Jump to content

అబద్ధాల వేట - నిజాల బాట/పెట్టుబడి లేని గిట్టుబాటు వ్యాపారం యోగ

వికీసోర్స్ నుండి
పెట్టుబడి లేని గిట్టుబాటు వ్యాపారం యోగ

యోగ విద్యను అమెరికాలో ప్రచారం చేసిన వివేకానంద 39వ ఏట చనిపోయాడు. యోగవిద్యను పాటించిన ఆదిశంకరాచార్యుడు 33వ సంవత్సరంలో మరణించాడు. కనుక యోగం వలన ఆయువు పెరిగి, చాలాకాలం ఆరోగ్యంగా వుంటారనేది అందరికీ చెందిన సత్యం కాదేమో!

ఇప్పుడు ఎక్కడ చూచినా యోగ బోర్డులు వెలిశాయి. మానసిక ఆరోగ్యం పేరిట, రకరకాల చికిత్సలు చేస్తున్నారు. యోగంలో అనేక పేర్లు వచ్చాయి. రాజయోగం, సిద్ధయోగం మొదలైనవి జనాన్ని ఆకర్షిస్తున్నాయి. విదేశాలకు ఎగుమతి అవుతున్న యోగం వలన కొందరు బాగా ఆర్జిస్తున్నారు. ప్రాచీన భారత సంస్కృతి పేరిట యోగం వీధిన బడింది. యోగం పెట్టుబడి లేని మంచి గిట్టుబాటు వ్యాపారంగా మారింది. బాబాలు, మాతలు తలెత్తినట్లే యోగం కూడా పాపులారిటీ సంతరించుకున్నది.

అసలు విషయం మభ్యపెట్టి యోగం వలన ఆరోగ్యంగా వుంటారని, ధనార్జన చేస్తున్న నేపధ్యంలో కొంచెం పూర్వాపరాలు చూద్దాం.

ఏది యోగం?

యోగం, భారతదేశం కనుగొన్న ప్రాచీన దర్శనం. మొత్తం ఆరు దర్శనాలలో యోగ ఒకటి. మోక్షం సాధించాలంటే లోగడ ఎవరి మార్గం వారు సూచించారు. మాది మాత్రమే మోక్షాన్ని సాధించగలదు అని చాటారు. అలాంటి ఆరు దర్శనాలు : న్యాయం, వైశేషికం, సాంఖ్యం, యోగం, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంసలు.

యోగం కనుగొన్న ఆద్యుడుగా పతంజలి పేరు చెబుతారు. అతని ప్రకారం మోక్ష సాధనకు ఎనిమిది మార్గాలు సూచించాడు. ఇందులో తొలిమెట్టు మాత్రమే ఆసనాలు. వీటన్నిటిని నియమానియమాలన్నాడు. ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి మెట్టు మెట్టుగా సాధిస్తూ మోక్షాన్ని పొందాలి.

పతంజలి యోగంలో మూలసూత్రం చిత్తవృత్తి నిరోధం. ఆలోచన స్తంభింప జేసి, ముందు ఒక వస్తువుపై మనస్సు లగ్నం చేయాలి. తరువాత నిరాకారంపై దృష్టి పెట్టాలి. ఆలోచన చంపేయడం చాలా ముఖ్యమైన అంశంగా యోగం పాటిస్తుంది. ఇదంతా గురువు వద్ద నేర్చుకొని పాటించాలే గాని సొంతంగా ఆచరించరాదన్నారు.

వివేకానంద యోగాన్ని గైడ్ పుస్తకాలుగా రాసేసి, పాపులర్ చేశాడు. ముఖ్యంగా అమెరికాలో ఆయన గైడ్ చిట్కాలు బాగా అమ్ముడుపోయాయి ఆత్మ-పరమాత్మ విలీనం కావడమనే లయ మార్గాన్ని వివేకానందుడు రాజయోగం అని పేరు బెట్టి ప్రచారంలోకి తెచ్చాడు.

ఒకప్పుడు గురుకులాల్లో ఆశ్రమాలకు పరిమితమైన యోగం నేడు వీధి వ్యాపారంగా ధనార్జనకు అక్కర కొస్తున్నది. చాలా మంది ఆరోగ్యంతో యోగాన్ని ముడిపెట్టి అసలు విషయాన్ని దాచేశారు.

గురువు దగ్గర యోగం నేర్చుకొని అభ్యసించాలి అనే సూత్రాన్ని వదలేసి, వివేకానందుడు మొదలు అనేక మంది రాసి బజార్లో అమ్ముతున్న గైడ్ల ఆధారంగా యోగ స్కూళ్ళు,కేంద్రాలు వచ్చేశాయి.

పైగా కొందరు యోగం శాస్త్రీయమని చెప్పేటంత వరకూ సాహసిస్తున్నారు. శాస్త్రీయ పద్ధతికి యోగం ఎన్నడూ పరీక్షకు పెట్టలేదు. సైంటిఫిక్ విధానానికీ, యోగానికీ సంబంధం లేదు. కేవలం మూడ నమ్మకంగానే యోగం నాడూ నేడూ ప్రచారంలో వుంది. ఆ విషయంలో స్పష్టత అవసరం.

కసరత్తు, వ్యాయామం ఆరోగ్యం కొరకు చేసే అభ్యాసాలు వేరు. యోగం ఉద్దేశం అదికాదు. అందుకే అసలు విషయం దాచిపెడుతున్నారని చెప్పవలసి వస్తున్నది. చిత్తవృత్తి నిరోధం యోగం పాటించవలసిన సూత్రమైతే, మోక్ష సాధన లక్ష్యం మార్గాన్నీ-లక్ష్యాన్నీ యోగం అరమరికలు లేకుండా చెప్పిందని మరచిపోరాదు.

యోగంలో చాలా రకాలున్నాయి. అందులో కుండలినీ యోగం ఒకటి కాగా, తాంత్రిక యోగం మరొకటి. తాంత్రిక యోగంలో సెక్స్ కూడా అమలుపరిచాడు. స్త్రీని సాధనంగా చేసుకుని యీ యోగాన్ని అమలుపరచాలన్నారు. క్రమేణా తాంత్రిక యోగం సెక్స్ షాపులుగా మారాయని, కేంద్ర ప్రభుత్వం దీనిని నిషేధించింది. ఒకప్పుడు గుజరాత్, అస్సాం, బెంగాల్ లో పాటించిన తాంత్రిక కేంద్రాలు నేడు మూతపడ్డాయి.

స్త్రీ బదులు వస్తువును పెట్టి తాంత్రిక విద్య అమలుచేసే రీతుల్ని కేరళలో పాటిస్తున్నారు. కుండలినీయోగం ప్రకారం ముడ్డి దగ్గర వెన్నెముక చివరి భాగంలో మనిషి శక్తి వుంటుందని నమ్మకం. ఆ శక్తిని ప్రకోపింపజేసి క్రమేణా వెన్నెముక ద్వారా పైకి తెచ్చి మెదడు గుండా తీసుకురావడం ఆ పద్ధతి. ఇలాంటి శక్తి అనేది వూహాజనితమేగాని,ఆధారాలకు నిలవదు. నమ్మకం అన్నప్పుడు ఆధారాలు అడగరాదు.

హఠ యోగం చమత్కారాల మాయం. నీటిపై నడుస్తామని, గాలిలో తేలగలమని గొప్పలు చెప్పిన వారున్నారు. ఇవేవీ ఎన్నడూ నిజం కాలేదు.

ఇక యోగాభ్యాసంలో ఫాషన్ మారిన ప్రాణాయామం కొన్నిసార్లు ప్రమాదకారి అని గ్రహించాలి. ఊపిరి బిగబట్టి వదలడం ఇందలి ముఖ్యాంశం. 45 సెకండ్ల వరకూ వూపిరి బిగబడితే చిక్కులు రావు. కొందరు అలవాటుగా రెండు మూడు నిమిషాలు వూపిరి పీల్చి బిగబడతారు.మనం పీల్చిన ప్రాణవాయువు(ఆక్సిజన్) శరీరానికి ఉపయోగపడిన తరువాత బొగ్గుపులుసు వాయువుగా(కార్బన్-డయాక్సైడ్) బయటకు వస్తుంది. అంటే బొగ్గుపులుసు వాయువును శరీరం అట్టిపెట్టుకోదు. బలవంతంగా వుంచితే చిక్కులు వస్తాయి. ఈ చిక్కులలో పేర్కొనదగినవి మూర్చ రావడం, స్పృహ తప్పడం, పగటి కలలు రావడం, వింత దృశ్యాలు కనిపించడం,భ్రమలు కలగడం వున్నాయి.

బొగ్గుపులుసు వాయువు ఎక్కువసేపు అట్టి పెడితే వచ్చే పరిణామాలను శాస్త్రీయంగా పరిశీలించారు. ఇందులో ఒక అంశం ఏమంటే, రక్తంలో టెన్షన్ 40 ఎం.ఎం. వుండాలి. బొగ్గుపులుసు వాయువు వుండడం ఎక్కువైతే టెన్షన్ కూడా ఎక్కువ అవుతుంది. 80-90 వరకూ టెన్షన్ పెరిగిందనుకోండి. భ్రమలు, కలలు, వింత ఆలోచనా ధోరణులు వస్తాయి. వాటినే దైవాంశాలుగా, విపరీత వ్యాఖ్యానాలు చేసి చూపుతారు. రామకృష్ణ పరమహంస యిలానే చెప్పేవాడు. ఆయన తరచు ముర్ఛలకు గురయ్యేవాడు. ఈ విధమైన స్థాయి కొనసాగిస్తే సమాధి అని చెప్పే స్థాయి వస్తుంది. అంటే స్పృహ కోల్పోవడం అన్నమాట. తిరిగి యధాస్థితి రావడానికి చాలాసేపు పడుతుంది. ఆ స్థితిని దైవసాన్నిధ్యంగా చిత్రించే వారున్నారు. కాని మెదడుపై యిలాంటి వత్తిడి వలన ప్రమాదకర స్థితి ఏర్పడుతుంది. దేహం శుష్కించిపోతుంది. యోగం పేరిట. తెలిసీ తెలియక కొందరు యీ దశలకు చేరుకుంటుంటారు. ఇందులో యిమిడిన ప్రమాదాలు తెలుసుకోలేరు.

ఇప్పుడు చాలా చోట్ల వెలసిన యోగ కేంద్రాలలో అసలు విషయం చెప్పరు. చెబితే జనం రాకపోవచ్చు, భయపడవచ్చు. కనుక కేవలం ఆరోగ్యం కొరకు, మానసిక ఉల్లాసం కోసం, టెన్షన్ తగ్గించడానికి అని మాత్రమే చెబుతారు. ఇది ఒక రకంగా మోసం చేయడం, మభ్యపెట్టడమే. డబ్బు కోసం కక్కుర్తిపడి మూలవిషయాలను దాచడం మన సంప్రదాయంలో వుంది. వాస్తులో కుల ప్రసక్తి వున్నా, నేడు ఆ విషయం దాచి పెడుతున్నారు గదా. అలాగే యోగం కూడా. లోగడ ధీరేంద్ర బ్రహ్మచారి డిల్లీలో టి.వి.లో యోగప్రచారం చేశాడు. ఆయనకు ఆనాటి ప్రధాని ఇందిరాగాంధి అండ వుండేది. ఆయనకు ఆయుధాల కర్మాగారం వున్నదని తరువాత బయటపడి పరువు పోయి ప్రచారం కోల్పోయాడనుకోండి. అలాగే కొందరు నేడు పదవులలో ఉన్నవారి ప్రాపకం సంపాదించి, యోగాన్ని ప్రచారం చేస్తున్నారు. యోగానికి రాజకీయం జోడైంది. కీలక పదవులలో వున్నవారు యోగాన్ని సమర్ధించడం తెలిసి కాదు. ఇతరేతర కారణాలే అందుకు కారణం.

ఆరోగ్యానికి ఎక్సర్ సైజ్ చేయడం యోగ కాదు. ఏదైనా రుగ్మతులున్నవారు డాక్టర్ ను సంప్రదించి, వ్యాయామం చేయడం మంచిది. యోగ వలన వచ్చే పరిణామాలకు బాధ్యులు లేరు. ఇన్సూరెన్స్ లేదు. యోగ శాస్త్రీయ పరిశోధనకు గురి చేసిన దాఖలాలు లేవు. అలా చేయకుండా అనుమతించడం ప్రభుత్వానికి సైంటిఫిక్ పాలసీ లేకపోవడమే!

- నాస్తికయుగం,మే 2001