Jump to content

అబద్ధాల వేట - నిజాల బాట/బైబిల్ - క్రైస్తవులు - హేతువాదులు

వికీసోర్స్ నుండి
బైబిల్ - క్రైస్తవులు - హేతువాదులు

ఇంగర్ సాల్ బైబిల్ విమర్శ చదువుతుంటే వెంకట్రాది ఉపన్యాసాలు గుర్తుకు వస్తాయి. బైబిల్ లోని మూఢనమ్మకాలు, మహత్యాలు అద్భుతాల కల్పితాల గురించి ఇంగర్ సాల్ తిరుగులేని దెబ్బతీశాడు. ఎదుటవారి వాదన అర్థంలేనిదిగా, నిర్హేతుకంగా వున్నపుడు వెంకటాద్రి కూడా అలాగే సుత్తితో బాదినట్లు బాది తలబద్దలుకొట్టి, అసలు విషయం చెబుతారు. అయినా మూర్ఖులు తగ్గటం లేదు. భక్తి ముదరడం మానలేదు.

క్రైస్తవ భక్తి, బైబిల్ నమ్మకం పట్ల మానవవాదులు శాస్త్రీయ దృక్పధాన్ని అవలంబించి చెబుతూనే వున్నారు. హేతువాదిలో పి.యస్.ఆర్. రచనలే అందుకు ఉదాహరణలు.

ప్రపంచవ్యాప్తంగా మానవవాదులు తమ సహేతుక విమర్శలు చేసి, శాస్త్రీయ దృక్పధం యేమిటో చెబుతున్నారు. సుప్రసిద్ధ సైంటిస్టు,రచయిత ఐజెక్ అసిమోవ్ బైబిల్ పైనా, క్రైస్తవుల పైనా విమర్శ పరంపరలు చేశాడు. ఆయన విమర్శకూ, ఇంగర్ సాల్ విమర్శకూ చాలా తేడా వుంటుంది. గులకరాళ్ళు పట్టువస్త్రంలో చుట్టి,కణతకు గురిపెట్టి కొట్టినట్లు అసిమోవ్ వ్రాస్తాడు. బైబిల్ కు గైడ్ వ్రాసిన అసిమోవ్ అందులో చరిత్ర పాలెంత, నమ్మకం ఏ మేరకు వుంది, కవిత యెంత, కథ యెక్కడ అనేది ఆధారాలతో పరిశీలించారు. ఇదిగాక తన రచనల్లో ఆసిమోవ్ చాలాచోట్ల బైబిల్ పై విమర్శలు చేశాడు.

నేను త్వరలో తిరిగొస్తాను(బైబిల్ రివలేషన్ 22:7) అని చెప్పి వెళ్ళిన క్రీస్తు రెండువేల సంవత్సరాలు అయినా రాలేదు. అంతటితో బైబిల్ లో కొత్త నిబంధన ముగుస్తుంది. అలాంటి బైబిల్ ను వివిధ కోణాల నుంచి చూస్తున్నారు. యూదులు కేవలం పాత నిబంధన వరకే పరిమితమౌతున్నారు. కొత్త నిబంధన వారు అంగీకరించరు. యూదులు, క్రైస్తవులు అక్కడ పోట్లాడుకుంటున్నారు.

అసిమోవ్ వివరణ ప్రకారం బైబిల్ పాతనిబంధన ప్రకారం కొన్ని చారిత్రక ప్రస్తావనలు, కొన్ని వివాదాస్పద తేడాలు, కొన్ని గాథలు వున్నాయి. క్రీ.పూ.8500 సంవత్సరం మొదలుకొని యీ ప్రస్తావనలు వున్నాయి. యూదుల దృష్టిలో క్రీ.పూ3761 నాడు సృష్టి ఆరంభమైంది! ఆర్చిబిషప్ ఉషర్ (USHER) దృష్టిలో క్రీ.పూ.4004 నాడు సృష్టి మొదలైంది.

వివిధ ప్రస్తావనల అనంతరం, క్రీ.పూ.4న జీసస్ క్రీస్తు పుడతాడు. ఆధునిక చరిత్ర దృష్ట్యా బైబిల్ ను స్వీకరించకూడదు. పురావస్తు పరిశీలన చేసి రాసిన గ్రంథం కాదని గ్రహించాలి. అలాగే నిర్ధారిత తేదీలు, ఆధారాలు కూడ బైబిల్ ద్వారా లభించవు. అయినా ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా పాశ్చాత్యులు బైబిల్ చదువుతున్నారు. బైబిల్ ను ఆరాధ్య గ్రంథంగా అధ్యయనం చేస్తారు. చరిత్రలో బైబిల్ సమకాలీన అంశాలు చాలా జరిగినా వాటికి బైబిల్ లో స్థానం లేదు. బైబిల్ లో ప్రస్తావించిన వాటి అసలు సంగతి ఏమిటో అసిమోవ్ వివరించాడు. క్రీ.పూ. 4 వేల నుండి క్రీ.పూ.900 వరకు 5 సామ్రాజ్యాల కాలంగానూ ఆ తరువాత క్రీ.పూ.100 వరకూ మరో 5 రాజుల కాలంగానూ అసిమోవ్ చూపాడు.

యూదులకూ క్రైస్తవులకూ ప్రధాన తేడా ఏసుక్రీస్తు దగ్గరే వస్తుంది. ఆ తరువాత క్రైస్తవులలో మళ్ళీ పోప్ పెత్తనం దగ్గర తగాదాలు రాగా, రోమన్ కాథలిక్కులు మిగిలినవారు చీలిపోయారు. మతం పేరిట యుద్ధాలు జరిగాయి.

బైబిల్ మొత్తం క్రైస్తవులకు ఆరాధ్య గ్రంథం కాగా, యూదులు పాత నిబంధనకే పరిమితం అయ్యారు. పాత నిబంధనలో శామ్యుల్, కింగ్స్ అనే అధ్యాయాలలో చరిత్ర వుండగా, జనిసిస్, ఎక్సోడస్ లో గాథలు వున్నాయి. కవిత, చింతన, భవిష్యత్తు ఊహాపోహలు పుష్కలంగా కంపిస్తాయి.

కొత్త నిబంధనలో క్రైస్తు చరిత్రను నలుగురు వ్రాయగా, కొంత చారిత్రక విషయం మరికొంత జోస్యం మిళితమై వుంది. వివరాలకు పోతే కొన్ని చారిత్రక విషయాలలో సరిగా లేకపోవచ్చు. అయితే, బైబిలులో ఆదాం, ఈవ్, కెయిన్, ఏబల్, నింరోడ్, అబ్రహాం, ఐజాక్, జాకబ్ వంటివారు ప్రస్తావన వున్నా వారికి చారిత్రక నిజస్వరూపం లేదు. బైబిల్ వెలుపలవారికి స్థానం లేదు. అలాగే అద్భుతాలన్నీ బైబిల్ పై నమ్మకం గలవారికే పరిమితం.

బైబిల్ చెప్పే సృష్టివాదం శాస్త్రీయంగా యెక్కడా నిలవదు, బైబిల్ చెప్పిందంతా సత్యం అని మూర్ఖంగా పట్టుబడితే, శాస్త్రజ్ఞులకూ నమ్మకస్తులకూ ఘర్షణ రాకతప్పదు. అసిమోవ్ తన రచనలో ఈ హెచ్చరిక చేశాడు.

అమెరికాలో సుప్రసిద్ధ మానవవాది ఎడ్ డోయర్ రాస్తూ స్కూలు పిల్లల్ని ఫలానా విధంగా ప్రార్థన చేయమని, మౌనం వహించమని ప్రభుత్వ పాఠశాలల్లో శాసించే హక్కు లేదంటున్నారు. మతపండుగలు చేసుకోడానికి ప్రభుత్వాన్ని సెలవులు యివ్వమనడాన్ని ఆయన గర్హిస్తున్నారు. ప్రభుత్వం, మతం వేరుగా వుండాలని ఎడ్ డోయర్ తీవ్రంగా పోరాడుతున్నారు.

ఆఫ్రికా-అమెరికా మానవతావాదులు నామ్ ఏలెన్ సంపాదకత్వాన వెలువరించిన గ్రంథంలో జోరానీల్ ప్రశ్నలు ఆశ్చర్యాన్ని గొలుపుతాయి. క్రీస్తు పావులను కాపాడటానికి పుట్టి, సిలువకు గురియై పాపాత్ములను రక్షించాడు కదా! ఇంకా మనుషులను పాపులంటూ చర్చీ ఫాదరీలు ప్రచారం చేస్తారేమిటి? పాపాలు పోగొట్టలేదా క్రీస్తు అని అడుగుతున్నారు. ఈ సృష్టి అంతా దేవుడు చేస్తే, అది మార్చమని ప్రార్థనలు చేయడం మరీ పాపం కదా అంటున్నారు. దైవ నిర్ధారణ మార్చమని ప్రార్థిస్తే, దైవసృష్టిలో దోషం వున్నట్లా? ఇక భక్తుల మాటకొస్తే, నాజీలు, జాత్యహంకారవాదులు సైతం పరమభక్తులే అని గుర్తు చేస్తున్నారు. పేదలకు సేవ చేయడానికి యింత డబ్బు ఖర్చుపెట్టి అంత పెద్ద గుడులు కట్టడం దేనికని కూడా ప్రశ్నిస్తున్నారు. కుటుంబ నియంత్రణ సాధనాలను పోప్ వ్యతిరేకిస్తుండగా సెక్యులర్ ప్రభుత్వాలు ఏంచేయాలో ఆలోచించుకోవాలి.

క్రైస్తవులందరూ జీసస్, బైబిల్ ను అంగీకరిస్తున్నా, వివరాలలో ఏకాభిప్రాయం లేదు. పైగా చంపుకునేటంత భేదాభిప్రాయాలున్నాయి. మూల ప్రతినిధిని నేనే అని పోప్ అనగా కాదని మార్టీన్ లూథర్ ఎదురుతిరిగాడు. ఎవరి బైబిల్ వారు అనువదించి, వాడుతున్నారు. ఎవరి వ్యాఖ్యానం వారు చేస్తున్నారు. దైవానికీ మనిషికీ మధ్య పోప్ ఎవరు అని ప్రశ్నించిన ప్రొటెస్టంటులు క్రమేణా ఫాదరీలను తెచ్చిపెట్టుకుని గుడులు కట్టి, కరడు గట్టుకపోయిన మతవ్యాపారంలోకి దిగారు. ఇప్పుడు కేథలిక్కులు, లూథరిన్లు, ప్రొటెస్టంట్లు, బాప్టిస్టులు, మెథడిస్టులు, ఎవాంజలిస్టులు, సెవెంత్ డే ఎవాంజలిస్టులు, పెంతకోస్తులు, ప్రెస్బీటేరియన్లు, ఆంగ్లికన్లు, కాంగ్రిగేషనలిస్టులు, డిసైపుల్స్ ఆఫ్ క్రీస్తులు, యూనీటేరియన్లు ఇంకా అనేక చిన్న శాఖలున్నాయి. అందరూ ఎవరి కుంపటి వారు వెలిగించి, నిధులు వసూలుచేస్తూ, మతమార్పిడులు జరుపుతూ, ప్రభుత్వ పన్నులు మినహాయింపులతో దైవం పేరిట మానవుడి పై స్వారీ చేస్తూ, మానవ బలహీనతలపై చక్కగా వ్యాపారం చేసుకుంటున్నారు. మానవ హక్కులు అమలుపరచకుండా దైవం పేరిట అడ్డుపడుతున్న క్రైస్తవాన్ని హేతువాదులు సైన్స్ ద్వారా ఎదుర్కొంటున్నారు. సైన్స్ కూడా తమదేనని చెప్పిన క్రైస్తవులు అపహాస్యం పాలయ్యారు. అమెరికాలో 90% దైవంలో నమ్మకం వున్నవారైనా, ఫలానా దేవుడని గాని ప్రార్థిస్తే వరాలిస్తాడని గాని నమ్మకం లేనివారు 30% వున్నారట.

భవిష్యత్తు జోస్యాలతో బైబిల్ ను అడ్డం పెట్టుకొని, 2 వేల సంవత్సరంలో విశ్వం అంతమౌతుందని చెప్పే క్రైస్తవులూ వున్నారు. ఈ తేదీలు సమయానుకూలంగా మారుస్తుంటారు.

భవిష్యత్తు చెప్పగలిగిన క్రైస్తవ నాయకులు, ప్రజల నుండి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. దీనికి బదులు లాటరీ టిక్కెట్లు కొని, గెలిచే నంబర్లు తెలుసుకొని చూపితే, సులభంగా కోటీశ్వరులౌతారుగదా అని ఛార్లస్ ఫాల్కనర్ అడిగాడు. బహుశా అతీంద్రియ శక్తులతో భవిష్యత్తు చూడగలమనే వారందరికీ యీ ప్రశ్న వర్తిస్తుంది.

నమ్మకస్తులు సులభంగా మారరు. ప్రశ్నలు, చర్చలు, ఆలోచన యివన్నీ చిత్రహింసలు నమ్మకానికి బుర్ర తాకట్టు పెడితే హాయిగా వుంటుంది. అందుకే సైన్సు ఇంత పెరిగినా నమ్మకస్తులు చలనం లేకుండా సాగిపోతున్నారు. బైబిల్ కు ఆదరణ సన్నగిల్లలేదు!

- హేతువాది, ఆగస్టు 1994