అబద్ధాల వేట - నిజాల బాట/సూదుల మందు (అక్యూపంక్చర్)

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
సూదుల మందు (అక్యూపంక్చర్)

నమ్మకమా? శాస్త్రీయమా?

ఆక్యూపంక్చర్ వైద్య విధానం ప్రాచీన చైనాలో వుండేది. సైన్సు అభివృద్ధి చెందక పూర్వం, చైనాలో యిదొక నమ్మకంగా ప్రబలింది. దేహమంతటా జీవశక్తి ("కి") ప్రవహిస్తుంటుందని, సూదులు గుచ్చడం ద్వారా, అనారోగ్యంగావున్న వ్యక్తిలో జీవశక్తిని ప్రభావితం చేయవచ్చునని చైనీయులు కొందరు నమ్మేవారు. మొదట్లో దేహంలో 365 చోట్ల సూదులు గుచ్చవచ్చని గుర్తించారు. అవి రానురాను పెరుగుతూపోగా, ప్రస్తుతం 2 వేల స్థానాలు పేర్కొంటున్నారు. కొన్నిచోట్ల యివి 2500 వరకూ వున్నాయి! ఆక్యూపంక్చర్ విధానాన్ని పాటించే వారిలో బేదాభిప్రాయాలున్నాయి. నాలుగు వేల సంవత్సరాల క్రితం చైనాలో ఆక్యుపంక్చర్ ఆరంభమైనప్పుడు, పంచభూతాలు-నీరు,లోహం, భూమి,అగ్ని, చక్క-దేహంపై ప్రభావం చూపెడతాయని నమ్మారు. దేహంలోని జీవశక్తికి స్త్రీ, పురుష(ఇన్,యంగ్) లక్షణాలున్నాయన్నారు. వీటి మధ్య సమన్వయం సాధించడానికి, సున్నితమైన సూదులు వాడి, దేహంలోని 14 స్థానాలలో వున్నవాటిని ప్రేరేపించవచ్చుననీ, ఉత్తేజపరచడం సాధ్యమనీ భావించారు. ఒక్కొక్క స్థానం ఒక అంగానికీ, ఒక్కొక్క పనికే చెందుతాయన్నారు. సున్నిత సూదులు ఆయా స్థానాలలో గుచ్చి, జీవశక్తిని తగిన రీతిలో మలుస్తారన్నారు. గుచ్చిన సూదుల్ని కొన్ని నిమిషాలు అట్టిపెట్టి, తీసేసిన తరువాత,సూదులు గుచ్చినచోట్ల ఆకులతో స్వల్పంగా కాల్చేవారు.

వ్యక్తికి వున్న రోగలక్షణాల బట్టి,ఏ స్థానాలలో సూదులు గుచ్చాలో నిర్ధారిస్తారు. నాడిని చూచి, స్త్రీపురుషులకు వేర్వేరుగా, యీ సూది చికిత్స చేస్తారు. దేహంలోని 12 అంగాలకు ప్రాతినిధ్యం వహించే నాడిని గుర్తించి,చికిత్స చేస్తారు. సూదులు గుచ్చడం, తీయడం, ఎంతసేపు వుంచాలనడం, ఎక్కడ గుచ్చాలనడం, ఆయా వ్యక్తులకు వచ్చిన రోగాన్ని బట్టి వైద్యుడు నిర్ధారిస్తాడు.

చైనా చరిత్రలో ఆక్యూపంక్చర్ కు ఆదరణ, అనాదరణ వుంటూ వచ్చింది. కొన్నాళ్ళు బ్రహ్మరధం పట్టడం ఒక్కోసారి యీసడించి పక్కన బెట్టడం చైనా సుదీర్ఘ చరిత్రలో జరిగింది. అక్యూపంక్చర్ పెర్కొనే దేహస్థానాలు (జ్యోతిష్యంలో రాసులవలె) ఆనాడు యీనాడు శాస్త్రీయంగా రుజువుకాలేదు. దేహంలో జీవశక్తి ప్రవహిస్తుందని, ఇది స్త్రీ పురుష అంగాలలో భిన్న తీరులలో వుంటుందనేది కేవలం నమ్మకం మాత్రమే.

మూత్రపిండాలు (కిడ్నీ), మానవశక్తి (యిచ్ఛ) కీ, భయానికి కేంద్రం అని, కాలేయం (లివిర్) వలన కన్నీళ్ళు వస్తాయని, ఆలోచనకు కూడలి (స్ప్లీన్) ప్లీహం అనీ అక్యూపంక్చర్ నమ్మకాలలో పేర్కొనదగినవి. దేహమంతటికీ చెందిన ఆక్యూపంక్చర్ స్థానాలు చెవులలో వున్నాయని వీరి విశ్వాసం.

దేహంలో యే భాగం ఎక్కడవుందో ఆధునిక వైద్యవిజ్ఞానం పరిశోధించి చెబుతున్నది. ఇందుకు అక్యూపంక్చర్ పూర్తిగా భిన్నం, విరుద్ధం కూడా. సూదులు గుచ్చి, సుఖ ప్రసవం చేయించవచ్చని, బాధా నివారణకు ఆక్యూపంక్చర్ మంచిదనీ ఆపరేషన్లకు (అనస్తేషియా) మత్తుమందువలె యిది ఉపకరిస్తుందనీ ప్రచారంతెచ్చి, బాగా వ్యాపారం చేస్తున్నవారున్నారు. కొందరు డాక్టర్లు తాము దేహంలో కొత్త స్థానాలు కనుగొన్నామంటూ, వాటికి తమ పేరు పెట్టి వైద్యం పేరిట డబ్బు గుంజుతున్నారు.

మావో చివరి రోజులలో చైనాలో ఆక్యూపంక్చర్ ప్రచారం చేశాడు. అందువలన కమ్యూనిస్టులు కొందరు యిది పార్టీపరంగా స్వీకరించి,ప్రచారసాధనంగా వాడుకుంటున్నారు. అక్యూపంక్చర్ ను వివిధ రీతులలో మావో ప్రచారం చేయించాదు. ప్రభుత్వ ప్రచారాలు చేసినట్లే, కొందరు రోగులు ఆపరేషన్ సమయంలో మావోను పొగడుతూ కులాసాగ కబుర్లు చెబుతున్నట్లు ఫోటోలు చూపి ఫిల్ం తీసి అక్యూపంక్చర్ ఒక చైనా కమ్యూనిస్టు విధానంగా ముద్ర వేశారు!

చైనాలో ప్రాచీన మూఢనమ్మకంగా బయలుదేరిన అశాస్త్రీయ విధానం కమ్యూనిస్టు మావో ప్రచారంవలన ప్రపంచం వ్యాప్తమయింది.

అక్యూపంక్చర్ లో మందులులేవు, కనుక మందులవలన కలిగే చెడు యిందులో లేదనీ ప్రచారం చేస్తున్నారు.

అక్యూపంక్చర్ విధానంలో వాడే సూదులు పొరపాటున, దేహస్థానంలో సరైన చోటగాని, కొంచెం పక్కన గుచ్చినా, జీవశక్తి ప్రవాహాన్ని ప్రభావితం చేయజాలదని చెప్పారు? అదేమోగాని, కొన్నిచోట్ల నరాలలోకి గుచ్చిన సూదులు ప్రమాదాలకు దారితీసిన సందర్భాలున్నాయి. నేడు గుచ్చే సూదుల వలన ఎయిడ్స్ వ్యాధి (ఇది వస్తే నయంకాదు ఇంకా మందు కనుక్కోలేదు గనుక) రావచ్చు. అంటువ్యాధులు ఒకరివి మరొకరికి రావచ్చు. కేవలం నొప్పి నివారణే చికిత్స కాదు. రోగనిర్ధారణ ముఖ్యం. అక్యూపంక్చర్ కు అది తెలయదు.

ఆధునిక వైద్య విజ్ఞానం కనుగొన్న దేహంలోని నరాలు,ఇతర సున్నిత భాగాలు యేవీ అక్యూపంక్చర్ కు తెలియవు. కొందరు డాక్టర్లు, సూదులకు విద్యుత్ పరికరాలు అమర్చి, గుచ్చుతూ, రోగుల్ని ఆకర్షిస్తున్నారు. దీని వలన అదనంగా రోగికి ఒరిగేదేమిలేదు. కంప్యూటర్ వాడి జ్యోతిష్యంతో ఇంకా యెక్కువ మోసం చేస్తున్న రకంగానే యిది కూడా వుంది.

కొందరు అక్యూపంక్చరులో ఆధునికులమని పేర్కొంటూ, ప్రాచీన చైనా విధానానికి సవరణలు సూచించారు. దేహంలో స్థానాలు లేవన్నారు. దేహం అంతటా అక్యూపంక్చర్ సూదులు వాడవచ్చునంటునారు. నొప్పులు తగ్గించటానికి రోజుల తరబడి విద్యుత్ పరికరాలతో కూడిన సూది వైద్యం వీరు వాడుతున్నారు.

పరికొందరు-అక్యూప్రజర్ అంటే సూదుల బదులు-ఒక విధమైన మసాజ్ పద్ధతిని వాడుతున్నారు. ఇంతకూ సారాంశం యేమంటే, అక్యూపంక్చర్ లో శాస్త్రీయం యేదీలేదు, వైజ్ఞానిక పరీక్షకు నిలబడేది యేదీ యిందులో లేదు. అలాంటి శాస్త్రీయ విధాన పరీక్షలు ఎక్కడా జరగలేదు. అయినా కొందరు అక్యూపంక్చర్ కూడా సైంటిఫిక్ అని జనాన్ని మోసం చేస్తున్నారు. ఏదో కారణం వలన తగ్గిన రుగ్మతల్ని తమ వలననే తగ్గిపోయాయని వీరు ప్రచారం చేస్తున్నారు. తగ్గకపోతే వీరేమీ బాధ్యత వహించరు. వైద్యవిధానంలో ఏ మాత్రం పరిచయంలేని జనం ఇలాంటి మోసాలకు తాత్కాలికంగా ఆకర్షితులై బాధలకు గురికావటం జరుగుతుంది.

- హేతువాది, జూన్ 1993