అబద్ధాల వేట - నిజాల బాట/బిలియన్స్ అండ్ బిలియన్స్

వికీసోర్స్ నుండి
బిలియన్స్ అండ్ బిలియన్స్

కార్ల్ శాగన్ రాసి, అచ్చుకాక పూర్వమే చనిపోయిన చివరి పుస్తకం బిలియన్స్ అండ్ బిలియన్స్ యిప్పుడు విడుదల చేశారు. ఆయన భార్య చివరి మాట జోడించి, పాఠకులను ద్రవింప జేసే మమత చూపారు. కార్ల్ శాగన్ మరణానంతరం ఆమె అందుకున్న లక్షలాది సానుభూతి లేఖలను బట్టి శాగన్ బ్రతికే వున్నాడని డ్రుయన్ రాశారు.

శాగన్ ఇతర పుస్తకాలవలె యీ చివరి గ్రంథం కూడా జీవితం, మరణం, భవిష్యత్తు గురించి రాయగా, విపరీతంగా జనాకర్షణ పొందుతున్నది. సైన్స్ ను, మానవాళికి సాంకేతిక రంగ ప్రమాదాలను, నివారణను శాగన్ అతి సున్నితంగా చర్చించి, మార్గాంతరాలను చూపడం యిందలి ప్రత్యేకత.

రెండవ అధ్యాయం ఎత్తుగడలోనే చదరంగం కథను స్వీకరించారు. తొలుత యిది కనుగొన్న పర్ష్యా మంత్రి అద్భుత చర్యకు రాజు ఆకర్షితుడై, ఏం కావాలని కోరుకోమన్నాడట. 64 గడులకూ మొదటిగడికి ఒక గోధుమ గింజతో మొదలెట్టి, రెట్టింపు చేసుకుంటూ పోయి, 64వ గడికి ఎంత ధాన్యం వస్తే అంత యిప్పించమని మంత్రి అడిగాడట. అదేం కోరిక! డబ్బు, స్త్రీలు, భవనాలు, ఆస్తులు, అలాంటివి కోరుకోమన్నాడు రాజు. మంత్రి వినయంగా తానడిగింది యిప్పిస్తే చాలన్నాడట. సరేనని, లెక్క మొదలెడితే, మొదటి గడికి ఒక గోధుమ గింజ రెండవ గడికి రెండు, మూడో గడికి 4, అలా హెచ్చిస్తూ పోయారట. 64వ గడి వచ్చేసరికి రాజుగారి ధాన్యాగారం చాల లేదు సరిగదా, అప్పు పడి, రాజ్యం అప్పగించాల్సి వచ్చిందట.

ఈ ఉదాహరణకు శాగన్ పేర్కొని భారత దేశంలో కూడా లెక్కలు కనిపెట్టిన ఖ్యాతి ప్రస్తావించారు. ఆ లెక్కలు మన జనాభాకు అన్వయిస్తే ఎంత ముంచుక పోయే స్థితి వస్తుందో చూడమన్నారు.

వాతావరణ కాలుష్యాన్ని గురించి శాగన్ రాసింది మరీ ఆకర్షణీయంగా, హెచ్చరికగా బాగా వున్నది. ప్రపంచం యావత్తూ కాలుష్యానికి తోడ్పడుతుండగా అందులో అమెరికా 20 శాతం అందిస్తున్న విషయం గుర్తు చేశారు.

భూమికి 25 కిలో మీటర్లు ఎత్తులో వున్న ఓజోన్ పొరకు బెజ్జం పడింది. అంటార్కిటికా వద్ద తొలుత సైంటిస్టులు యిది కనుగొన్నారు. అయితే ఏమిటి? సూర్యరశ్మిలో వుండే అల్ట్రావైలేట్ కిరణాలు సూటిగా మన మీద పడతాయి. అది కాన్సర్ వంటి రోగాలకు దారితీస్తుంది. శరీరానికి వుండే రోగనిరోధకశక్తి పోతుంది. ఓజోన్ పొరకు బెజ్జం పడడానికి కారణం మనమే. క్లోరో ప్లూరో కార్బన్లు వాడటం వలన యీ ప్రమాదం ఏర్పడింది. మనం వాడే రిఫ్రిజిరేషన్, సెంట్లు, అనేక పరిశ్రమలలో వాడే స్ప్రేలు, ఇన్సులేషన్, సాల్వెంట్స్ లో యిది వున్నది. ఇందులో కణాలు ఆకాశంలో ఒజోన్ పొరలోని కణాల్ని ఎదుర్కొంటున్నాయి. అదే ప్రమాదం. భవిష్యత్తులో యీ ప్రమాదం యింకా పెరిగిపోతుంది. శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తే, తొలుత పారిశ్రామికులు నిరోధించారు. తరువాత ఒప్పుకొని, వీటి వాడకాన్ని తగ్గించడానికి అంగీకరించారు. పూర్తిగా వీటిని ఆపడానికి కొంత కాలం పట్టవచ్చు. కాని ఆపి తీరాలని, భవిష్యత్తు తరాల సంక్షేమకారుడుగా కార్ల్ శాగన్ స్పష్టం చేశారు. 'ఎ పీస్ ఆఫ్ స్కై యీజ్ మిస్సింగ్' అని ఈ అధ్యాయానికి చక్కగా శీర్షిక పెట్టారు.

సైన్స్ - మతం గురించి కార్ల్ శాగన్ చేసిన చర్చ ఉత్తేజ పూరితంగా, మానవ వాదంతో యిమిడివున్నది.

రాజ్యాధిపతులు, మతాధిపతులు ఏర్పరచిన సంయుక్త సమావేశాలు 1988 ఏప్రిల్ లో ఆక్స్ ఫర్డ్ లోనూ, 1990 జనవరిలో మాస్కోలోనూ జరిగాయి. అందులో పాల్గొన్న శాస్త్రజ్ఞుడుగా శాగన్ తన అనుభవాల్ని రాశారు. వాతావరణ కాలుష్యాన్ని ఆపి,భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత గురించి ఒక విజ్ఞప్తి చేయగా దానిపై మతాల వారు, రాజకీయ నాయకులు ఒడంబడికపై సంతకాలు చేశారు. అందుకే యీ విషయంలో మతం-శాస్త్రం చేరువ అయ్యాయని శాగన్ రాశాడు. ఆ సందర్భంగా ఒక ఆసక్తికర విషయం ప్రస్తావించాడు.

వివిధ మతాలవారు సమావేశంలో ప్రార్ధనలు చేశారు. అలాగే భారత వేద పండితుడు ఓం మంత్రాన్ని ఉచ్ఛరించగా అది అందరూ అనుకరించారట. సోవియట్ విదేశాంగ మంత్రి షెవర్ నాట్జి కూడా అందులో చేరి ఓం పఠనం చేశాడట. కాని గొర్భచేవ్ మాత్రం మౌనం దాల్చాడట. ఆయన వెనకే లెనిన్ విగ్రహం వున్నది.

'మన శత్రువులు' అనే అధ్యాయంలో ఇంకో విశేషాన్ని శాగన్ బయటపెట్టారు. అమెరికా రష్యాలు శాగన్ వ్యాసాన్ని ఒకేసారి ప్రచురించాయి. అమెరికాలో పెరేడ్ పత్రిక. రష్యాలో ఓగోన్యాక్ (Ogonyak) ఈ వ్యాసాన్ని ప్రచురించి చర్చకు పెట్టారు. 1988లో జరిగిన విశేషం యిది. మనకు వేరే ప్రపంచాల నుండి ఎవరో వచ్చి దాడి చేసే ప్రమాదం లేదనీ, మనం సహజ వనరులను తగలేయడంలో ప్రమాదం వుందనీ, బొగ్గు తగలేసి కార్బన్ డయాక్సైడ్ పెంచి, వాతావరణం వేడెక్కేటట్లు చేస్తున్నామని శాగన్ హెచ్చరించారు. అమెరికా-రష్యాలు యిది ఆపితే,ఎడారులుగా కొన్ని ప్రాంతాలు మారిపోకుండా వుంటాయన్నారు.

నిజం గురించి అటు అమెరికాకు గాని, యిటు సోవియట్ యూనియన్ కు గాని గుత్తాధిపత్యం లేదని శాగన్ అన్నారు.

ఆ సందర్భంగా లెనిన్ మాటల్ని శాగన్ ఉదహరించారు. సోవియట్ యూనియన్ లో శాగన్ వ్యాసంలోని భాగాలను, లెనిన్ పై వ్యాఖ్యలను సెన్సార్ చేశారు. ఇప్పుడు తమదే తప్పు అని, లెనిన్ ప్రస్తావన చేసిన శాగన్ సరిగానే ఉదహరించాడని అర్భటోల్ తన స్మృతులలో ప్రకటించారు.

గర్భస్రావంపై చర్చించిన అధ్యాయంలో జీవనాన్ని హత్య చేయడం అంటే ఏమిటనే విషయంపై శాగన్ సునిశిత ప్రశ్నలు వేశారు. ప్రతి మనిషి రేతస్సులో భూమిని నింపగల శక్తి వున్నదనీ,రేతస్సు వృధా అవుతుంటే, అదంతా హత్యగా పరిగణించాలా అన్నారు.

ప్రపంచ సంక్షేమ నిమిత్తం ఇస్లాం కూడా కుటుంబ నియంత్రణ పాటించాలని సిరియాకు చెందిన గ్రాండ్ ముప్తి 1990 ప్రపంచ సభలో చెప్పడం అందరినీ ఆకట్టుకున్న విషయం అని శాగన్ జ్ఞప్తి చేశారు.

మరణాన్ని సహజంగా స్వీకరించిన శాగన్ తన గొప్పతనాన్ని యీ గ్రంథంలో చూపాడు. సైన్స్ ను సామాన్యులకు అందించిన శాగన్ శ్లాఘనీయుడు.

- మిసిమి మాసపత్రిక,సెప్టెంబర్-1997