అబద్ధాల వేట - నిజాల బాట/దళితులకు సాంఘిక సమానత్వం కావాలి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
దళితులకు సాంఘిక సమానత్వం కావాలి

దళితులకు ఓట్లు వున్నాయి. అవి రాజకీయ పార్టీలకు కావాలి. అన్ని పార్టీలు అనేక పథకాలు, ఆకర్షణలు వలగా వేసి దళితుల్ని ఆకర్షించడానికి యథాశక్తి పోటీ పడుతున్నాయి.

దళితుల మౌళిక సమస్యల్ని పరిష్కరించాలని ఏ రాజకీయ పార్టీ అనుకోవడంలేదు.

ఏమిటి ఆ మూల సమస్య?

అంటరానితనం, వూరికి దూరంగా, సంఘసేవలో మాత్రమే పనికివచ్చే వారుగా దళితుల్ని భారతదేశం ముద్రవేసింది. ఇది శతాబ్దాల చరిత్ర.

స్వాతంత్ర్య పోరాటంలో అంటరానితనం పోగొట్టే సమస్యను గాంధీ చేబట్టారు. మరో చేత్తో కులవ్యవస్థను సృష్టించి బలపరుస్తున్న గీతను చేతబూని ప్రార్థనలు చేశారు. ఆయన చిత్తశుద్ధిని అంబేద్కర్ ప్రశ్నించారు. ఈ విషయంలో అంబేద్కర్ వాదన సరైందని అన్పిస్తుంది.

మతంలో నుంచి పుట్టి పెరిగి వర్ధిల్లుతున్న కులం, అందులోనుంచి విషపుత్రికగా అవతరించిన అంటరానితనాన్ని అంబేద్కర్ చక్కగా వివరించారు. మూలసమస్య పరిష్కారం కావాలంటే మూలదోషాలనుంచి దళితులు బయటపడాలన్నారు. మతాన్ని ఎందరు సంస్కరించబోయినా విఫలంగావడానికి కారణం, మూలం జోలికిపోకపోవడమే.

రాజ్యాంగం అంటరానితనాన్ని నిషేధించింది. అయినా అది పోలేదు. మాల,మాదిగ పేరిట దూషణలుగా శిక్షార్హం చేసిన చట్టాలువచ్చాయి. కాని దళితులు వూరికి దూరంగానే వున్నారు.

దళితులకు వున్న ఓటు హక్కును గుర్తించిన రాజకీయ పార్టీలు, దళితులలో దళారీలను ప్రోత్సహించాయి. ఎన్నికలనాడు ఓటు వేయించుకుంటే మళ్ళీ ఎన్నికలు వచ్చేవరకూ ఎన్నికైన ప్రతినిధిని రీకాల్ చేసే అవకాసం లేదని పార్టీలకు తెలుసు.

ఆర్థిక విషయాలకే ప్రాధాన్యత యిచ్చి రాజకీయ పార్టీలు ఆకర్షణలకు దిగాయి. ఇందుకు భాగంగానే భూములివ్వడం, ఇళ్ళ స్థలాలు కేటాయించడం,స్కాలర్ షిప్ లు,గుడులు , మందిరాలు నిర్మించడం, రిజర్వేషన్ల పేరిట ఉచ్చు పన్నడం అన్ని రాజకీయ పార్టీలు జాగ్రత్తగా ఆడుతున్న నాటకమే. దీనిలో ఇరుక్కున్న దళిత నాయకత్వం ఆయా రాజకీయ పార్టీలకు అమ్ముడుబోయి హాయిగా అనుభవించడం చూస్తూనే వున్నాం.

కాని దళితుల ప్రధాన సమస్య-అంటరానితనం అలాగే వుంది. అంబేద్కర్ సూచించిన మూలపరిష్కార మార్గం జోలికి పోతేనే యీ సమస్య పరిష్కారమై దళితులు మానవులుగా సమానహక్కులతో మనగలరు. దళితుల్ని పుద్ధరిస్తామంటూ, మతసంఘాలు బయలుదేరి, హిందూమతం కాదని క్రైస్తవంలోకి మార్చడం మరో తంతు. దీనివలన సమస్య పరిష్కారం కాలేదు. పేదరికాన్ని మత వ్యాపారంగా సాగించడం దారుణం. ఒక మత దోషాన్ని మరో మత దోషం రూపుమాపలేదని రుజువైంది.

దళితులకు కావలసింది మత మార్పిడి కాదు. మానవహక్కులు, వైజ్ఞానిక విద్య కాని యిన్నాళ్ళుగా దళితుల్ని కర్మవాదంతో వారి గతి అంతేనని మతం అట్టిపెట్టింది. దీనికి మార్గాంతరంగా ఆర్ధికసమస్య తీరిపోతే దళితులు మామూలుగా అందరితో సమానమౌతారని వామపక్షరాజకీయ పార్టీలు మభ్యపెట్టాయి. డబ్బున్న దళితులు సైతం అంటరానితనానికి గురౌతున్నారని యీ పార్టీలు గ్రహించకపోవడం సిద్ధాంత మూర్ఖత్వం వలననే.

దళితుల సమస్యలలో మూఢనమ్మకాలు, ఆచారాలు కూడా ప్రముఖంగా పేర్కొనాలి. అగ్రకులాలలో వున్నట్లే వీరికీ అనేక మతపరమైన అంధవిశ్వాసాలున్నాయి. పుట్టిన దగ్గరనుండీ చనిపోయేవరకూ యీ గుడ్డినమ్మకాలు వీరిని కుంగదీస్తున్నాయి.

అగ్రకులాల అంధవిశ్వాసాలు, మూఢాచారాలు, కుల అహంకారం ఖండిస్తున్న దళిత నాయకత్వం అదే స్థాయిలో దళితుల పట్ల ప్రవర్తించకపోవడం దోషమే. దళితుల దురాచారాలను, మత విశ్వాసాలను, జాతరలను, కులాన్ని వెనకేసుకురావడం దళిత నాయకత్వం లోపంగా వున్నది.

శర్మ, శాస్త్రి, ఆచారి, చౌదరి, రెడ్డి అనే కుల పేర్లను సూచించే రీతులు తప్పు అని, అవి తొలగించుకోవాలి అంటున్నాం. మాల, మాదిగ అని పెట్టుకోవడంలో గర్వించదగిందేమీ లేదని గ్రహించక, యిటీవల అలా కొందరు పేర్లకు కులం తగిలిస్తున్నారు. ఈ పని ఏ కులం చేసినా దోషమే, సంకుచితమే. కులం పోగొట్టుకోవాల్సిన అవసరం, మానవులుగా సమానత్వ హక్కులతో ఎదగాల్సిన రీతులు కావాలి. అవే పిల్లలకు నేర్పాలి. ఇందుకు దళితులు మినహాయింపుకారాదు. కాని అలా జరగడం లేదు. ఇదొక ప్రధాన సమస్య అయింది. దళితులలో కులాంతర వివాహాలు జరిగినప్పుడు, వెంటనే రిజిస్టర్ చేసుకోవాలి. వారి సంతానానికి కులప్రసక్తి లేకుండా చూడాలి. అప్పుడూ నవసమాజం అవతరించి, విలువలు కాపాడడానికి దోహదం చేస్తుంది. ఇప్పుడు అందుకు భిన్నంగా, తండ్రి కులాన్ని తగిలిస్తున్నారు. కొన్ని సందర్భాలలో తల్లి కులాన్ని వాడుకుంటున్నారు. కులవ్యవస్థ పోగొట్టడానికి అది దారి తీయదని గ్రహించాలి.

దళితుల పిల్లలు చదువుకోవాలి. వారిని మానసిక విముక్తులు చేయడానికి వైజ్ఞానిక దృక్పథంతో విద్య చెప్పించడం, తప్పనిసరిగా బడికి పోయేట్లు చూడడం కర్తవ్యం. దళిత నాయకత్వం యీ రంగంలో దృష్టిపెట్టాలి. రాజ్యాంగపరంగా వున్న ఉచిత నిర్భంధ విద్య దళితులందరికీ వర్తించేటట్లు పట్టుబట్టాలి. ఒక్కతరంలోనే యీ మార్పు జరిగితే దళిత సమస్య పెద్దమలుపు తిరుగుతుంది. క్రైస్తవులుగా మారిన దళితుల పిల్లల్లో మార్పు కనిపించినా మతవిద్య వలన వారి వెనుకబాటుతనం వారిని వెన్నంటుతూ వస్తున్నది. వైజ్ఞానిక విద్య వారికి విమోచన కల్పిస్తుంది.

దళితుల్ని చీల్చి,ఆయా రాజకీయ పార్టీలకు తాకట్టు పెట్టిస్తున్న దళితనాయకులే దళితులకు ద్రోహం చేస్తున్నారు. ఇది అన్ని పార్టీలకు చెందిన ఓట్ల, సీట్ల వ్యవహారం. దళిత నాయకత్వం చేస్తున్న యీ దళారీ వ్యవహారాలే ఇన్నాళ్ళుగా దళితుల్ని వెనకబాటుతనంలో అట్టిపెట్టాయి. తాత్కాలిక లోభాలకు కక్కుర్తి పడుతున్న నాయకులు, సుఖాలు అనుభవిస్తూ యీ పనులకు దిగారు. అధికారం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారంలో లేనివారు, ఎన్నికలకై ఎదురుచూస్తున్నారు.

దళితుల మరో ప్రధాన సమస్య జనాభా నియంత్రణ, ఇందుకుగాను వారికి మూఢనమ్మకాలు పోగొట్టి,కుటుంబ ఆర్థిక వ్యవస్థ వివరించి, దేశసమస్యకూ దీనికి గల సంబంధం చెప్పి, ఒప్పించవలసి వుంది. ఇదేమంతా సులభమైన విషయం కాకున్నా అవసరం. ఇక్కడకూడా మతనమ్మకం వారికి అడ్డుపడుతున్నది. కనుకనే సమస్య జటిలమైంది. దేవుడిచ్చిన సంతానం అనే భ్రమ తొలగించడానికి వైజ్ఞానిక విద్య చెప్పి ఒప్పించవలసి వుంది.

దళితుల సమస్య ఆర్థిక సమస్య కాదు. కేవలం ఆర్థిక బాధ తీరితే, అంటరానితనం పోయి సమానత్వం రాదనేది తేలిపోయింది. డబ్బున్న దళితులు సైతం అంటరానితనం సమస్యకు గ్రామాల్లో గురౌతూనే వున్నారు, మనిషిని ఆర్థికంతో కొలిచే తప్పుడు సిద్ధాంతం వలననే. దళితుల సమస్యలు దీర్ఘకాలికాలు,తాత్కాలికాలు అని రెండుగా చూడాలి. తాత్కాలికమైన వాటిని రాజకీయ పార్టీలు, మతపక్షాలు పట్టించుకొని,తీర్చడానికి ప్రయత్నిస్తూ, ఆకర్షిస్తునాయి. సౌకర్యాలు, ఉద్యోగాలు, కేటాయింపులు యీ కోవలోకి వస్తాయి.

దీర్ఘకాలికమైన అంటరానితనాన్ని పోగొట్టడం, మానవహక్కులు అమలుజరపడం, ఉచిత నిర్భంద వైజ్ఞానిక విద్యను ఆచరణలోకి తీసుకురావడం కోసం దళిత నాయకత్వానికి స్పష్టమైన అవగహన అవసరం. దళితుల అంధవిశ్వాసాలు, మూఢాచారాలు పోగొట్టకపోగా, వాటిని సమర్ధించే నాయకత్వం వారికి ద్రోహులుగా పరిణమించింది. ముఖ్యంగా రాజకీయపార్టీలలో చేరి అధికార పదవులకోసం దళితుల్ని ఫణంగా పెట్టినవారు చేస్తున్న సాంఘికనేరం ఇంతా అంతా కాదు.

అగ్రకులాలలో వున్న జాడ్యాలు, రుగ్మతలు,దోషాలు, రాజకీయ దళారీతనం గర్హనీయాలు. వాటిని దళితులు ఆదర్శంగా తీసుకోవాల్సిందేమీ లేదు. రాజకీయ పార్టీలకు తమ కులాల్ని ఓట్ల ద్వారా తాకట్టు పెట్టించే దళారీ వ్యాపారాన్ని అగ్రకులాలే మొదలెట్టాయి. అది అంటురోగం వలె దళితుల్నీ ఆవహించింది. దాన్నుండి దళితులు బయటపడాలి.

తీవ్రమైన సమస్యకు పరిష్కారాలు కూడా తీవ్రంగానే పరిగణించి,అమలుపరచాలి.

- హేతువాది, సెప్టెంబర్ 2002