అబద్ధాల వేట - నిజాల బాట/అన్ని మన మూలగ్రంథాల్లో వున్నాయా?

వికీసోర్స్ నుండి
అన్ని మన మూలగ్రంథాల్లో వున్నాయా?

అన్నీ మన వేదాలే చెప్పాయని నమ్మేవారున్నట్లే ఇతర దేశాల్లో అన్ని మతాల్లో శాశ్వత సత్యాల్ని నమ్మేవారున్నారు. అంతటితో ఆగకుండా, సైన్స్ ఏదయినా కొత్త అంశం కనుగొనగానే అది మనవాళ్ళెన్నడో చెప్పారని శ్లోకాలు వల్లించే వారున్నారు. క్రైస్తవులు బైబిల్ ని గుడ్డిగా నమ్మి, దానికోసం కోర్టులదాకా వెళ్ళి ఓడిపోయారంటే నమ్ముతారా? ఈ విశ్వమంతా బైబిల్ ప్రకారం సృష్టి అయిందని, అలాగే పిల్లలకు పాఠాలు చెప్పాలన్నారు. సైన్స్ రుజువు చేసిన పరిణామవాదాన్ని ప్రశ్నించారు. అమెరికాలో కోర్టులలో యీ సృష్టివాదాన్ని రుజువు చేయలేక వెల్లకిలా పడ్డారు. బైబిల్, వేదాలు, ఖురాన్ ఇత్యాది మతగ్రంథాలన్నీ ఆయా మతస్తులకి పవిత్రాలు, శిరోధార్యాలు కాని అవి కేవలం నమ్మకాలని విస్మరించి, వాస్తవాలన్నప్పుడే చిక్కొస్తుంది. పైగా సైన్సు ప్రకారం వున్నాయంటే మరీ ప్రమాదం.

అమెరికాలో కాలిఫోర్నియా విశ్వ విద్యాలయంలో ఫిజిక్స్ ప్రొఫెసర్ ఫ్రిట్జ్ ఆఫ్ కాప్రా ఒక పుస్తకం రాశాడు. ది టావో ఆఫ్ ఫిజిక్స్ అనే యీ గ్రంథం బాగా అమ్ముడు బోయింది. బహుళ ప్రచారంలోకి వచ్చింది. సైన్స్ లో నేడు శాస్త్రజ్ఞులు కనుగొన్నదంతా చైనాలో నాడే తెలుసుకున్నారని ఆయన పేర్కొన్న సారాంశం. ఇంకేముంది! జనం ఎగబడికొన్నారు. అందునా ఒక అమెరికా ఫిజిక్స్ ప్రొఫెసర్ రాశాడంటే అది పరమ సత్యమే అయివుంటుందని నమ్మే ఆసియా వాసులు చాలామంది వున్నారు. ఇండియాలో కూడా యీ నమ్మకం బాగావున్నది. సత్యసాయిబాబా, రామకృష్ణ పరమహంస, రమణమహర్షి మొదలైన వారి గురించి పాశ్చాత్యులు రాస్తే, అదొక సర్టిఫికెట్ గా భావిస్తారు. తెల్లవారు రాసినా నల్లవారు చెప్పినా అందులో సత్యాసత్యాలు తెలుసుకోడానికి శాస్త్రీయ ప్రమాణాలు ఒకటేనని మరచిపోతారు.

చైనాలో ఇన్ అనేది హేతుబద్ధ ఆలోచనగానూ, యాంగ్ అనేది ఉద్వేగానికి సంబంధించినది గానూ భావిస్తారు. ఈ రెండూ ఒకే సత్యాన్ని రెండు కోణాలనుంచి చూస్తాయని అంటారు. టావో గ్రంథానికి ఆధునిక సైన్స్ రీత్యా కాప్రా భాష్యం చెప్పాడన్నాం గదా? ప్రాచీన చైనా గ్రంథాలలో చెప్పిందంతా చూస్తే ఆధునిక సైన్స్ అందులో వున్నట్లు కాప్రా నమ్మాడు. కనుక సైన్సు గొప్పతనం ఏమీలేదనీ, ప్రాచీనులు తమ దివ్యదృష్టి ద్వారా అన్నీ కనుగొన్నారనీ యిందలి సారాంశం. ఆధునిక అణు విజ్ఞాన శాస్త్రం ఏ విధంగా ప్రాచీన టావో గ్రంథంలో యిమిడి వున్నదో కాప్రా రాశాడు. అలాగే వేదాలు, ఖురాన్ ,బైబుల్ గురించి చెబుతున్నవారున్నారు. ఇదంతా చాలా బాగున్నది నమ్మకస్తులకు తామరపై వేడినీరు పోసినట్లున్నది.

సైన్సు కనుగొనేవరకూ ఆగకుండా సమస్యలన్నీ పూర్వీకులు తమ గ్రంథాల ద్వారా ఎలా పరిష్కరించారో చెప్పేస్తే సరిపోతుందికాని అలా చెయ్యకుండా,సైన్స్ కనుగొనేవరకూ ఆగి అదంతా మా వేదాల్లో వుందని ఎందుకంటున్నారు?

మరొక ప్రధానమైన అంశం యీ నమ్మకస్తులు విస్మరించి యెప్పటికప్పుడు చావుదెబ్బ తింటున్నారు. సైన్స్ ఒకసారి కనిపెట్టిన విషయాన్ని,కొత్త సాక్షాధారాలు లభించిన తరువాత తృణీకరిస్తుంది. కొన్నిసార్లు సవరిస్తుంది. అప్పుడేమంటారు? వేదాలు, ఖురాన్ ,బైబిల్, టావో రచనలు కూడా అలా సవరిస్తారా? దివ్యశక్తి అనేది సైన్సులో కూడా వున్నది. సైంటిస్టు తన పరిశోధనకు పరిష్కారం లభించనప్పుడు ఆలోచిస్తూవుంటాడు. హఠాత్తుగా పరిష్కారం లభించినట్లు కల వస్తుందనుకోండి అదే పరమసత్యం అనడు. దానిని పరిశీలనకు, రుజువు పెడతాడు. దివ్యశక్తి కూడా అలా పరిశోధనకు గురిచేయడమే సైన్సు విశిష్ఠత. నమ్మకస్తులు యీ విషయం విస్మరించారు.

కాప్రా రాసిన టావో ఫిజిక్స్ గ్రంథాన్ని సుప్రసిద్ధ శాస్త్రజ్ఞుడు ఇజెక్ అసిమోప్ పరిశీలించాడు. ఆయన అభిప్రాయాలు వెలిబుచ్చుతూ, సైన్స్ పరిశోధన చాలా ఖర్చుతో కూడిన పని. ప్రభుత్వాలు యీ ఖర్చును భరించలేకపోతున్నాయి. కనుక సైన్స్ యెదుర్కొంటున్న అనేక సమస్యలకు టావో ఫిజిక్స్ ఏం చెబుతున్నదో విడమరచి వివరించమని కోరాడు. అలా చెప్పగలిగితే కాప్రా ఎంతో సేవచేసినవాడే గాక, ఖర్చు శ్రమ మిగులుతాయి అని అసిమోవ్ సూచించాడు. ఇది వేదాంతులకు, బైబిల్,ఖురాన్ నమ్మకస్తులకూ వర్తిస్తుంది.

ఉదాహరణకు సూక్ష్మలోకంలో క్వార్క్ లనే అణువులు దేనితో ఏర్పడ్డాయో తెలియక సైన్స్ సతమతమౌతున్నది. దీన్ని గురించి టావో ఫిజిక్స్ యేమంటుంది?

అలాంటి క్వార్క్(Quarks) లు ఎన్ని ఉన్నాయి? ఎలక్ట్రాన్లు దేనితో ఏర్పడ్డాయి? భారమైన లెప్టాన్లు వున్నాయా? ఉంటే యెన్ని? క్వార్క్ లకూ లెప్టాన్లకూ సంబంధం ఏమిటి? ఇవన్నీ క్వాంటం సిద్ధాంతరీత్యా మౌలిక సందేహాలు. వీటికి సమాధానం టావో ఫిజిక్స్ లో యేమున్నదో చెప్పమని 1980లోనే అసిమోవ్ అడిగాడు. ఆయన చనిపోయాడు కూడా. 14 సంవత్సరాలైనా కాప్రా మాట్లాడలేదు. నమ్మకస్తులెవరూ నోరు విప్పలేదు.

సైన్స్ కనిపెట్టిన తరువాత ఏదో ఒక శ్లోకాన్ని, వాక్యాన్ని, సూత్రాన్ని పట్టుకొచ్చి, దీనికి అర్థం సైన్స్ చెప్పినట్లే వున్నదనడం ఫాషన్ అయింది. నమ్మేవారున్నంతకాలం ఇలాంటి మోసాలు సాగుతూనే వుంటాయి. గ్రీకులు సెక్యులర్ గా హేతుబద్ధంగా ఆలోచన సాగిస్తుండగా, క్రైస్తవమతం దెబ్బ కొట్టింది. ఫలితం యేమైంది? అంధకారయుగం వచ్చిందని అసిమోవ్ వాపోయాడు. ఇప్పుడు అలాంటి స్థితి యేర్పడింది. మళ్ళీ అంధకారయుగం రాకుండా చూచుకోవాలని ఆయన హెచ్చరించారు.

బైబిల్ నమ్మేవారు క్రీస్తుపూర్వం 4004 ఏళ్ళనాడు సృష్టి జరిగిందన్నారు. సైన్స్ ప్రకారం 15 బిలియన్ సంవత్సరాల చరిత్ర సృష్టికి వున్నది. సృష్టి ప్రారంభ దశనుండే భూమి కూడా వున్నదని బైబిల్ నమ్మింది. సైన్స్ ప్రకారం 5 బిలియన్ ఏళ్ళ క్రితం భూమి యేర్పడింది. అంటే 10 బిలియన్ సంవత్సరాల పరిణామం తరువాత భూమి వచ్చిందన్నమాట. బైబిల్ ప్రకారం సూర్య, చంద్రులకంటె ముందే భూమివుంది. సృష్టి అంతా 6 రోజులలో పూర్తి అయినట్లు బైబిల్ పేర్కొన్నది. పరిణామం యెప్పుడూ జరుగుతూనే వున్నదని నక్షత్రాలు యిప్పుడుకూడా ఏర్పడుతూనే వున్నాయని సైన్స్ చెబుతున్నది.

ఖగోళ శాస్త్రజ్ఞుడు రాబర్ట్ జస్ట్రోవ్ 'గాడ్ అండ్ ది అస్ట్రానమర్స్' అని పుస్తకం రాశాడు. ఆయన బైబిల్ ను సమర్ధించడంతో మతస్తులకు మంచి పట్టి చిక్కినట్లు భావించారు. రుజువుకు నిలబడని విషయాలు శాస్త్రజ్ఞుడు చెప్పినా ఒకటే, పురోహితుడు ప్రవచించినా ఒక్కటే అని విస్మరించారు. ఈ గ్రంథాన్ని కూడా అసిమోవ్ కూలంకషగా పరిశీలించి, అందులో పెడదారులు పట్టించే తీరును యెండగట్టాడు.

- హేతువాది, ఫిబ్రవరి 1994