అబద్ధాల వేట - నిజాల బాట/అబద్దాల వేట ఏది సత్యం ? గాంధీగారూ !

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
అబద్దాల వేట
ఏది సత్యం? గాంధీగారూ!

గాంధీగారిని కాంగ్రెసు వారు, స్వాతంత్ర పోరాటయోధులు, సర్వోదయవాదులు "మహాత్మ"గా చూస్తారు.

మానవవాదులు, హేతువాదులు గాంధీజీని మనిషిగా భావించి, అంచనావేస్తారు. అందరి మనుషులవలె, గాంధీకూడా రాగ ద్వేషాలు, ఈర్ష్య అసూయలుగల వ్యక్తి. గాంధీజీ గొప్పతనాన్ని హేతువాదులు గ్రహిస్తారు, లోపాల్ని నిర్మొహమాటంగా చూపుతారు. అది శాస్త్రీయ ధోరణి. మనిషిని అంచనా వేయడానికి పూర్తి వ్యక్తిత్వాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం, అన్ని వివరాలు కూలంకషగా తెలుసుకోవడం అవసరం, "మహాత్ముడ"ని ఆరాధించే వారు నిజానిజాలు విడమరచి చూడలేరు. సమాధుల్ని పూజిస్తారు, భజనలు చేస్తూ వ్యక్తి ఆరాధనతో తృప్తిపడతారు.

గాంధీజీ హేతువాదుల దృష్టిలో గొప్ప స్వాతంత్రపోరాట రధసారధి. సత్యాగ్రహాన్ని ఆయుధంగా స్వీకరించి, అహింసా పద్ధతిలో, అశేష ప్రజానీకాన్ని పోరాట రంగంలోకి దింపిన వ్యక్తి గాంధీజీ, దేశ స్వాతంత్ర విషయంలో రాజీపడకుండా పోరాడిన విశిష్ట నాయకుడు. చరిత్రలో గాంధీజీ ఆ విధంగా చిరస్మరణీయుడుగా నిలుస్తాడు. స్వాతంత్ర పోరాటంలో హిందూ ముస్లింలను కలుపుకురావాలని ఆకాంక్షించిన గాంధీజీ, మత సామరస్యతకై కృషిచేశారు. స్వాతంత్ర పోరాటాన్ని గ్రామాలలోకి తీసుకెళ్ళారు. మహిళల్ని ఉత్తేజ పరచారు. ఎటు చూచినా దేశ స్వాతంత్ర పోరాట నాయకుడుగానే గాంధీజీ కనబడతారు. మంచి లక్ష్యానికి మంచి మార్గం అనుసరించాలని చెప్పిన వ్యక్తిగా గాంధీజీ ఆదర్శప్రాయుడే. అలాంటి గాంధీజీ తన జివితమే సత్య పరిశోధనగా పేర్కొన్నారు. అందుకే జీవిత చరిత్ర రాశామన్నారు.

గాంధీజీ జీవితచరిత్ర పరిశోధించి రాయాల్సివుంది. ఇంకా ఆ పని జరగలేదు. ముఖ్యంగా గాంధీజీ తొలిజీవితం, దక్షిణాఫ్రికా రంగంలో ఆయన పాత్ర శాస్త్రీయ ఆధారాలలో అధ్యయనం చేయాలి. అప్పుడుగాని అసలు గాంధీ మనకు అర్థంకారు. గాంధీ జీవితంపై అనేక గ్రంథాలు వచ్చాయి. దేశ విదేశ రచయితలు ఎన్నో పుస్తకాలు రాశారు. ఇందులో ప్రసిద్ధులుకూడా కొందరున్నారు. గాంధీజీ రాసిన స్వీయ చరిత్ర ఆధారంగానే వీరిలో చాలా మంది తమ రచనలు చేశారు. అక్కడే వచ్చింది చిక్కు. గాంధీజీ సంపూర్ణ రచనలు వెలువడ్డాయి, సంపూర్ణ పరిశోధన మాత్రం యింతవరకూ వెలువడలేదు! "మహాత్మ" అని భావించిన వారు పరిశోధన చేయలేరు. గాంధీ తన తొలి జీవితాన్ని గురించి రాసిందే వీరుకూడా స్వీకరించారు. అయితే అందులో దోషం ఏమిటి? అనే ప్రశ్న రావచ్చు. ఇక్కడ ఆగి, "మహాత్మ" విషయం కొద్దిగా గమనిద్దాం.

"మహాత్మ" అనే బిరుదు నన్ను బాధపెడుతున్నది............నేను సంపూర్ణత్వాన్ని జీవితంలో ఎన్నడూ ఆపాదించుకోలేదు. నా సహచరులలో వున్న అపవిత్రత నాలోని దోషాన్ని సూచిస్తున్నది. "మహాత్మ" అనే మాట నాకు తిట్టుగా వుంటుంది-ఇదీ గాంధీజీ అభిప్రాయం. ఆ మాత్రం గ్రహింపు పరిశోధకులకు,రచయితలకు వుంటే యీ పాటికి స్వతంత్రంగా గాంధీజీ జీవిత చరిత్ర వచ్చివుండేదే.

1922లోనే సంపూర్ణ స్వరాజ్యం వస్తుందన్న గాంధీజీ, కేవలం తన మనస్సాక్షికి దైవం చెబుతున్న దృష్ట్యా అలా ఘంటాపధంగా చెప్పగలుగుతున్నామన్నారు. కాని, శాస్త్రీయాధారాలతో మనస్సాక్షి మాటల్ని పరిశీలించలేదు. స్వాతంత్రం 1922లో రాలేదు, హిమాలయాలంతటి తప్పుచేశానన్నాడు గాంధీజీ. కాని, అనుచరులు మాత్రం యింకా అలాంటి తప్పులుచేస్తూనే వున్నారు.

గాంధీజీ తన తొలి జీవిత వాస్తవాలు లండన్ డైరీ పేరిట ఇంగ్లీషులో రాశారు. 20 సంవత్సరాలు జాగ్రత్తగా అట్టిపెట్టి 1909లో 120 పేజీల లండన్ డైరీని తన బంధువు భగన్ లాల్ కు అప్పగించారు గాంధీ కార్యదర్శిగా సేవలు చేసిన మహదేవ దేశాయికి 1920లో అవి చేరాయి, ఉత్తరోత్తరా అది ప్యారీలాల్ కు చేరిందో లేదో తెలియదు. కాని,గాంధీజీ స్వయంగా నోట్ పుస్తకాలలో ఇంగ్లీషులో నిర్మొహమాటంగా రాసిన నిజాలు అదృశ్యమయ్యాయి కేవలం 20 పేజీలు అట్టిపెట్టి గాంధీజీ శీలాన్ని కాపాడదలచిన భక్తులు, మిగిలిన లండన్ డైరీని నామరూపాలు లేకుండా చేశారు. ఎందుకిలా జరిగింది? లండన్ లో విద్యార్థి జీవితాన్ని యధాతధంగా గాంధీ రాస్తే, భక్తులకు షాక్ కొట్టి అదంతా బయటకొస్తే కొంప మునుగుతుందని, రచన కనబడకుండా చేసి తృప్తిపడ్డారు! గాంధీజీకి సంబంధించిన నిజాలు నాశనం చేయడంలో ఆయన శిష్యులు ఎప్పటికప్పుడు తగిన పాత్ర వహిస్తూనే వున్నారు. మహాత్మగాంధీ రచనల సంపుటాలలో ఇట్లాగే కొన్ని వాస్తవాలను 1938లో నాశనంచేస్తే, గాంధీజీకి తెలిసికూడా వూరుకున్నారు!

లండన్ డైరీలో మిగిలిన 20 పేజీల ఆధారంగా లండన్ ప్రయాణం గురించి కొన్ని వివరాలు లభిస్తున్నాయి, దక్షిణాఫ్రికా గురించి 30 ఏళ్ళ తరువాత జ్ఞాపకం వున్నంతవరకూ గాంధీజీ రాస్తే, అదే మిగిలిన వారికి ఆధారమైంది. గాంధీజీ జీవితంలో మలుపుతిప్పిన సంఘటన 1893లో దక్షిణాఫ్రికా వెళ్ళడమే, అక్కడ ప్లీడరుగా ప్రాక్టీసుపెట్టి సంపాదించుకోవాలని, ఇండియాలో అలాంటి అవకాశం లేదని గాంధీజీ భావించి ప్రయాణం కట్టారు. కాని, ఆ విషయం దాచిపెట్టి, 1893 ప్రయాణం గురించి పట్టీపట్టనట్లు రాశారు. ఇండియాలో పొందిన వైఫల్యానికి బదులు, దక్షిణాఫ్రికాలో పట్టుపట్టి సాధించాలని గాంధీజీ లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే సాధించారుకూడా. కాని ఆ విషయం తన రచనలో దాచారు. దక్షిణాఫ్రికాలో గాంధీజి రాసిన పబ్లిక్‌ పిటిషన్ ప్రచురించిన సంపుటాలలో చేర్చలేదు. 1893 సంవత్సరం గాంధీజి జీవితంలో ఎంత మలుపు తిప్పిందో, అంతగా ఆవిషయాన్ని ఆయన దాచారు. దాదా అబ్దుల్లా కేసు కోసమే ఆయన దక్షిణాఫ్రికా వెళ్ళలేదు. వెళ్ళి అక్కడ పట్టంగట్టి, ప్లీడరీగా కుదురుకోవాలనే నిశ్చయంతోనే వెళ్ళారు. అది సాధించారు కూడా.

గాంధీ జీవిత రచన చేసిన ప్యారిలాల్, దక్షిణాఫ్రికాలో గాంధీజీ వెళ్ళకముందు జాతి విచక్షణ పట్టించుకున్నవారే లేరని మనల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. కాని అప్పటికే ప్రిటోరియాలో సి.ఎం.పిళ్ళె కింబర్లీలో దొరస్వామి పిళ్ళె, ఎ.ఒ.అల్లె వున్నారన్న సంగతి ఆయన పరిశోధించనేలేదు. మునుస్వామి అనే మరోవ్యక్తి కూడా యధాశక్తి జాతి విచక్షణకు వ్యతిరేకంగా, తమ హక్కులకోసం పోరాడిన వారిలో వున్నారు. ఇదంతా గాంధీయులు దాచారు. గాంధీకూడా దాచాడు. అదేబాధ, దక్షిణాఫ్రికాకు కేవలం కేసునిమిత్తం, అది పూర్తికాగానే గాంధీజీ వచ్చివుండేవారు. ఆయనకు వీడ్కోలు సభకూడా జరిగింది. అయినా గాంధీజీ అక్కడ వుండాలని భావించినందున, అందుకు తగిన పోరాట కారణాలుకూడా ఆయనకు లభించాయి. అలా చెబితే బాగుండేది. సత్యంకోసమే పుట్టినట్లు చెప్పిన గాంధీ, యీ విషయాన్ని దాచనక్కరలేదు, పైగా భారతీయులు సంతోషించేవారు. గాంధీజీ అబద్దాలతో దక్షిణాఫ్రికా జీవితం ఆరంభించీ, సఫలీకృతులయ్యారు. వీడ్కోలు సమావేశంనాటికే గాంధీజీ దక్షిణాఫ్రికాలో కొనసాగడానికి, భారతీయుల పక్షాన ఒక విజ్ణాన పత్రం సిద్ధంచేశారు. కొందరి సంతకాలు సేకరించారు. భారతీయులకు ఓటు హక్కు నిరాకరించే బిల్లును వ్యతిరేకించడానికి ఉద్యమించారు. అదంతా బాగానే వుంది, కాని స్వీయ చరిత్రలో, ఓటుహక్కు బిల్లు గురించి తనకు తెలియనే తెలియదని గాంధీజీ పచ్చి అబద్దంఆడారు. సత్యశోధనకై అంకితమైన వ్యక్తి అలా ఎందుకు చేశారు?

దక్షిణాఫ్రికాలో వుండదలచలేదు గనుక, వచ్చినపని పూర్తి అయింది గనుక, ఇండియాకు వెళ్ళదలచానని గాంధీజీ రాశారు. ఇదికూడా దారుణ అబద్దం. ప్రిటోరియాలో కేసు విషయం చూస్తూనే, మరోపక్క దక్షిణాఫ్రికా సాంఘిక రాజకీయ పరిస్థితిని గురించి నోట్స్ రాసుకున్నారు. నేటాల్ భారతీయుల నిమిత్తం, వారి ప్లీడరుగా అక్కడే వుండదలచి గాంధీజీ తన కృషి అంతా కేంద్రీకరించారు. నేను ఇండియా వెళ్ళాలనుకుంటే, దైవం మరో విధంగా తలంచింది. అని గాంధీ రాశారు. కాని గాంధి చేసిన కృషి అంతా ఒక పధకం ప్రకారమేనని సాక్ష్యాధారాలు, ఆయన ఉపన్యాసాలు, భారతీయుల సమావేశాలు తెలుపుతున్నాయి. దక్షిణాఫ్రికాలో వుండదలచిన గాంధీజీ కావాలని పార్లమెంటుకు దరఖాస్తు సమర్పించడంలో జాప్యంచేశాడు. సమయానికి దరఖాస్తు యిస్తే పార్లమెంటులో ఓటుహక్కు బిల్లుఆగేదే, అప్పుడు గాంధీజీ చేసేది లేక, ఇండియా తిరిగి రావలసి వచ్చేది. అక్కడే వుండదలచి, జాప్యం చెయ్యాలని, బిల్లు వస్తుందని తెలిసి కూడా వూరుకున్నాడు. భారతీయులకు ఓటు హక్కు వున్నట్లే, నేటాల్ భారతీయులకు వుండాలని గాంధీ తన స్వీయ గాధలలో రాశారు. 1890లో భారతీయులకు ఓటు హక్కు లేదని తెలిసీ గాంధీ అలా వ్రాశారంటే, దీనిపై వ్యాఖ్య పాఠకులకే వదలేస్తున్నాను. 1893 సంవత్సరం గాంధీ జీవితంలో పెద్ద మలుపు అని ఇంతకు ముందే పేర్కొన్నాం. అంతకుముందూ అ తరువాత ఓడ ప్రయాణాలు, అనుభవాలు క్షుణ్ణంగా పూసగుచ్చినట్లు రాసిన గాంధీ, 1893 ఓడ ప్రయాణం మాత్రం అంటి అంటనట్లు రాశాడు. ఆయన జీవిత చరిత్ర పరిశోధకులు ఆ విషయం పట్టించుకోలేదు.

గాంధీ మార్గ్ త్రైమాస పత్రిక సంపాదకుడు, గాంధేయ అధ్యయనంలో నిపుణుడు టి.కె. మహదేవన్ ప్రత్యేక పరిశోధనచేస్తే అనేక నగ్న సత్యాలు బయటపడ్డాయి. (చూడండి: ది ఇయర్ ఆప్ ది ఫెనిక్స్ 1982 అర్నాల్డ్ హానిమన్, డిల్లీ (ప్రచురణ) వృత్తి రీత్యా తనకు సంబంధించిన విషయమై గాంధి రహస్యంగా వ్యవహరించడంకద్దు (చూడు: టి.కె.మహదేవన్ రాసిన ద్విజ:ఎ ప్రాఫెట్ అన్ ఆర్మ్‌డ్ 1977) గాంధీ తన జీవిత చరిత్రను గుజరాత్‌లో రాసి, వారం వారం నవజీవన్ పత్రికకు పంపాడు. 1922 నుండే జైలులో వుంటూ కేవలం జ్ణాపకశక్తిపై ఆధారపడి గాంధీ రాశాడు. తన సత్య శోధన రచనలో చాలా తప్పులు దొర్లినట్లు మగన్‌లాల్ గాంధీకి రాసిన లేఖలో అంగీకరించారు. కాని దక్షిణాఫ్రికాకు చెందిన విషయాలు రాసిన తరువాత గాంధీ ఎన్నడూ దిద్దలేదు. పుస్తక రూపంలో జీవిత చరిత్రను వేస్తున్నప్పుడు కూడా గాంధీ మళ్లీ దిద్దలేదు. కనుక, దొర్లిన దోషాలు అలాగే వున్నాయి. చరిత్రలు రాసిన గాంధేయులుగాని, అభిమానులుగాని ఆయన రచనలలో నిజానిజాలు పరిశీలించలేదు. గోవింద బాబు కొన్ని విషయాలు గాంధి తన జీవిత చరిత్రలో ఎలా వదిలేసిందే ప్రస్తావించగా, సత్యాన్వేషణకు రాశాకగాని, కార్యకర్తలకు ధృవపత్రాలివ్వడానికి కాదని గాంధీ యంగ్ ఇండియాలో బదులిచ్చారు(జనవరి 31-1929) గాంధీ తన సత్యశోధనలో కావాలని నిజాల్ని దాచేస్తే ఎవరేం చేస్తారు? దక్షిణాఫ్రికాలో తాను ప్లీడరుగా దాదా అబ్దుల్లా కేసు చేబట్టినా, అతడు దొంగ సరుకు రవాణా చేస్తుండేవాడనే సత్యాన్ని గాంధీజీ దాచేశారు. కాని తన కుటుంబ మిత్రుడైన రుస్తుంజీ మాత్రం దొంగ సరుకు రవాణాలో పట్టుబడ్డాడని రాశాడు ఆయనమీద ప్రేమతోనే అలా రాశానని, జీవితగాధ వున్నంతవరకు రుస్తుంజీ పేరు చిరస్తాయిగా వుండాలని తన ఉద్దేశమని, అందుకే ఇతరుల పేర్లు వదలేశానని, తన కుమారుడు మణిలాల్ అభ్యంతరానికి సమాధానమిచ్చారు(1928 జూలై 15)

వివేకానంద శిష్యురాలు నివేదితను కలసినవిషయమై గాంధీ ప్రస్తావనను వివరిస్తూ 1927 జులై మోడరన్ రివ్యూ విమర్శించగా, గాంధీ తప్పడు కూడా కేవలం జ్ఞాపకశక్తిపై ఆధారపడి రాశానని, సత్యశోధనకై ఉద్దేశించాను గనుక మనస్సుపై పడిన ముద్ర దృష్టానే యిది చూడాలన్నారు! కేవలం జ్ణాపక శక్తిపై ఆధారపడి సత్య శోధన చేస్తే వచ్చిన దోషాలు గాంధి జీవితంలో యిన్నీ అన్నికాదు. అయితే 30 సంవత్సరాల తరువాత జీవిత చరిత్ర ధారావాహికంగా రాసినా, కొన్ని సంగతులు ఫోటో తీసినట్లేరాశారు. తన జీవిత చరిత్ర ప్రభావం చాలామందిపై వుంటుందని తెలిసిన గాంధీ నిజాలు చెప్పడంలో జాగ్రత్త వహిస్తే, సత్య శోధన బాగుండేది! ప్యారిలాల్, పెయిన్, హటన్‌బాక్‌తో సహా జీవితచరిత్ర రాసిన వారంతా గాంధీ రాసిన దానినే యధాతధంగా మనకు చెప్పడం వలన, శాస్త్రీయ పరిశోధన జరగ లేదని తేలింది. గాంధీ అబద్దాలు రాస్తే, ఆయన చరిత్రకారులు అనే చిలక పలుకుల్లాగా మనకు తిప్పి చెప్పారు. దక్షిణాఫ్రికాలో గాంధీ వీడ్కోలు సమావేశం అందుకు మచ్చుతునక! గాంధీజీ తన సత్యశోధనలో తన బాల్య ముస్లిం మిత్రుడు షేక్‌మెహతాబ్ గురించిన అనేక వాస్తవాలు వదలేశానన్నారు. వాళ్ళిద్దరి మధ్య స్వలింగ సంపర్క సంబంధం వుందని ఎరిక్ ఎరిక్‌సన్ తన గాంధీస్ ట్రూత్‌లో అంటాడు. షేక్ మెహతాబ్ చిన్నప్పటినుండే మిత్రుడుగా గాంధీచేత చేయించని పాపం అంటూ లేదు. చివరకు దక్షిణాఫ్రికాకు సైతం షేక్ మెహతాబ్‌ను పిలిపించుకున్నాడు, అయినా సత్యశోధన రచనలో చాలా వాస్తవాలు వదలేశారు.

దక్షిణాఫ్రికాలో గాంధీజీ చాలా పరిశోధనలు చేశారు. అయన కీర్తి ఇండియాలో వ్యాపించింది. భారతీయుల కోసం పోరాడి, దెబ్బలుతిని, నిలిచిన దైర్యశాలి గాంధీ. దక్షిణాఫ్రికా అనుభవాలే గాంధీని భారతదేశంలో నాయకుడిగా రూపొందించడానికి పునాదులు వేశాయి. దక్షిణాఫ్రికాలో తన భార్య కస్తూరిబాను ఒక దశలో ఇంట్లోనుంచి గెంటశాడు యువతతో టాల్‌స్టాయ్‌ఫాంలో పరిశోధనలు చేశాడు. చెరువులో స్నానాలు చేస్తున్న యువతీ యువకులు చిలిపి చేష్టలు చేయగా, వారిని నగ్నంగా నడిపించి, ఆడపిల్లల జుట్టు కత్తిరించిన పరిశోధనకూడా యిందులో ఒకటి. నలుగురు పిల్లలు పుట్టిన తరువాత, ఇక లైంగిక సంబంధం వద్దని ఒట్లు పెట్టుకున్నదికూడా దక్షిణాఫ్రికాలోనే. గాంధీ బాల్య వివాహం చేసుకొని, విపరీతంగా లైంగిక కార్యకలాపంలో మునిగి తేలిన విషయం విస్మరించారు. అది గ్రహిస్తే ఆయన పెళ్ళి అయిన వారికి బ్రహ్మచర్యం పాటించమని సలహా యివ్వడంలో విజ్ణతను గమనించవచ్చు. లైంగిక వాంఛలు ఆగాయో లేదోనని వృద్దాప్యంలో కూడా కలకత్తా-నౌఖాళిలో ఇద్దరు యువతులమధ్య నగ్నంగా పడుకుంటే, ఆయన కార్యదర్శి నిర్మలకుమార్ బోసు అభ్యంతరపెట్టి రాజీనామా యిచ్చిన విషయం గుర్తుంచుకోవాలి.

గాంధీ జీవితంలో స్వాతంత్ర పోరాటం ఆయనకు గొప్పతనాన్ని తెచ్చిపెట్టింది. అంతవరకే స్వీకరించకుండా ఇతర విషయాలు కూడా ప్రభావితం చేయడంతో మనం పరిశీలించి, అర్హతలు గమనించవలసి వచ్చింది. గాంధీ అభిప్రాయాలు ఆయుర్వేదం మొదలు ఆవుల వరకూ అనేక అంశాలపై వున్నాయి. అవన్నీ సత్యశోధన అనలేం. గాంధీ సైన్స్ బొత్తిగా చదువుకోలేదు. శాస్త్రీయ ధోరణిలో చూస్తే గాంధీ భావాలు అసలే నిలబడవు. అశాస్త్రీయమైన భావాలు వదిలేద్దాం. బీహారులో భూకంపం వస్తే ప్రజలు పాపం చేశారు గనుక దేవుడు ఆగ్రహించాడని గాంధీ ప్రకటించాడు. ఆయన సన్నిహిత అనుచరులే-పండిట్ నెహ్రూతో సహా యీ అశాస్త్రీయ ధోరణిని బాహాటంగా ఖండించారు. దేశీయ దుస్తులే ధరించాలంటూ, రవీంద్రనాధ్ ఠాగూర్ ను సిల్కుబట్టలు వదలేయమంటే ఆయన నిర్మొహమాటంగా నిరాకరించారు. దేవాలయాలపై బూతుబొమ్మలున్నచోట, తనకు పెత్తనం వుంటే కూలగొడతానని గాంధీ అంటే, ఖొజరాహో దేవాలయ శిల్ప సంపద అభినందించిన వారు నవ్వుకున్నారు (అగేహానంద భారతి) కనుక స్వాతంత్రపోరాటం మినహా మిగిలిన విషయాలలో గాంధీ భావాలు అట్టే పట్టించుకుంటే మనం నవ్వులపాలవుతాం. రాజకీయాలలో మాత్రం గాంధీ గారి చిత్తశుద్ధిని కొన్ని సందర్భాలలో శంకించినవారు లేకపోలేదు. అదికూడా ఆషామాషీగా కాదు, ఆధారాలతోనే అందులో అంబేద్కర్ పేర్కొనదగిన వ్యక్తి, ఆయన అడిగిన ప్రశ్నలు, చూపిన ఆధారాలు తిరుగులేనివి. గాంధీజీ అబద్ధాలకు మరోనిదర్శనంగా యీ విషయాలు నేటికీ మనముందున్నాయి. అటు గాంధీని ఇటు అంబేద్కర్ ను ఒకే వేదికపై నిలబెట్టి పొగిడే రాజకీయ వాదులను విస్మరించి యీ విషయాలు పరిశీలించాలి. ఓట్లకోసం పడే పాట్లు వున్నంతకాలం రాజకీయ వాదులు ఎవరినైనా వాడుకుంటారు. శాస్త్రీయ పరిశీలనకు వారి ప్రవర్తన అడ్డురాకూడదు.

అంటరాని తనం పోవాలని గాంధీ పదే పదే అంటుండేవాడు. దీనికి గాను ఆయన దేవాలయలలో హరిజనులకు ప్రవేశం వుండాలన్నారు. హరిజన అనే పదంకూడా ప్రచారంలోకి తెచ్చారు. ఈ రంగంలో గాంధీ చిత్తశుద్ధిని అంబేద్కర్ ప్రశ్నించారు. గాంధీ అబద్ధాలను బయటపెట్టారు.

ఎన్నో సత్యాగ్రహాలు, నిరాహార దీక్షలు ఎన్నో కారణాలకై చేసిన గాంధీ, కనీసం ఒక్కసారైనా అంటరానితనం పోవడానికి నిరాహార దీక్ష పూనలేదేమని అడిగారు. గాంధీ సమాధానం చెప్పలేదు. అలాగే, అంటరాని వారి పక్షాన ఒక్క సత్యాగ్రహమైనా ఎందుకు చేయలేదని అంబేద్కర్ ప్రశ్నిస్తే గాంధీ మౌనం వహించారు. స్వరాజ్యం రావడానికి అంటరానితనం పోవాలని ఉపన్యాసాలిచ్చిన గాంధీ, ఖద్దరు ధరించాలన్నారే గాని, కాంగ్రెసు సభ్యత్వానికి అంటరానితనం పాటించబోమని ప్రతిన చేయమనలేదు. గాంధీ చేయకపోతేమానె అంటరానితనం పోగొట్టడానికి నాందిగా 1929లో బావులు వాడుకోడానికి, దేవాలయ ప్రవేశానికి సత్యాగ్రహం తలపెట్టారు కొందరు హరిజనులు. దీనిని సమర్ధించకపోగా, గాంధీ ఖండించడం అంబేద్కర్ కు ఆశ్చర్యం వేసింది. కేరళలో గురువాయూర్ గుడి హరిజనులకు తెరవకపోతే ఆమరణ నిరాహారదీక్ష పూనుతానని బెదిరించిన గాంధీ, ఆ మాట ఎన్నడూ పాటించలేదు. హరిజనుల దేవాలయ ప్రవేశబిల్లును రంగ అయ్యర్ కేంద్ర శాసనసభలో ప్రవేశపెట్టినా, ఎన్నికలు దగ్గరపడుతుంటే కాంగ్రెసుపార్టీ ఆ బిల్లుకు మద్దతు ఉపసంహరిస్తే, గాంధీ కనీసం అభ్యంతరమన్నా తెలుపలేదేమి? హరిజన సేవా సంఘంలో హరిజనులు లేకపోగా వారిపై దాడులు జరిగితే పౌరహక్కులు కాపాడుకునే నిబంధన కూడా సంఘ నియమావళిలో చేర్చలేదు. హరిజనులకు ప్రత్యేక రాజకీయ హక్కులు ప్రసాదించే ఒప్పందాన్ని వ్యతిరేకించడానికి ఆమరణ నిరాహార దీక్ష పూనిన గాంధీ, ముస్లింలకు అలాంటి హక్కులిస్తుంటే కాదనలేదు. అంటరాని వారిపై ప్రేమవున్న గాంధీ కాంగ్రెసు మంత్రి వర్గాలలో వారికి ప్రాతినిధ్యం వుండాలని సూచన చేయలేదు. మద్యపరగణాలలో అగ్ని భోజ్ అనే హరిజనుడ్ని మంత్రిగా నియమిస్తే గాంధీ వ్యతిరేకించారు. ఇలాంటి విషయాలన్నీ బాధతో ఆవేదనతో అంబేద్కర్ తన పుస్తకంలో వివరంగా రాశారు. (చూడు: వాట్ కాంగ్రెస్ అండ్ గాంధి వేవ్ డన్ టు ది అన్ టచ్ బుల్స్ 1945 థాకర్ అండ్ కో బాబ్)

గాంధీ ముఖ్యంగా హిందువు. ప్రార్థనా సమావేశాలలో గీతా పారాయణం చేసేవారు. వర్ణాశ్రమ ధర్మాలను సమర్ధించారు. వర్ణాలు కావాలంటే కులాలు కావాలనడమే, అంటరానితనం హిందూ మత పుత్రికే, అంటరానితనం పోవాలంటే హిందూమతంలో సాధ్యంగాదు. గాంధీకి యీ విషయం బాగా తెలుసు. రాజకీయాలలో ప్రాబల్యంకోసం, స్వాతంత్రోద్యమం బలహీన పడకుండా చూడడానికి హరిజనుల్ని గాంధీ ఆకర్షించారు, వాడుకున్నారు. అంతకు మించి ఆచరణ కార్యక్రమం ఏదీ లేదు. చివరి దశలో కులం పోవాలని గాంధీ రాశారు. కాని అప్పటికే ఆయన హరిజనులకు చాలా అన్యాయం చేశారు. అంబేద్కర్ యీ విషయం గ్రహించి హెచ్చరించినా హరిజనులు గ్రహించలేదు. హిందూ మతం పట్టు వారిని వదలలేదు. ఆ మతంలోనే వుంటూ అంటరానితనం పోగొట్టుకోవడం సాధ్యంకాదని వారూహించలేదు. గాంధీ తెలివిగా హరిజనుల్ని మోసగించగలిగారు.

ఆధునిక భారతదేశం గాంధీని వదలేసి ఎం.ఎన్.రాయ్ ను అనుసరించి వుంటే యెంతో ముందుకు పోయేది, బాగుపడేది అని కీ॥శే॥నార్ల వెంకటేశ్వరరావు ఆవేదనతో రాశారు. కాని అది యెదురీత. ఎం.ఎన్. రాయ్ శాస్త్రీయ పరిశీలకుడు. ఆయన్ను అనుసరించడం నమ్మకస్తులకు చాలా దుర్లభం. గాంధీ ఆకర్షిత వ్యక్తి. ప్రజలలోవున్న మూఢనమ్మకాలను పాటించి, రాజకీయాలకు వాడుకున్న నాయకుడు. కనుక ఆయనకువున్న పలుకుబడి ప్రచారం ఎం.ఎన్.రాయ్ కు వూహించలేం. గాంధీ భావాలపట్ల నమ్మకంలేని నెహ్రూ, సైతం రాజకీయాలలో నాయకత్వంకోసం గాంధీజీకి శిరస్సు వంచక తప్పలేదు. యెదురు తిరిగిన సుభాస్ చంద్రబోసు, అంబేద్కర్ దెబ్బతిన్నారు.

భారతీయ జనతాపార్టీ సైతం గాంధీని పొగడాల్సిన పరిస్థితి మన దేశంలో వుంది. ఓట్లు కావాలంటే ప్రజా బాహుళ్యంలో సెంటిమెంటు వ్యతిరేకంగా పోకూడదన్నమాట. ప్రజలకు శాస్త్రీయ ధోరణి చెప్పాలని గాంధీవంటి వారు తలపెడితే యెలావుండేదో! కాని గాంధీ గోవధ నిషేధం, ఆయుర్వేదం, ప్రకృతి చికిత్స, శాఖాహారం, ఉపవాసాలు, ఖద్దరు వంటి అనేక విషయాలలో ప్రవాహానికి అనుకూలంగా వెళ్ళారు. అందుకే స్వాతంత్రోద్యమంలో ఆయన మతాన్ని తెలివిగా రాజకీయాల్లోకి తెచ్చారు. చివరిదశలో మతాన్ని రాజకీయాలకు దూరంగా వుంచాలన్నారు. అప్పటికే ముదిరిపోయింది. దేశంలో మూఢనమ్మకాలకు, అశాస్త్రీయ ధోరణులకు గాంధి గట్టి పునాదులు వేశారు.

భవిష్యత్తు బాగా వుండాలని కోరుకునే వారు గాంధీ జీవితాన్ని శాస్త్రీయంగా పరిశీలించాలి. చరిత్రను సైంటిఫిక్ గా రాయాలని ఎం.ఎన్.రాయ్ కోరాడు. అందుకు భిన్నంగా గాంధీ స్వీయగాధలు, రచనలు వున్నాయి. పరిశోధకులు సత్యాన్వేషణకు పూనుకుంటే వాస్తవాలు బయటకు వస్తాయి. ఈశ్వర-అల్లా తేరేనాం అంటూ గాంధీ జయంతులలో టోపీలు పెట్టుకొని సమాధికి పూలుచల్లుతూ, భజన చేసినంత కాలం "సత్యాన్వేషణ" జరగదు. వీరారాధనలో ఆలోచన వుండదు.

గాంధీకి చరిత్రలో ఏ మేరకు గౌరవ స్థానం యివ్వాలి అనేదికూడా శాస్త్రీయ పరిశీలకులు నిర్ధారించాలి. స్వాతంత్ర పోరాటంలో ఆయనకు సముచిత స్థానం యివ్వడానికీ మిగిలిన విషయాలలో పాటించడానికీ తేడా గ్రహించాలి.

- హేతువాది, నవంబర్ 1993