అబద్ధాల వేట - నిజాల బాట/శాస్త్రవేత్త గెలీలియోను హతమార్చిన తీరు !

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
శాస్త్రవేత్త గెలీలియోను హతమార్చిన తీరు!

భూమి చుట్టూ గ్రహాలు, గోళాలు, తారలు తిరుగుతాయని మత శాస్త్రాలు చాలాకాలం నమ్మించాయి. పవిత్ర గ్రంథాలలో అలా రాసుకొని జనాన్ని అనుసరించమన్నారు టాలమీ అలాగే రాశాడు.

పరిశీలన, పరిశోధన వచ్చి మతభావాల్ని కాదంటూ అసలు విషయాన్ని వున్నది వున్నట్లు బయటపెట్టాయి. కోపర్నికస్ 1543లో సూర్యుడు కేంద్రం అనీ, భూమి కాదని రాసి చనిపోయాడు. అంతటితో అప్పటి వరకూ టాలమీ(క్రీ.శ.150) రాసిన భూకేంద్ర సిద్ధాంతం తలక్రిందులు చేయాల్సి వచ్చింది. భూమి స్థిరంగా, కదలించడానికి వీలు లేకుండా వుంటుందని బైబిల్ చెప్పింది. క్రైస్తవులు అలాగే నమ్మారు.(సాం 93)

కెప్లర్ వచ్చి సూర్యుడు కేంద్రం అన్నాడు. అతడు గెలీలియో సమకాలీనుడే!

గెలీలియో ఇటలీలో పుట్టి పెరిగి చదువుకున్నాడు. అతడి మిత్రుడే మఫె బార్బెరిని(Maffew Barberini) . ఇద్దరూ ఇటలీ పీసా యూనివర్శిటీలో చదువుకున్నారు. మిత్రులుగా ఎదిగారు. కాగా మత వ్యవస్థలో బాగా పలుకుబడి, ధనం గల కుటుంబం నుండి వచ్చిన బార్బెరిని కార్డినల్ గా తరువాత పోప్ గా ఎన్నికయ్యాడు. 55 సంవత్సరాల ప్రాయంలో పోప్ గా అతడు 8వ ఆర్బన్ అని నామకరణం చేసుకున్నాడు.

గెలీలియో తన పరిశోధనా రచన : డైలాగ్ ని(Dialogue) కేథలిక్ మత సెన్సార్ వారికి ముందే అందించాడు. అది పరిశీలించిన వారు అభ్యంతరపెట్టలేదు. పోప్, గెలీలియో తరచు కలసి చాలాసేపు మాట్లాడుకునేవారు. ఇరువురూ ఇటలో ఫ్లారెన్స్ లో పెరిగారు. గెలీలియో వైద్యం చదివిన రోజుల్లో అర్బన్ లా చదివాడు. సూర్యుడు కేంద్రం అని రాసినప్పుడు గెలీలియోకు కొందరు జాగ్రత్త అని హెచ్చరించారు. గెలీలియో చాలా సంవత్సరాలు యూనివర్శిటీలో సైంటిస్టుగా బోధించి గౌరవం పొందాడు. కేథలిక్ మతస్తుడుగా వున్నాడు. 1631లో లెటర్స్ ఆన్ సోలార్ స్పాట్స్ ప్రచురించాడు. అప్పటికే టెలిస్కోప్ పరిశీలనలు చేశాడు. లోగడ గ్రీక్, లాటిన్ లో సూర్యుడికి ప్రాధాన్యత యిస్తూ రచనలు వచ్చినా అవి జనంలోకి ప్రాకలేదు. గెలీలియో తన డైలాగ్ ఇటాలియన్ భాషలో రాశాడు. అది విపరీత జనాకర్షణ పొందింది.

గ్రంథ నిషేధం-జైలు శిక్షా!

గెలీలియో సిద్ధాంతం కేవలం ప్రతిపాదనే అని పైకి చెప్పినా సమకాలీన సైంటిస్టులు, ప్రజలు ఆయన వైపు మొగ్గారు. కేథలిక్ మతం వూగిపోయినది.

పోప్ అర్బన్ దృష్టికి "డైలాగ్" రాగా ఆయన మండిపడి గెలీలియోను విచారణకు పెట్టాడు. 10 మంది కార్డినల్స్ విచారణ సంఘంగా ఏర్పడ్డారు. ఏదుగురు శిక్షకు అనుకూలంగా వుండగా ముగ్గురు సంతకం చేయలేదు. ఏకగ్రీవాభిప్రాయంగాకున్నా అధిక సంఖ్యాకుల నిర్ణయం ప్రకారం గెలీలియోకు మతశిక్ష వేసి నిర్భంధంలో వుంచారు. శిక్షలో భాగంగా ప్రార్థనలు చేయమన్నారు. 1663 జూన్ 22న శిక్ష విధించే నాటికి గెలీలియో 69వ సంవత్సరంలో అంధత్వంలో బాధపడుతున్నాడు. అతడి పుస్తకం డైలాగ్స్ ని కేథలిక్ నిషేధ జాబితాలో చేర్చారు 1632లో! దీనిని "ఇండెక్స్" అంటారు. హిట్లర్ మెయిన్ కాంప్ వంటి పుస్తకాలు నిషేధించని పోప్, శాస్త్రజ్ఞుల సత్యాన్వేషణ ఫలితాల గ్రంథాలను నిషేధించారు.

1822లో గెలీలియో డైలాగ్ ను నిషేధ జాబితా నుండి తొలగించారు. 1992లో పోప్ క్షమాభిక్ష కోరుతూ గెలీలియో పట్ల తప్పు చేశామన్నాడు. గెలీలియో పుస్తకం నిషేధించినా అది ఇతర భాషలలోకి అనువదించడం ప్రపంచ దృష్టికి రావడం,గెలీలియో సరైన ఆధారాలతో వాస్తవాలు చెప్పాడని గ్రహించడం అందరి కళ్ళు తెరిపించింది. గెలీలియో నివాసాన్ని ఫ్లారెన్స్ యూనివర్శిటీ వారు మళ్ళీ పునరుద్ధరించారు 1999 నాటికి! గెలీలియో గెలిచాడు. క్రైస్తవమతం ఓడిపోయింది. జైలులో నిర్బంధించిన గెలీలియోకు అతని కుమారుడు, ఇద్దరు శిష్యులు వచ్చి సహాయపడుతుండేవారు. 1638లో ప్రచురితమైన గెలీలియో పుస్తకం (ఫోర్స్, మోషన్ గురించి) న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాలకు ఉపకరించింది.

పీసాటవర్ పై నిలబడి ఒక బరువైన వస్తువు మరొక ఏదైన వస్తువు ఒకేసారి కింద పడేస్తే రెండూ ఒకేసారి భూమిని చేరాయి. గెలీలియో చేసిన యీ ప్రయోగం అంత వరకూ వున్న నమ్మకాన్ని కాదన్నది. అరిస్టోటిల్ బరువైన వస్తువులు తొందరగా కింద పడతాయన్నాడు. క్రైస్తవులు అరిస్టోటిల్ దగ్గరే ఆగి, భూమి చుట్టు సూర్యుడు తిరుగుతాడని, బల్లపరుపుగా భూమి వుంటుందని, భూమి కదలదనీ నమ్మారు. అది తప్పనే సరికి తలక్రిందులై, అన్నవారిని చంపడం మొదలెట్టారు. అదీ వారి మతసహనం. క్రైస్తవుల క్రూరత్వానికి బలి అయిన గెలీలియో 1642లో నిర్బంధవాసంలో గ్రుడ్డివానిగా అస్తమించాడు. ఆ తరువాత ఎప్పుడో క్రైస్తవులు తప్పు చేశామని చెంపలేసుకుంటే ఏం ప్రయోజనం!

- నాస్తికయుగం, జూలై 2000