అబద్ధాల వేట - నిజాల బాట/నాస్తికులు - హోమియో

వికీసోర్స్ నుండి
నాస్తికులు - హోమియో

నాస్తికులు, హేతువాదులు, మాననవాదుల్లో అక్కడక్కడా కొందరు హోమియో వైద్య వృత్తి చేస్తున్నారు. అది శాస్త్రీయం కాదనే విమర్శ వచ్చినప్పుడు వారి వృత్తి దెబ్బతింటుందనే దృష్ట్యా, సమర్ధించుకుంటున్నారు. విమర్శలకు హేతుబద్ధంగా శాస్త్రీయంగా సమాధానం చెప్పకుండా, మొండి వైఖరి అవలంబిస్తున్నారు. కొన్నిటిల్లో శాస్త్రీయంగా వుండాలని, కొన్నిటిల్లో శాస్త్రీయంగా వుండకపోయినా ఫరవాలేదనే ధోరణి సరైనది కాదు.

హోమియో విషయమై ప్రపంచ వ్యాప్తంగా మానవవాదులు, హేతువాదులు శాస్త్రీయ పరిశీలన చేశారు. ఇందుకుగాను ప్రసిద్ధ శాస్త్రజ్ఞుల సహాయం స్వీకరించారు. హోమియో శాస్త్రీయం అని రుజువు అయితే అంగీకరించడానికి నాస్తికులు, మానవవాదులు సిద్ధమే. కాని పరిశోధన, పరిశీలనలో ఎన్ని టెస్ట్ లు చేసినా సైంటిఫిక్ అని రుజువు కాలేదు.

శాస్త్రీయ పద్ధతి విశ్వవ్యాప్తమైనది. ఇండియాలో చేసినా అమెరికాలో చేసిన అఫలితాలు ఒకేరకంగా వస్తాయి. ఒకరు రుజువు పరిస్తే అదే పరీక్షలు ఇంకొకరు జరిపినా అదే ఫలితాలు వస్తాయి. ఖమ్మంలో రుజువు అయితే కాలిఫోర్నియాలోనూ అవే ఫలితాలు వస్తాయి. అందుకే శాస్త్రీయపద్ధతి విశ్వవ్యాప్తమైనది. ఇందులో రాగద్వేషాలకు తావులేదు. మన వాళ్ళకు ఒక నిబంధన, మరొకళ్ళకు మరొక రూల్ శాస్త్రీయ పద్ధతిలో వుండదు. ఇదే హోమియోకూ వర్తిస్తుంది. నాస్తికులలో, హేతువాదులలో హోమియో ప్రాక్టీసు ఎవరైనా చేసినంత మాత్రాన అది రుజువుకు అతీతం కాదు. పోనీలే, మనవాడుగదా అని మినహాయించలేం.

హోమియో మందులు 30 ఎక్స్ మొదలు ఏవైనా సరే తీసుకొని, యిష్టం వచ్చిన లాబొరేటరీ (పరిశోధనాలయం) లో పరీక్షకు పెట్టండి. అందులో ఏ మందూ వుండదు. అయినప్పుడు ఎలా పని చేస్తుంది?

హోమియో ఔషధాలు తయారుచేయడంలో అవలంబించే పద్ధతి ప్రకారం ఒక పాలు పదార్థం, 10 పాళ్ళు సారాయి లేదా నీరు కలిపి కుదుపుతారు. అందులో నుంచి మళ్ళీ ఒక పాలు తీసుకొని మరో 10 పాళ్ళు సారాయి కలిపి కుదుపుతారు. ఇలా కుదుపుతూ పోతుంటే కొంతసేపటికి కనీసం ఒక్క అణువు కూడా మూలపదార్థం లేకుండా పోతుంది. 30 ఎక్స్ హోమియో మందులో ఒక పాలు మందు వుంటే సారాయి పాళ్ళు 1000 000 000 000 000 000 000 000 000 000 000 000 అన్నమాట. అంటే 7874 గాలన్ల నీటిలో లేదా సారాయిలో ఒక అణువు హోమియో వుంటుదన్న మాట. 200సి లో 10400 అణువుల సారాయి / నీటికి ఒక హోమియో అణువు వుంటుంది. అంటే 1కి 400 సున్నాలు చేర్చి చూచుకోవాలి.

విజ్ఞానశాస్త్రం ప్రకారం విశ్వంలో అణువులన్నీ 1080 (1కి 80 సున్నాలు చేర్చాలి) వున్నాయి. 200సి హోమియో అంతకు మించిపోయింది. అవగాడ్రో అనే శాస్త్రజ్ఞుడు హానిమన్ సమకాలీనుడు. పదార్థంలో అణువుల విషయం అంచనా వేసే రీతి అతడు చెప్పాడు. రసాయనిక శాస్త్రం ప్రాథమిక పాఠాలు తెలిసిన వారికి యీ విషయం అవగాహన అవుతుంది. హోమియో ఈ సూత్రానికి విరుద్ధంగా వుంది.

హోమియోలో మందు లేకున్నా పనిచేస్తుందని వాదించే వారున్నారు.

ఒక్క అణువు కూడా హోమియో మందులో లేనప్పుడు, కేవలం సారాయి, నీరు, చక్కెర మాత్రం హోమియో లక్షణాలను గుర్తు పెట్టుకొని చికిత్సకు ఉపకరిస్తాయని, కుదుపుతూ పలచబడేటట్లు చేస్తే హోమియోలో శక్తి అధికమవుతుందనేది నమ్మకం అయితే కావచ్చుగాని, రుజువుకు నిలవదు.

హోమియోలోను ప్రసిద్ధుల సిద్ధాంతాలు, ఆచరణ కూడా శాస్త్రీయ పరీక్షకు పెట్టడం, ఎక్కడా రుజువుకు నిలవకపోవడం సర్వత్రా జరుగుతూనే వుంది. అయితే హోమియోకు పలుకుబడి, ప్రచారం వుంది. అది నమ్మేవారిపై పనిచేస్తున్నది. ముఖ్యంగా ప్లాసిబో (Placebo) ఆధారంగా హోమియో వ్యాపారం సాగుతునంది. డాక్టరు వస్తున్నాడన్నా అతని చేతి మీదుగా మందిచ్చినా కొందరికి వూరట లభిస్తుంది. ప్రతి మనిషికీ ఏదైనా రుగ్మత వచ్చినప్పుడు ఆటుపోటులుంటాయి. మందు తీసుకోకపోయినా శరీరం తట్టుకొని నిలబడగల రీతులు కొన్ని సందర్భాలలో లేకపోలేదు. అలాంటి అవకాశాల్ని తమ విజయంగా చెప్పుకునే చికిత్సాపరులున్నారు.

మెదడువాపు వ్యాధికి బెల్లడోనా యిస్తే పనిచేస్తుందని హోమియోవారు ప్రచారం చేసి, ప్రభుత్వం దగ్గర పలుకుబడి వుపయోగించి, మాత్రలు పంచారు. రాష్ట్రంలో జనానికి బెల్లడోనా యిచ్చి మెదడువాపు వ్యాధి వచ్చినవారిని మినహాయించి, మిగిలినవారిని తమ వలననే వ్యాధి రాలేదని ప్రచారం చేయగల ఘనులు.

హోమియో రాజకీయ పలుకుబడి ఎలా పనిచేస్తుందో ఒక ఉదాహరణ గమనిద్ధాం.

అమెరికాలో ఒక హోమియో డాక్టరు రాయల్ కోప్ లాండ్ న్యూయార్క్ నుండి సెనేటర్ గా ఎన్నికయ్యాడు. 1938లో ఆయన తన పలుకుబడి ప్రచారాన్ని ఉపయోగించి ఔషధాల పరిశీలన పరిధిలోకి హోమియో రాకుండా మినహాయించేటట్లు చేయించగలిగాడు. Food, Drug, Cosmetic Act ప్రకారం అమెరికాలో అన్ని మందులూ పరీక్షకు గురైన తరువాతనే అమ్మనిస్తారు. హోమియోపతి వారు గుట్టుచప్పుడుగా వ్యవహరించి మినహాయింపు తెచ్చుకొని, హాయిగా పంచదార మాత్రలు అమ్ముకుంటున్నారు. మనదేశంలో హోమియో పరిశోధన అనేదేమి లేదు. కేవలం మందుల అమ్మకం, డాక్టర్ల వ్యాపారం వునంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో హోమియో వారికి విపరీత పలుకుబడి వుంది. అదంతా సరే. ఇంతకూ శాస్త్రీయం అంటేనే చిక్కు. అది లేకుండా. చిట్కా వైద్యంగా చలామణి అయినంతకాలం చేపమందు, తేలుమంత్రం వంటిదే అది కూడా.కాని,శాస్త్రీయం అని రుజువు కాని వైద్యానికి ప్రభుత్వం నిధులు యివ్వరాదు. ప్రముఖ శాస్త్రజ్ఞులు డా॥ పి.ఎం.భార్గవ ఆ మాట అంటే, తిట్టారు, ఆయనపై దాడిచేశారు గాని, సమాధానం రాలేదు. ప్రజలలో మూఢనమ్మకాలు మత మౌఢ్యాలు వున్నట్లే, హోమియో వంటి చికిత్సలూ వున్నాయి. దీనికి హేతువాదులు, నాస్తికులు గురిగావడం విచారకరం. నేను జర్నలిస్టుగా పనిచేస్తుండగా హోమియోపై విమర్శ చేస్తే ఒక కమ్యూనిస్టు జర్నలిస్టు మిత్రుడు వచ్చి, విమర్శలు మానేయమన్నాడు. ఎందుకు అని అడిగితే, హోమియో కళాశాలలో తమ పార్టీ నాయకత్వాన యూనియన్ వున్నదని, వారికి బాధగా వున్నందున సహకరించమన్నాడు. అంతేగాని శాస్త్రీయం కాదనే విమర్శలకు సమాధానం రాలేదు.

మనదేశంలో అన్ని వైద్యాలను ముఖ్యంగా అలోపతిని పూర్తిగా నిషేధించి, హోమియోను విధిగా అందరూ స్వీకరించాలని నిర్భధం పెడితే కుటుంబ నియంత్రణ సమస్య అతివేగంగా పరిష్కారమౌతుంది.

- నాస్తికయుగం, అక్టోబరు-నవంబరు 2000