అబద్ధాల వేట - నిజాల బాట/ఇంద్రియాతీత శక్తులు-2

వికీసోర్స్ నుండి
ఇంద్రియాతీత శక్తులు-2

1969లో విజ్ఞానాభివృద్దికి ఏర్పడిన అమెరికా సైన్సు సొసైటీ వారు పేరాసైకలాజికల్ అసోసియేషన్ కు అనుబంధ సభ్యత్వం ప్రసాదించారు. హ్యూమనిస్ట్,కాగ్నిటివ్ సైకాలజి శాఖలు బయలుదేరి మోహనిద్ర, కలలు,ధ్యానం, తెచ్చిపెట్టుకునే విశ్రాంతి యిత్యాదులను అధ్యయనం చేశాయి. హెల్మెట్ షిమిట్(Helmet Schmidt)కృషి ఫలితంగా అతీంద్రియశక్తుల పరిశోధనలలో పాతపావుల, కార్డుల పద్ధతుల స్థానే ఎలక్ట్రానిక్ పరికరాలు వినియోగించారు. 1985లో ఇంగ్లండ్ లో ఆర్థర్ కోస్లర్ పీఠాన్ని స్థాపించి పేరా సైకాలజీ అధ్యయనం ఎడిన్ బరో యూనివర్శిటీ ఆరంభించింది.సమన్వయ పేరా సైకాలజీ పేరిట పీఠాధిపతి రాబర్ట్ మోరిస్ కొత్త ప్రతిపాదనలు తెచ్చాడు. పరిశోధకులు కొందరు పి.హెచ్.డి.లు తీసుకున్నరు. ఇతర శాఖలతో సమంవయం,

శాస్త్రీయ పద్ధతులు కొత్త ప్రతిపాదనలలో చోటుచేసుకున్నాయి. రానురాను అమెరికాలోని డ్యూక్ యూనివర్శిటీ, ఇంగ్లండ్ లోని ఎడిన్ బరో యూనివర్శిటీ కూడా కొన్ని పేరా సైకాలజీ కేంద్రాల్ని మూసేయడం గుర్తించాలి. జె.బి.రైన్ అతని భార్య కూడా పేరా సైకాలజీ రీసెర్చి పేరిట దొంగనివేదికలు,లెక్కల మోసాలు జరిగినట్లు గుర్తించారు. కొన్నాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా వుంచినా చివరకు వారు భరించ లేక నిజాలు బయటపెట్టారు. పేరా సైకాలజీకి ఎదురుదెబ్బ తగిలింది. పేరా సైకాలజీ పరిశోధనలలో పాల్గొనే వ్యక్తులు తమకూ బయట ప్రపంచానికీ గల సంబంధాలను వివరించడంలో అనేక భ్రాంతులకు, దోషాలకు గురౌతున్నట్లు తెలిసింది. వీటిని నివారించి, పరిశోధించడానికిగాను,కొన్ని జాగ్రత్తలు వహిస్తున్నారు. తలవని తలంపుగా వచ్చిన అనుభవాలను రికార్డు చేసుకోవడం ఒక ముఖ్యదశగా వుంది. వ్యక్తి ఆలోచనలు, అనుభూతులు వెల్లడించినప్పుడు, వాటికి అనుగుణంగా బయట జరిగిన వాటిని జోడించి చూచుకోవడం యిందులో ప్రధానాంశం. వ్యక్తుల అనుభవాలను,జరిగిన సంఘటనలను క్షుణ్ణంగా పరిశీలించడం రెండో దశ. మూడోస్థాయిలో వ్యక్తుల అనుభవాలను, వారుచెప్పేవాటిని, తదనుగుణంగా బయట జరిగినట్లు చెప్పేవాటిని, పరిశోధనాలయంలో నిశిత పరిశీలనకు గురిచేస్తున్నారు. సైన్స్ లో అన్వయించే పంథాలను పాటించడాన్ని, కంట్రోల్డ్ పరిశోధన అంటున్నారు.

ఇలాంటి పరిశోధనలు జరిపినప్పుడు పేరా సైకాలజి కొన్ని సమస్యల చిక్కులో పడక తప్పడంలేదు. ఒక వ్యక్తి తన అతీంద్రియ శక్తితో రెండో వ్యక్తి శరీరాన్ని ప్రభావితం చేశాడనుకుందాం. మొదటి వ్యక్తి దృష్టిలో అది సైకొకెనిసిస్ అయితే, రెండో వ్యక్తికి అది టెలిపతి అవుతుందా? అతీంద్రియ శక్తితో దూరాన వున్న వస్తువును కదలిస్తే, అలాంటి ప్రయోగాన్ని మళ్ళీ చేసి చూపించవచ్చా? భవిష్యత్తును ముందే చెప్పగల శక్తిని ఎలా పరిశోధనకు గురి చేస్తారు? ఇలాంటి ప్రశ్నలు చిక్కు సమస్యలుగా పేరా సైకాలజీలో మిగిలిపోతున్నాయి.

అతీంద్రియశక్తి వుంటే,శరీరంలో అది అంతర్గతంగా యిమడ్చగల అవకాశం వుందా? వుంటే పరిణామంలో మనుషులకు ఎంతో ప్రయోజనకారి అవుతుంది గదా. అతీంద్రియ శక్తి కావాలని పెంపొందించుకోవచ్చా?

అతీంద్రియ శక్తికొన్ని సార్లే పనిచేయడం, బయట పడడం,మిగతా సమయాల్లో పనిచేయకపోవడం జరుగుతుందా? ఎందుకని? అన్ని సమయాల్లోనూ అతీంద్రియశక్తితో వస్తువులపై ప్రభావం చూపెట్టలేకపోడానికి కారణాలు ఏమిటి? ఇలాంటి సందేహాలు,ప్రశ్నలు తలెత్తాయి. సమాధానం రావలసి ఉంది.

సైకొకెనెసిన్(మనో శక్తితో వస్తువుల కదలిక)

పేరా సైకాలజీలో మనోశక్తితో దూరానవున్న వస్తువులపై వివిధ విధాల ప్రభావం చూపెట్టడం ఒక ప్రధానాంశంగా ప్రచారంలో వుంది. ఇందులో పెద్ద వస్తువులు, సూక్ష్మపదార్థాలపై ప్రభావం అని విడదీసిచెబుతున్నారు. పెద్ద వస్తువులపై ప్రభావం అంటే, బల్లను గాలిలోకి లేవనెత్తడం, చెంచాలను వంచడం మొదలైనవి ఉదాహరణలుగా చెపారు. సూక్ష్మంగా వస్తువులపై ప్రభావం చూపడం అంటే పావులు ఎగరేసి,నాణాలు విసిరేసి,బొమ్మ బొరుసు కావాలనుకున్న తీరులో వచ్చేటట్లు చేయడమన్నమాట. ఛాన్స్ పద్ధతిలో వచ్చే అంచనాకు విరుద్ధంగా ఎక్కువ సార్లు మనోశక్తి ఎలా కావాలనుకుంటే అలా వస్తుందని ప్రచారం చేశారు.

రోగులను మనోశక్తితో నయం చేయడం కూడా సైకొకెనిసిస్ తన శక్తిగా చూపుతున్నది. వీటన్నిటినీ ఆయా సందర్భాలలో పరీక్షకు గురిచేశారు. యూరిగెల్లర్ చేసిన కొన్ని పనులు,స్పూన్ వంచడం వంటివి జేమ్స్ రాండి 1982లోనే చూపాడు. మరికొన్ని శక్తులు,ముఖ్యంగా రోగాలు నయం చేసే అంశాలలో మోసాలు,కప్పి పుచ్చడాలు బయటపడ్డాయి. హెల్మట్ షిమిట్ వంటి వారి పరిశోధనలలో తీవ్రలోపాలని సి.ఇ.ఎం.హాన్సల్ (C.E.M Hansel)చూసి, మూలపద్ధతిలోనే దోషాలు వున్నట్లు వెల్లడించారు. కొందరు పేరా సైకాలజిస్టులు చిత్తశుద్ధితో శాస్త్రీయ పద్ధతిలో ప్రయోగాలు చేసి రుజువులకై తిప్పలు పడుతున్న మాట వాస్తవం. కాని వారికి అడుగడుగునా తీవ్ర ప్రతిబంధాలు ఎదురౌతూనే వున్నాయి.

పళ్ళాలు,చెంచాలు యిత్యాది వస్తువుల్ని వంచడం, తుంచడం, వంటివి శక్తులుగా చూపిన ఉదంతంపై పరిశోధన జరిగింది. 160 గంటల పరిశీలనను ఆల్పా ప్రాజెక్టు అన్నారు. సైకిక్ రీసెర్చ్ కి నిధులు సమకూర్చి సెయింట్ లూయిస్ లోని వాషింగ్టన్ యూనివర్శిటీ వారిని పరిశోధించమన్నారు ఈ లాబ్ ను మాక్ లాబ్(MAC LAB) అంటారు. జేమ్స్ రాండి శిష్యులు యిరువురు కూడా ఆ పరిశోధనలో చేరారు. తరువాత జరిగిన ట్రిక్ అంతా డిస్కవరీ పత్రిక వివరంగా వెల్లడించింది.

పేరా సైకాలజి-పబ్లిసిటి

పేరా సైకాలజి పేరిట జరిగే సంఘటనలు నిజమా,కాదా అనే విచక్షణ గాని, విచారణ గాని లేకుండానే పత్రికలు,రేడియో,టి.వి.లలో ప్రచారం విపరీతంగా వస్తున్నది. ఈ విషయంలో పాఠకులకు, ప్రేక్షకులకు వాస్తవాలు తెలిపే దానికంటే,వ్యాపారసరళి బాగా కనిపిస్తున్నది. అతీంద్రియ శక్తులకు చెందిన అద్భుతాలు ఆసక్తి కలిగిస్తాయి గనుక, జనం ఆత్రుతగా చదువుతారుగనుక,వాటికి చాలా ప్రాధాన్యత లభిస్తున్నది. అద్భుతాలు,మూఢనమ్మకాలు, అతీంద్రియశక్తుల విషయమై సందేహవాదులు, సైంటిస్టులు చేసే హెచ్చరికలు, వాస్తవాలు అంత ప్రాధాన్యతను సంతరించుకోవడం లేదు.

ప్రజలు నమ్మడానికి సిద్ధంగా వున్నారు. నిజా నిజాలతో వారికి నిమిత్తం లేదు. అతీంద్రియ సంఘటన వెనుకవాస్తవాన్ని వివరించడానికి సమయం పడుతుంది. పైగా వివరణ చాలా చిక్కులతో, జటిలంగా వుండవచ్చు. ఒక కథ వలె సాగిపోతున్న ఇంద్రియాతీత శక్తి సంఘటన వలన పత్రికల సర్కులేషన్ పెరుగుతుంది. పత్రికలలో అతీంద్రియ శక్తుల వార్తలు వేసినంతగా వాటి వ్యతిరేక వార్తలు,ప్రధానంగా చోటుచేసుకోవు. సంపాదకులు, రిపోర్టర్లు, అతీంద్రియ శక్తుల్ని నమ్మడం,లేదా ఆసక్తి కనబరచడం వలన ప్రసారాలు, ప్రచారంలో అవి ప్రాధాన్యత పొందుతాయి. అలాగే ప్రసార సాధనాల యాజమాన్యం కూడా ఆసక్తి కనబరచి తమ వ్యాపార లాభాలకై ఏ స్థాయికైనా వెడుతున్నారు. ఈ దోరణివలన వాస్తవాలు దెబ్బతింటున్నాయి. వార్త నిజం కాదని తెలిసినా అతీంద్రియశక్తుల వార్తకు తాము బాధ్యులం కాదని ప్రచురించరు.

అతీంద్రియ శక్తుల వార్తలు ప్రచురించడంలో, ప్రసారం చేయడంలో కొన్ని నియమాలు పాటించడం అవసరం. అతీంద్రియ శక్తులున్నాయని బాబా,మాత, లేదా మారుమూల వ్యక్తులు చెబుతున్నప్పుడు, మూలాధారాల కోసం రిపోర్టర్లు అన్వేషించాలి. చెప్పుడు మాటల్నిగాక,ఆధారాలే ప్రమాణంగా స్వీకరించాలి. ఇంద్రియాతీత శక్తుల పరిమితులు-శాస్త్రీయ పంథాలు పోల్చి చూచుకోవాలి. లోగడ అలాంటి అతీంద్రియ శక్తుల విషయమై జరిగిన పరిశోధనల్ని దృష్టిలో పెట్టుకొని వార్తలు ప్రచురించాలి.అతీంద్రియ శక్తుల వెనుక వున్న సాధారణ పరిస్థితులు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. విమర్శల్ని పక్కనబెట్టరాదు. అతీంద్రియ శక్తులున్నాయన్నప్పుడు బహిరంగ ప్రదర్శనకై వత్తిడి చేయాలి. ఆ సంఘటనను పరిశీలనకు పెట్టాలి. సంఘటనలో కప్పిపుచ్చి, మోసపూరితంగా వ్యవహరించే ధోరణిని అరికట్టాలి. సంఘటనపై చిలవలు పలవలుగా ప్రచురించే కరపత్రాలు, అభిప్రాయాలు ప్రమాణంగా తీసుకోరాదు. ఇలాంటి నియమాలు ప్రసార సాధనాలు,పత్రికలు పాటించగనిగితే,మూఢ నమ్మకాలు జనాన్ని మోసంచేయజాలవు. ఒకానొక అతీంద్రియ సంఘటనకు మీడియా యిస్తున్న విపరీత ప్రాధాన్యత వలన ప్రజలలో ఆసక్తి పెరగడమేగాక, మూఢ నమ్మకాలు ధృవపడుతున్నాయి. దీనికి తగ్గట్టుగా అతీంద్రియ శక్తిని బట్ట బయలుచేస్తూ వచ్చిన నివేదికను,వార్తను చాలా అప్రధానంగా ప్రచురించడం వలన ఎంతో హాని జరుగుతున్నది. ఇలాంటి ధోరణిపత్రికా రంగంలో సర్వసాధారణంగా కనిపిస్తున్నది. బొత్తిగా బాధ్యత లేని అశాస్త్రీయ ధోరణి అటు రిపోర్టర్లలోనూ, యిటు సంపాదకులలోనూ సర్వత్రా కనిపిస్తున్నది. ప్రజలకు శాస్త్రీయంగా నిజాలుచెప్పాలనే ధోరణి రానంత వరకూ అతీంద్రియ శక్తుల పట్ల నమ్మకం సడలదు.

అతీంద్రియ శక్తుల పట్ల సందేహాలు

ప్రాచీనకాలం నుండీ చెదురు మదురుగా ఇంద్రియాతీతశక్తుల పట్ల సందేహాలు, ఖండన మండనలు వ్యక్తమౌతూనేవున్నాయి. గ్రీస్-రోమన్ ప్రాంతాలలో సందేహ వాదిపితామహుడుగా ఇలిస్ కు చెందిన పైరొ(Pyrrho)ను చెప్పవచ్చు-360-270 క్రీ.పూ. ఆ తరువాత అకడమిక్ సందేహవాదం ప్లేటో అకాడమీ నుండి పుట్టింది. ఆర్సిలాస్(Arcesilaws) ,కార్నిడాస్(Cameades) యీ రంగంలో పేర్కొనదగినవారు. ఆధునికయుగాలలో పైర్ బేల్(1647-1706),రేనడెకార్ట్(1596-1650),డేవిడ్ హ్యూం(1711-1776) సందేహవాదానికి పునాదులు గట్టిగా వేశారు. ఫ్రెంచి అకాడమీ ప్రత్యేక విచారణలు జరిపి ఫ్రాంజ్ మెస్మర్(1734-1815) యానిమల్ మాగ్నటిజపు బూటకాలను బట్టబయలు చేసింది. 19వ శతాబ్దం చివరలో 20వ శతాబ్దం ప్రారంభంలో అనేక అతీంద్రియ శక్తుల గురించి పరిశోధనలు జరిగాయి. ఏదీ శాస్త్రీయ పరిశీలనలో రుజువు కాలేదు. జె.బి.రైన్ వచ్చి అతీంద్రియ శక్తులకు శాస్త్ర గౌరవం కోసం అనేక పరీక్షలు జరిపాడు. సైకాలజిస్టు బి.ఎఫ్.స్కిన్నర్ యీ రంగంలో రైన్ వృధా ప్రయాసను తీవ్రంగా ఎదుర్కొన్నాడు. సైకొ కెనిసిస్ పై శాస్త్రీయ విమర్శలను ఎడ్వర్డ్ గిర్డెన్ (Edward Girden) ప్రచురించాడు.

1976లో అమెరికాలో అతీంద్రియ శక్తుల శాస్త్రీయ పరిశీలనకు ఒక నిపుణుల సంఘం ఏర్పడింది. దీనిని సికాప్(CSICOP) అని పొడిగా పిలుస్తారు. పాల్ కర్జ్ సంఘాధ్యక్షుడుగా ఇందులో అనేకులు పనిచేశారు. సుప్రసిద్ధ శాస్త్రజ్ఞుడు కార్ల్ శాగన్,తాత్వికులు సిడ్నీహుక్, ఎర్నెస్ట్ నాగెల్, మార్టిన్ గార్డ్ నర్, జేమ్స్ రాండి, డబ్లు.వి.క్విన్,ఫిలిప్ క్లాజ్,మార్సిలో ట్రూజి, రేహైమన్ ప్రభృతులు బాగా లోతుపాతులు అధ్యయనం చేశారు.

సైకో కెనిసిస్ రంగంలో ప్రపంచ ప్రసిద్దుడుగా ఆవిర్భవించిన యూరిగెల్లర్ స్పూన్(చెంచాలు) వంచడం వంటి ఇంద్రియాతీతశక్తి వెనుక కిటుకులను బయటపెట్టి యీ సంఘం శాస్త్రీయంగా ముందుకు సాగింది. సంఘం పక్షాన స్కెప్టికల్ ఇంక్వ్తెరర్ అనె పత్రిక పెట్టి,ఎప్పటికప్పుడు అతీంద్రియ శక్తుల శాస్త్రీయ పరిశీలనా ఫలితాలు వెలికి తెస్తున్నాడు. కెండ్రిక్ ఫ్రేజర్ సంపాదకత్వాన యీ పత్రిక కొనసాగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా ఇంద్రియాతీతశక్తి సంఘటన దృష్టికి వచ్చినా యీ సంఘంవారు పరిశీలిస్తున్నారు. ఎక్కడా రుజువుకు నిలబడిన సంఘటన కనిపించలేదు. Committee for the Scientific Investigation of Claims of the Paranormal(CSICOP) సంఘాన్ని చైనాకు ఆహ్వానించి, అక్కడ జరుగుతున్న అతీంద్రియశక్తుల వుదంతాలను పరిశీలించమన్నారు. పాల్ కర్జ్ ఆధ్వర్యాన 1988లో ఆరుగురితో కూడిన సంఘం చైనాలోని కొందరు అతీంద్రియ శక్తిపరుల్ని పరిశీలించింది. సైకిక్ శక్తులున్నాయన్న పిల్లల్ని కూడా టెస్ట్ కు గురిచేశారు. మోసాలు జరగకుండా జాగ్రత్తలు చేసేసరికి,పిల్లల్లో ఎలాంటి ఇంద్రియాతీతశక్తులు లేవని తేలింది. చైనాలో బాగా ప్రచారంలో వున్న కిగాంగ్(Qigong) శక్తిలో "శక్తి" ఏదీ లేదని రుజువుపరచారు.

ప్రతి సంవత్సరం యీ సంఘం వారు సమావేశాలు జరిపి అత్యంత ఆధునాతనంగా ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతున్నదీ వివరిస్తూ అతీంద్రియశక్తుల అధ్యయనం చేస్తున్నారు. ఈ విషయాలపై టేప్ లు సిద్ధం చేసి యిస్తున్నారు. యూరిగెల్లర్ యీ సంఘంపై కోర్టులో కేసులు పెట్టి ఓడిపోయి, ప్రస్తుతం అమెరికాలో అడుగుపెట్టకుండా ఇంగ్లండ్ కు పరిమితమయ్యాడు. కోర్టులో తన చెంచాలు వంచే శక్తి నిజమని రుజువు చేసుకోలేకపోయాడు. అతీంద్రియ శక్తులున్న వారిని అమెరికా, యూరోప్ లలో పోలీస్ శాఖ సైకిక్ డిటెక్టివ్ లుగా వాడుకుంటున్నది. నేరస్తులను పట్టివ్వడానికి,నేరాలలో కీలకాలు బయటపెట్టడానికి సైకిక్ డిటెక్టివ్ లు ఉపకరిస్తారని పోలీస్ నమ్మింది. కాని రుజువుకు పెడితే ఎక్కడా సైకిక్ డిటెక్టివ్ లు నిలబడలేదు. ఉజ్జాయింపుగా వూహించి చెప్పడం,అదృష్టవశాత్తు నిజమైతే తమ శక్తిగానూ,లేకుంటే నోరు మూసుకొని మరోచోటికి పోవడం జరుగుతున్నది. కంట్రోల్డ్ పరిశోధనలకు కొందరు సైకిక్ డిటెక్టివ్ లను గురిచేసి, నివేదికలు వెల్లడిస్తే వారికి ఎలాంటి ఇంద్రియాతీత శక్తులు లేవని తేలింది. పాశ్చాత్య దేశాలలో వున్న యీ సైకిక్ డిటెక్టివ్ సంప్రదాయం భారత దేశంలో సోకలేదు. ఇది బాబాలకు,మాతలకు పరిమితమైన శక్తిగానే మిగిలింది. అయితే బాబాలను శాస్త్రీయ పరిశోధనకు గురిచేయనందున వారి వ్యాపారం నిరాఘాటంగా సాగిపోతున్నది.

భారతీయ బాబా మహేష్ యోగి అమెరికా వెళ్ళి గాలిలో తేలే విద్య నేర్పిస్తానని కొంతకాలం ధనార్జన చేశాడు. ఎంతవరకూ ఆ శక్తి బయట పడకపోయే సరికి ఆయన శిష్యులే కోర్టుకెక్కారు. ఫిలడెల్ఫియా కోర్టు మహేష్ యోగి పై తీర్పు యిస్తూ ఆయన్ను డబ్బు చెల్లించమన్నది. కోర్టు బయట మహేష్ యోగి వ్యవహారం పరిష్కరించుకున్నాడు.

మనదేశంలో ఏ బాబాను శాస్త్రీయ పరిశోధనకు గురిచేసినా వారి నిజానిజాలు తెలుస్తాయి. హెచ్.నరసింహయ్య కమిటి అలాంటి పరిశోధన చేయబోగా సాయిబాబా తప్పించుకున్నాడేగాని, నిలబడలేదు. బాబాలకు పోలీస్,ప్రభుత్వం అండగా నిలిచినంతకాలం వారి అతీంద్రియ శక్తులు భక్తుల్ని వశపరుచుకుంటూనే వుంటాయి. ఇన్నాళ్ళుగా విభూతితో,ఇతర ఇంద్రియాతీత శక్తులున్నాయనే భ్రమ కల్పించిన సాయిబాబా సైతం,తనకు అలాంటి మహిమలు, శక్తులు లేవని ఒప్పుకున్నట్లే అయింది. అందుకు నిదర్శనం రోగుల్ని నయం చేయడానికి పుట్టపర్తిలో సాయిబాబా సూపర్ స్పెషల్ ఆస్పత్రి పెట్టడమే తార్కాణం. మహిమలతో రోగాలు తగ్గించగలిగితే ఆస్పత్రిలో శాస్త్రీయంగా చికిత్స దేనికి అనే అంశం భక్తులకు తెలియడానికి కొంతకాలం పడుతుంది. ఇది అందరు బాబాలకు,స్వాములకు,మాతలకు అన్వయించి చూచుకోవాలి.

కార్ల్ యూంగ్

అతీంద్రియ శక్తుల గురించి సిగ్మండ్ ఫ్రాయిడ్,కార్ల్ యూంగ్ లు తీవ్రంగా వాదించుకున్నారు. ఫ్రాయిడ్ నాస్తికుడు మూఢ నమ్మకాలకు వ్యతిరేకి. యూంగ్ నమ్మకాల పుట్ట,అతడి ప్రభావం వలన కూడా అతీంద్రియ శక్తుల ప్రచారం బాగా సాగింది. కార్ల్ గస్టావ్ యూంగ్(1875-1961) సింక్రోనిసిటి,ఆర్డిటైప్ అనే రెండు సిద్ధాంతాలు ప్రచారంలో పెట్టి,మూఢ నమ్మకాలకు ప్రాతిపదికలు సమకూర్చాడు. యూంగ్ జ్యోతిష్యాన్ని, టెలిపతిని, గాలిలో తేలడాన్ని, వస్తువుల్ని సృష్టించడాన్ని నమ్మాడు. అతీంద్రియ శక్తుల విషయంలో యూంగ్ ఒకవైపు అతిజాగ్రత్త వహిస్తున్నట్లు అగుపించినా,వాటికి ఆధునిక శాస్త్రీయ ప్రతిపత్తి కల్పించాలని తహతహలాడాడు. జె.బి.రైన్ పరిశోధనలు తన సిద్ధాంతాలకు మద్దతుగా చూపాడు.తీరా, జె.బి.రైన్ పరిశోధనలే శాస్త్రీయ పరిధికి నిలవకుండా పోయాయి. బయట ప్రపంచంలో జరిగే సంఘటనలే వ్యక్తికి అనుభూతులుగా ప్రతిబింబిస్తాయని యూంగ్ తన Synchronicity సిద్ధాంతంలో నమ్మాడు. అదే సిద్ధాంతం ప్రకారం,సమిష్టి అవ్యక్తత (Collective Unconscious)లోని అంశాలు వ్యక్తిలో ప్రతిబింబిస్తాయన్నాడు యూంగ్. యూంగ్ ఆర్కిటైప్ వాదం జ్యోతిష్యం చెప్పే రాసులవంటివి,వాటికి ఉనికిలేదు. అవి కేవలం నమ్మకంపై ఆధారపడినవే. పురాణగాధల్లోని అంశాలకు బాహ్యరూపాన్ని,వాస్తవికతను కల్పించే ప్రయత్నం కూడా యూంగ్ చేశాడు. ఆర్కిటైప్ అంశాలు వంశపారంపర్యతగా సంక్రమిస్తాయని కూడా యూంగ్ నమ్మాడు. క్వాంటం సిద్ధాంతంలో విషయాల్ని యూంగ్ తన సామ్యాలకి వాడుకోబోయి పొరబడ్డాడు. క్వాంటం సిద్ధాంత ప్రతిపాదనలు రుజువుకు నిలిచాయి. యూంగ్ చెప్పేవాటికి రుజువు గాక, నమ్మకమే ప్రధానం. అయినా యూంగ్, ఆర్థర్ కోస్లర్ వంటి వారి ఆసక్తి కారణంగా అతీంద్రియ శక్తుల పట్ల నమ్మకం పెరిగింది. వ్యక్తిగతంగా వుండే అవ్యక్తత, సమిష్టి అవ్యక్తత అనేవి మానవ సంపదగా చూపిన యూంగ్,క్రమానుగతంగా,లామార్క్ జీవ సిద్ధాంతం వలె, సంక్రమిస్తాయని అతడి నమ్మకం. వీటికి ఆర్కిటైప్ అని నామకరణం చేశాడు. భావాలకు యివే మూలం అన్నాడు.

టెలిపతి పట్ల ఉదార దృష్టి అవలంబించమని యూంగ్ కోరాడు. అతీంద్రియ శక్తులను సమర్ధించడానికి యూంగ్,ఒక సైంటిస్ట్ పాలి(Pauli)తో కలిసి Interpretation of Nature and Psyche అనే పుస్తకం రాశాడు. పదార్థానికి చెందిన సూక్ష్మరూపంలో సైకి విధానాన్ని నిర్మించవచ్చని అన్నాడు. సైన్సులో రుజువుకు నిలపకుంటే తోసిపుచ్చుతారు. యూంగ్ ఒక వైపున సైన్స్ ఉదాహరణలు తెచ్చి,తాను చప్పే సైకిని రుజువుకు పెట్టడానికి,రుజువు కాకుంటే నిరాకరించడానికి సిద్ధపడలేదు. అదే నమ్మకస్తుల బలం! అతీంద్రియ శక్తుల విషయంలో అత్యంత ఉత్సాహం చూపిన ఆర్థర్ కోస్లర్ చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు.

నేడు పేరా సైకాలజీ కొన్ని యూనివర్శిటీలలో కోర్సులుగా వున్నది. అక్కడ మాత్రం దీనికి ఎలాగైనా శాస్త్రీయగౌరవాన్ని తీసుకరావాలని కృషి చేస్తున్నారు. ఆధినిక విజ్ఞాన సాంకేతిక పరికరాల సహాయంతో వివిధ పరిశీలనలు జరుపుతున్నారు. ఇంత వరకూ నిర్ధారణగా ఒక్క పేరా సైకాలజీ పరిశోధనకూ శాస్త్రీయ ప్రమాణం రాలేదు. పేరా సైకాలజీని సైన్సులో భాగంగా పరిగణించడానికి అవకాశం లభించడం లేదు,ఇదీ వాస్తవ పరిస్థితి. సైన్స్ పేరిట,శాస్త్రీయ పరిశోధనల పేరిట మోసాలు చేసి తాత్కాలికంగా నమ్మించడం పేరా సైకాలజీలో పరిపాటి అయింది. శాస్త్రీయ పరిశోధనలంటూ కొన్ని పత్రికలలో వివరాలు ప్రచురించడం,తీరా వాటిని మళ్ళీ పరీక్షకు పెడితే ఫలితాలు రాకపోవడం సర్వసాధారణమై పోయింది.

ఇంత జరుగుతున్నా,సైన్స్ నేటికీ దృక్పథంతో, సహనంతో వుంది. పేరా సైకాలజీ ఎప్పుడు అక్కడ రుజువుపరచినా ఆమోదించడానికి సైన్స్ సిద్ధపడుతోంది.ఏమైనా సరే,పేరా సైకాలజీ కూడా సైంటిఫిక్ అని రుజువు చేయాలని ఆత్రుత పడడంలోనే,సైంటిఫిక్ మెథడ్ లోని గొప్పదనం అర్థం చేసుకోవచ్చు.

సైన్స్,సంపూర్ణతను, అంతా కనుగొన్నాం అనడాన్ని సుతరామూ ఒప్పుకోదు. సైన్స్ ప్రకారం తెలుసుకోవడం, మార్చుకోవడం,దిద్దుకోవడం నిరంతరం జరిగేపని. పవిత్ర గ్రంథాల పేరిట అంతా అందులోనే వున్నదని సైన్స్ ఏనాటికీ అనదు.అందువలన సైన్స్ మానవాళికి తోడ్పడుతుంది.

పేరా సైకాలజి మానవ అభివృద్దికి దోహదం చేసిన ఉదాహరణ ఒక్కటి లేదు

- మిసిమి మాసపత్రిక,జులై-2001