అబద్ధాల వేట - నిజాల బాట/హోమియో సాంఘిక నేరమా ? అమానుషమా ?

వికీసోర్స్ నుండి
హోమియో సాంఘిక నేరమా? అమానుషమా?

అలోపతి (ఆధునిక విజ్ఞానిక వైద్యం) తప్పులు చేస్తుంది. తప్పులు ఒప్పుకుంటుంది. దిద్దుకుంటుంది. మానవుడికి మేలు చేయాలనే దీక్షతో అనేక పరిశోధనలు చేస్తుంటుంది. ఇది అనంతం. నిత్యకృత్యం. తాను చెప్పిందే వేదం అనదు. తన జ్ఞానం సంపూర్ణం అనదు. విమర్శలు స్వీకరిస్తుంది సహనం ప్రదర్శిస్తుంది. ఆ విధంగా ఆధునిక వైద్యం(అలోపతి) దినదినాభివృద్ధి చెందుతూనే వున్నది. ఇతర శాస్త్రీయ పరిశోధనా ఫలితాలను వైద్యరంగంలోకి స్వీకరిస్తుంది. దుష్పరిణామాలను తొలగించడానికి, తగ్గించడానికి చేతనైన ప్రయత్నం చేస్తుంది. పరీక్షలు జరిపి, తద్వారా చికిత్స చేస్తుంది. నమ్మకాలు విశ్వాసాలు ఆధారంగా వైద్యం తలపెట్టదు. ఇది శాస్త్రీయ పంథా. అలోపతి వైద్యం మానవులందరికీ సామాన్యమైంది. రష్యాలో, చైనాలో, అమెరికాలో ఎక్కడ వైద్యం కనిపెట్టినా అది ప్రపంచమంతటా దాపరికం లేకుండా వ్యాపిస్తుంది. మానవుల సొత్తుగా అలోపతి వైద్యం పరిణమించింది.

డాక్టర్లు తప్పులు చేస్తే అడిగే హక్కు,పరిహారం కోరే అవకాశం రోగులకు అలోపతిలో వుంది. వైద్యభీమా పద్ధతులు అమలులో వున్నాయి. రోగికి ఏమేమి మందులు ఎలా యిచ్చారో, చికిత్స ఎలా జరిపారో రికార్డు చేస్తారు. దీనివలన తప్పులు దిద్దుకునే అవకాశం లభిస్తుంది.

అంటురోగాలతో లక్షలాది చనిపోవడాన్ని ఆపింది అలోపతి మాత్రమే. అంతుబట్టని రోగాలను పరిశీలించి, పరిశోధనలు జరుపుతున్నది, అలోపతి వైద్యంలోనే సాధ్యం. ఇతర వైద్య విధానాల జోలికి అలోపతి వెళ్ళదు.

హోమియోపతి వైద్యం జర్మనీలో హానిమన్ అనే వైద్యుడు ప్రవేశపెట్టి, ప్రచారం చేశాడు. ఆయన బ్రతికుండగానే హోమియోపతి చిట్కా వైద్యమా కాదా అనే చర్చ ఆరంభమైంది. అ ది నేటికీ కొనసాగుతున్నది.

ఆధునిక వైద్యాన్ని (అలోపతి) తీవ్రంగా విమర్శిస్తూ హోమియో ప్రచారంలోకి వచ్చింది. హానిమన్ ఆరంభించిన యీ ప్రక్రియను హోమియో వైద్యులు విస్తృతంగా వాడుకుంటున్నారు.

హోమియోశాస్త్రీయమా కాదా, అనేది హేతువాదులు, మానవవాదులు శాస్త్రజ్ఞులు చేబట్టిన అంశం. ప్రపంచవ్యాప్తంగా యీ విషయమై పరిశోధన సాగింది. హోమియో శాస్త్రీయమేనని హోమియోపతి వైద్యవృత్తిలో వున్నవారు చెబుతూనే వున్నారు. ఆధారాలేమిటి అన్నప్పుడు సమాధానం చెప్పలేకపోతున్నారు. హోమియో సూత్రాల్ని, మందుల్ని, చికిత్సను శాస్త్రీయ పరిశోధనకు పెట్టిన శాస్త్రజ్ఞులకు ఇది సైంటిఫిక్ అని ఆధారాలు ఎక్కడా అభించలేదు. శాస్త్రీయమని కొందరు హోమియోవాదులు ఇచ్చిన సాక్ష్యాధారాలు తప్పుడువని రుజువైంది. శాస్త్రీయ పద్ధతిని అనుసరించే యూరప్, అమెరికా వంటి చోట్ల హోమియో క్షీణించింది. వెనుకబడిన దేశాలలో హోమియో ఇంకా ప్రచారంలో వుంది. హోమియో వైద్యాన్ని ప్రవేశపెట్టిన హానిమన్ (1755-1843) తొలుత అలోపతి డిగ్రీ పొందాడు. ఆనాడు రోగాలకు హెచ్చు మోతాదుల్లో మందులివ్వడం పట్ల హానిమన్ అభ్యంతరపెట్టాడు. తన డిగ్రీ చదువును వదిలేసి హోమియో పద్ధతి పరిశీలించి, చిన్న మోతాదుల్లో మందులివ్వాలని, రోగలక్షణం ఔషధ లక్షణం ఒకటే అయినప్పుడు చికిత్స కుదురుతుందన్నాడు. మందులలో మోతాదు తగ్గిస్తూ పోవడంతోబాటు, వాటి శక్తి పెంచే రీతి కూడా పేర్కొన్నాడు. హోమియో సూత్రాలను క్రోడీకరించాడు. ఔషధ లక్షణాలు గ్రంథస్తం చేశాడు. ఇవన్నీ ఒక వైపున చేస్తూనే, ప్రతి మనిషికి జీవశక్తి(వైటలిజం) వుంటుందని హానిమన్ నమ్మాడు.

మనుషులందరి లక్షణాలను మూడు రకాలుగా వర్గీకరించాడు. సిఫిలిస్, సోరా, సైకో అనే యీ లక్షణాలకుగాని, జీవశక్తికిగాని, సూక్ష్మీకరించే మందులలో శక్తి పెరుగుతుందనడంలో గాని ఎక్కడా శాస్త్రీయ పద్ధతి లేదు. శాస్త్రీయ పరిశోధనలకు హానిమన్ తన సూత్రాల్ని పరీక్ష పెట్టలేదు. ఒక మహర్షి వలె చెప్పి, ప్రవర్తించాడు. మూలపురుషులంతా అంతేనేమో.

హానిమన్ రుజువులనేవి శాస్త్రీయ పద్ధతికి నిలబడేవి కావు. అలాగే ఆయన శిష్యులు చెప్పిన రుజువులు కూడా రుజువులు కావు. వాటిని అనుభవాలు అంటే సరిపోతుంది. వ్యక్తిగత అనుభవాలను శాస్త్రీయరంగంలో పరీక్షకు పెట్టిన ఉదాహరణలు ఎన్నోవున్నాయి. శాస్త్రీయ పద్ధతి తెలిసినవారు అలా చేస్తారు. సింకోనా బెరడు నోట్లో వేసుకుంటే చలి ఒణుకు మొదలైన మలేరియా లక్షణాలు హానియన్ కు వచ్చాయట. అదే ఆయన రుజువుగా పేర్కొన్నాడు. దీనిపై సిద్ధాంతీకరించి, ఆచరణకు పూనుకున్నాడు. కాదన్న వాళ్ళని తిట్టాడు. మత ప్రచారకుడివలె అసహనం ప్రదర్శించాడు. కొత్త పద్ధతి కొందర్ని ఆకర్షించగా, జనాకర్షణను హానిమన్ తెలివిగా వాడుకున్నాడు. హోమియో వైద్యం తొలుత అంతగా సఫలం కాకపోయినా రానురాను ప్రచారం ప్రబలి, డబ్బు సంపాదన జరిగింది.

జర్మనీలో హానిమన్ హోమియో పలుకుబడితో ముందుకు పోతుండగా ఎదురుదెబ్బ తగిలింది. ఆయన చికిత్స చేసిన యువరాజు షవార్జన్ బర్గ్ (Schwartzenberg) 1819లో చనిపోయాడు. జనం రెచ్చిపోయి, హానిమన్ పుస్తకాల్ని,మందుల్ని తగలబెట్టారు. అంతటితో జర్మనీ వదలి, ఫ్రాన్స్ పారిపోయి, అక్కడ ఒక సంపన్న యువతిని పెళ్ళాడాడు. హోమియో వైద్యులకు ఆదర్శప్రాయమైన పనికూడా హానిమాన్ చేపట్టాడు. పలుకుబడిగల ప్రభు వర్గాలనే ఆయన ఆశ్రయించి వారి అండదండలతో తన వృత్తి ప్రాబల్యాన్ని పెంచుకునేవాడు. గ్రాండ్ డ్యూక్ ఫెర్డినాండ్ అండతో అలా కొనసాగాడు. 80వ సంవత్సరంలో తనకంటె 45 సంవత్సరాల తక్కువ వయసు గల ఫ్రెంచి సంపన్న యువతిని పెళ్ళాడిన హానిమన్ బాగా డబ్బు కూడా ఆర్జించాడు.

హానిమన్ సూత్రాలు అన్వయించి రోగాల్ని నయం చేయడం, కనీసం తగ్గించడం, రాకుండా చేయడం సాధ్యం కాదని ఆయన బ్రతికుండగానే నిర్ధారణ అయింది. యూరోప్ దేశాలలో, కలరా, ఇన్ ఫ్లూయంజా, రక్త విరేచనాలు, ఎల్లో ఫీవర్, ప్లేగు మొదలయినవి రావడమే గాక, లక్షలాది ప్రజలు తుడుచుకపోయారు. హానిమాన్ చనిపోయేనాటికి ఆధునిక అలోపతి వైద్యం బాల్యదశలో వుంది. ఆ తరువాతే అనేక విధాల అది పెంపొందింది.

హోమియో చుట్టూ చాలా ఆకర్షణీయ కథలు, చిత్రవిచిత్రాలు అల్లారు. కొందరు జ్యోతిష్యానికి ముడిపెట్టారు. ఆర్సనిక్,బెల్లడోనా వంటి ఔషధాలకు వ్యక్తిత్వ లక్షణాలున్నాయన్నారు. పెట్టుబడి అంతగా అవసరం లేని గిట్టుబాటు వ్యాపారంగా హోమియోపతి చాలా మందికి అక్కరకొస్తుంది కనుక హోమియోను శాస్త్రీయం కాదన్నా, రుజువు చేయమన్నా కోపం వస్తున్నది. గ్రామాల్లో సైతం చదువు అట్లే రానివారుకూడా చిట్కావైద్యంగా హోమియోను ప్రయోగిస్తున్నారు. హోమియో వైద్యుడికి అర్హతలు, డిగ్రీలు, అనుభవం అక్కరలేదు. పత్రికలలో చదివి, పొది పట్టుకొని వైద్యం చేస్తున్నవారున్నారు తగ్గితే తమ గొప్పతనంగానూ, తగ్గకుంటే రోగి కర్మగానూ చెప్పవచ్చు ఇదీ హోమియో పేరిట జరుగుతున్న తంతు.

హోమియోపతి శాస్త్రీయం అని చెప్పేవారు జీవశక్తి (Vital Force) ని ఎలా నమ్ముతారో వివరించవలసి వుంది. జీవశక్తి పనిచేసే తీరులో గందరగోళం ఏర్పడితే, రోగ లక్షణాలు వస్తాయని దీనికి చికిత్స చేసి, సామరస్యత ఏర్పరచాలని వారు నమ్మి రాశారు. ఇది శాస్త్రీయ పరిశోధనలో యిముడుతుందా?

హానిమాన్ పేర్కొన్న హోమియో మూలసూత్రాల్ని (ఆర్గానన్)శాస్త్రీయ పరీక్షకు పెట్టారా? రుజువయ్యాయా? రుజువు కానివి ఏవైనా వున్నాయా? ఉంటే వాటిని తృణికరించారా? శాస్త్రీయ పద్ధతిలో తప్పొప్పులు దిద్దుకుంటూ ముందుకు పోయే ధోరణి వుంది గదా. హోమియోలో ఏవి యింత వరకు తప్పు తేల్చారు? శాస్త్రీయ పద్ధతికి గురిచేసినట్లు ఆధారాలు ఏవి? మన దేశంలో హోమియోను శాస్త్రీయ పరీక్షకు గురిచేసిన ఆధారాలు మచ్చుకు ఒక్కటి చూపగలరా?

వ్యాదినిరోధకశక్తి (ఇమ్యునైజేషన్) సూత్రాన్ని అలోపతి కూడా చెబుతున్నది. హోమియో పేర్కొనే సారూప్య సిద్దాంతం కూడా ఇదే అని అసలు మూలసూత్రం హోమియోదే నని ప్రచారం చేసుకున్న సందర్భాలు లేకపోలేదు. అలోపతి యిచ్చే టీకాలమందు హోమియో పేర్కొనే పలచబరిచిన ఔషధం కాదు. టీకాల మోతాదు తగ్గిస్తే ఫలితం రాదు. టీకాలమందు పలచబరిస్తే పనిచేయదు. శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచడానికి,రోగక్రిముల్ని చంపేయడానికి తగిన మోతాదుల్లో మందు ఎక్కిస్తారు. కనుక హోమియో సూత్రానికి భిన్నంగా టీకాల వైద్యం సాగుతున్నది. అది బాగా పనిచేస్తున్నట్లు రుజువైంది. అంటురోగాలతో లక్షలాది మంది తుడిచిపెట్టుకపోకుండా టీకాల వైద్యం ఆపింది. పోలియోవంటి వ్యాధులు రాకుండానూ టీకాలవైద్యం తోడ్పడింది. హోమియో పేరిట చాలాచోట్ల అలోపతి వైద్యం చేస్తున్నారు. కొన్నిచోట్ల పట్టుబడ్డారు. పాకిస్తాన్ లో దంకాప్ (Dumcap) తయారుచేసి, ఉబ్బసానికి హోమియో చికిత్సగా ప్రచారం చేసి అమ్ముతుంటే పట్టుకున్నారు. (చూడు 1986 ఏప్రిల్ 12 లాన్సెట్ పత్రిక 862-863 పుటలు) హోమియో పేర్కొనే ఔషధాల మోతాదు ఆధునిక రసాయనిక సూత్రాలకు విరుద్ధంగా వుంది. దీనినే అవగార్డొసూత్రం అంటారు. దీని ప్రకారం హోమియో చెప్పే 30X నుండి ఆపైన మోతాదుల్లో దేనిలోనూ మందులేదు చక్కెర, సారా మాత్రమే వుంది. మందు సూక్ష్మరూపంలో వున్నదనీ, అది శాస్త్ర పరికరాలకు అందదనీ హోమియో ప్రచారకులు చెబుతారు. అయినా హోమియో శాస్త్రీయం అంటారు. హోమియో వారే అలా అనగలరు.

హోమియో మందిస్తే రోగలక్షణం ప్రకోపించినట్లుంటే, మంచిదనీ, పెరిగిన తర్వాత తగ్గుతుందని కొందరు ప్రచారం చేస్తారు. ఇది కూడా నమ్మకమే. శాస్త్రీయ పద్ధతికి విరుద్ధమే కాన్సర్, ఎయిడ్స్ వ్యాధులు పెరిగిన తరువాత, తరగవు! తరిగేది మనిషే. అందుకు హోమియో బాధ్యత వహించదు.

కొన్నిటికి హోమియో బాగా పనిచేస్తుందని ప్రచారం చేసేవారున్నారు. కొన్నిటికీ పరిమితమైన చికిత్సా విధానం వుంటుందా! వైఫల్యాలకు ఇదొక ముసుగు. అనేక రోగాలు ఏ మందూ లేకుండా కొన్నాళ్ళకు సర్దుకుపోవడం, తగ్గిపోవడం కద్దు. అలాంటి సమయంలో హోమియో మందు తీసుకొని తగ్గిందంటే,అదే వారి ఖ్యాతిగా మిగులుతుందన్నమాట.ప్రతి చిట్కావైద్యంలోనూ యిలాంటివి వున్నాయి. గుండెపోటు వచ్చినప్పుడు, కలరా వంటి ప్రమాదకర అంటురోగాలు వచ్చినప్పుడు, రోడ్డు ప్రమాదాలలో ఎముకలు విరిగినప్పుడు, మెదడుకు సంబంధించిన జబ్బులు వచ్చినప్పుడు హోమియో చికిత్సకు పరిగెత్తరేం?

హోమియో వలన నాకు తగ్గిందనేవారు సైతం పైన పేర్కొన్న ప్రమాదాలలో అలోపతికి వెడుతున్నారెందుకని? కొందరు హోమియో వైద్యులు సైతం, రోగుల్ని అలోపతికి వెళ్ళమని చెబుతున్నారెందుకు? ఇవన్నీ చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయాలు. వైద్యం మనిషి ప్రాణానికి సంబంధించింది. దానితో హోమియో చెలగాటమాడుతున్నది. అందుకే అది అమానుషం. హోమియో మందులు ప్రమాదకరమైనవి కావనీ సైడ్ ఎఫెక్ట్స్ వుండవనీ, తగ్గితే సరేసరి, తగ్గకుంటే మందువల్ల హాని లేదనే ప్రచారం కూడా వుంది. ఇది మరీ మోసం. సీరియస్ జబ్బులలో సరైన సమయానికి వైద్యం లేకుంటే ప్రాణాపాయం వస్తుంది. హోమియో చౌకగా లభిస్తుందనీ, ప్రమాదం లేదనీ చికిత్స ప్రారంభిస్తే మనిషి చనిపోయే అవకాశం వుంది.

హోమియో వల్ల ఏదైనా ప్రమాదం వచ్చినా వైద్యులు ఎలాంటి చిక్కూ లేకుండా తప్పించుకుంటున్నారు. జీవిత ఆరోగ్య బీమా హోమియోలో లేదు. మందులో మందులేదు గనుక ఏ మందు యిస్తే రోగికి చిక్కువచ్చిందో తెలియదు. హోమియో మందులలో ఏ పాళ్ళలో ఏది వుందో చూపించే పట్టిక వుండదు, రోగికి వచ్చిన జబ్బు, దానికి హోమియో చికిత్స స్పష్టంగా రాయరు. కనుక ఇతరులకు అది తెలుసుకునే అవకాశం రాలేదు. హోమియోలోనే ఇలాంటి రహస్య చికిత్స కొనసాగుతున్నది!

హోమియో చికిత్స వ్యక్తిగతంగా చేస్తారుగాని. సామాన్య లక్షణాలకు కాదనే వాదన వున్నది. అంటే టైఫాయిడ్ జ్వరం 10 మందికి వస్తే ఒక్కొక్కరికీ ఆయా వ్యక్తిని బట్టి చికిత్స వుంటుందన్నమాట. అందరికీ ఒకే మందు ఒకే పద్ధతి వుండదు. కనుక ఎంతమంది మనుషులున్నారో అన్ని చికిత్సా పద్ధతులుంటాయాన్న మాట. అలాంటప్పుడు హోమియోను రుజువు చేయమనడం ఎలా సాధ్యం? అయినా హోమియో శాస్త్రీయం అని యెందుకంటున్నారు? రోగాల్ని బట్టి ఫలానా మందు వేసుకోండని పత్రికలలో, పుస్తకాలలో చిట్కా వైద్యం యెందుకు ప్రచారం చేస్తున్నారు?

కేవలం హోమియో సూత్రాలకు భిన్నంగా ప్రవర్తించే యీ పద్ధతి వ్యాపార లక్షణమే ఆధునిక వైద్య ఉప్పెనకు తట్టుకోడానికి హోమియో ఏ స్థితికైనా దిగజారుతున్నదన్న మాట. డబుల్ బ్లైండ్ టెస్ట్, రాండం శాంపిల్ పద్ధతులు హోమియోలో కుదరవు! హోమియోపతి ప్రచారకులు యెప్పటికప్పుడు కొత్త యెత్తుగడలతో జనాన్ని మోసం చేస్తూనే వున్నారు. బాగా చదువుకున్నారనుకున్న అమెరికా, యూరోప్ లలోనే యీ మోసాలు చేస్తున్నారు. అలాంటప్పుడు వెనుకబడిన దేశాలు వారికి ఒక లెక్క కాదు.

పారిస్ లోని ఒక హోమియో సంస్థ పరిశోధన పేరిట అనేక కట్టుకథలు అల్లి సుప్రసిద్ధ సైన్సు పత్రిక నేచర్ కు పంపగా, వారు ప్రచురించారు. దీనిపై ఫిర్యాదులు రాగా, ఆ పత్రికవారే ఒక నిపుణుల సంఘాన్ని పంపారు. తీరా విచారిస్తే అంతా మోసం అని తేలింది. పరిశోధనా సంస్థలో హోమియో పేరిట శాస్త్రీయ పద్ధతిలో రుజువు చేశామన్నవారికి ఉద్వాసన పలికారు.

హానిమాన్ తరువాత అంతటివాడని హోమియో వైద్యులు ప్రచారంచేసే జేమ్స్ టైలర్ కెంటే కూడా ఎన్నో కాశీమజిలీకథలు ప్రచారంలోకి తెచ్చి అమెరికాలో హోమియో ప్రచారం చేశాడు. ఆయన రాసిన లెక్చర్స్ అనే హోమియోపతి మెడిసిన్ గ్రంథంపై మార్టిన్ గార్డినర్ వ్యాఖ్యానిస్తూ శాస్త్రీయాధారం ఏకోశానా లేకుండా 982 పేజీలు ఎలా రాసాడా అని ఆశ్చర్యపోయాడు. ప్రపంచవ్యాప్తంగా హోమియోపతి పేరిట ప్రచారమవుతున్న పుక్కిటి పురాణాలు యిలాంటివేనని ఆయన సబబుగానే విమర్శించాడు. (ఆన్ ది వైల్డ్ సైడ్ - 1992 ప్రామిథియస్ బుక్స్ పుట 39)

హానిమాన్ కాలంలో అలోపతి వైద్యం చేస్తున్న పనుల పట్ల విముఖతతో హోమియో వైద్యం ప్రవేశపెట్టాడు. ఇందులో మోతాదు తగ్గిస్తూ శక్తి పెంచడం అనేది ఆకర్షణీయ విషయం. జంతువులు, మొక్కలు, ఖనిజాలు, రసాయనాల వంటి వాటినుంచి యీ మందులు తయారుచేశారు. ఇందులో కరిగే వాటిని నీళ్ళలోగాని, సారాలోగాని కలిపేవారు. ఒక పాళ్ళు ఔషధం, 99 పాళ్ళ సారా లేదా నీరు కలిపి చేసే పద్ధతి ఒకటి, అలా కలిపి, బాగా పది సెకండ్ల పాటు వూపి, అందులో ఒక పాలు మళ్ళి తీసుకోని 99 చుక్కలు సారా లేదా నీరు కలిపేవారు ఇలా చేసుకుంటూ పోయే మందుల్ని 6C, 9E, 30C అలా పేర్లు పెట్టారు. ఈ పద్ధతిలో ఒక పాలు ఔషధం. 9 పాళ్ళు నీరు లేదా సారా కలుపుతూపోతే 3X, 6X, 30X అంటూ పేర్లు పెట్టారు. సులభంగా కరగని వాటిని మెత్తగా నూరి తరువాత యిా ప్రక్రియ చేసేవారు. ఇలా పలచబరిచే పద్ధతిని శక్తివంతం చేయడంగా (పొటెంటైజేషన్) అన్నారు. రసాయన శాస్త్రంలో అవగాడ్రో కనుగొన్న సూత్రం ప్రకారం మూలపదార్థం కోల్పోకుండా పలచబరచడానికి ఒక పరిమితి వుంది. 6023*1023 అనే యీ పరిమితిని హోమియోలో 12Cతో లేదా 24Xతో పోల్చవచ్చు. అంటే ఆ తరువాత మందులలో మందు వుండదన్న మాట. అయితే పదార్ధం లేకున్నా శక్తి వున్నదనీ అది జీవశక్తి(వైటల్ ఫోర్సు)ని ప్రకోచింపజేసి పనిచేస్తుందని హానిమాన్ నమ్మాడు. హోమియో మందుల్ని పరిశీలిస్తే మందు ఏమీ వుండదని తేలింది. నమ్మకంతో బ్రతికేవారిని శాస్త్రీయ పద్ధతిలో నిరూపించమనడం సాధ్యం కాదు.

మనుషుల్లో నమ్మకాలు ప్రబలి వున్నాయి. ప్రతి రోగి కూడా వైద్యుడి దగ్గర చిన్న పిల్లవాడి మనస్తత్వంతో వుంటాడు. వీటిని ఆసరాగా తీసుకొని హోమియో వైద్యులు దోపిడీ చేస్తున్నారు. యెన్నో ప్రశ్నలు వేసి, అలోపతిని తిట్టి రోగిలో బలహీనతను పెంచుతున్నారు. మన రోగులలో ఒక పట్టాన డాక్టర్ శక్తి సామర్ధ్యాలను ప్రశ్నించే తత్వం లేదు. ఆ విషయం కూడా హోమియోవారు బాగా వాడుకుంటున్నారు. హోమియో రీసెర్చి అని బోర్డులు పెట్టి భ్రమలు కలుగజేస్తున్నారు. సర్వరోగ నివారిణిగా హోమియోను ముద్రవేస్తున్నారు. ఎయిడ్స్, మెదడువాపు వంటి వ్యాధులు రాకుండా ఆపగల శక్తి వుందని ప్రచారం చేస్తున్నారు. వైద్యరంగంలో ప్రభుత్వానికి వున్న బలహీనతల్ని బాగా వాడుకుంటున్నారు. అలోపతికి వున్న నియమ నిబంధన హోమియోపై రాకుండా అధికార్లను రాజకీయనాయకులను పట్టుకొని జాగ్రత్తలు పడుతున్నారు. పత్రికలు ద్వారా మూఢనమ్మకాన్ని ప్రచారం చేసి, సంపాదిస్తున్నారు. మానవవాదులు ప్రశ్నించేది ఒక్కటే. హోమియో శాస్త్రీయపద్ధతికి రుజువు కాగలదా? అయితే ఆధారాలేమిటి?

హోమియోను ప్రభుత్వం నిషేధించాలని మానవవాదులు కోరడంలేదు. శాస్త్రీయం అని రుజువుపరిచేవరకూ ప్రభుత్వ నిధులు యివ్వరాదని మాత్రమే కోరుతున్నారు. అమెరికాలోని నార్త్ కరోలైనా రాష్ట్రంలో హోమియో వైద్యాన్ని ఆపారు. కోర్టులో హోమియో శాస్త్రీయమని రుజువు కానందుకే యిలా చేశారు.ఇంగ్లండ్ లో మెడికల్ బోర్డు అజమాయిషీ క్రిందకు హోమియోను తెచ్చారు. మనదేశంలో హోమియో పేరిట మారుమూల గ్రామాలలో సైతం సంపాదన జరుగుతుంది. అశాస్త్రీయమైన వైద్యాన్ని పాటిస్తే సమాజ నేరమౌతుంది, రాజ్యాంగంలో 51Ah ప్రాథమిక విధి ప్రకారం హోమియో పట్ల నిరసన తెలుపడం హ్యుమనిజమే.

శాస్త్రీయపద్ధతిని మనకు అనుకూలమైన చోట వాడుకుంటామని, మన వృత్తికి ఆదాయానికి దెబ్బ తగిలేచోట వాడుకోబోమని అంటే కుదరదు. హ్యుమనిస్టులు, హేతువాదులు తెలిసో తెలియకో హోమియో వైద్యం చేబట్టారనుకోండి అది శాస్త్రీయం అవునా కాదా అని ప్రశ్నించినప్పుడు వారు కూడా ఆ పరీక్షకు నిలవాలి. అదొక్కటే మినహాయించి మిగిలిన వాటిలో మానవవాదం అంటే కేవలం అవకాశవాదులుగా మిగులుతాం. వృత్తి లాభసాటిగా వుంది గనుక, ఏమైనాసరే హోమియోను సమర్ధిస్తామనడం హేతువాదంకాదు. రుజువులు చూపి శాస్త్రీయ పద్ధతి అని నిరూపించడం. లేదంటే హోమియో తప్పు అని యితరులకు చెప్పి, తాము వృత్తి మానడం హ్యుమనిజం.

- హేతువాది, జనవరి 1994