Jump to content

అబద్ధాల వేట - నిజాల బాట/'అశాస్త్రీయతే 'దేశం' పునాది, లౌకికత్వానికి ఏనాడో సమాధి'

వికీసోర్స్ నుండి
'అశాస్త్రీయతే 'దేశం' పునాది,
లౌకికత్వానికి ఏనాడో సమాధి'

భారత రాజ్యాంగం అన్ని మతాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ సెక్యులరిజానికి అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఏ ఒక్క మతానికో పెద్దపీట వేయడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. అయితే నేడు సెక్యులరిజం స్పూర్తికి విరుద్ధంగా రాష్ట్రమ్లో, దేశంలో అధికారంలో ఉన్నవారు వ్యవహరిస్తున్నారని అఖిల భారత హేతువాద సంఘం ఉపాధ్యక్షులు డాస్టర్ ఎన్. ఇన్నయ్య అభిప్రాయపడుతున్నారు. మన రాష్ట్రంలో అధికారంలో వున్న చంద్రబాబునాయుడు కూడా ఒకవైపు సెక్యులరిజాన్ని కాపాడతామని ప్రతిజ్ఞలు చేస్తూనే మరోవైపు మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొని పరోక్షంగా మతాన్ని ప్రోత్సహిస్తున్నారు. చంద్రబాబు పాలనలో మతాలను ఎలా వెనకేసుకొని వస్తున్నారు అన్న అంశాలపై ఇన్నయ్య 'ప్రభాతవార్త'కు ఇచ్చిన ఇంటర్వ్యూలొ ఇలా అంటున్నారు....'

? సెక్యులరిజంకు వాస్తవ నిర్వచనం ఏమిటి? అది టి.డి.పి పాలనలో అమలౌతోందా?

  • సెక్యులరిజం అంటే మనదేశంలో రకరకాల వ్యాఖ్యలు, అర్థాలు ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం భిన్నమైన మతాలకు నిలయమైన భారత సమాజంలో అన్ని మతాలను సమానంగా చూడాలి. ఏ ఒక్క మతాన్నో భుజాన వేసుకొని దాన్ని ప్రభుత్వ పాలనలో ఆచరించరాదు. రాజ్యాంగానికి కట్టుబడి ప్రభుత్వ పాలన సాగించాలి కాబట్టి పాలకులు కూడా సెక్యులర్ గా ఉండాలి. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిడిపి అన్ని మతాలను దువ్వుతూ తాము సెక్యులరిజానికి కట్టుబడి ఉన్నామని నమ్మించడానికి ప్రయత్నిస్తోంది.

? టిడిపి మతాలను దువ్వుతోందని అంటున్నారు ఆ విషయాన్ని వివరిస్తారా?

  • మతాలను దువ్వి రాజకీయం కోసం వినియోగించుకునే వైఖరి ఎన్.టి. రామారావు నుంచి టిడిపిలో వస్తోంది. రంజాన్ నాడు ముస్లిం వేషంలో మసీదుకు వెళ్ళి ప్రార్థన చేయడం, క్రిస్మస్ వేడుకలకు వెళ్ళడం; హిందూ పండుగలను అధికారికంగా జరపడం, దేవాలయాల వద్ద అధికార లాంఛనాలు వినియోగించుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడడమే. అంతేకాదు ముస్లింలకు మక్కా, క్రైస్తవులకు వాటికన్ ఉన్నట్లుగా హిందువులకు తిరుపతిని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని కూడా ఎన్.టి.ఆర్ ప్రకటించారు. అదే బాటలో చంద్రబాబునాయుడు కూడా వెళ్తున్నారు. మతం వ్యక్తిగత నమ్మకం. దీన్ని అధికారికంగా ఆచరించడం ద్వారా సెక్యులర్ విలువలకు భంగం కలిగించడమే అవుతుంది.

? సెక్యులరిజం అంటే అన్ని మతాలను సమానంగా చూడడం అన్నారు. అయితే అన్ని మతాలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్నా తప్పు పడుతున్నారు...

  • ఎవరి మతవిశ్వాసాలు వారివి. అది వ్యక్తిగతం కూడా. ఈ రెండూ నిర్వివాదాంశమైనవి. అయితే రాష్ట్రంలో కీలకమైన పదవిని నిర్వహించే ముఖ్యమంత్రి మొదలుకొని, మంత్రులు, అధికారులు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడమే అభ్యంతరకమైన అంశం. తిరుపతి, భద్రాచలంలలో జరిగే హిందూమత ఉత్సవాలు, క్రైస్తవులు ప్రార్థన ద్వారా వ్యాధులు నయం చేస్తామని, కాళ్ళులేని వారికి నడిపిస్తాం అంటూ చేసే స్వస్థత సభలకు వెళ్ళడం,మొహరం వంటి ముస్లిం పండగల్లో పాల్గొనడం రాజ్యాంగ విరుద్ధమే కాక ఉన్నత పదవుల్లో ఉన్నవారే ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల ప్రజలు తప్పుదోవపట్టే ప్రమాదం ఉంది. అంతేకాక మత గురువులు, బాబాల ఆశ్రమాలు, మిషనరీలకు ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు వెళ్లడం వల్ల వాటిలో జరిగే అక్రమాలు,ఆర్థిక లావాదేవీలు, హత్యలు బహిర్గతం కావు. విదేశాల నుంచి నిధులను తెచ్చుకోవడానికి మతపరమైన సంస్థలకు మంత్రులు, అధికారుల సందర్శనలు పరోక్షంగా తోడ్పడతాయి. అంతేకాక ఇలాంటి సంస్థలు వాణిజ్య కార్యకలాపాలు సాగించినప్పటికీ పన్నుల సడలింపులు పొందుతున్నాయి. ఇవన్నీ పోను ప్రస్తుత ప్రభుత్వం సమ్మక్క-సారక్క వంటి పలు ఉత్సవాలను ప్రభుత్వం తరపున నిర్వహిస్తూ ఒక మతాన్ని వెనకేసుకొస్తోంది.

? ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక మతాన్ని వెనకేసుకొస్తోందో వివరిస్తారా?

  • రాష్ట్ర మంత్రివర్గంలో ప్రత్యేకంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉండడమే హిందూమతాన్ని వెనుకేసుకురావడం అవుతుంది. హిందువులు విశ్వసించే దేవాలయాలకు సంబంధించి ప్రత్యేక శాఖ నెలకొల్పి వాటి అభివృద్ధికి చర్యలు తీసుకుంటుండడం వల్ల ఇతర మతాల నుంచి కూడా తమకు రాయితీలు కావాలన్న ఒత్తిడి వస్తుంది. అంతేకాక దేశవ్యాప్తంగా విమర్శలను ఎదుర్కొంటున్న జ్యోతిష్యం వంటి అశాస్త్రీయమైన కోర్సులను తెలుగు విశ్వవిద్యాలయంలో ఎన్.టి.రామారావు ప్రారంభించారు. ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ ఆ కోర్సులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇదికాక వాస్తుకు ఈ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్ర రాజధానిలోని సచివాలయం మొదలుకొని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో వాస్తుకు అనుగుణంగా మార్పులు చేయడానికి లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇదికాక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భవనాలకు వాస్తు ఎలా ఉందని టెలికాన్ఫరేన్ లలో అధికారులను విచారించిన దాఖలాలు కూడా ఉన్నాయి. దీనివల్ల అమాయక ప్రజల్లో వాస్తు పట్ల భ్రమలను పెంచినట్లే అవుతుంది.

? రాష్ట్రంలో అమలౌతున్న విద్యావిధానంలో ఏమైన లోపాలున్నాయా?

  • రాష్ట్రంలో అమలౌతున్న విద్యావిధానమ్లో బలవంతంగా పసిపిల్లలపై మతాచారాలను రుద్దుతున్నారు. క్రైస్తవ మిషనరీ స్కూళ్లలో క్రైస్తవ సంబంధ ప్రార్థనలు తప్పనిసరిగా అందరిచేత చేయిస్తుండగా, మదరసాల్లో, భజరంగ దళ్, ఆర్ ఎస్ ఎస్ నిర్వహించే శిశుమందిర్ లలో చిన్నారులపై మత మౌఢ్యాన్ని రుద్దుతున్నారు. దీన్ని ప్రభుత్వం అడ్డుకున్న దాఖలాలు లేవు.

? మతాలు రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకునే పావులయ్యాయనే విషయంపై మీరేమంటారు?

  • ఇది అక్షరాలా వాస్తవం. వివిధ మతాల వారి రాజకీయ మద్దతు కూడగట్టుకునేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అనేక సామాజిక సమస్యలకు కారణమౌతున్నాయి. ఒక మతం వారు రోడ్డుపై ప్రార్థనా మందిరాన్ని కట్టుకున్నారని, పోటీగా ఇతర మతాల వారు రోడ్లను ఆక్రమించుకొని గుళ్లు, గోపురాలు, మసీదులు, చర్చిలు నిర్మిస్తున్నా వాటిని అడ్డుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉంది.

? అయోధ్యలో వివాదానికి కారణమైన బిజెపి, దాని అనుబంధ సంస్థలకు ఇప్పటికీ చంద్రబాబు మద్దతును కొనసాగించడం సెక్యులరిజాన్ని అగౌరవపరచడం కాదా?

  • బిజెపి సంకీర్ణ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వడం రాజకీయ ఎత్తుగడ మాత్రమే. గతంలో ఆయన కమ్యూనిస్టులతో కూడిన యునైటెడ్ ఫ్రంట్ లో కూడా ఉన్నారు. పరిస్థితులను బట్టి మారే ఈ మద్దతుకూ సెక్యులరిజానికి ఎలాంటి సంబంధం లేదు. అయితే సెక్యులరిజం పేరుతో రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్రంలో అనేక కార్యకలాపాలు సాగుతున్నాయి. సెక్యులరిజంపై పాలకులకు సరైన అవగహన లేని కారణంగా పలు అనర్ధాలు జరుగుతున్నాయి. అన్ని మతాలను దువ్వడం సెక్యులరిజం ఎట్టి పరిస్థితుల్లోనూ కాజాలదు. బిజెపి, విశ్వహిందూ పరిషత్, ఆర్.ఎస్.ఎస్., క్రిస్టియన్, ముస్లిం సంస్థలకు తమ మతాలపై మాత్రమే అపారమైన విశ్వాసం ఉంటుంది. ఇతర మతాలన్నీ నిజం కావు అన్నట్లు కూడా వ్యవహరిస్తాయి. అలాంటి మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటున్న చంద్రబాబు ప్రభుత్వం పరోక్షంగా మతతత్వాన్ని ప్రేరేపిస్తోందనే చెప్పాలి. జవహర్ లాల్ నెహ్రూ పాలనలో సెక్యులరిజానికి ఎలాంటి భంగం కలగలేదు. దేశానికి రాష్ట్రపతిగా వున్న జాకీర్ హుస్సేన్ కూడా తన మత విశ్వాసాలను ఎప్పుడూ బహిరంగంగా ప్రదర్శించలేదు. అలాంటి వైఖరి మన పాలకుల్లో రావాలన్నదే మా ఆకాంక్ష.
- వార్త,మార్చి 2002