అబద్ధాల వేట - నిజాల బాట/హ్యూమనిస్ట్ "రాణె" అనుభవాలు - ఆదర్శాలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
హ్యూమనిస్ట్ "రాణె"
అనుభవాలు-ఆదర్శాలు

బొంబాయిలో కాకలు తీరిన హ్యూమనిస్ట్ అడ్వకేట్ ఎం.ఎ.రాణె. ఇటీవలన ఆయన అనుభవాలు-ఆదర్శాలు పెద్ద గ్రంధంగా వెలువరించారు. ఆయన్ను సత్కరించడానికి కొందరు సంఘంగా ఏర్పడి రాణె రచనల్ని సంకలనంగా 500 పుటల్లో ప్రచురించారు.

రాణె 1925లో పుట్టారు. బొంబాయి తరలివచ్చి హైకోర్టులో ప్రాక్టీసు చేస్తున్నప్పుడు వి.ఎం. తార్కుండేతో పరిచయమై, సాన్నిహిత్యంగా మారింది.

తొలుత ఎం.ఎన్.రాయ్ రాడికల్ డెమొక్రటిక్ పార్టీని వ్యతిరేకిస్తూ ప్రదర్శనలు చేసిన వారిలో రాణె కూడా వున్నారు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఎం.ఎన్.రాయ్ బ్రిటిష్ వారిని సమర్థిస్తూ ఫాసిస్టు దేశ ప్రమాదాన్ని ఎదుర్కోడానికి అలాచేయాలని, యుద్ధంలో బ్రిటన్ గెలిస్తే, ఇండియాను వదలి వెడుతుందని చెప్పాడు. అది తరువాత నిజమైనా, యుద్ధకాలంలో కాంగ్రెస్ వీరజాతీయాభిమానులకు రాయ్ మాటలు నచ్చలేదు. అలాంటప్పుడు రాయ్ రచనలు చదివాడు. అప్పుడు గాని రాణెకు అసలు విషయాలు అవగహన కాలేదు. అంతటితో మారిపోయి, రాడికల్ హ్యూమనిస్ట్ గా పరిణమించాడు.

రాణె చాలా కాలం రాడికల్ హ్యూమనిస్ట్ పత్రిక నడపటానికి ఆర్ధిక సహాయం చేశాడు. "మేరా భారత్ మహాన్" అనే శీర్షికన రాడికల్ హ్యూమనిస్టులో హాస్య, వ్యంగ్య రచనలు చేశాడు.

ప్రస్తుత సంకలనానికి Good Times-Bad Times-Sad Times అని పేరు పెట్టారు. రాణె రచనలలో వృత్తి రీత్యా అనుభవాలు, ప్రజాస్వామ్యం,సెక్యులరిజం, మతం,మానవ హక్కులు మొదలైన అంశాలన్నీ చేర్చారు. కొద్దిగా స్వీయగాధ కూడా వున్నది.

వి.ఎం. తార్కుండే యీ సంకలనానికి పీఠిక రాశారు. రాడికల్ హ్యూమనిస్ట్ ఉద్యమం పేద వర్గాలలోకి చొచ్చుకపోవాలని తార్కుండే అన్నారు. తార్కుండే 90 ఏట,ఆయనపై ఒక పెద్ద గ్రంథాన్ని రాణె వెలువరించారు. ప్రస్తుతం 75వ ఏట వున్న రాణె, జీవితమంతా రాడికల్ హ్యూమనిస్టు ఉద్యమానికి కృషి చేస్తామని అన్నారు.

ఎం.ఎన్.రాయ్ నడిపిన అధ్యయన శిబిరాలలో పాఠాలు నేర్చిన రాణె, జాతీయవాదంలో వున్న లోపాన్ని గ్రహించగలిగాడు. మతాన్ని రాజ్యాన్ని వేరుపరచవలసిన అవసరాన్ని అర్ధం చేసుకున్నారు. ప్రజాసంఘాలు ఏర్పరచవలసిన అవశ్యకతను, అట్టడుగునుండే ప్రజాస్వామ్యం నిర్మించాల్సిన తీరు గ్రహించారు.

కాంగ్రెసు ఫాసిస్టు ధోరణిని, జన్ సంఘ్ మతమౌఢ్యాన్ని రాణె తన వ్యాసాలలో బట్టబయలుచేశారు. నాస్తికత వివరించి ప్రతి రాడికల్ హ్యూమనిస్ట్ కూడా నాస్తికుడేననీ, అయితే తాత్విక అవగహన, తాత్వికపునాదులు మానవవాదులకు వుండటంతో వారి ధోరణి పరోక్షంగా గాక,ప్రత్యక్షంగా సాగిపోతుందన్నారు.

రాణె రచనలు ఇంగ్లీషులో సరళంగా వున్నాయి.

M.A. Rane, 75th Birthday Felicitation Committee వారు ప్రచురించిన 500 పుటల గ్రంథాన్ని 300 రూపాయలకు యిస్తున్నారు.

- హేతువాది, ఏప్రిల్ 2001