అబద్ధాల వేట - నిజాల బాట/ఇంద్రియాతీత శక్తులు-1

వికీసోర్స్ నుండి
ఇంద్రియాతీత శక్తులు-1

ఒక మనిషి మరో మనిషి మనస్సులోని ఆలోచనను చెప్పగలగడం ఒక విశేష శక్తిగా పేర్కొంటారు. అమెరికాలో ఒకరుంటారు-ఇండియాలో మరో వ్యక్తి వుంటాడు. వారిరువురూ ఫోను సైతం చేసుకోరు. అయినా ఇండియాలో వున్న వ్యక్తి ఒకానొక సమయంలో ఏమి ఆలోచిస్తున్నాడో అదే సమయంలో అ విషయాన్ని అమెరికాలో వున్న వ్యక్తి చెబుతాడు. తరువాత పరిశీలీంచిన వారికి యిది అద్భుతంగా ఇంద్రియాతీతశక్తిగా కనిపిస్తుంది. ఇలాంటి ప్రక్రియకు టెలిపతి (Telepathy) అని పేరు పెట్టారు. మరికొందరు యీ టెలిపతి శక్తి ద్వారా మరో వ్యక్తి యిష్టానికి వ్యతిరేకంగాను పనిచేయించగలడంటారు.

టెలిపతి అనేది సాధ్యమా కాదా అనే చర్చ సాగుతున్నది. కార్ల్ యూంగ్ (Carl Jung) వంటివారు దీనికి శాస్త్రీయ గౌరవాన్ని తెచ్చిపెట్టే ప్రయత్నం చేశారు. జె.బి.రైన్ వంటివారు డ్యూక్ యూనివర్శిటీలో (అమెరికా) పరిశోధనలు చేసి ఫలితం కోసం తిప్పలు పడ్డారు. సోవియట్ యూనియన్ లో పరిశీలన తీవ్రస్థాయిలో జరిపారు. అయినా ఇంతవరకూ శాస్త్రీయ నిర్ధారణకు నిలిచే ప్రయోగం తేల్చలేదు. దూరాన వున్న మనుషుల్ని,వస్తువుల్ని తాకకుండానే ప్రభావితం చేయడం, మనస్సు బలంతో వస్తువుల్ని కదల్చడం, మొదలైన చర్యలు చేయవచ్చునని కొందరు భావించారు. ప్రదర్శనలు చేశారు. ఇలాంటి శక్తికి సైకోకెనిసిస్ అని పేరు పెట్టారు. ఇజ్రాయిల్ కు చెందిన యూరిగెల్లర్ చెంచాలని వంచడం, గాలిలో నుండి వస్తువుల్ని సృష్టించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అదంతా అతీంద్రియ శక్తిగా గెల్లర్ చాటుకున్నాడు. జోసెఫ్ బి.రైన్ కూడా సైకో కెనిసిస్ పై ప్రయోగాలు ఎన్నో చేశాడు. గైగర్ కౌంటర్ పరిశోధనలు జరిపాడు. రేడియో యాక్టివిటి విచ్ఛిన్నత ఆధారంగా ప్రయోగాలు ఎన్నో చూచాడు. ప్రిన్స్ తన్ యూనివర్శిటీ (అమెరికా)లో రాబర్ట్ జాన్ చాలా ప్రయోగాలు చేశాడు.

ఇంతవరకూ టెలిపతిలోగాని, సైకోకెనిసిస్ లోగాని శాస్త్రీయ పరిశోధనకు నిలిచేవి కనిపించలేదు.

గుర్రపు పందాలలో ఎవరు గెలుస్తారు,లాటరీ టిక్కెట్టులో దేనికి ప్రథమగెలుపు దక్కుతుంది అనేవి యీ శక్తుల ద్వారా ఎందుకు చెప్పలేకపోతున్నారనే విమర్శకు సమాధానం రావడం లేదు. అయినా నమ్మకస్తులు మొండిగా వీటిని ప్రచారం చేస్తూనే వున్నారు. టెలిపతి ప్రకారం ఒక వ్యక్తి ఎలాంటి ఆధారాలు లేకుండానే మరో వ్యక్తి మెదడులో ఆలోచనలు గ్రహించగలిగితే,మెదడు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. మనిషి మెదడులో సుమారు పది బిలియన్ల కణాలున్నాయి. వీటి పరస్పర సంబంధాలు జటిలంగా వుంటాయి. ఆలోచనలు, ఉద్వేగాలు, నిర్ణయాలు అన్నీ మెదడులో జనించి, ప్రసరిస్తాయి. ఈ కణాలు న్యూరాన్స్(Newrones) యాగ్జాన్స్(Axons) కు అతిచేరువగా వుంటాయి. కణాలిచ్చే సంకేతాలను యాగ్జాన్లు క్షణంలో మరోచోటకు చేరుస్తాయి. ఇదంతా విద్యుత్తు రసాయనిక చర్యగా సాగిపోతుంటుంది. న్యూరాన్ల మధ్య సంబంధాలకు అయోన్లు అనే అణువులు ఉపకరిస్తాయి. మెదడులో జరిగే యీ ఆలోచనా ప్రక్రియ మరో మెదడుకు తెలియాలంటే సంకేతాలు ఏదొక విధంగా బయట పడాలన్నమాట. టెలిపతి ప్రకారం ఆ సంకేతాలను గ్రహించిన వ్యక్తి, వాటి భావాన్ని బయటపెడతాడు. టెలిపతి ప్రకారం అవతల వ్యక్తి మెదడులో సంకేతాలను ఎలాగో తెలుసుకోవడమేగాక వాటి అర్థాన్ని విప్పి చెప్పగలగాలి. మెదడులో భిన్న భాగాలు భిన్న పనులు నిర్వహిస్తుండగా, టెలిపతి ప్రకారం వీటిని స్వీకరించడమేగాక,సమన్వయీకరించి, అర్థం చెప్పాలి కూడా. ఇది సాధ్యమా?

కొందరు పేరా సైకాలజిష్టులు యీ జటిల సమస్యలోని చిక్కుముడి విప్పడానికి ఒక పరిష్కారం కనుగొన్నారు. మెదడు నుండి సిట్రాన్స్ అనే కణాలు వస్తాయని(psitrons) వీటికి సాంద్రత, శక్తి వుండదనీ అన్నారు. క్వాంటం సిద్ధాంతం చెప్పే న్యూట్రినో(Neutrino) వంటివే సిట్రాన్లు అని సామ్యం చూపారు. కార్ల్ యూంగ్ వంటి సైకాలజిష్టులు యీ విషయంలో కోవు వేసుకున్నారు. సిట్రాన్ల సహాయంతో ఇతర మనస్సులలో జరిగే ప్రక్రియను తెలుసుకుంటున్నారన్నారు.

క్వాంటం ఫిజిక్స్ లో న్యూట్రినోలు అంచనాలకు,పరిశోధనలకు అందాయి. ఫలితాలు వచ్చాయి.

టెలిపతి చెప్పే సిట్రాన్ల వునికి యింత వరకు నిర్ధరణ కాలేదు. అదే ప్రధానమైన తేడా.

మెదడుపై ఆధినిక శాస్త్రం చేసిన పరిశోధనలు యింకా కొనసాగుతుండగా, యిప్పటి వరకూ తెలిసిన విషయాలు కొన్ని అంశాలని బయటపెట్టాయి.

మెదడు పనిచేసే తీరులో నాలుగు విధాలైన తరంగాలని కనుగొన్నారు. వీటిని గ్రహించడానికి ఎలక్ట్రో ఎన్ సిఫలో గ్రాఫ్ (EEG)తోడ్పడుతుంది.

ప్రతి సెకండ్ కూ మెదడులోని వివిధ తరంగ ప్రకంపనాల ప్రసారాలు భిన్న తీరుల్లో వుంటాయి.

మెదడు విశ్రాంతిగా ఉన్నప్పుడు అల్ఫా తరంగాలు జనిస్తాయి.(Alpha rhymes)

మెదడు చురుకుగా పనిచేస్తుండగా బీటా(Beta) తరంగాలు ప్రకంపిస్తాయి.

నిద్రలో మెదడు డెల్టా తరంగాలను విడుదల చేస్తుంది.

గాఢనిద్రలో తీటా(Theta) తరంగాలు వస్తాయి.

ఈ తరంగాలన్నీ సెకండుకు ప్రసరించే వేగాలలో మార్పు వుండగా, ఇఇజి పరికరం వాటిని చూపగలుగుతుంది. ఇవన్నీ వైద్యరంగానికి బాగా తీడ్పడతాయి. మూర్ఛరోగులకు చికిత్స యివి సహకరించాయి. టెలిపతిలో పనిచేసే తీరు వివరించడానికి యీ పరికరం వాడిన(EEG)వారు, ఫలితాలను సాధించలేకపోయారు. సందేహవాదుల సమక్షంలో టెలిపతి పనిచేయదని మరికొందరు వాదించారు!

టెలిపతి రుజువు పరచడానికి చేసిన ప్రయత్నాలలో భాగంగా ఇంగ్లండ్ ఆర్థర్ కోస్లర్ 1985లో ఎడిన్ బర్గ్ యూనివర్శిటీలో ఒక కేంద్రం నెలకొల్పారు.

ఎక్కడైనా ఒక విద్యార్థి అనూహ్య ప్రతిభను చూపినప్పుడు అదంతా టెలిపతి వల్లనే అనడం ఆనవాయితీ అయింది. ఎక్కడా టెలిపతి శాస్త్రీయ పరిశోధనకు నిలవలేదు.

సైకో కెనిసిస్ వాదులు రేడియో సంకేతాల సామ్యం చూపుతూ,అలాంటి "ఆలోచనా సంకేతాలు" దూరానవున్న వస్తువులపై ప్రభావం చూపుతాయన్నారు. రేడియో సిగ్నల్స్ సమాచారాన్నందిస్తాయి. వాటి వలన వస్తువులు కదలవు,చెంచాలు వంగవు. విద్యుదయస్కాంత రేడియేషన్ వంటిది ఆలోచనా తరంగాలలో వుంటే, అదెక్కడా రుజువుకు నిలబడలేదు. రుజువుకు అతీతమైనదని టెలికెనిసిస్ వాదులు అంటే అది వారి మూఢ నమ్మకాన్ని సూచిస్తుంది.

పేరా సైకాలజీ నిపుణుడుగా పేరొందిన జె.బి.రైన్ అమెరికాలోని నార్త్ కెరోలైనా రాష్ట్ర డ్యూక్ యూనివర్శిటీలో 1930 నాటికి ఒక శాఖను స్థాపించాడు. శాస్త్రీయ పద్ధతిలో పరిశోధనలు చేసి,పేరా సైకాలజీకి గౌరవాన్ని ఆపాదించే ప్రయత్నంలో ఆయన వేలాది పరిశోధనలు చేశాడు. అందులో పేక ముక్కల వంటి కార్డులను ప్రయోగించి,కార్డులలో ఏముందో ఎటువైపు అవి కనిపిస్తాయో అనే అంశం పరిశీలించాడు. అలాగే చదరంగంలో పావులు కూడా వినియోగించాడు. నాణాలు ఎగరవేస్తే తల,తోక(బొమ్మబొరుసు) ఎటుపడతాయో లెక్కలు కట్టాడు.

1934లో లాంగ్ మూర్ అనే నోబెల్ ఫ్రైజ్ గ్రహీత వెళ్ళి జె.బి.రైన్ పరిశోధనల్ని శ్రద్ధగా తిలకించాడు. పరిశీలకులు తమను తామే వంచించుకుంటున్నారని, లేని వాటికోసం వెతుకుతున్నారని,అదంతా దయనీయమైన స్థితిగా వున్నదని అన్నాడు. తన అభిప్రాయాన్ని జె.బి.రైన్ కు చెబితే, అతడు ఆశ్చర్యపడక పోగా, ఇర్వింగ్ లాంగ్ మూర్ అభిప్రాయాల్ని బయటపెట్టమని కోరాడు. తద్వారా తనకు ప్రచారం లభిస్తుందన్నాడు.

జె.బి.రైన్ తన పరిశోధనలలో పాల్గొన్న వారు కొందరు కావాలని తప్పుడు అంచనాలు వేస్తున్నా,వాటిని రైన్ బయట పెట్టకుండా దాచినట్లు లాంగ్ మూర్ కనుగొన్నాడు. తనంటే యిష్టం లేనివారు అలా తప్పుడు అంచనాలు వేశారు గనుక వారి లెక్కల్ని చేర్చలేదని రైన్ అన్నాడు. తప్పుడు అంచనాలు వేస్తున్నారని రైన్ కు ఎలా తెలుసు? లెక్కల్లో కొన్ని మరీ తక్కువ అంచనాలు చూపడమే.

లాంగ్ మూర్ అనే సైంటిస్టు పేరా సైకాలజీలో ఆసక్తి కనబరచాడనే ప్రచారం చేశారు తప్ప, అతను ఖండించిన రైన్ పరిశోధనల్ని బయట పెట్టలేదు? నెవాడ యూనివర్శిటీలో పేరా సైకాలజిస్టు డీన్ రాడిన్ పరిశోధనలు చేబట్టి, ఒకానొక వ్యక్తికి చెమట పోసే రీతులలో ఉద్వేగ స్థాయిని కొలవ వచ్చునన్నాడు. కంప్యూటర్ ముందు ఒక వ్యక్తిని కూర్చోబెట్టి కొన్ని గందరగోళపరచే బొమ్మల వలన ఎలా వూహలు మారతాయో చూడవచ్చునన్నాడు. అంతటితో ఆగక, రానున్న బొమ్మను వ్యక్తి వూహించడం ద్వారా అతడిలో ఉద్వేగాలు మారతాయన్నాడు. కొందరు ముందే ఎలాంటి బొమ్మ రానున్నదో సరిగా చెప్పగలుగుతారన్నాడు.

అమెరికాలో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ 1987 లో పేరా సైకాలజీని క్షుణ్ణంగా పరిశీలించి, 130 సంవత్సరాల పరిశోధనలలో ఎలాంటి శాస్త్రీయ నిర్ధారణ జరగలేదని స్పష్టం చేశారు.

న్యూజెర్సీలోని ప్రిన్స్ టన్ యూనివర్శిటీలో రాబర్ట్ జాన్ పేరా సైకాలజీ పరిశోధనలు చేశారు.

ఒక బల్ల ముందు గైలిన్ (Guillen) కూర్చొని, ఒక బొమ్మ కప్పను తన మనోబలంతో తన దగ్గరకు రప్పించాలని ప్రయత్నించాడు. దూరంగా జరిగినప్పుడు మనోబలం తీవ్రంగా లేనట్లు, సమీపంగా వచ్చినప్పుడు మనోబలంతోనే అది చెంతకు వచ్చినట్లు పేర్కొన్నారు. సైకోకెనిసిస్, వస్తువులపై మనోబలం చూపే విధానానికి యిదొక నిదర్శన అని చూపదలచారు. అలాగే నీళ్ళ పంపులలో నీటిచుక్కలపై మనోబలం గురించి పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో పాల్గొనే అసిస్టెంట్లు చాలా సందర్భాలలో తమ "బాస్" ల తృప్తి కోసం అనుకూల ఫలితాలు చూపినట్లు బయటపడింది.

లాంగ్ మూర్ యీ పేరా సైకాలజీని పేథలాజికల్ సైన్స్ గా చిత్రించారు.

పేరా సైకాలజి ఒక ఫాషన్ గా,అంటువ్యాధిలా వ్యాపించింది. దీనికి సైంటిఫిక్ ముసుగు తొడిగి గౌరవం ఆపాదించాలనే ప్రయత్నంలో కోట్లాది ధనం వెచ్చించి,వృధా ప్రయాసకు గురి అయ్యారు. ఫలితాలు మాత్రం శూన్యం.

పేరా సైకాలజీ చరిత్ర

తొలుత పేరా సైకాలజీలో అనేకాంశాలు పరిశీలనలోకి స్వీకరించారు. దూరదృష్టి, దూరశ్రవణం, భవిష్యత్తును చెప్పడం,మనోబలంతో వస్తువుల్ని కదిలించడం, దయ్యాలు, భూతాలు,ఆత్మలు, పునర్జన్మ, గాలిలో తేలడం, మనోశక్తితో ఇతరుల మనస్సులలో ఆలోచనలు గ్రహించడం యిత్యాదులన్నీ చేర్చారు. ఇలాంటివి అన్ని సమాజాలలో పూర్వకాలం నుండి వున్నాయి. యూరోప్ లో ఆధ్యాత్మికత పేరిట అధ్యయనాలు బాగా సాగాయి. కొందరు తమ వృత్తులు సైతం వదలి,అదే పనిగా ఇంద్రియాతీతశక్తులపై దృష్టి సారించారు. మొట్టమొదటగా 1882లో సైకిక్ పరిశోధనాకేంద్రాన్ని లండన్ లో ప్రారంభించారు. వీరి పరిధిలో శక్తులు, ఆత్మలు, పూనకాలు, దయ్యాలు,భూతాలు,మనస్సుల మధ్య సంబంధాలు వుండేవి. కేంబ్రిడ్జి తాత్వికుడు హెన్రి సిడ్జిలిక్ యీ సైకిక్ రీసెర్చి సంఘానికి అధిపతిగా వ్యవహరించాడు. అందులో 13 మంది ఆధ్మాత్మిక వాదులు,ఆరుగురు పరిశోధకులు వుండేవారు. పరిశీలన అంతా ఆ ఆరుగురు మాత్రమే చేస్తుండగా ఆధ్మాత్మికవాదులు ఒక్కరొక్కరే తప్పుకున్నారు. 1887 నాటికి కొందరు సుప్రసిద్ధులు యీ సంఘంలో చేరారు. సర్ ఆలివర్ లాడ్జి, లార్డ్ రాలి,జె.జె.థాంసన్ లు సైకిక్ రీసెర్చి సంఘంలో ఆసక్తిగా పాల్గొన్నారు. ఆత్మకు శాస్త్రీయ గౌరవం ఆపాదించాలని యీ సంఘం ప్రయత్నించింది. వ్యక్తికి భౌతికేతర అంశం కూడా చాలా ప్రధానం అని వీరు తలచారు. అయితే వీరు,టెలిపతితో బాటు, దృశ్యాలు కనబడడంతో సహా అనేకాంశాలు పరిశీలనలోకి స్వీకరించారు. మనస్సును గ్రహించడం, టెలిపతి శక్తుల గురించి దృష్టి బాగా కేంద్రీకరించారు. అనేక శక్తులు సరైనవేనని వీరు నమ్మారు. సర్ ఆలివర్ లాడ్జి తన కీర్తిశేషుడైన కుమారునితో మాట్లాడినట్లు చెప్పుకున్నాడు.

ఈ సంఘం వారిలో కొందరు ఆత్మల పరిశీలనాంశాలలో మోసాలు జరిగినట్లు ఒప్పుకున్నారు.

చేతులు వాటంతట అవే రాస్తూ పోవడం ఒక శక్తిగా యీ సంఘం నమ్మింది. అవన్నీ ఆధ్యాత్మిక రంగానికి అంటగట్టారు.

ఇంగ్లండ్ లో సైకిక్ రీసెర్చి ప్రారంభించిన తరువాత, 1985లో అలాంటి సంఘాన్ని అమెరికాలోని బోస్టన్ లోనూ మొదలెట్టారు. సుప్రసిద్ధ సైకాలజిష్టు విలియం జేమ్స్ యిందులో పాల్గొన్నాడు. కాని ఆధ్యాత్మిక శక్తులలో వీరికి పూర్తి నమ్మకం లేక, కొన్ని కలహాలు తలెత్తాయి. సంఘం చీలింది. ఉత్తరోత్తరా సైకాలజిస్టు విలియం మెగ్డోగల్ మరికొందరు సంఘాన్ని పునరుద్ధరించారు.

సైకిక్ సంఘం కలగాపులగంగా మారడంతో,పేరా సైకాలజీని విడదీసి,శాస్త్రీయ గౌరవం ఆపాదించే నిమిత్తం జోసెఫ్ బాంక్స్ రైన్ ప్రయత్నించాడు.

సైకికల్ రీసెర్చి స్థానే పేరా సైకాలజీని 1930 నుండీ జె.బి.రైన్ ప్రచారంలోకి తెచ్చాడు. పరిశోధనాలయాలలో శాస్త్రీయ పరిశీలన చేసి పేరా సైకాలజీని సైన్స్ లో భాగంగా చేయాలని రైన్ కృషి చేశాడు. ది జర్నల్ ఆఫ్ పేరా సైకాలజీ అనే పత్రిక ప్రారంభించాడు. అంతకు ముందు జర్నల్ ఆఫ్ సైకికల్ రీసెర్చి పత్రిక ఇంగ్లండు నుండి వెలువడుతూ దయ్యాలు,పూనకాలతో సహా అన్ని అంశాలు ప్రచురించింది.

ప్రపంచ వ్యాప్తంగా పరిశోధకులు పేరా సైకాలజీకి శాస్త్రీయ గౌరవం తెచ్చే ప్రయత్నంలో నిమగ్నులయ్యారు. అమెరికన్ సైంటిఫిక్ సొసైటీలో సభ్యులుగా పేరా సైకాలజిస్టులు చేరడం గమనార్హం. పరిశోధనాంశాలు ప్రమాణ పత్రికలో ప్రచురించారు. అయితే పేరా సైకాలజీ 4 ప్రధానాంశాలకే పరిమితమై మిగిలిన వాటిని మూఢ నమ్మకాలుగా తృణీకరించింది. ఇది గ్రహించవలసిన అంశం.

టెలిపతి

పేరా సైకాలజీలో అత్యంత ప్రధానాంశంగా టెలిపతి వున్నది. ఏ ఆధారం లేకుండానే ఇతరుల మనస్సులలోని విషయాలు గ్రహించి చెప్పగలగడం యిందులో విశేషం.

దూరదృష్టి రెండో పరిశీలనాంశంగా టెలిపతి స్వీకరించింది. వస్తువులు ఎక్కడ వున్నాయో గ్రహించడం,ఇతరుల రోగాల గురించి తెలుసుకోవడం, ఇందుకుగాను తెలిసిన ఆధారాలేవీ వుండక పోవడం యిందలి ఆశ్చర్యకర అంశం.

భవిష్యత్తును చెప్పడం, ఉపద్రవాలను హెచ్చరించగలగడం మరో అంశం.

మనోబలంతో వస్తువుల్ని కదలించడం,వాటిపై వివిధ రీతులలో ప్రభావాన్ని చూపడాన్ని సైకో కెనిసిస్ అంటారు. పేరా సైకాలజీ దీనిని కూడా తన పరిధిలోకి స్వీకరించింది. అయితే కేవలం మనో శాస్త్రానికో, భౌతికశాస్త్రాలకో పరిమితం కానందున దీనిని పేరా సైకాలజీ అంటున్నారు. కొంతమేరకు శాస్త్రీయ పరిశోధనని తీసుకొని, మిగిలిన శక్తులు కూడా వున్నాయనడం యీ పేరా సైకాలజీ ప్రత్యేకత. జ్యోతిష్యం, ఎగిరే పళ్ళాలు, స్పటికాల ప్రభావం మొదలైనవి పేరా సైకాలజీ స్వీకరించలేదు.

1957లో పేరా సైకాలజీకల్ అసోసియేషన్ ఏర్పడి, వార్షిక సమావేశాలు జరుపుతూ,పరిశోధనా ఫలితాలను చర్చిస్తూ పోతున్నది. అవన్నీ వివిధ పెరా సైకాలజీ పత్రికలు ప్రచురిస్తున్నాయి.

- మిసిమి మాసపత్రిక. ఫిబ్రవరి-2001