అబద్ధాల వేట - నిజాల బాట/నవ్య మానవుడు ఎరిక్ ఫ్రామ్

వికీసోర్స్ నుండి
నవ్య మానవుడు ఎరిక్ ఫ్రామ్

ఏమి చెబుతున్నామనేది ఎంత ముఖ్యమో,ఎలా చెబుతున్నామనేది అంతకంటే ప్రధానమైన అంశం. ఎరిక్ ఫ్రామ్ నుండి అందరూ నేర్వదగిన అంశంలో-ఎంత క్లిష్టమైన, జటిలమైన ఇనుప గుగ్గిళ్ళు కూడా ఆయన కలానికి లొంగి, కావలసినట్లు మైనం వలె ఒంపుసొంపులు తొడుగుకుంటాయి-అనేది చూడవచ్చు.

మార్క్సిజంతో ప్రారంభించి సైకో ఎనాలసిస్ వరకూ, ప్రేమ నుండి మానవ వాదం దాకా ఎరిక్ ఫ్రామ్ ప్రస్తావించాడు. అన్నిటినీ చదివించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఎరిక్ ఫ్రామ్ అభిమానులు, శిష్యులు, అనుచరులు సగర్వంగా "మా గురువు" అని చాటుకునే వారున్నారు.

1975లో ఎరిక్ ఫ్రామ్ కు ఉత్తరం రాసి,ఆయన రచన "ది సేన్ సొసైటి" అనువాదానికి అనుమతి కోరాను. ఆయన నుండి వెంటనే సమాధానం వచ్చింది. కాపీరైట్ వున్న గ్రంథం గనుక,ప్రచురణకర్తలు అనుమతి యివ్వాలని, తన సెక్రటరీ ఆ విషయంలో సహకరించగలడనీ రాశారు. చాలా సంతోషించారు. 1980లో ఆయన చనిపోవడం నాకు చాలా విచారాన్ని మిగిల్చింది.

1964లో కీ॥శే॥ఆవుల గోపాల కృష్ణమూర్తి అమెరికా ప్రభుత్వ ఆహ్వానంపై అమెరికాలో పర్యటించబోతుండగా, ఎరిక్ ఫ్రామ్ ను తప్పనిసరిగా కలుసుకోమని కోరాను. ఆ ప్రకారమే ఎ.జి.కె. ప్రయత్నించి, నిర్ణీత సమయంలో కలవాలని నిర్ణయించారు. ఎరిక్ ఫ్రామ్ యిచ్చిన సమయానికి వెళ్ళలేక,ప్రయాణం దూరాన్ని, కాలాన్ని, అంచనా వేయడంలో పొరబడి కలుసుకోలేకపోయారు.

1955లో సేన్ సొసైటి ప్రచురితమైంది. అందులో తొలి అధ్యాయంలోనే ఎరిక్ ఫ్రాం ప్రత్యేకంగా ఎం.ఎన్.రాయ్. "రీజన్, రొమాంటిసిజం, రివల్యూషన్" గ్రంథాన్ని ప్రస్తావించారు. యూరోప్ పునర్వికాసం అవగహన చేసుకోడానికి ఆ పుస్తకం చదవాలని పాఠకులకు సిఫారసు చేశారు. అంతకు ముందు సంవత్సరం క్రితమే రాయ్ చనిపోయారు. రాయ్ గ్రంథం 2 సంపుటాలు అప్పుడే వెలువడ్డాయి. అంటే ఎరిక్ ఫ్రామ్ ప్రచురణ జరిగిన కొద్ది రోజులకే రాయ్ పుస్తకం చదివారన్నమాట. రాయ్-ఫ్రామ్ లకు ఎంత పరిచయం వుందో తెలియదు. 1952లో తొలుత ఏర్పడిన అంతర్జాతీయ హ్యూమనిస్టు సంఘానికి రాయ్ వైస్ ప్రెసిడెంట్ గావడం, హ్యూమనిస్ట్ వే అనే త్రైమాస పత్రికను నడిపే రాయ్ బహుశ ఫ్రామ్ తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి వుండొచ్చు.

అమెరికా హ్యూమనిస్ట్ అసొసియేషన్ 1966 సంవత్సరంలో ఎరిక్ ఫ్రామ్ ను హ్యూమనిస్ట్ గా సత్కరించింది. తాను మానవ సహజవాదినని, రాడికల్ హ్యూమనిస్ట్ నని ఫ్రామ్ స్పష్టీకరించాడు. అనేక పర్యాయాలు హ్యూమనిస్ట్ సంఘ సమావేశాలలో మాట్లాడి, సంఘం, సంస్కృతి ప్రభావం వ్యక్తిపై వుంటుందన్నాడు. ఆ విధంగా చూస్తే పారిశ్రామిక సమాజాలలో వున్న వ్యక్తి వైమనస్యతకు గురౌతాడన్నారు. దీనిని Alienation చెప్పిన ఫ్రామ్ ధోరణి ఆనాడు కొలంబియా యూనివర్శిటీ, న్యూయార్క్ జనాలకు నచ్చలేదు.

హేతువాదంతో విశ్వాసం గనుక పొందికగా యిమడలేకపోతే, పాత సంస్కృతి ప్రభావాలు లక్షణంగా భావించి, విశ్వాసానికి తిలోదకాలివ్వాలని ఎరిక్ ఫ్రామ్ రాశాడు. (మేన్ ఫర్ హింసెల్ఫ్) విశ్వాసంస్థానంలో సైన్స్ చోటుచేసుకోవాలన్నాడు.

ఎరిక్ ఫ్రామ్ పూర్వాపరాలు

ప్రపంచ వ్యాప్తంగా ఎరిక్ ఫ్రామ్ పేరెత్తగా, ఆర్ట్ ఆఫ్ లవింగ్ పుస్తకం జ్ఞాపకం చెసుకుంటారు. మొదలుపెడితే చివరి దాకా చదివించే లక్షణం గల ఫ్రాం, అతి జటిలమైన విషయాలను సులభంగా చెప్పడంలో ఆరితేరిన సామాజిక మనోవిజ్ఞాన మానవవాది.

జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ నగరంలో యూదు పురోహిత(రాబై) కుటుంబంలో 1900 మార్చి 23న ఎరిక్ ఫ్రామ్ పుట్టాడు. తన తల్లిదండ్రులు చపలచిత్తురనీ, తనకూ కొస వెర్రి లేకపోలేదనీ రాసుకున్నాడు. తన 26వ ఏట వరకూ ఫ్రామ్ కూడా యూదు మత సంప్రదాయాలను పాటించి, బయటపడ్డాడు. ఫ్రామ్ యువకుడుగా సాల్మన్ రబిన్ కోవ్ సోషలిస్టు భావాలకు, నెహెమియా నోబల్ మార్మిక ధోరణిక గురయ్యాడు.

రైనర్ ఫ్రంక్ కొన్ని ఆసక్తికర విషాయాలు వెల్లడిస్తూ ఫ్రామ్ జీవిత విశేషాలు రాశాడు. ఫ్రామ్ కుటుంబంలో 20 ఏళ్ళ యువతి ఆత్మహత్య చేసుకోవడం,ఆమెను తన తండ్రి సమాధి పక్కనే పెట్టడం కొంత ప్రభావాన్ని కలిగించిందనీ, ఫ్రాయిడ్ సిద్ధాంతాల పట్ల శ్రద్ధ చూపడానికి యీ సంఘటన కారణమని అంటాడు.

విశ్వవ్యాప్తంగా అన్ని దేశాలు శాంతియుత సహజీవనం గడపవచ్చనే ఫ్రామ్ విశ్వాసం, మొదటి ప్రపంచ యుద్ధంతో పటాపంచలైంది. మానవుడిలో హేతు విరుద్ధ భావాల్ని, ధోరణుల్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నించాడు.

చరిత్రను లోతుగా అవగహన చేసుకోడానికి మార్క్స్ రచనలు ఫ్రామ్ కు ఉపకరించాయి. మార్క్స్ తొలి రచనలు మానవవాదంతో వున్నాయని చెప్పాడు. ఫ్రాంక్ ఫర్ట్, హైడల్ బర్గ్ లో చదివి 1922 నాటికే డాక్టరేట్ పట్టం స్వీకరించిన ఫ్రామ్, 1926లో ఫ్రెడారైక్ మన్ ను పెళ్ళాడాడు. మ్యూనిక్ లో మనోవిశ్లేషణ అధ్యయనం గావించాడు.

ఆనాడు ఫ్రాంక్ ఫర్ట్ మేధావి వర్గాలు ఆలోచనారంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపెట్టాయి. అందులో కొంతకాలం ఫ్రామ్ కూడా వున్నాడు. సామాజిక శాస్త్రాలకూ, మానసిక విజ్ఞానానికీ సన్నిహిత సంబంధం వుండాలని ఫ్రామ్ ఉద్దేశ్యం. జర్మనీలో తలెత్తిన నాజీవాదం, హిట్లర్ పెత్తందారీ తనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఫ్రామ్, ఉత్తరోత్తరా తన "అనాటమీ ఆఫ్ హ్యూమన్ డిస్ట్రక్టివ్ నెస్" లో అటు హిట్లర్, యిటు స్టాలిన్ మానవ వినాశకర రీతుల్ని ఎందుకు చేబట్టారో విడమరచాడు.

ఫ్రాయిడ్ అనుచరుడుగా కొన్నాళ్ళున్న ఫ్రామ్ క్రమేణా నిశిత పరిశీలకుడుగా మారి, ఫ్రాయిడ్ లో నిలిచేది,నిలవనిది వేరు చేయగలిగాడు. మనోవిశ్లేషణ శిక్షణ పొంది ఆచరించాడు.

1931 నాటికే క్షయ వ్యాధి సోకగా,స్విట్జర్లాండ్ లోని దావాస్ లో వుంటూ, తన భార్యకు ఎడమయ్యాడు. తరువాత అమెరికాకు వలస వెళ్ళి కారెన్ హర్నేతో సన్నిహితుడయ్యాడు. పదేళ్ళపాటు వారి మిత్రత్వం సాగింది. అమెరికాలో స్థిరపడిన ఎరిక్ ఫ్రామ్ పౌరసత్వం స్వీకరించాడు. అంతవరకూ జర్మన్ లో రచనలు సాగించిన ఫ్రాం, 1939నుండీ ఇంగ్లీషు రచనలు మొదలుపెట్టాడు.

ఎస్కేప్ ఫ్రం ఫ్రీడం రచన 1941లో రాగా, ఫ్రామ్ సిద్ధాంతకారుడుగా వెలుగులోకి వచ్చాడు. అది అతడి మూల సిద్ధాంతం. మానవుడు వైమనస్తతతో, బాధ్యతల్ని తప్పించుకొని,ఏదొక పెత్తందారీ వ్యవస్తకు లొంగిపోయి, అటు నియంతలనో, యిటు దేవుడినో కొలుస్తూ తన బాధ్యత నుండి తప్పుకుంటా డన్నారు.

1944లో హెన్నీ గుర్ లాండ్ ను పెళ్ళి చేసుకున్నాడు.

1947లో మాన్ ఫర్ హింసెల్ఫ్ ప్రచురించాడు. అప్పటికి మానవవాదిగా ఆవిర్భవించి మానవుడు తన బాధ్యతల్ని తానే స్వీకరించాలని, మానవుడు కేంద్రస్థానంలోకి రావాలన్నాడు.

1950 నుండీ ఫ్రామ్ మెక్సికోలో వుంటూ అక్కడ సుప్రసిద్ధుడయ్యాడు. 1952లో రెండో భార్య చనిపోగా, ఆనిస్ ఫ్రీమాస్ ను పెళ్ళాడాడు.

1955లో సుప్రసిద్ధ రచన సేన్ సొసైటి వచ్చింది. సామాజిక రీతుల్లో సోషలిస్టు వ్యవస్త ఎలా అమలులోకి తేగలమనే సిద్ధాంత గ్రంథం అది.

నేటి ప్రపంచాన్ని ఆకర్షించినది ఆర్ట్ ఆఫ్ లవింగ్ 1956లో ఫ్రామ్ ప్రచురించారు. ప్రేమను భిన్న కోణాల నుండి శాస్త్రీయంగా చూడగలగడం అందలి విశేషం. 1959లో ఫ్రాయిడ్ పై విశ్లేషణను స్వతంత్ర ధోరణిలో రాశారు. మరోపక్క ఫ్రామ్ సోషలిస్ట్ పార్టీలో అమెరికాలో ప్రముఖ పాత్ర వహించారు. ఆ దశలోనే 1961లో మార్క్స్ కాన్ సెప్ట్ ఆఫ్ మాన్ రాశారు.

ప్రపంచ శాంతి సమావేశాల్లో పాల్గొనడానికి 1962లో మాస్కో వెళ్ళారు. బియాండ్ ది చైన్సు ఆఫ్ ఇల్యూజన్ 1962లో ప్రచురించారు. ఆతరువాతనే ది హార్ట్ ఆఫ్ మాన్ కూడా రాశారు.

అమెరికా విధానాన్ని వియత్నాం యుద్ధంలో పాల్గొనడాన్ని ఫ్రామ్ తీవ్రంగా నిరశించారు. 1966లో యు షల్ బి యాజ్ గాడ్స్ అనే రచన చేశారు. అప్పుడే తొలిసారి గుండెపోటు వచ్చింది. చనిపోయేలోగా మొత్తం 4 పర్యాయాలు ఫ్రామ్ గుండెపోటుకు గురయ్యారు.

1968 ది రివల్యూషన్ ఆఫ్ హోప్ రాసి,రాజకీయాలలో చురుకుగా పాల్గొనడం విరమించేశారు. స్విట్జర్లాండ్ లో నివాసం ఏర్పరచుకొని తరచు అక్కడ వుంటూ,విశ్రాంతి తీసుకునేవారు.

1973లో "ది అనాటమీ ఆఫ్ హ్యూమన్ డిస్ట్రక్టివ్ నెస్" అనే విశ్లేషణాత్మక పెద్ద రచన చేశారు. 1975లో టు హేవ్ ఆర్ టు బి అనే రచనలో మానవుడు తనకు తానుగా నిలబడగలగడం అవసరమనీ, కేవలం సంపద ఆర్జించినంతమాత్రాన వ్యక్తిగా వుండజాలడని అన్నాడు.(1976)

1977లో ఒకసారి 1978లో మరోసారి గుండెపోటుతో ఎరిక్ ఫ్రామ్ బాధపడుతూనే జర్మనీ, ఇటలీలలో ప్రత్యామ్నాయ ఉద్యమాలలో పనిచేశారు. 1980లో మరోసారి గుండెపోటు రాగా మరణించిన ఫ్రామ్ ను స్విట్జర్లాండ్ లో సమాధి చేశారు.

ఎరిక్ ఫ్రామ్ కు తత్వం వుందా?

ఎరిక్ ఫ్రామ్ కేవలం మనో విశ్లేషణకారుడుగా, విమర్శకుడుగా మిగులుతాడా? లేక అతనికి తత్వం కూడా ఏదైనా వుందా?

ఫ్రామ్ రచనల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అతని మానవవాద తత్త్వం స్పష్టంగా అవగహన అవుతుంది.

మనిషి సహజ పరిణామంలో నుండి వచ్చాడు. ప్రకృతిలో భాగంగా వుంటూనే దానికి మించి పోవాలని మనిషి ప్రయత్నిస్తున్నాడు. ఇందుకు కారణం ఏమంటే, మిగిలిన వాటికి లేని వివేచన మనిషిలో వుండడమే.

ప్రతిక్షణమూ మనిషి బయటి ప్రపంచంతో సంపర్కం వలన, ప్రకృతిలోనూ, తోటివారితోనూ పొందికగా యిమడడం ఎలా అని సంఘర్షణ పడుతూనే వున్నాడు.

మానవుడు తన ఉనికి విషయంలో పరిష్కార మార్గాలను అన్వేషించిన ఫలితంగా రెండే రెండు మార్గాలు మిగిలాయి. ఒకటి మానుషం. అదే మానవవాదం.రెండవది అమానుషం. ఈ అమానుష పరిష్కారాల ఫలితంగానే దైవాన్ని, అతీత శక్తుల్ని ఆత్మను,అమరత్వాన్ని వూహించుకున్నాడు. వాటికి క్రమేణా బానిసగా మారి కొట్టు మిట్టాడుతున్నాడు.

మానవవాదంలో మనిషి కేంద్రంగా వుంటాడు. ప్రకృతిని క్రమంగా పొరలు విప్పుకుంటూ, ఒక్కొక్క అరలో ఏముందో తెలుసుకుంటూ సాగుతాడు. అలా తెలుసుకోవడం నిరంతరంగానూ, అనంతంగానూ సాగుతుంది. తాను గ్రహించింది తోటివారికి తెలియజెప్పడం, ఇతరుల నుండి గ్రహించడం మానవుడి సహకార లక్షణం. అందులో ఆనందం వుంది.

తెలుసుకోవడంలో ఎప్పుడూ చిక్కులు ఎదురౌతూనే వుంటాయి. అయినా కష్టపడి శాస్త్రీయ పద్ధతిని కనుగొన్నాడు. దాని సహాయంతో తెలుసుకుంటూ పోతున్నాడు.

మానవులకు ఇన్నేళ్ళుగా ఏ పరమాత్మ, ఏ ఆదిశక్తీ తోడ్పడలేదు. ఆదుకోలేదు. అలాంటివి వున్నాయనేది నమ్మకమే. దేవుడు, అతీతశక్తులు యిత్యాదులన్నీ మానవుడిని భ్రమల్లో ముంచెత్తాయి. బాధ్యతారహితుణ్ణి చేశాయి. సమస్యలు ఎదురైనప్పుడు తప్పుకు పోవడం, వైమనస్యత చెందడం, తనకు పట్టనట్లుండడం యివన్నీ అతీతశక్తుల, దైవాల భావనా ఫలితమే.

మానవుడు తోటివారికి తోడ్పడడం,నీతిగా విలువల్ని పాటించడం మానవ లక్షణం. మానవుడి వివేచనకు, అన్వేషణకు తోడ్పడే వ్యవస్తలు , సంస్థలు, సమాజాలు ఉత్తమమైనవి. మానవుడిని కించపరచి, విలువ లేకుండా, తక్కువగా చూచే వ్యవస్థలు అతన్ని అమానుషంగా ప్రవర్తించేట్లు చేస్తున్నాయి.

మానవుడు విశిష్టమైన జీవి. అతన్ని మూక స్వామ్యంలో కలిపేయడం అవివేకం. మానవుడి ప్రతిభ విప్పారడానికి తోడ్పడే సహకార విధానాలు ఏర్పరచుకోవాలి.

వివేచన ఒక్కటే మానవుడికి తోడ్పడగల ఆయుధం. దానిని సద్వినియోగపరచుకోవాలి.

మానవుడికి స్వేచ్ఛ అత్యంత విలువైనది. దానిని అరికట్టే విధానాలన్నీ అమానుషాలే. మానవుడు సంపూర్ణత వైపుకు ఎప్పుడూ సాగిపోవాలి. అది లక్ష్యంగా మంచి మార్గాలతో కదలాలి. స్వయం శక్తి పై మానవుడు నమ్మకం వుండాలి. ఇదీ ఎరిక్ ఫ్రామ్ తత్వసారం.

ఎరిక్ ఫ్రామ్ ముఖ్య రచనలు:

1. Escape from Freedom 1941

2. Man for Himself 1947

3. The sane Society 1955

4. The Art of Loving 1956

5. Sigmund Freaud Mission 1959

6. Marx's Concept of Man 1961

7. Beyond the Chains of Illussion 1962

8. The Heart of Man 1963

9. You shall be Gods 1966

10. The Revolution of Hope 1968
11. The Anatomy of Human destructiveness 1973

12. To have or to be 1975

ఇంకా ఎన్నో ప్రామాణిక వ్యాసాలు జర్మన్,ఇంగ్లీషులో కొన్ని గ్రంథాలు ఎడిట్ చేశారు అందులో హ్యూమనిజంపై ముఖ్యమైనవి వున్నవి.

- మిసిమి మాసపత్రిక, మార్చి-2001