అబద్ధాల వేట - నిజాల బాట/హోమియో శాస్త్రీయమని ప్రపంచంలో ఎక్కడా రుజువుకాలేదు !

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
హోమియో శాస్త్రీయమని ప్రపంచంలో
ఎక్కడా రుజువుకాలేదు!

హోమియోపతి శాస్త్రీయమని ప్రపంచంలో ఇంతవరకూ ఏ ఒక్క సందర్భంలోనూ రుజువు కాలేదు. రుజువు చేద్దామని ప్రయత్నించిన ఫ్రాన్స్, ఇంగ్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్, జర్మనీ దేశాల హొమియోవైద్యులు విఫలమయ్యారు. ఈ విషయంలో బ్రిటీష్ హోమియో వైద్యులకు చిత్తశుద్ధి వుంది. ఈ సంవత్సరంలోనే (1990 ఏప్రిల్) లండన్ నుండి వెలువడుతున్న బ్రిటిష్ హోమియోపతిక్ జర్నల్ త్రైమాస పత్రికలో బెర్నార్డ్ లియరీ కుండబద్దలు కొట్టి చెప్పేశారు. హోమియోపతికి మూలం జీవశక్తి అనీ, ఇది ఆధునిక శాస్త్రీయ విజ్ఞాన పద్ధతిలో రుజువు చేయజాలమనీ రాశారు. ఆధునిక పదార్థ విజ్ఞానం, రసాయన సూత్రాలలో యీ జీవశక్తి యిమడదన్నారు. అలాగే హోమియో మందులలో ఏ మేరకు మందువున్నదీ రసాయన సూత్రం ప్రకారం రుజువు చేయజాలమనీ, అవొగాడ్రొ సూత్రం అన్వయిస్తే కుదరదనీ ఒప్పేసుకున్నారు. అయితే హోమియో ఆధారపడే "జీవశక్తి"కి మూలం ఏమిటి అంటే, వివరించలేమని, స్పష్టంగా అన్నారు. అలాంటి వారితో పేచీలేదు. హోమియో శాస్త్రీయమని మొండిగా విర్రవీగేవారితోనే పేచీ.

హోమియో వాస్తవాలు కొన్ని

హోమియో శాస్త్రీయమని రుజువు పరచడానికి పాశ్చాత్య దేశాలలో ప్రయత్నాలు జరిగాయి. 1988లో డా॥జాక్ బెన్ వెనిస్తి, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ రీసర్చిలో యీ కృషి చేశారు. వీరి అధ్యయనంలో ఇటలీ, ఇజ్రాయిల్, ఫ్రాన్స్, కెనడా హోమియో వైద్యులు తోడ్పడ్డారు. ఈ పరిశోధన జరిగేటప్పుడు సేకరించే సమాచారాన్ని పరిశీలిస్తామని నేచర్ పత్రికా సంపాదకుడు మేడక్స్, డా॥ వాల్టర్ స్టీవర్ట్(అమెరికా ఆరోగ్య సంస్థకు చెందిన వ్యక్తి) జేమ్స్ రాండీలు కోరారు. పరిశోధనా ఫలితాలు నేచర్ పత్రికలో ప్రచురిస్తామన్నారు. తీరా చూడనివ్వకపోయినా, పరిశోధనా ఫలితాలు గమనిస్తే తప్పుడు లెక్కలిచ్చినట్లు తేలింది. శాస్త్రీయపరిధిలోకి రావాలని హోమియో తాపత్రయం అర్థం చేసుకోవచ్చు. శాస్త్రీయ పరిశోధనకు నిలవలేని హోమియోవారు శాస్త్రానికి పరిమితి వుందనీ, అన్నీ శాస్త్రం ద్వారా వివరించలేమనీ తప్పుకుంటున్నారు. శాస్త్రీయ విజ్ఞానం అంతం లేనిది. రుజువుకు నిలవనపుడు అరమరికలు లేకుండా తృణీకరించి, ఆధారాలకై అన్వేషిస్తుంది. పెత్తందారీతనాన్ని ఒప్పుకోదు. ఎంత గొప్పవారు చెప్పినా, మందువాడినా రుజువు ఒక్కటే ప్రమాణంగా స్వీకరిస్తుంది.

హోమియోను గురించి వాస్తవాలు అనేకం వున్నాయి. అమెరికాలో వివిధ దశలలో హోమియో గురించి పరిశీలన సాగింది. ఫెడరల్ ఫుడ్ డ్రగ్ కాస్మటిక్ చట్టం 1938లోనే హోమియోను క్షుణ్ణంగా పరీక్షకు పెట్టి శాస్త్రీయ పరిశోధనకు నిలవలేదని అమెరికాలో ప్రకటించారు. కేన్సర్ నివారణ, వైరస్ చికిత్స, ఉద్దీపన ఔషధాలు అని ఆమ్మే హోమియో మందులన్నిటినీ బలవంతంగా 1984లో ఫెడరల్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిలిపివేసింది. పెన్సిల్వేనియా ఆరోగ్యశాఖ కూడా 1985లో హోమియో ఔషధాలను పరిశీలించి నొప్పినివారిణి, శక్తి పునరుజ్జీవనాలు, మొదలైన ఆకర్షణీయ పేర్లుగల వాటిని నిలిపేశారు. 1986లో జార్జిగెస్ అనే హోమియో వైద్యుడు కోర్టుకు వెళ్ళి, హోమియోను రుజువుచేయలేక, ఓటమిని అంగీకరించాడు. (అమెరికాలో నార్త్ కెరోలైనా) అమెరికా ఫెడరల్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నియమ నిబంధనలు హోమియోకు అన్వయిస్తే, హోమియో మందులు మార్కెట్ లో వుండజాలవని స్టీఫెన్ బారెట్ ప్రకటించారు.

ఆస్ట్రేలియాలో కూడా హోమియో గురించి వాదోపవాదాలు సాగాయి. పార్లమెంటు చివరకు శాస్త్రజ్ఞులతో కూడిన సంఘాన్ని నియమించి పరిశీలింపజేస్తే మందుశాతం తగ్గించుకుంటూపోతే, శక్తి పెరుగుతూ పోతుందని రుజువుకాలేదని నివేదిక సమర్పించింది 1977లో.

హోమియో పితామహుడు హానిమన్ జర్మనీలో 1819లో యువరాజు షవర్జన్ బర్గ్ కు వైద్యం చేస్తే అతడు చనిపోయాడు. ఇది చూచి మండిపడిన ప్రజలు హానిమన్ వెంటబడి తరిమికొట్టి, ఆయన మందుల్ని, పుస్తకాల్ని తగులబెట్టారు. హానిమన్ తరువాత ఫ్రాన్స్ లో స్థిరపడి 80వ ఏట తనకంటె 45 సంవత్సరాల చిన్న యువతిని పెళ్ళాడి హోమియో ప్రాక్టీసు చేశారు. ఆయన చనిపోయేనాటికి(1843) ఆధునిక వైద్య, జీవ, అణు, జన్యు, శారీరక శాస్త్రాలు అభివృద్ధి చెందలేదు. బహుశా హానిమన్ యీ శాస్త్రాల పరిశోధనల రీత్యా తన వైద్యాన్ని విడనాడి, మారేవాడేమో. మనదేశంలో సైంటిఫిక్ మెథడ్ అంటే ఏమిటో వివరించే బొమ్మల ప్రదర్శన ఒకటి డా॥ పి.ఎం.భార్గవ ఏర్పరచారు. అందులో శాస్త్రీయ, అశాస్త్రీయ పద్ధతుల ఉదాహరణలు పేర్కొంటూ, హోమియోను అశాస్త్రీయంగా ఉటంకించారు. ఎలా అశాస్త్రీయమో ఉత్తరోత్తరా వ్యాసాలు రాశారు, వివరించారు కూడా. శాస్త్రీయపద్ధతి అంటే ఏమిటో తెలిసిన పాశ్చాత్య హోమియో వైద్యులు శాస్త్రీయమని రుజువు చేయడానికి తిప్పలు పడుతున్నరేగాని, శాస్త్రీయ పద్ధతినే తిట్టడం లేదు. మనదేశంలో హోమియో శాస్త్రీయమని రుజువుపరచడానికి కంట్రోల్డ్ ఎక్స్ పరిమెంట్ జరగలేదు. ఎవరికో ఎందుకో తగ్గిందని కథలు చెబితే శాస్త్రీయ పరిశోధన కిందకు రాదు. అలాగైతే, హోమియో ద్వారా తగ్గనివారు, చనిపోయిన వారి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అప్పుడేమంటారు? మనదేశంలో హోమియో శాస్త్రీయమని రుజువుపరచే పరిశోధనలు ఎక్కడ ఎవరు ఎప్పుడు చేశారో చూపితే సరిపోతుంది గదా? పలుకుబడి చట్టాలు చేయించుకొని నిధులు సమకూర్చుకోవడం శాస్త్రీయతా?

శాస్త్రీయపద్ధతి అంటే?

శాస్త్రీయ పద్ధతి అంటే స్థూలంగా ప్రపంచవ్యాప్తంగా అంగీకారం వుంది. సమస్యకు సంబంధించిన సమాచారం లభించినంతమేరకు సేకరించడం, ఆ మేరకు విశ్లేషించడం, తద్వారా ప్రతిపాదనలు చేసి సిద్ధాంతీకరించడం, సిద్ధాంతాన్ని క్లిష్ట పరీక్షకు గురిచేయడం-ఇదీ వరుసక్రమం. పరీక్షకు నిలబడిన తరువాతనే ఆమోదిస్తారు. ఇలా రుజువైన సిద్ధాంతం ఇతరమైన రుజువైన సిద్ధాంతాలతో పొందికగా వుందో లేదో పేర్కొంటారు. కొత్త ఆధారాలు, వాస్తవాలు లభిస్తుంటే కొత్త సిద్ధాంతాలు ప్రతిపాదిస్తారు. ఈ విధంగా శాస్త్రజ్ఞానం నిత్యనూతనంగా గమనిస్తుంటుంది. ఫలానా శాస్త్రజ్ఞుడు చెప్పాడు గనుక అది తిరుగులేనిది అనే అధికారిక, పెత్తందారీ ప్రమాణాలు శాస్త్రీయ పద్ధతిలో వుండవు. ఒకసారి రుజువైన విషయం కొత్త ఆధారాలతో తృణీకరణకు గురైతే విచారించాల్సిన పనిలేదు. సెంటిమెంట్ కు తావులేదు.

రెండు సిద్ధాంతాల మధ్య పోటీ రావడం శాస్త్రీయ పద్ధతికి మామూలే. అప్పుడు క్లిష్ట పరిక్షకు ఏది నిలుస్తుందో చూచుకుంటారు. న్యూటన్, హూగిన్స్ సిద్ధాంతాల మధ్య ఇలాగే జరిగింది.

శాస్త్రీయ పద్ధతిలో రుజువు చేసిన తరువాత,ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా అలాంటి రుజువు మళ్ళీ చేయవచ్చు. హోమియో కూడా అలాగే రుజువుకు నిలబడితే సంతోషమే. రుజువు చేయడానికి ఒక శాస్త్రజ్ఞుల సంఘాన్ని నియమించమంటే, ఆగ్రహించి తిట్లకు, శాపాలకు దిగాల్సిన పనిలేదు.

మానవుడి ప్రాణం ఎంతో విలువ గలది. దీనితో చెలగాటం ఆడకూడదు. శాస్త్రీయపద్ధతిలో వైద్యం పెంపొందబట్టి, అంటురోగాలు, హృద్రోగాలు, అత్యవసర పరిస్థితిలో ఆదుకోవడం సాధ్యపడింది.

మన రాజ్యాంగం 51(ఎ) ప్రకారం శాస్త్రీయ ఆలోచన పెంపొందించడం మన విధిగా పేర్కొన్నది. అందుకు విరుద్ధంగా ప్రస్తుతం హోమియో వున్నది గనుకనే, శాస్త్రీయపద్ధతిలో సాగినట్లు రుజువుపరచమంటున్నాం.

- హేతువాది, నవంబర్ 1990