అబద్ధాల వేట - నిజాల బాట/బాబాలు - ఆశ్రమాలు - ఆస్తులు

వికీసోర్స్ నుండి
బాబాలు - ఆశ్రమాలు - ఆస్తులు

ఆశ్రమాలకు ఆస్తులకూ చాలా దగ్గర సంబంధం వుంది. దేశంలో బాబాలు, మాతలు, సన్యాసులు, స్వాములు భక్తపేరిట, ఆధ్యాత్మికత పేరిట ఆస్తులు కూడగట్టారు. ఆస్తులు కాపాడుకోడానికి ఆస్తి పన్ను మినహాయింపు తెచ్చుకున్నారు. మతం, ధార్మికత, మొదలైనమాటల చాటున ప్రభుత్వాలు ఆస్తి పన్ను మినహాయిస్తున్నాయి. ఆదాయం వచ్చే ఆశ్రమాలకు ఆకర్షణ ఎక్కువ. అక్కడ కూడా బాబాలకు,ఆదాయం పన్ను మినహాయిస్తున్నారు.

మతం పేరిట పన్నులు మినహాయింపు తెచ్చుకోడం వివిధ దేశాలలో యించుమించు అన్ని మతాలకూ వున్నది.

పౌరులందరినీ చట్టరీత్యా సమానంగా చూడాల్సిన ప్రభుత్వం నేరాలు, ఫోర్జరీ చేసిన బాబాలకు మినహాయింపులిస్తున్నది. పోలీస్ అధికారులు, న్యాయమూర్తులు, మంత్రులు,రాష్టపతులు, గవర్నర్లు, సంపన్న వాణిజ్య వేత్తలు వివిధ కారణాలతో వివిధ బాబాలకు భక్తులుగా పబ్లిక్ గా ప్రదర్శించడం, ఆయా ఆశ్రమాధిపతులకు గిట్టుబాటుగా వుంది.

ఇటీవల దత్తభగవాన్ అనే బాబాను హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. కాళీబాబా ఆశ్రమంపై బాంబులు పడ్డాయి. సత్యసాయిబాబా పుట్టపర్తి ఆశ్రమంలో నాలుగుహత్యలు జరిగాయి. రాజమండ్రి వద్ద గోదావరి ఒడ్డున సుందర చైతన్యస్వామి ఆస్తులపై వివాదం వుంది. ముస్లింల వక్ఫ్ బోర్డులు ఆస్తులపై కావలసినన్ని నిందారోపణలున్నాయి క్రైస్తవుల చర్చీల ఆస్తుల కలహాలు కోకొల్లలు.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని ఆశ్రమాలున్నాయి? ఆ ఆశ్రమాలలో ఎలాంటి స్థిరాస్తులు చరాస్తులున్నాయి? ఆశ్రమాధినేతలు ఎవరు? వారి పూర్వపరాలేమిటి? ఈ విషయమై పూర్తి రికార్డు ప్రభుత్వం వద్ద వుందా?

ఆధ్యాత్మిక చింతన వీధినపడింది. ఆశ్రమాలు,బాబాలు,మాతలు, విచ్చలవిడిగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. మతం రాజకీయాల్లో బాగా ప్రవేశించింది. నగరాలలో గ్రామాలలో ట్రాఫిక్ అడ్డంగా కొత్త దేవుళ్ళను సృష్టించి కొంగ్రొత్త దేవాలయాలను, మసీదులను, గుడులను కట్టేస్తున్నారు.

సుప్రీంకోర్టు వద్దన్నా వినకుండా మైకుల రూపంలో శబ్దకాలుష్యం సృష్టించి, భక్తిని బజార్లో పెడుతున్నారు. భక్తివ్యాపారం బాగా సాగిపోతున్నది.

సాంకేతిక శాస్త్రీయ రంగాలలో ముందుకు పోతున్న సమాజాన్ని, సామాజిక రంగంలో మతంపేరిట వెనక్కు నడిపిస్తున్నారు. విగ్రహారాధన వద్దన్న రామమోహన్ రాయ్, వీరేశలింగం గార్లను మరచిపోయి, కొత్త విగ్రహాలు పెడుతున్నారు.

విదేశాలకు భక్తిని ఎగుమతి చేస్తున్న బాబాలు పరుపు తీసేస్తున్నారు. అయినా ఒక బాబా మోసాన్ని బట్టబయలు చేసినప్పుడు, జనం మరో బాబాని వెదక్కుంటున్నారు. అంతేగాని, కొంచెం తేడాతో అందరు బాబాలూ ఒకే మూసలోని వారేనని గ్రహించడం లేదు.

రజనీష్, మహేష్ యోగి అమెరికాలో ఆస్తులు విపరీతంగా సంపాదించి, అక్కడి సమాజం చీదరించుకోగా పారిపోవాల్సి వచ్చింది. అలాగే చంద్రస్వామి, ధీరేంద్ర బ్రహ్మచారి వగైరాల గొడవలు బయటపడ్డాయి. రామకృష్ణమఠం, షిర్డిసాయిమఠం, అయప్పకేంద్రం, తిరుపతి దేవస్థానం అవినీతి పనులు ఎన్నోసార్లు బయటపడుతూ వచ్చాయి. తిరుపతిలో గుండు చేయించుకుంటే తిరిగి జుట్టురాదంటే చాలామంది చేయించుకోరని ఒకరు చమత్కరించారు. ఏమైనా మతవ్యాపారానికి చిన్న పిల్లల్ని సైతం చిత్రహింసల పాలు చేస్తున్నారు.

ఇదీనేడు జరుగుతున్న తంతు! చిన్నతనం నుండి తల్లిదండ్రులు, పంతుళ్ళు, పురోహితులు మతమూఢనమ్మకాల్ని నూరిపోయడం వలన, శాస్త్రజ్ఞులుగా తయారైనవారు సైతం చిన్నతనం ప్రభావం నుండి ఒక పట్టాన బయట పడలేకపోతున్నారు.

నేడు ప్రభుత్వం బాహాటంగా బాబాలను, సన్యాసులను, యోగులను ప్రోత్సహిస్తున్నది.

సమాజంను నిర్వీర్యం చేస్తున్నది యీ బాబాలే. ఆలోచన చంపేయాలని యోగ పద్దతులను చిత్రవిచిత్రాలుగా ప్రచారం చేస్తున్నది యీ మతాలవారే. సన్యాసులు ఎంత ఎక్కువైతే సమాజం అంతటా క్షీణిస్తుంది. మూఢనమ్మకాలకు నిలయం యీ సన్యాసి ఆశ్రమాలు.

ప్రభుత్వం తక్షణమే యీ ఆశ్రమ వివరాలన్నీ సంపూర్ణంగా సేకరించాలి. ఆశ్రమాలకు ఆస్తి పన్ను, ఆదాయం పన్ను మినహాయింపులు యివ్వరాదు. నేరాల నుండి ఆశ్రమాలకు భద్రత కల్పించరాదు. మతాన్ని ప్రభుత్వాన్ని వేరుచేయాలి. భక్తివుంటే అది ప్రైవేట్ విషయంగానే తప్ప ప్రదర్శనకు పెట్టరాదు. ఇప్పటికే ఆశ్రమాలు, బాబాలు చాల సంఘద్రోహం చేశాయి. ఇప్పటికైనా అడ్డుకట్ట వేయకపోతే మనం ముందుకు పోలేం.

- హేతువాది, జూన్ 2001