అబద్ధాల వేట - నిజాల బాట/చావుబ్రతుకుల్లో సెక్యులరిజం
ఇండియాలో సెక్యులరిజం కనుచూపు మేరల్లోలేదు. కేంద్రంలో గానీ, రాష్ట్రాలలో గానీ ప్రభుత్వాలు వస్తూ పోతూ వున్నవి. వీటన్నిటికీ సెక్యులరిజం పట్ల ఏకాభిప్రాయం వున్నది. అటువంటి అవగాహన వున్న రాజకీయపార్టీలు పెత్తనం చేసినంతకాలం సెక్యులరిజానికి అర్థం మారక తప్పదు. ఓట్లు రాబట్టాలనే దురుద్దేశ్యంతో రాజీపడే యీ రాజకీయపార్టీలు సెక్యులరిజానికి నిర్వచనం చెప్పాయి. దీనికి ఇండియాలో రాధాకృష్ణన్ పితామహుడు.
సెక్యులరిజం అంటే అన్ని మతాలను సమానంగా పరిగణించడం అని రాధాకృష్ణన్ చెప్పిన భాష్యానికి రాజకీయపార్టీలు అంటిపెట్టుకున్నాయి. అవసరమైతే తమకు అనుకూలమైన మతాన్ని ప్రవారం చేసుకుంటూ, మధ్య మధ్య మిగిలిన మతాలను పొగుడుతూ ఒక సందేశం పారేస్తుంటారు. మతాన్ని వ్యక్తిగతంగా అట్టిపెడితేనే సెక్యులరిజం అవుతుంది. ఎవరి మతం వారిది. ఎవరి నమ్మకాలు వారివి. ప్రభుత్వం అందరిదీ. కనుక ప్రభుత్వంలో వున్నవారు తమ వ్యక్తిగత నమ్మకాలను ప్రచారం చేయడం గాని, ఇతరులపై రుద్దడంగాని, ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించడం గానీ కూడదు. అంటే మతాన్ని బజార్లోకి ఈడ్చుక రాకూడదని సారాంశం.
సెక్యులరిజాన్ని యీ విధంగా అమలు జరపకపోవడం వలన అన్ని అనర్థాలు వచ్చాయి. ఇంకా వస్తాయి. దేశంలో తరచు జరిగే హిందూ-ముస్లిం కలహాలు,హిందువులలోని శాఖలలో తగాదాలు, సిక్కుల ఖలిస్తాన్ ఉద్యమం, ఇవన్నీ ప్రభుత్వ సెక్యులర్ వైఖరివలన జనించినవే.
అన్ని మతాలు ఒకటికాదు. మతాలన్నీ ఒకే విషయాన్ని బోధించడం లేదు. దేవుడు ఒక్కడు కాదు. ఎవరి మతానికున్న దేవుడు ఆ మతానికి గొప్ప. అన్ని మతాలు ఒకటే అయితే ఇన్ని మతాలు పుట్టేవేకాదు. ఒక మతాన్ని ఖండిస్తూ, మరొక మతం పుట్టింది. హిందూమతాన్ని కాదని బౌద్ధ, జైనమతాలు వచ్చాయి. హిందువులలో శైవులు, వైష్ణవులు చావచితకబాదుకున్నారు. ఇలాగ ప్రపంచవ్యాప్తంగా మతాలన్నీ పరమత ద్వేషంతో పుట్టి పెరిగినవే. మతాలు హింసను పోషించి ఆచరించాయి. చివరకు బౌద్ధంకూడా అలాంటిదే. అల్లా ఒక్కడే దేవుడంటున్న ముస్లింలు మిగిలిన దేవుళ్ళను ఒప్పుకోరు. క్రైస్తవులూ అంతే. అందరు చెప్పేది ఒక్కటే అయితే, మతప్రచారం అర్థరహితం గదా.
కాని మన రాజకీయవాదులు, పదవులలో వున్నవారు జాతీయసమైక్యత పేరిట తమను మోసగిస్తూ, ఇతరులను భ్రమింపజేయాలని ప్రయత్నిస్తున్నారు. మతకలహాలు జరిగినప్పుడు, సభలుపెట్టి చిలకపలుకులు వల్లిస్తున్నారు. వారికి చిత్తశుద్ధిలేదు. ఉంటే దేశంలో పౌరులందరికీ ఒకే కోడ్ ఎప్పుడో అమలుచేసేవారు.
పంజాబ్ లో శిక్కుల మతపరమైన కోర్కెలు ఆమోదించడంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి సెక్యులరిజాన్ని చావుదెబ్బ కొట్టింది. మిగిలిన మతాలవారు కూడా వెనకా ముందూ చూచుకొని మతాధిక్యతపై ప్రయత్నిస్తారు.
సెక్యులరిజం చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నది.
ఇందిరాగాంధీకి వ్యక్తిగతంగా ఏ నమ్మకాలున్నాయో మనకు అనవసరం. ఎన్.టి.రామారావు స్వయంగా దైవాంశ సంభూతుడనని కలలు కంటే మనం చేయగలిగిందేమీలేదు. కాని ప్రధానిగా ఇందిరాగాంధీ, ముఖ్యమంత్రిగా ఎన్.టి.రామారావు ప్రజలకు బాధ్యులు. వారేమిచేసినా ప్రజలు గమనిస్తారు. ఇక్కడే వ్యక్తిగత నమ్మకాలకూ, ప్రభుత్వ ఆచరణకూ గిరి గీయవలసి వుంటుంది. వీరిద్దరూ ప్రభుత్వ ఖర్చు లేకుండా, ప్రైవేటుగా తిరుపతి వెళ్ళినా సంతోషిమా దగ్గర ప్రణామం చేసినా మనకు అనవసరం ప్రజల డబ్బుతో పటాటోపంగా తమ భక్తిప్రపత్తులను ప్రచారం చేయడం సెక్యులర్ వ్యతిరేకం. ఇతర మతాలవారిని తృప్తిపరచడానికి గురుద్వారా, మసీదు, దేవాలయాలను సందర్శించినా, ఎవ్వరూ నమ్మరు. పైగా ద్వేషం రగులుతూ కలహాలకు దారితీస్తుంది.
ప్రభుత్వ యంత్రాంగం కూడా నిష్పాక్షికంగా వుండకపోతే, పరిపాలన వలన అందరికీ సుఖం లభించదు. విజయవాడవద్ద కృష్ణపై వంతెనకు కనకదుర్గ అని పేరు పెడితే,ముస్లింలు, క్రైస్తవులు,నాస్తికులు ఎలా భావిస్తారు? రేడియో, టి.వి.లు అందరికోసం ఉద్దేశించారు. మతం ఒక వర్గానికి చెందినది. ఆయా మతస్తులు అనేక ఆచారవ్యవహారాలను పాటిస్తుంటారు. అప్పుడే కలహించుకుంటారు కూడా. మసీదు పక్కగా బాండ్ మేళాలతో పోతే కలహాలు వచ్చాయి. పంది మాంసం గురించి, ఆవు మాంసం గురించి ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ దృష్టిలో ఇవన్నీ లా అండ్ ఆర్డర్ సమస్యలుగానే వుండాలి. ఉద్యోగాలుచేసే వారికి రూల్స్ ఒకటే. మతపరమైన పండగవస్తే ఆ మతస్థులు సెలవు పెట్టుకోవాలి. అందరికీ సెలవు యివ్వడం అనవసరం. ఉద్యోగాలుచేసే ముస్లింలు ప్రార్థన పేరిట పోతామనడం కూడా సెక్యులర్ వ్యతిరేకమే. ఇతరులకు కష్టం కలిగించే వ్యవహారమే యిది. ఆఫీసుల్లో ప్రార్థన నిమిత్తం షెడ్లు నిర్మించమంటే, అన్ని మతస్తులు ఏదో ఒక కోరిక కోరతారు. దీనికి అంతం వుండదు. క్రమేణా కలహాలకు దారితీస్తుంది.
రేడియో,టి.వి.లలో మతప్రచారం ఎక్కువైంది. దీనివలన సమైక్యత చెడుతుందే గాని బాగుపడదు. వారానికి 5 రోజులు హిందువుల భజనచేసి, ఒకరోజు ముస్లింల ప్రార్థన, ఒకరోజు క్రైస్తవుల భక్తిగీతాలు వేస్తే అన్ని మతాలు ఒక్కటైనట్లు కాదు. పైగా ఒకే భక్తి గేయాల్ని తరచు వేయడం వలన మత ప్రచారం అనిపించుకుంటుందే గాని మతాన్ని గురించి చెప్పినట్లు కాదు.
మత ప్రచారం నిమిత్తం వివిధభారతిలో డబ్బిచ్చి కొనుక్కోవచ్చు. విదేశాలలో క్రైస్తవులు అలాగే చేస్తున్నారు. ఇష్టం వున్నవారు వింటారు. లేకుంటే లేదు. కాని ఆలిండియా రేడియో ప్రజలందరి కోసం, అందరి డబ్బుతో స్థాపించిన వ్యవస్థ. అక్కడ ప్రతి శనివారం వెంకటేశ్వర సుప్రభాతం వినిపిస్తే అర్థం ఏమిటి?
ప్రభుత్వంలో కీలక స్థానంలోవున్న వ్యక్తులు స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో సెక్యులరిజం పట్ల వేసిన తప్పటడుగు వలన నేటి దుష్పరిణామం వచ్చింది. రాజకీయ పార్టీలు మతాన్ని ఓట్లకోసం వినియోగించుకొనే దుస్థితికి దిగజార్చాయి. హైదరాబాద్ లో ఒక్కొక్క యేడు గణపతి ఉత్సవం జరుగుతుంటే హిందూ-ముస్లిం ద్వేషం ప్రబలిపోతూ వున్నది.
సమస్యను మూలానికి వెళ్ళి పరిశీలించకుండా, తాత్కాలిక ప్రయోజనాలతో దాటవేద్దామంటే యిలాగే వుంటుంది. మహాత్మగాంధీ రాం రహీం ఒక్కటే అంటే హిందువులు ఒప్పుకున్నారా? ముస్లింలు అంగీకరించారా? సెక్యులర్ సమస్యల్ని మతపరంగా చూస్తే పరిష్కారం లభించదు. ప్రతిమతం పుట్టడానికి, పెరగడానికి చారిత్రక కారణాలు వున్నాయి. వాటన్నిటినీ కాదని, ఒకే గాటిన అన్ని మతాలను కట్టేయడం సాధ్యంకాదు. ప్రభుత్వ దృష్టిలో అన్ని మతాలు సమానం అంటే, అన్నిటికీ సమాన దూరంగా వుండటమే అని గ్రహిస్తేచాలు. అదే సరైన సెక్యులరిజం అవుతుంది. మతాలు వున్నంతకాలం మతకలహాలు తప్పవు. కనుక మతాల్ని వ్యక్తిపరమైన విశ్వాసంగా అట్టిపెట్టి, పరిపాలించడం సెక్యులరిజం అనిపించుకుంటుంది.