అబద్ధాల వేట - నిజాల బాట/వికృతాకారాలు - వింత జీవులు
మనుషులు తోడేలువలె ప్రవవర్తించదం, అడవిలో జంతువులతో కలిసి హాయిగా బతకడం సినిమాలో చూశాం. నిజజీవితంలో యిలాంటివి సాధ్యమా?
కొందరు రాత్రిళ్ళు సంచరిస్తూ, మనుషులు రక్తం పీల్చి తమ ఆకలి తీర్చుకుంటారనీ భయానక కథలు వున్నాయి. మన పురాణాలలో, పవిత్రగంథ్రాలలో దేవుళ్ళు, రాక్షసులు, దేవతలు కొందరు ఎనిమిది చేతులతో, పన్నెండు తలలతో, మరికొందరు మూడోకన్నుతో, ఇంకొందరు సగం స్త్రీగా వున్నట్లు వర్ణనలువున్నయి. వినాయకుడి ఆకారం సంగతి సరేసరి. మానవాకారంలో వుంటూ కొన్ని వికృతాలుగల జీవులు అక్కడక్కడ తటస్థపడుతున్నయి. అందరివలెగాక వీరికి కొన్ని అంశాలు ఎక్కువో, తక్కువో వుంటాయి. అవే మామూలుగా కాక విపరీతంగా పెరుగుతాయి. వీరిని పాతాళలోవాసులనీ, అడవి మనుషులనీ రకరకాలుగా పిలుస్తారు. దయ్యాలుగా, పిశాచాలుగా కొందరు తలుస్తారు. వాంపైర్స్ నాగలోక కన్యలు అనే పిల్లలు కధల్లో వీరున్నరు.
వాంపైర్లపై పుస్తకాలు, సినిమాలు వచ్చాయి. వీరి లక్షణాలలో చీకటి తప్ప వెలుగు చూడలేకపోవడం రక్తాన్ని పీల్చడం ప్రధానంగా చెబుతారు. పరపీడన పరాయణులుగా, అధికార దాహంతో యీ వాంపైర్లను చిత్రించారు. పూర్వం నుండే పుట్టుకలో వికృతాలు రావడానికి దగ్గరసంబంధాలు, మేనరికాలు, రక్తసంబంధాలు ఒక ప్రధాన కారణంగా చెబుతారు. తల్లి కొడుకు, తండ్రి కూతురు మధ్య లైంగిక సంబంధం, వివాహాలు నిషిధ్ధంగా వున్నయి . అలాగాక, రక్త సంబంధ వివాహాలు, సంపర్కంవల్ల వికృతాకారాలు పుట్టడం జరుగుతూనే వుంది.
జన్యుశాస్త్రం ప్రకారం పెళ్ళిళ్ళుబంధుత్వం లేనివారిని చేసుకుంటే మంచిది. ముఖ్యంగా రక్తసంబంధాలు వద్దంటున్నారు. వంశపారంపర్యంగా దగ్గర సంబంధాలవల్ల పోర్ఫిరియా అనే వ్యాధి వస్తున్నది. ఇది ప్రోటీన్ ఉత్పత్తిని అడ్డుకొంటున్నది. అలాంటప్పుడు పాలిపోయినట్లు అయిపోతారు. రక్తంలో హీమోగ్లోబిన్ సద్వినియోగం గాకపోవడం, ఆక్సిజన్ సరిగా వాడకపోవడం వల్ల యిలా జరుగుతుంది. చర్మ కింద పోర్పిరిన్ చేరుతుంది. ఇందుమూలంగా సూర్యకాంతిని చూడలేకపోవడం, వంటి నిండా పొడలు రావడం జరుగుతుంది. ఇది వాంపైర్ లక్షణం.
వాంపైర్లు చీకట్లో సంచరిస్తూ వెల్లుల్లి వాసన భరించలేకుండా వుంటారు. పోర్ఫియా బాధితుల లక్షణం అది. వెల్లుల్లిలో ఎంజైంలు పోర్ఫియా బాధితులలోలేని ప్రొటీన్లను అందిస్తాయి. కాని వెల్లుల్లి తిన్నా,వాసన చూసినా వాంపైర్ల చర్మం కంది,ఒక్కోసారి తీవ్ర వ్యాధికి గురౌతారు. పోర్ఫియా వ్యాధిగ్రస్తులలో పండ్ల గమ్స్ పోయి పండ్లు బయటకు పొడుచుకువస్తాయి. పోర్ఫియావ్యాధి వున్నవారికి రక్తప్రీతి వుండడానికి పోర్ఫిరిక్ రింగులు కట్టుగా వుండకపోవడమే. యవ్వనదశ వచ్చేసరికి వీరిలో ప్రోటీన్ కొరత బాగా బయట పడుతుంది. అలాంటప్పుడు వారికి పెళ్ళి అయితే పాలిపోవడం, రక్తం పీల్చడం, బాగా జరిగిపోతుంది. సహజంగా దీని చుట్టూ చాలా కథలు వ్యాపిస్తాయి. కొన్ని దీవులలో, సముద్రం మధ్య లంకలలో పరిమిత ఆహారం లభిస్తుంది. ఆకు అలములు తినే సముద్ర ఆవులలో వుండే కాలేయం(లివర్)లో ఎ విటమిన్ సమృద్ధిగా వుంటుంది. ఇది రెటినోల్ గా వుంటుంది. అది తిన్నవారికి పుట్టుకలో వ్యాధులు వస్తాయి. దీవులలో బాగా వెడల్పాటి పాదాలతో పుట్టిన పిల్లలు యిలాగే లోపాలతో వుండగా,మెర్ మెయిడ్ కథలొచ్చాయి. పుట్టుకలో వికృతాల వల్ల దవడలలో వచ్చిన రూపం మారుతున్నది. అలాంటి వారిని చూసి అడవితోడేలు మనిషిగా చిత్రించారు. హింసాయుతంగా ప్రవర్తించడానికి మానసికశక్తి సక్రమంగా లేకపోవడం కూడా ఒక కారణం.
నరసింహావతారం మన కథల్లో సుప్రసిద్ధమే. అలాగే చాలా జంతు ఆకారాలు మన గాథల్లో పవిత్రతను, రాక్షసత్వాన్ని సంతరించుకున్నాయి. ఇలాంటి వికృతాకారాలు పుట్టుక దోషాల కారణంగా వచ్చినవే. పరిణామ క్రమంలో అక్కడక్కడా దారితప్పి, వికృతాకారాలు రావడం జరిగింది. పరిసరాల ప్రభావం కూడా దీనిపై వుంది. అకడక్కడా చిన్న సమూహాలు ఇతరులతో సంబంధం లేకుండా, కుంచించుకుపోయి, తమలోతామే వివాహాలు చేసుకొని, పుట్టుకలో అనేక లోపాలకు చోటు యిచ్చారు.
నేపాల్ లో 'యతి' అనే వింత ఆకారాన్ని చూసినట్లు కొందరు చెప్పగా, దీనిపై చాలా కథలు వచ్చాయి. పాశ్చాత్య దేశాలలో మంచుమనిషి మొదలైనవి వున్నాయి. పరిణామంలో అకక్డక్కడా వచ్చిన వికృతాలు,దారి తప్పిన తీరుకు యీ వింత ఆకారాలే నిదర్శనం. ఇవన్నీ అధ్యయనం చేసెలోగా కథలు అల్లేశారు. పరిణామాన్ని జాగ్రత్తగా పరిశీలించిన డార్విన్ తొలుత వివరణ యిస్తూ మనకూ కోతులకూ పూర్వీకుల సాధారణ లక్షణాలను చెప్పాడు. అంతేగాని కోతిలోనుండి మానవుడు వచ్చాడని చెప్పలేదు. ఈ విషయం కొందరు తెల్సీతెలియక కోతి నుండి మనిషి వచ్చినట్లు చెబుతుంటారు. పరిణామవంశంలో ఉభయులకూ ఒకే లక్షణాలు వుండడం. ఒక దశలో వేరుపడిన జీవులు మానవులు గావడం అనేది జరిగింది. అందులో జన్యువిభాగం అధ్యయనం చేసి వికృతాకారాల కారణాలు చెబుతున్నారు. భూమిపై వున్న మనుషులు ఒకరికొకరు తెలియకముందు ఆకారాల వికారాలపై కథలు వచ్చాయి. ఏమాత్రం తేడా వచ్చినా కథ అల్లారు. ఇందులో రంగు, రూపం బాగా చోటు చేసుకున్నాయి. విడమరచి అధ్యయనం చేస్తే కారణాలు తెలుస్తాయి.
అప్పుడు పరిష్కారాలు సాధ్యపడతాయి. ఆశ్చర్యంలో అద్భుతాల్ని ఆరాధిస్తుంటే అన్వేషణ కుదరదు. జిజ్ఞాసతో తెలుసుకోదలిస్తే క్రమంగా పొరలు విప్పవచ్చు.