, వూపిరాడనట్లనిపించడం లక్షణాలు. గుండెపై ఎవరో అదిమి పెట్టినట్లుండడం కూడా మరో లక్షణం. ఇదంతా నిద్రపక్షవాత లక్షణమే.
చైనా, జపాన్ ,కెనడా, అమెరికాలలో నిద్ర పక్షవాతంపై పరిశోధనలు ముమ్మరంగా సాగాయి. కెనడాలో యీ అనుభవానికి ఓల్ట్ హాగ్ అని, జపాన్ లో కొనషిబారి అని, వెస్ట్ ఇండీస్ లో కొక్మా అని, చైనాలో గైయీ అనీ నానుడిగా చెబుతారు. మన దగ్గర భూతాలు, శక్తులు, అమ్మవారు, పిశాచాలు పట్టి పీడించడం, అని సాధారణంగా పేర్లు పెడతారు. ఇవి నిద్రలోనే జరుగుతాయని విస్మరించరాదు. అయితే నిద్రపక్షపాతం అనేది ఒకటుంటుందని చాలామందికి తెలియదు.