అబద్ధాల వేట - నిజాల బాట/నేను ముస్లింను ఎందుకు కాదు ?

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
నేను ముస్లింను ఎందుకు కాదు?
Why I am not a Muslim by IBN WARRAQ,
(Pub :- Promethus Books, U.S.A.)

కథ చెప్పడమేగాదు,వినడం కూడా చేతకావాలన్నాడు రాచకొండ విశ్వనాధశాస్త్రి. పుస్తకాలు రాయడం ఒక ఎత్తు. వాటిని అచ్చు వేయడానికి ధైర్యం కావాలి. సాల్మన్ రష్డీ, తస్లీమానస్రీన్ (బంగ్లాదేశ్ "లజ్జ" రచయిత్రి) రచనలు వెలువడిన తరువాత, చాల మంది ప్రచురణకర్తలు వివాదాస్పద రచనలంటే భయపడుతున్నారు. ముఖ్యంగా ముస్లింలను, మహమ్మద్, కొరాన్, ఇస్లాం చట్టాలను విమర్శించే గ్రంథాల జోలికి పోకూడదనుకుంటున్నారు. అలాంటి సందర్భంలో అమెరికాలోని హ్యూమనిస్టు ప్రచురణ సంస్థ ప్రామిథిస్ వారు ధైర్యంగా యీ పుస్తకాన్ని యిటీవలే వెలువరించడం ఆహ్వానించదగిన మార్పు.

పుస్తకరచయిత ముస్లిం. ఇస్లాంను బయటివారు విమర్శించిన రచనలు చాలా వున్నాయి. వాటిని ముస్లింలు అంతగా పట్టించుకోరు. కాని తమలోని ఒక వ్యక్తి విమర్శిస్తే. చంపేసే వరకూ, అమానుషంగా ప్రవర్తిస్తారు. శటానిక్ వర్సెస్ రాసిన సాల్మన్ రష్డీని చంపేయమని ఇస్లాం అధిపతి అయొతుల్లా ఖొమిని ఉత్తర్వులు జారీచేశారు. బంగ్లాదేష్ లో తస్లీమా నస్రీన్ కు తలదాచుకునే అవకాశం లేక, స్వీడన్ కు పారిపోవాల్సిన దుర్గతి పట్టించారు. వారి పుస్తకాలను నిషేధించారు. మళ్ళీ యీ దేశాలన్నీ మానవ హక్కుల పత్రం పాటిస్తామని సంతకాలు చేసిన వారే! ఇబన్ వారక్ రచన చాలా లోతుపాతులతో, నిశిత పరిశీలనతో, అనేక మంది రచయితలను పట్టి చూచి రాసిన గ్రంథం. అంతా అయిన తరువాత ఇక తాను ముస్లింగా వుండలేనంటున్నాడు. అది ధైర్యానికి నిదర్శన ప్రకటన.

బెర్డ్రాండ్ రస్సెల్ నేనెందుకు క్రైస్తవుణ్ణి కాదు అనే రచన చేస్తే ప్రపంచంలో ఇతర మతస్తులు మెచ్చుకున్నారు. ఇబన్ వారక్ అంటాడు. రసెల్ రచనలో క్రీస్తుకు బదులు అల్లాను పెడితే, అదంతా ముస్లింలకు యధాతధంగా వర్తిస్తుంది. అలాగే అన్ని మతాలకూ చెందుతుంది. నేనెందుకు హిందువును కాలేదు అని యిటీవల రామేంద్ర బీహార్ నుండి ఒక రచన ప్రచురించాడు. అదికూడా రసెల్, ఇబన్ వారక్ ధోరణిలోదే.

ఈ రచనలో 17 అధ్యాయాలు వున్నవి. ఇబన్ వారక్ చాలా పరిశోధన చేసి ప్రతి అంశాన్ని పట్టిచూచి, రాశాడు. రష్డీ వ్యవహారంతో తొలి అధ్యాయం ఆరంభమౌతుంది. 1989 ఫిబ్రవరిలో ఇరాన్ అధిపతి అయొతుల్లా ఖొమిని ఫత్వా జారీచేసి సాల్మన్ రష్డీని చంపమన్నాడు. పాశ్చాత్యులలో కొందరు ముస్లింలను దువ్వడానికిగాను యీ చర్యను సమర్ధించారని, ఖొమిని చర్యను ఖండించలేకపోయారని ఆయన చూపారు. ఫ్రెంచి తత్వవేత్త పూకోసైతం ఖొమిని చర్యల్ని ఆహ్వానించి, ఇరాన్ లో దారుణాల పట్ల కళ్లు మూసుకున్నట్లు రచయిత ప్రస్తావించారు. శాస్త్రీయ రంగంలో పరిశోధనలు, రుజువులు, ప్రగతిని కొంత వరకు క్రైస్తవులు స్వీకరించి, మత ఛాందసాన్ని సవరించారని, ఇంకా ముస్లింలు ప్రారంభించ లేదని రచయిత అన్నారు. అయితే శాస్త్రీయ ఉప్పెనకు కొరాన్ తట్టుకోలేదని కూడా ఆయన అన్నాడు.

రెండో అధ్యాయంలో ఇస్లాం పుట్టుపూర్వోత్తరాలు, యూదు క్రైస్తవ మతాల, గ్రంధాల ప్రభావం సుదీర్ఘంగా చర్చించారు. విగ్రహారాధన వ్యతిరేకించే ముస్లింలు మక్కాలో "కాబా" నల్లరాతిని ప్రతిష్టించి, ఆరాధించే రీతులు ఎలా వచ్చాయో వివరించారు. ఇది ఆకాశంనుండి వూడిపడిన ఉల్క అని కీ॥శే॥కారల్ శాగన్ రాశారు. మక్కా మీదుగా ఎమెన్, సిరియా వెళ్ళే ఒంటె వ్యాపారస్తులు కాబావద్ద ఆగి, పక్కనే వున్న ఊట బావి నీటితో సేద తీర్చుకొని వెళ్ళేవారని రచయిత పేర్కొన్నారు.

మూడో అధ్యాయంలో మూలాధారాల పరిశీలనలో ఎదుర్కొంటున్న సమస్యల్ని, రచయిత కూలంకషంగా చూచారు.ఖురాన్ గురించి ముస్లిం సనాతనులు చెప్పే అబద్ధాలు మొదలు, మహమ్మద్, సంప్రదాయాల వెనుక ఎంత వరకు నిలబడగల చరిత్ర వుందో చూపారు.

నాలుగో అధ్యాయంలో మహమ్మద్ సందేశాలను రచయిత విప్పి చూపారు. మహమ్మద్ గురించి రాసిన వాళ్ళలో చాలా మంది వ్యతిరేకులు కాదని, అయినా వాస్తవాలు తెలిపారనీ, ముస్లింలు అదంతా గ్రహిస్తే అంత అభిలషించరని రచయిత అన్నారు. మహమ్మద్ లో మక్కా కాలంలో మహమ్మద్ చిత్త శుద్దిగల మత నమ్మకస్తుడుగా వున్నాడు.

ఖురాన్ గురించి ఐదవ అధ్యాయం విపులంగా పరిశీలిస్తుంది. ముస్లింలు ఖురాన్ పవిత్రమనీ, దైవదత్తమనీ, సత్యమనీ నమ్ముతారు. అలాంటి గ్రంథంలో పరస్పర విరుద్ధాలు, ప్రక్షిప్తాలు, భిన్న పాఠాంతరాలు వుండడాన్ని రచయిత చూపాడు. ఖురాన్ సూచించే శిక్షలో మానవహక్కుల్ని ఎలా ఉల్లంఘిస్తున్నాయో రచయిత పేర్కొని ఇస్లాం దేశాలన్నీ మానవహక్కుల పత్రం అంగీకరించిన విషయం గుర్తు చేశారు. బైబిల్ వలె ఖురాన్ కూడా సృష్టివాదం ఒప్పుకోగా, సైన్స్ అందుకు విరుద్ధంగా పరిణామ వాదానికి సాక్ష్యాధారాలు చూపుతున్నది. అలాగే జీవంకూడా.

ఇస్లాంలో నియంతృత్వం ఎలా వుందో రచయిత మరొక అధ్యాయంలో చూపాడు. ఇస్లాం అంతా విధులతో కూడినది. పుట్టిన దగ్గరనుండీ చనిపోయే వరకూ జీవితాన్ని అదుపులో పెట్టడం ఇస్లాం పని. కనుకనే ఇస్లాంలో సెక్యులరిజం లేదు. అంటే మతం-రాజ్యం విడిగా చూడడం లేదు. ఇస్లాం యావత్తూ నాలుగు స్థంభాలపై ఆధారపడుతుంది. ఖురాన్, సున్నా, (ప్రవక్త ప్రవచనాలు), వీటిని గురించి ఒక అంగీకారానికి వచ్చిన ముస్లిం పండితుల మాటలు, ఉపమానాలతో కూడిన వాదన. రచయిత ననుసరించి ఖురాన్ 7-9 శతాబ్దాల మధ్య రాసిందే. ఇందులో యూదు, క్రైస్తవ, జొరాస్ట్రియన్, సమారిటన్ నుండి స్వీకరించి చేర్చినవి చాలా వున్నాయి. ఇందులో శాస్త్రీయంగా నిలబడని దోషాలు,వ్యాకరణ భాషా దోషాలు, కాలదోషం, పరస్పర విరుద్ధ విషయాలు, అసంబద్ధాలు పేగన్ల పట్ల అసహనం, హింస, హత్య, స్త్రీపురుష అసమానతలు, బానిసత్వాన్ని అంగీకరించం, అమానుష శిక్షలు, మానవ వివేచన పట్ల జుగుప్స వున్నాయి. దైవదత్తమైన వాటిలో యిలా వుండడం అర్థం లేనిదని రచయిత ఉద్దేశం. ఉదారత, తల్లి దండ్రులపట్ల గౌరవం వంటివి వున్నప్పటికీ అసంబద్ధాల మధ్య అవి మునిగిపోయాయి.

ఇస్లాంలో పురోహిత వర్గం లేదని ముస్లిం పండితులు చెబుతారు. కాని ఇస్లాంకు సరైన వ్యాఖ్యానం చేసే పేరిట అన్ని చోట్ల పురోహిత వర్గం తిష్ఠ వేసి పెత్తనం చేస్తున్నది. ఉలేమాలు వీరే. ముస్లింలలో నిశిత పరిశీలన, శాస్త్రీయ దృక్పధం పెంపొందకుండా నిరోధిస్తున్నది యీ ముల్లాలే. వెయ్యేళ్ళ క్రితం ఆనాటి పరిస్థితులలో వచ్చిన హరియా చట్టాలు నేడు చారిత్రకంగా చూడాలేగాని, తుచ తప్పకపాటిస్తే నైతిక ప్రగతి వుండదని రచయిత ఘంటా పధంగా చెప్పారు.

మానవహక్కులు :ముస్లిం దేశాలు ఇస్లాంను పాటిస్తూనే,మానవహక్కుల్ని అంగీకరిస్తూ సంతకాలు చేశాయి. ఐక్యరాజ్య సమాఖ్యలో వీరు సభ్యులే. కాని ఆచరణలో అడుగడుగునా మానవ హక్కుల్ని ఇస్లాం అడ్డు కొంటున్నది. ఇస్లాంలో స్త్రీలు పురుషులు సమానం కాదు. పురుషుడి సాక్ష్యంలో సగం విలువ మాత్రమే స్త్రీ సాక్ష్యానికి వుంటుంది. స్త్రీలకు అన్ని విధాల స్వేచ్ఛను ఇస్లాం పరిమితం చేస్తుంది. ముసుగు వేసుకోమంటుంది. మానవ హక్కుల ప్రకారం స్త్రీ పురుషులకు హక్కులు స్వేచ్ఛ, భావాలు సమానంగా వుండాలి. కాని ఇస్లాం ప్రకారం స్త్రీలు ముస్లింలు కాని వారిని పెళ్ళి చేసుకోరాదు. ముస్లిం దేశాలలో నివశించే ముస్లిమేతరులకు, కోర్టులో గాని, మరెక్కడా సమాన హక్కులు లేవు. ముస్లిం దేశాలలో నాస్తికులు, నమ్మకం లేనివారు చంపబడాల్సిందే. ముస్లిం దేశాలలో ఇతరమతాల వారు తమ ప్రార్ధనలు చేసుకోడానికి, బాహాటంగా గుడి,చర్చి నిర్మించడానికి, పవిత్ర గ్రంధాలు చదవడానికి వీల్లేదు. మానవహక్కులు బానిసత్వాన్ని వ్యతిరేకిస్తుండగా ఇస్లాం గుర్తిస్తున్నది. బానిస స్త్రీలతో లైంగిక సంపర్కం ముస్లింలకు ఖురాన్ అనుమతిస్తున్నది.(సురా 4:3)

మానవహక్కుల ప్రకారం క్రూరమైన, అమానుషమైన శిక్షలు, మానవత్వాన్ని దిగజార్చే శిక్షలు వుండరాదు. ఇస్లాం ప్రకారం కొరడాతో బహిరంగంగా కొట్టడం, చేతులు కాళ్ళు నరకడం, రాళ్ళు విసరి చంపడం అనుమతిస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానమని మానవహక్కులు చెబుతుండగా, ఇస్లాం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నది. ముస్లింలలో ఇతరులు మతం మార్చుకొని చేరవచ్చు కాని ముస్లిం మతం మార్చుకొని వేరేపోడానికి వీల్లేదు.

ప్రజాస్వామ్యం-ఇస్లాం పొసగనివని, మానవహక్కులకు ఇస్లాంలో అవకాశం లేదని రచయిత వివరంగా చెప్పారు. ముస్లింలు ఇతర ప్రపంచంతో పాటు ముందుకు సాగడానికి, మతాన్ని రాజ్యాన్ని విడదీసే సెక్యులరిజం అవసరమని రచయిత అన్నారు.

స్త్రీలు-ఇస్లాం:స్త్రీలపట్ల ఇస్లాం ఎలా ప్రవర్తిస్తున్నదో చాలా వివరంగా రచయిత ఒక అధ్యాయంలో చర్చించారు. క్రైస్తవుల వలె ఇస్లాంకూడా పురుషుని సృష్టి ముందు జరిగిందని భావించారు. స్త్రీల పట్ల ఇస్లాం చాలా క్రూరంగా, హేయంగా ప్రవర్తించిన ఉదాహరణలు రచయిత చూపాడు.

స్త్రీ బహిస్టు సమయంలో ఖురాన్ తాకరాదు, కాబా చుట్టూ తిరగరాదు, ప్రార్ధన చేయరాదు, ఉపవాసం వుండరాదన్నారు. స్త్రీ పురుష అసమానత్వం ఖురాన్ లో నిర్దిష్టంగా వుంది (సురా 2.282) ఆస్తిహక్కులో కూడా అబ్బాయికి రెండు రెట్లు అమ్మాయికి ఒక భాగం చెందాలన్నారు.

రక్తపాతంతో కూడిన పగ సాధింపు ఇస్లాంలో పేర్కొన్నారు. (సురా 2.178) స్త్రీలకంటె పురుషులు వివేచనలో అధికులని ముస్లిం న్యాయవేత్తలు పేర్కొన్నారు.

ముస్లిం స్త్రీల ముసుగు వారి బానిసత్వానికి గృహ నిర్భంధానికి, తక్కువగా చూడడానికి నిదర్శనంగా నిలచింది. ముస్లిం స్త్రీలు అనేకదేశాలలో బయటకు వచ్చి, తమ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను వెళ్ళడిస్తున్నా, మొత్తం మీద ఇస్లాం వారిని చిన్న చూపు చూస్తూనే వుంది. రచయిత యీ రంగంలో సోదాహరణలతో వివరణ యిచ్చారు.

ఇస్లాం సాహిత్యంలో వైన్, స్త్రీలగురించి రమణీయమైన కవితలు సాహిత్యం యీ రచయితే ప్రస్తావించారు. వైన్ దైవదత్తమని మహమ్మద్ ఒక చోట ఖురాన్ లో ప్రస్తావించాడు. (16.69) మరొక చోట వైన్ నిషిద్ధం అని కూడా చెప్పాడు (5.92)

ప్రతి మతం ఆహార పానీయాలలో నిషేధాలు పాటించింది. హిందువులు, క్రైస్తవులు దీనికి మినహాయింపుకాదు. ముస్లింలు పందిని నిషేధించారు. చైనాలో ముస్లింలు పంది మాంసం తింటూనే, దానిని పోర్క్ అనకుండా, మటన్ అని సరిపెట్టుకుంటున్నారు. మొరాకోలో రహస్యంగా తింటున్నారు.

లైంగిక ఆచారాలలో పురుషాయితం, స్త్రీల పట్ల స్త్రీలు అనుసరించే రీతుల్ని కూడా రచయిత ప్రస్తావించారు. ముస్లిం కవుల కవితల్ని చూపారు.

మహమ్మద్: రచయిత ఒక అధ్యాయంలో మహమ్మద్ వ్యక్తిత్వాన్ని అంచనా వేశారు. చరిత్రలో ఆయనగొప్ప వ్యక్తి అన్నారు. మక్కా కాలమంతటా మహమ్మద్ చిత్తశుద్ధితో ప్రవర్తించాడన్నారు. మదీనా కాలంలో మహమ్మద్ మారి పోయినట్లు చెప్పారు.

ముస్లింలకు తప్ప ఇతరులకు ముక్తిలేదని, మానవవాళికి యీ సందేశం అందించడానికి దైవం నిర్ణయించినట్లు చెప్పారు. ఇది పెద్ద భ్రమ అని రస్సెల్ ను ఉదహరిస్తూ రచయిత పేర్కొన్నారు.

ఖురాన్ దైవదత్తమనీ, అదే అంతిమ సత్యమనీ మహమ్మద్ చెప్పడంతో కొత్త భావాలకు, స్వేచ్ఛకు స్వస్తి పలికినట్లయిందని రచయిత స్పష్టంచేశారు. పాశ్చాత్య దేశాలలో ముస్లింలపట్ల, ఇస్లాం, ఖురాన్ గురించి రాజీధోరణిలో ప్రవర్తించడం వలన, ప్రజాస్వామ్యవిలువల పట్ల రాజీపడినట్లయిందని రచయిత హెచ్చరించారు. స్వేచ్ఛకూ, ఇది లేని వారికీ పోరాటం జరుగుతుందనీ, 21వ శతాబ్దంలో ముందుకు పోవాలంటే స్వేచ్ఛతో కూడిన, ప్రజాస్వామిక మానవ హక్కులు పాటించాలని రచయిత అంటున్నారు.

సాల్మన్ రష్డీ శటానిక్ వర్సెస్ వంటిది కాదీ పుస్తకం. ఒక ముస్లిం పండితుడు ప్రజాస్వామిక, స్వేచ్ఛా పిపాసిగా ఆక్రందనతో రాసిన పుస్తకం యిది. అయితే ముస్లింలలో వున్న అసమానం దృష్ట్యా యీ రచనకు సుప్రసిద్ధ హ్యూమనిస్ట్ ప్రచురణ సంస్థ అమెరికాలో చేబట్టింది. బహుశ ఇస్లాం గురించి యింత విపులంగా, సమగ్రంగా యిటీవల ఏ రచనా వెలువడలేదేమో.

భారత దేశంలో హమీద్ దల్వాయ్, ఎ.బి.షా వంటి వారు చేసిన రచనలు చాలా మందిని ఆలోచింపజేశాయి. ఈ రచన బహుళ ప్రచారంలోకి వస్తే యింకా కళ్ళు తెరుస్తారు. ఖురాన్ గురించి కూలంకషంగా చర్చించిన అనంతరం, సుమారు 6 వేల సురా సూత్రాలతో కూడిన ఖురాన్ ను రోజూ ముస్లిం పిల్లలకు నూరిపోసి, కంఠస్తం చేయించడం కూడా రచయిత ప్రస్తావించారు.

- మిసిమి మాసపత్రిక, ఏప్రిల్-1997