అబద్ధాల వేట - నిజాల బాట/యోగ

వికీసోర్స్ నుండి
యోగ

చదువుకున్న వారిని సులభంగా మోసం చేయవచ్చు అనడానికి ఇప్పుడు విరివిగా వ్యాపిస్తున్న యోగ దుకాణాలే దానికి నిదర్శనం వీధి వీధికి కొత్త పేర్లతో వెలిసిన యోగ కేంద్రాలు చాలామందిని ఆకర్షిస్తున్నాయి.

రోగాలు వచ్చిన వారు, ఇళ్ళలో సమస్యలున్నవారు టెన్షన్ పడుతున్నవారు, యీ యోగ విధానాలకు ఆకర్షితులవుతున్నారు. యోగం భారతీయ విలక్షణ విధానం. ఇది యిప్పుడు విదేశాలలో కూడా గిట్టుబాటు వ్యాపారంగా ప్రచారమవుతున్నది.

యోగ స్కూలు తెరవడానికి, ఫీజులు వసూలు చేయడానికి, లైసెన్స్ అవసరం లేదు. పెట్టుబడులు సైతం అట్టే అక్కరలేదు. యోగాభ్యాసాలతో బాటు ఆకర్షణీయంగా మాట్లాడడం. కొంత ఆధునిక పరికరాలు జోడించడం కూడా ఆకర్షణకు తోడ్పడుతున్నది. యోగం పేరిట చికిత్సకు ముడిపెడుతున్నందున దీనికి కొత్త కారణం వచ్చింది కూడా.

యోగం వలన రిలాక్స్ కావచ్చుననీ, టెన్షన్ తగ్గించుకోవచ్చునని, ప్రశాంతత వనగూడునని తాత్కాలికంగా కష్టాలు మరిచిపోవచ్చుననీ, ఆరోగ్యం కుదుట బడుతుందనీ చెబుతారు. ఇవన్నీ ఆకర్షణీయాలే కాగా చాలామంది ప్రశ్నించకుండా యోగాభ్యాసాలకు లొంగిపోతున్నారు. ఇటీవలే కొత్త మాటలు వినవస్తున్నాయి. యోగ కూడా సైంటిఫిక్ అనడం!

యోగానికి మూలసూత్రం చిత్తవృత్తి నిరోధం. అంటే మానవుడి ప్రధాన లక్షణమైన ఆలోచనను స్తంభింపజేయడం. యోగంలో ఇంద్రియాల్లో ఒక వస్తువుపై గాని బిందువుపై గాని దృష్టి పెట్టి, మిగిలిన ఆలోచనలు రానివ్వకుండా చూడమంటారు. అదే ఆలోచన చంపడానికి నాంది. ఆలోచిస్తే ప్రశ్నలు వస్తాయి. గుడ్డిగానమ్మడం వలన ఆలోచన చచ్చిపోతుంది. అలా ఆరంభించిన యోగం 8 మార్గాల సోపానం చెప్పింది. ఇందులో మెట్లు మెట్లుగా మనిషిని తీసుకుపోయినారు. మోక్షం అంటే వెంటనే అందరూ ఒప్పుకోరు గనుక, ఆధునిక పదజాలంతో ఆకర్షించడం యోగంలో పెద్ద ఎత్తుగడ.

యోగానికీ, ఆరోగ్యానికి చికిత్సకూ సంబంధం లేదు. కాని కొందరు అలాంటి సంబంధం కల్పిస్తున్నారు. యోగాభ్యాసాలతో ఎక్సర్ సైజ్ 8 మార్గాలలో ఒక మార్గమే. అలా చెప్పక మభ్యపెట్టడం వారి చిత్త ప్రవృత్తికి గీటురాయి.

యోగంవలన దీర్ఘాయిస్సు అనేది మరొక భ్రమ, శంకరాచార్యులు, వివేకానంద, రామకృష్ణ పరమహంస(గదాధర్), రమణ మహర్షి యోగం చేసిన వారే. వివేకానంద 38ఏళ్ళకి చనిపోయాడు. రమణ, రామకృష్ణలు కేన్సర్ తో చనిపోయారు. శంకరాచార్య 32 ఏళ్ళకే చనిపోయారు. కనుక ఆయుస్సు గురించి మరిచిపోవాలి.

యోగాభ్యాసాల వలన మెదడు ఎలా పనిచేస్తుందో యోగులకు తెలియదు. ఆనాడు అంత సైన్స్ పెంపొందలేదు. నేడు మెదడు గురించి చాలా తెలుస్తున్నది. ఇంకా తెలియాల్సింది ఎంతో ఉంది.

మెదడు నాలుగు విధాలైన తరంగాలు ప్రసరిస్తుంది. మెదడు పనిచేసే తీరులో తరంగాలకూ సంబంధం వుంది.

నిద్ర పోతున్నప్పుడు అల్ఫాతరంగాలు వస్తాయి.

దృష్టి కేంద్రీకరించినప్పుడు బీటా తరంగాలుంటాయి.

సమస్యలు సాధించేటప్పుడు, పనిచేస్తున్నంతసేపు బీటా తరంగాలు వుంటాయి.

గాఢ నిద్రలో డెల్టా తరంగాలు వస్తాయి.

మోహనిద్రావస్తలో (సుషుప్తి దశ) తీటా తరంగాలు వుంటాయి.

ఈ తరంగాలను ఎలక్ట్రోసిఫలోగ్రాఫ్ (ఈజి) యంత్రంతో కొలుస్తారు. జెన్ బౌద్ధం యోగులు పేర్కొనే సుషుప్తి అవస్తను నేడు సైన్స్ వివరిస్తుంది. ఎం.ఎన్.రాయ్ ఈ విషయాన్ని వివరంగా శాస్త్రీయంగా రాశారు.

యోగంలో ప్రాణాయామం ఒకటి. మనిషి ఊపిరిపీల్చడం వదలడం అనుకోకుండా చేసే పని. యోగంలో ఊపిరి బిగబట్టమంటారు. అంటే పీల్చిన ప్రాణవాయువు బొగ్గుపులుసు వాయువుగా మారిన తర్వాత వదిలివేయాలి. కానీ, అట్టిపెడితే అది శరీరానికి పనికిరాదు. గనుక హాని చేస్తుంది. కొంతసేపు అట్టిపెడితే పగటి కలలు వస్తాయి. భ్రమలు కలుగుతాయి. ఆ తరువాత దశలో మైకంకమ్మినట్లు దీర్ఘనిద్రావస్తలోకి పోతారు. అటువంటి దశ నుంచి యధాస్తితికిరావడానికి కొంతసేపు పడుతుంది. కానీ, ఆ దశను కొందరు ముక్తికి చేరువైన సమాధి దశగా చెపుతారు. రామకృష్ణ పరమహంస విషయంలో యిలానే జరిగింది. శరీరానికి యీ దశలో హాని జరుగుతుంది.

యోగాభ్యాసాల వలన ఏదైనా జరిగితే అందుకు బాధ్యత వహించే వారెవరూ లేరు. మళ్ళా ఆధునిక చికిత్సకు పోవాల్సిందే.

ఆధునిక వైద్యరంగానికి యోగాన్ని జోడించే ఎత్తుగడ కొన్ని ఆశ్రమాల వారు ఇటీవల వాడుకలోకి తేవడం వారి వ్యాపారాన్ని తెలివిగా ఆధునీకరణ చేయడానికే.

ప్రపంచంలోనే మేధావివర్గానికీ సాధారణ ప్రజానీకానికి మధ్య అగాధం పెరుగుతున్నది. అందువల్లనే విజ్ఞాన శాస్త్రానికీ, సనాతనవాదానికి మధ్య సంబంధం లేకుండా పోతున్నది. అందువల్లనే సాధారణ ప్రజానీకం మతవాదాల్లో నిమగ్నమై ఆధునిక విజ్ఞాన తాత్విక ఫలితాలను అందుకోలేక సతమతమైపోతున్నారు. కాగా విజ్ఞానశాస్త్ర ఫలితాలైన సాంకేతిక పరికరాలను వాడుకోవలసిన పరిస్థితిలో ఈనాడు మతం పడిపోయింది. ఇది ఆధునిక జాడ్యాలకు ఒక కారణం కాగా, ఇప్పుడు కంప్యూటర్ యుగంలో ప్రవేశించాం. ఇది సాధారణ పౌరుడికి మాయాలోకంలాగా దర్శనమిస్తుంది. అర్ధమయ్యేస్థితిలో లేదు. అంటే విజ్ఞానికీ సాధారణుడికీ మధ్య పూడ్చరాని అగాధం మిగిలిపోయింది. ఇది ప్రమాద సంకేతం. వేల సంవత్సరాలనాడు ఈ స్థితిలోనే సాధారణమానవుడికంటే భిన్నంగా పౌరోహిత వర్గం పెరిగిపోయింది. అందునా భారతదేశంలో ఆ వర్గం సాధారణ ప్రజానీకానికి అందనంత దూరంగా జరిగి మానవుడిలో తారతమ్యాలను చాలా పెంచివేసింది. ఈ చారిత్రక సత్యాన్ని మనం గుర్తిస్తే, కేవలం అక్షరజ్ఞానం కాకుండా వైజ్ఞానిక తాత్విక ఫలితాలు సామాన్య ప్రజలదాకా మనం మోసుకువెళ్లాలి. అది మన బాధ్యత.

- హేతువాది, అక్టోబరు 2001