అబద్ధాల వేట - నిజాల బాట/ఏది సెక్యులరిజం ? ఎలా అమలుపరచడం ?

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఏది సెక్యులరిజం? ఎలా అమలుపరచడం?

సెక్యులరిజం చిక్కుల్లో పడింది. భక్తి బలప్రదర్శనకు దిగింది. రాజకీయ పార్టీలు ప్రజల్ని నలుచుకు తింటున్నాయి. అయోధ్యలో మసీదు-రామమందిర్ తగాదావలన, సెక్యులరిజం అంటే ఏమిటో నిర్దుష్టంగా తేల్చుకోవలసిన స్థితి వచ్చింది.

సెక్యులరిజంపై దాడిచేస్తున్న భారతీయ జనతాపార్టీ దేశంలో సెక్యులరిజం గురించి చర్చ జరగాలంటున్నది.

సెక్యులర్ శక్తులన్నీ ఏకం కావాలని ప్రధాని పి.వి.నరసింహారావు పిలుపు యిచ్చాడు.

ఏది సెక్యులరిజం అంటే అన్ని మతాల్ని సమాన గౌరవంగా చూడడం అని రాధాకృష్ణన్ చెప్పిన భాష్యాన్ని పల్లెవేస్తున్నారు. ఆ పేరిట ఎవరిమతాన్ని వారు ప్రోత్సహిస్తూ, అధికారంలో వున్నవారు తమ వ్యక్తిగత నమ్మకాల్ని జనంపై రుద్దేస్తున్నారు.

ప్రధానిగావున్న పి.వి.నరసింహారావు హైదరాబాద్ లో ఒక ప్రైవేటు కళ్యాణమండపానికీ వచ్చిన సాయిబాబా కాళ్ళకు మొక్కాడు. నాలుగేళ్ళపాటు దేశాన్ని సుభిక్షంగా వుంచమని (తన పదవీకాలం) పి.వి. కోరుకున్నాడు. రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ పుట్టపర్తి వెళ్ళి సాయిబాబా కాళ్ళకు వందనం చేశాడు.

ప్రజలు ఎన్నుకున్న పదవులలో వున్నవారు ప్రజలు తమకిచ్చిన సార్వభౌమత్వాధికారాన్ని ఇతరుల పాదాల వద్ద తాకట్టుపెట్టారు. ఇది ప్రజలకు అవమానం.ఇది సెక్యులర్ వ్యతిరేకం. అలాంటి వాళ్ళు సెక్యులర్ శక్తులు ఏకం కావాలంటే, పదవులు నిలబెట్టుకోడానికి ఎత్తుగడ మాత్రమే అవుతుంది.

సెక్యులరిజం అంటే ఏమిటి? మానవవాదులు,హేతువాదులు మొదటి నుంచీ యీ విషయమై స్పష్టంగానే చెబుతూ వచ్చారు.

సెక్యులరిజం అంటే అన్ని మతాలకు ప్రభుత్వం దూరంగా వుండతమే. మతాన్ని వ్యక్తిగత విశ్వాసంగా పరిగణించి,ప్రభుత్వ యంత్రాంగాన్ని,ప్రసారాలను మతానికి వినియోగించకుండా వుండటమే సెక్యులరిజం. అంటే ఎవరు ఏ మతానికి చెందినా,చట్టం ముందు సమానమే.దీనికి అనుగుణంగానే రాజ్యాంగంలో ఆదేశసూత్రాలలో యూనిఫారం, సివిల్ కోడ్ కావాలన్నాం. నేరాలు చేసిన వారిని మతాతీతంగా ఒకే తీరులో శిక్షిస్తున్నట్లే, పౌరస్మృతి కూడా మతరహితంగా వుండాలి. సెక్యులరిజంలో మతానికి స్థానం లేదు. ప్రభుత్వం మతాన్ని పట్టించుకోరాదు. ఇది చాలా ముఖ్యం. ప్రభుత్వంలో వున్నవారు ఇందు నిమిత్తం చేయాల్సిన పనులు కొన్ని వున్నాయి.

మత ఉత్సవాలకు, పండుగ పబ్బాలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించరాదు. పండుగ చేసుకోదలచిన వ్యక్తులు సెలవులు పెట్టుకోవాలి.

మత ఊరేగింపులు,మేళాలు, సమావేశాలు అన్నీ శాంతిభద్రతల సమస్యగానే ప్రభుత్వం పరిగణించాలి.

అధికారంలో వున్న వారెవరూ తమ అధికారాన్ని వినియోగించి మతపరమైన వాటిలో పాల్గొనరాదు. వాహనాలు వాడరాదు. పర్యటనలు చేయరాదు. రేడియో, టి.వి.లలో ప్రసారాలు మతపరంగా జరపరాదు. అలాంటప్పుడు ప్రజలలో అసూయ ద్వేషం పెచ్చరిల్లదు.

మతపరమైన ఆస్తులకు ఆదాయంపన్ను వుండాలి. బాబాలు, ఆశ్రమాలకు మినహాయింపులు వుండరాదు. అలాగే విద్యాసంస్థలలో మతపరమైన బోధనలు వుండరాదు. మతపరమైన యాజమాన్య గుర్తింపు వుండరాదు. మతాన్ని పాఠశాలల్లో శాత్స్రీయంగా పాఠాల్లో చెప్పవచ్చుగాని బోధనగా, ప్రచారంగా కాదు.

ప్రభుత్వ కార్యాలయాల్లో, రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లలో మతపరమైన ఆరాధనలు, ప్రచారాలు, చందాలు వసూలుచేయుట నిలిపివేయాలి.

మసీదులు, దేవాలయాలలో మైకులు పెట్టి, పిల్లల వదువులకు అవరోధంగా శబ్దకాలుష్యం జరపడం అనుమతించరాదు.

రాజకీయవాదులు ఇన్నాళ్ళుగా మౌల్వీలను,బాబాలను ప్రోత్సహిస్తూ తమ అవసరాలకు వాడుకున్నారు. సాయిబాబా, కంచి ఆచార్య,పూరిశంకరాచార్య, ధీరేంద్ర బ్రహ్మచారి, చంద్రస్వామి, ఇలాంటి వారంతా ఆ బాపతే. ఆ పనులు మానాలి.

రోడ్డు మీద ట్రాఫిక్ కు అడ్డమొచ్చే తీరులో మత మందిరాలు నిర్మించడాన్ని అనుమతించరాదు.

ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనులు మతపరంగా చేయడం ప్రభుత్వ యంత్రాంగానికి తగదు.

సెక్యులరిజాన్ని శాస్త్రీయంగా అమలుపరచడానికి గాను యూనిఫారం సివిల్ కోడ్ చట్టపరంగా తక్షణం తీసుకురావాలి.

- హేతువాది, జనవరి 1993