అబద్ధాల వేట - నిజాల బాట/పిశాచ పీడిత ప్రపంచం

వికీసోర్స్ నుండి
పిశాచ పీడిత ప్రపంచం

కార్ల్ శాగన్ ఒక ఆకర్షణీయ, అపూర్వ శాస్త్రజ్ఞుడు. ఆయన చనిపోబోయే ముందు (1996) ఒక పుస్తకం రాసిపోయాడు. దాని శీర్షిక: పిశాచ పీడిత ప్రపంచం (The Demon haunted world) (కార్ల్ శాగన్ 62వ యేట 20 డిసెంబరు 1996న మరణించారు.)

శాగన్ ఏది రాసినా, చెప్పినా జనానికి అర్థమయ్యేట్లు, అందుబాటులో ఆచరించేటట్లు చెప్తాడు. కాస్మాస్ పేరిట ఆయన రాసిన పుస్తకమూ అంతే, ప్రపంచ వ్యాప్తంగా కాస్మాస్ కార్యక్రమాలు టి.వి.లలో తిలకించిన వారికి యీ సంగతి తెలుసు. సైన్స్ ను ఆకాశం నుండి భూమి మీదకు తెచ్చిన సైంటిస్టు శాగన్. సైన్స్ నిపుణులు లోతుపాతులు గ్రహించి అనేక విషయాలు కనిపెడతారు. వాటిని సాంకేతిక నిపుణులు ఆచరణలో పెడతారు. అదే ఉపయోగం, అందులోనే హానికూడా వుంది. హాని ఎక్కువ అతిశయోక్తులతో చూపి, అది సైన్స్ కు అంటగట్టి, బూచిగా చిత్రించిన సందర్భాలున్నాయి.

కార్ల్ శాగన్ ఖగోళ శాస్త్రజ్ఞుడు. కార్ల్ మార్క్స్ తత్వాన్ని భూమి మీదకు తెచ్చి జనంలో పడేయమన్నాడు. సైన్స్ ను ఒక తత్వంగా చూచిన శాగన్ అదేపని సమర్ధవంతంగా చేసి, ఎంతో సేవ జరిపిన వాడయ్యాడు. చుట్టూవున్న చీకటి చూసి, నిస్సహాయంగా కూర్చోవద్దు. ఒక కొవ్వొత్తి అయినా వెలిగించు. ఇదీ దయ్యాల ప్రపంచంలో శాగన్ సూత్రం. ఆయన సైన్స్ ప్రచారానికి పూనుకోలేదు యీ పుస్తకంలో. ఆ పని చేసే వారు చాలా మంది వున్నారు.

సైంటిఫిక్ మెథడ్ (శాస్త్రీయ పద్ధతి) ఒక కొవ్వొత్తిగా స్వీకరించమన్నాడు. ఎన్ని ఒడిదుడుకులున్నా, రాగద్వేషాలున్నా, సైన్స్ ను ముందుకు నడిపించి, మనుషులకు ప్రగతి చూపి, ఇంత వరకూ రావడానికి మూలకారణంగా శాస్త్రీయ పద్ధతే, అంటే, సైన్స్ కూ, సైంటిఫిక్ మెథడ్ కూ తేడా చూపుతున్నాడన్నమాట. తెలుసుకోవడం, ప్రశ్నించడం, తప్పు అయితే దిద్దుకోవడం, విషయ సేకరణ, కొత్త ఆలోచనల్ని పరీక్షకు పెట్టడం, అందుకు సాక్ష్యాధారాలు చూపడం,పరీక్షకు నిలవకపోతే కొట్టిపారేయడం, నిలిస్తే సిద్ధాంతీకరించడం,దేనినీ పవిత్రం పేరిట ప్రశ్నించకుండా వదలకపోవడం, మనం చిరకాలంగా నమ్మేది శాస్త్రీయంగా తప్పు అని రుజువైతే అంగీకరించడం - ఇదే శాస్త్రీయ పద్ధతి. కొన్నిసార్లు శాస్త్రజ్ఞులే అనుసరించలేకపొతున్నారు. కాని అదే అవసరం.

కార్ల్ శాగన్ తన 457 పుటల గ్రంథంలో స్వానుభవాలు జోడించి, ఏదో లోకాల్లో ఎవరో ఆకాశ వ్యక్తులున్నారనే భ్రాంతుల్ని తిరస్కరించాడు. ఎగిరే పళ్ళాల వెనుక వున్న భ్రమల్ని బయటపెట్టాడు. ప్రతి శాస్త్రానికి ప్రతిబింబంగా వున్న అశాస్త్రీయ రూపాల్ని చూపాడు. ఉదాహరణకు ఖగోళశాస్త్రం ఒకవైపు, జ్యోతిష్యం మరొక పక్క చూపాడు.

25 అధ్యాయాలుగల యీ పుస్తకం ఎక్కడా బోర్ కొట్టదు. అర్థం చేసుకోడానికి తల బొప్పికట్టదు. నిఘంటువులు భూతద్దాలతో చూడనక్కరలేదు. అంతగా విడమరచి శాగన్ చెప్పాడు. ప్రకృతి అద్భుతాలను ఆనందించాలి. అనుభవించాలి, అంతటితో ఆగక, తెలుసుకోవాలి. ఇది నిరంతరం సాగవలసిన జిజ్ఞాస. పూజిస్తే తెలుసుకోలేం. ఆరాధిస్తూ కూర్చుంటే అంతుబట్టదు. అంతు తేల్చుకోవాలనే శాస్త్రీయ పట్టుదలవుంటే కొంత ముందుకు పోతాం. అలా పోవడంలో ఆనందం వుంది. ఆ పని చేయమని శాగన్ ప్రోత్సహిస్తున్నాడు.

ప్రభుత్వాలు తప్పులు చేయకుండా చూచే బాధ్యత ప్రజలదని సూత్రీకరించాడు. ఇందుకు తల క్రిందులుగా వ్యవహారం సాగిపోతున్నది. వ్యక్తులు తప్పులు చేస్తే దిద్దుకోవడం సులభం. ప్రభుత్వాలు చేస్తే, సమర్ధించుకోడానికి ప్రయత్నిస్తాయి. అదే ప్రమాదం.

ప్రతి అధ్యాయానికి రిఫరెన్స్ గ్రంథాలపట్టిక శాగన్ చూపాడు. చాలా అందంగా గ్రంథం ముద్రించారు. ఖరీదునుబట్టి అందరూ కొనడం యిబ్బందికరం గనుక, గ్రంథాలయాలకు, సంస్థలకు, కాలేజీలకు తెప్పిస్తే, చాలామందికి ఉపయోగపడుతుంది.

శాగన్ గురించి కొంత వ్యక్తిగత అనుభవం చెప్పడం మంచిదేమో. నేను ఆయనతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాను. తీరిక లేని సైంటిస్టుగా, అమెరికాలోని కార్నెల్ యూనివర్శిటీలో డంకెన్ ప్రొఫెసర్ గా వుంటూనే, నాకు జవాబులు రాశాడు. ఒక ఉత్తరంలో భారతదేశంలో మానవవాద మిత్రులకు మీద్వారా శుభాకాంక్షలు అందజేస్తున్నాను అన్నాడు. అదే చివరి ఉత్తరం. భద్రంగా జ్ఞాపికగా అట్టిపెట్టాను. వాషింగ్టన్ లో రెండు పర్యాయాలు శాగన్ ను కలిశాను. ఫోటో తీయించుకున్నాను. ఆయన వివాదాస్పద విషయాలు కూడా చాలా ఆహ్లాదంగా చెబుతారు.

CARL SAGAN:
The Demon-Haunted World, Science As a Candle in the Dark PP 457
1/8 Demmy 1996 $ 30, Random House, New York
- మిసిమి మాసపత్రిక,జూన్-1997