అబద్ధాల వేట - నిజాల బాట/"పిచ్చి" అంటే

వికీసోర్స్ నుండి
"పిచ్చి" అంటే

నీవు దేవుడితో మాట్లాడితే ప్రార్ధన అంటారు. దేవుడు నీతో మాట్లాడాడంటే పిచ్చి అంటారు. సుప్రసిద్ధ సైకియాట్రిస్టు థామస్ సాజ్ సూక్ష్మంగా చెప్పిన సత్యమిది.

ఇటీవల ఆయన గ్రంథం Insanity వెలువడింది. అందులో ఆయన కొన్ని మౌళికాంశాలు లేవనెత్తి, ప్రశ్నీంచి, వివరించారు. మనం అలవాటుగా మాట్లాడే అనేక సందర్భాలు ఎంత అసమంజసమో, అశాస్త్రీయమో చెప్పారు.

మానసిక రోగం అనేది ఉపమాలంకారం అని, పిచ్చి అనేది మిధ్య అని సాజ్ అంటుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఏది పిచ్చో చెప్పమని ఆయన అడిగితే నోరు నొక్కుకోవాల్సివస్తుంది. అలాగే మానసిక రోగం అని అతిసులభంగా వాడేస్తుంటాం. మానసికం అంటే ఏమిటి అని సాజ్ ప్రశ్నిస్తే సమాధానానికి తన్నుకోవాల్సిందే. వీటన్నింటినీ ఆయన చాలా లోతుగా పరిశీలించాడు.

రోగాలు శరీరానికి వస్తాయి. వాటి లక్షణాలు పరిశీలించి, చికిత్స చేస్తారు.

ప్రవర్తన మనిషికి సంబంధించినది. ఇందులో నవ్వడం, ఏడ్వడం, కోపగించడం, అనురాగం, మొదలైనవి వుంటాయి.

అంతవరకూ అర్ధమైంది. మూడోది మానసికం. అక్కడే వచ్చింది చిక్కు. తత్వవేత్తలు మనస్సు గురించి చాలా రాశారు. కాని మానసిక రోగాల జోలికి పోలేదంటారు సాజ్. సైకియాట్రిస్టులు మనస్సు అంటే ఏమిటో చెప్పకుండానే మానసిక రోగాలకు చికిత్స చేస్తున్నారని సాజ్ అభ్యంతరపెట్టారు. మానసిక చికిత్స అనేది దేవతా వస్త్రాలతో పోల్చి, దేవతలూ లేరు, వస్త్రాలు లేవని సాజ్ చెప్పాడు.

కొందరు యిటీవల పిచ్చి అంటే, మెదడుకు వచ్చే రోగం అంటున్నారని, అలాగయితే మెదడు స్పష్టంగా శరీరంలో ఒక భాగం అనీ, దానికి నిర్దుష్టమైన శాస్త్రం, లక్షణాలు వున్నాయని అన్నాడు. మెదడులో ఏభాగం ఎలా పనిచేస్తున్నదో, దానికి చికిత్స ఏమిటో మెదడు శాస్త్రం అధ్యయనం చేస్తున్నదని సాజ్ స్పష్టం చేశారు. కనుక "పిచ్చి" అనేది ఒక అంగానికి వచ్చే రోగంగా నిర్ధారించలేకపోయారని ఆయన అన్నారు.

ఆత్మ అనేది వున్నదనే భ్రమ కల్పించి దానికి చికిత్స నిమిత్తం వివిధ శిక్షలు సైతం విధించిన పురోహిత వర్గం ఎలా ప్రవర్తిస్తున్నదో, సైకియాట్రిస్టులు కూడా మానసికం పేరిట అలానే చేస్తున్నారన్నారు.

ఫ్రాయిడ్ మానసిక రోగాలకు మూలంగా స్వప్నాలను స్వీకరించాడు. అదొక శాస్త్రంగా పెంపొందించే ప్రయత్నం చేశాడు. ఆ భ్రమలో సైకో ఎనాలసిస్ రూపొందింది. నేడు అదంతా శాస్త్రీయం కాదని, రుజువుకు నిలవడం లేదని తెలిసేసరికి,అనేక చిలవలు పలవలుగా మార్పులు చేశారు. కాని సైకియాట్రిని మాత్రం వదలకుండా, 'మానసికచికిత్స' అంటూ కొనసాగిస్తున్నారు.

మనుషులు వివిధ రకాలుగా ప్రవర్తిస్తారు. అందులో మనకు యిష్టం లేనివాటికి "పిచ్చి", "ఉన్మత్తత" "మనోవికారం" అని పేరుపెట్టడం, మానసిక చికిత్స చేయాలనడం,బలవంతంగా ఆస్పత్రిలో చేర్చించడం-యివన్నీ సాజ్ అభ్యంతర పెడుతున్నారు. తనలో తాను నవ్వుకోవడం, ఏడ్వడం,రోడ్డు మీద పోతూ అలా ప్రవర్తించడం "పిచ్చి"గా వర్ణిస్తున్నారు. అలాంటి వ్యక్తి ఎవరి జోలికీ రాకుండా, హానిచేయకుండా వున్నంతవరకూ, బలవంతంగా ఆస్పత్రి పాలు చేయడాన్ని కూడా సాజ్ ఆక్షేపిస్తున్నారు.

స్క్రూడ్రైవర్ అనే మత్తు పానీయం వుంది. ఓడ్కాలో నారింజరసం కలిపి, స్క్రూడ్రైవర్ అనే పేరు పెట్టారు. మరమేకులు విప్పడానికి మనం వాడే స్క్రూడ్రైవర్ వుంది. స్క్రూడ్రైవర్ తాగినప్పుడు మత్తెక్కి ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తుంటే, స్క్రూడ్రైవర్ చెడిపోయిందని షాపుకు తీసుకెళ్ళి బాగుచేయమంటే ఎలా వుంటుంది? మానసిక చికిత్స కూడా అలాంటిదే అన్నారు సాజ్.

మానసిక రోగం అనేది ఉపమాలంకారం వంటిదనే తన సిద్ధాంతాన్ని 5వ అధ్యాయంలో సాజ్ సమర్ధించారు. ఒక విషయానికి మరోపేరు పెట్టి అలంకారంగా మనం వాడుతుంటాం. వాటిని సాగదీసి, నిజం అనుకుంటే చిక్కువస్తుంది. కాని సైకియాట్రి నేడు అలాగే చేస్తున్నది. ఫాదర్ అంటే తండ్రి. క్రైస్తవ ఫాదర్ అంటే పూజలు చేసే పురోహితుడు. నిజమైన తండ్రికీ క్రైస్తవ ఫాదర్ కూ వాడుకలో తేడా వుంది. రెండూ ఒకటే అనుకుంటే చిక్కు వస్తుంది.

అలాగే కొన్ని హాస్య ఉపమానాలుంటాయి. వాటిని విని నవ్వుకొని ఆనందించాలేగాని, తు.చ.తప్పకుండ స్వీకరిస్తే చిక్కువస్తుంది.

ఒక అమెరికా యాత్రికుడితో చైనా అధికారి యిలా అన్నాడు. ప్రపంచంలో అతిపెద్ద దేశం ఏదో తెలుసా? క్యూబా. క్యూబా ప్రభుత్వం మాస్కోలో వుంటుంది. క్యూబా సైన్యం ఆఫ్రికాలో వుంటుంది. క్యూబావాసులు అమెరికాలోని ఫ్లారిడా రాష్ట్రంలో వుంటారు.

ఇది సునిశిత విమర్శనాయుత వ్యంగ్యంగా, స్వీకరించాలి. వాస్తవంగా గ్రహిస్తే ప్రమాదం. సైకియాట్రిలో మనిషి ప్రవర్తనను యిలా స్వీకరించడం జరుగుతున్నదని సాజ్ చూపడానికి చాలా ఉదాహరణలు యిచ్చారు.

అనుకరణ గురించి రాస్తూ, మానసిక రోగాలలో యిదెలా పరిణమించిందో చూపారు. ఇతరులను అనుకరించడం, జబ్బుగా వున్నట్లు నటించడం సైకియాట్రి సమస్యలలో ప్రధానంగా వున్నట్లు సాజ్ వివరించారు. చార్కాట్ కాలం నుండీ యిలా మానసిక రోగులుగా, మూర్ఛరోగులుగా నటించడం వస్తున్నది. దానికి తగ్గట్లే నయం చేసినట్లు నటించడం కూడా వచ్చింది.

మానసిక రోగాన్ని వివరించి, మనస్సు, మానసిక రోగం అంటే విడమరచి, అంతా గాలి మాట అని చూపారు.

మొత్తం మీద యీ పుస్తకం "పిచ్చి" వైద్యం చేసే వారికి మింగుడుపడని వాదనలతో వుంది. సాధారణ పాఠకులకు చాలా ఆశ్చర్యం కలిగించే విషయాలున్నాయి. మనందరం అలవాటుగా, ప్రశ్నించకుండా ఆమోదించే విషయాలను సాజ్ ప్రశ్నీంచి మనల్ని ఆలోచించేటట్లు చేస్తారు. జబ్బు అనేది చాలా లోతుపాతులతో సాజ్ చర్చించారన్నాం గదా. ఉదాహరణకు కొందరికి "ప్రేమ జబ్బు" వుంటుంది. ఇది ఉపమానంగా స్వీకరించాలేగాని, శరీరానికి ఏదో జబ్బు చేసినట్లూ చికిత్స అవసరమైనట్లూ భావించరాదు. కొందరు ఆర్ధిక యిబ్బందుల వలన దిగజారిపోవచ్చు, మాట్లాడడం యిష్టం లేక మౌనం వహించవచ్చు. వారికి జబ్బు వునట్లు భావించరాదు. కాని సైకియాట్రిస్టులు అలాంటి వారిని కూడా రకరకాల "పిచ్చి" పేర్లు పెట్టి ఆస్పత్రి పాలుచేస్తున్నారు.

రోగికీ వైద్యుడికీ గల సంబంధాన్ని చర్చించినప్పుడు, రోగిపై సైకియాట్రిస్టుకు గల పట్టు ఎలాంటిదో సాజ్ వివరించాడు. ఈ సందర్భంగా ఆయన అధికారానికి చెందిన వివిధ దృక్పథాలను బాగా విడమరచి చెప్పారు.

రోగులకు గల హక్కులను సాజ్ చర్చించారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తించని రోగులకు హక్కులుంటాయి. చట్టాన్ని అతిక్రమించిన వారిని శిక్షించే తీరు వున్నది. మానసిక రోగులు ఇతరులను కొడుతున్నారని, ఆస్తికి నష్టం కలిగిస్తున్నారని అంటారు. అలాంటి పనులు నేరం క్రిందకు వస్తాయి. కాని అలాగాక, వారికి "పిచ్చి" అని ముద్రవేసి, ఆస్పత్రి పాలు చేసి సైకియాట్రిస్టులు వారిని తమ బానిసలుగా చేసుకుంటున్నారనేది సాజ్ విమర్శ. మతం మత్తుమందు అని మార్క్స్ అన్నాడు. సాజ్ దృష్టిలో మతాన్ని సృష్టించిన మనిషే మత్తును కూడా సృష్టించుకున్నాడంటారు. మాటలగారడీలో పడి కొట్టుకుంటున్నామని సాజ్ వాదన. జబ్బు వస్తే, డాక్టర్లు నయం చేయాలేగాని, ఉద్దేశాలు అంటగట్టరు. సైకియాట్రిలో ఉద్దేశాలు చుస్తున్నారు. ఒక 42 ఏళ్ళస్త్రీ తాగి, కారునడుపుతుండగా, పోలీసు పట్తుకొని వూపిరి పరీక్ష (తాగుడు నిర్ధారణకు) చేయబోగా ఆమె నిరాకరించింది. తన్నేసింది, అరిచింది. గొడవ చేసింది. కోర్టులో న్యాయమూర్తి ఎదుట చెబుతూ, బహిష్టుకు ముందు లక్షణాలుగా తన ప్రవర్తనను వివరించింది. కోర్టు ఆమెను వదిలేసింది! సాజ్ యిలాంటి ఉదాహరణలు యిస్తూ, నేరానికీ రోగానికీ తేడా చూడనప్పుడు యిలాంటి స్థితి వస్తుందన్నాడు.

సైకియాట్రి పేర్కొనే అనేక లక్షణాలు వ్యక్తిగత, ఆర్ధిక, చట్టబద్ధ, సామాజిక, రాజకీయరంగాలకు చెందినవని, వైద్యరంగంలోకి రానివనీ సాజ్ చూపారు.

సాజ్ వాదనలకు సమాధానం చెబితే, సైకియాట్రిస్టుల వృత్తు దెబ్బతింటుంది. ఆదాయం పోతుంది. కనుక వాదనకు దిగరు. శాస్త్రీయ వివరణకు పూనుకోరు. తమ పలుకుబడి వినియోగించి పెత్తనం చేస్తున్నారు.

ఆత్మ, మనస్సు, మోక్షం, నరకం దేవుడు, దయ్యం మొదలైనవి పురోహిత వర్గానికి ఆయువుపట్టు. వాటిని రుజువు చేయాల్సిన బాధ్యత వారికి లేదు. మనుషులు నమ్మినంతకాలం అవి వారి ఆయుధాలే.

మానసిక రోగం, మనోవికారం, ఉన్మత్తత,పిచ్చి యిత్యాదులు సైకియాట్రిస్టుల అస్త్రాలు. అవి రుజువుకు నిలబడతాయా లేదా అనేది వారికి పట్టదు. దీనిపై వారి వ్యాపారం సలక్షణంగా సాగిపోయినంతకాలం, జనం "పిచ్చి" వదలదు!

- మిసిమి మాసపత్రిక, ఆగష్టు-1997