Jump to content

అన్నమాచార్య చరిత్రము/నారాయణుఁడు

వికీసోర్స్ నుండి

అక్కొమరుండు నారాయణాహ్వయుఁడు
చక్కఁగాఁ దనవద్దఁ జదువకయున్న

నూటుకూరను పొరుగూరఁ జుట్టముల-
చాటునఁ గొనిపోయి చదువఁబెట్టుటయు,

ఆ చుట్టములు వేడ్క నయగారియొద్ద-
నా చిన్న పాపని నమరించి నిలుపఁ

గొదుకుచు గురుడుఁను గొన్నాళ్ళు తోడఁ-
జదివెడు పడుచులచందంబు చూపి

సామంబుచేతనె చదివించి చూచి
యామీఁదఁ గొన్నినా ళ్ళదలించి చూచి

మఱి కొన్నిదినములు మైనొత్తి చెప్పి
వెఱపారఁ దఱటున వేయించి చూచి

నూఱుమాటలు చెప్పి నులిపెట్టి చెక్కు
నూఱిపోసినఁగాని నుడుగు నోరికిని

రాకున్న నిదియెట్టురా గొంటు వీని
పోకలఁ జూడ నబ్బురమయ్యె నాకు

నని యొక్కనాఁడు బిట్టదలించి తిట్టి
మొనసిన కోదండమున వ్రేలవేసి

కోలగగ్గెరఁ ద్రోసి గుంజిళ్ళఁ బెట్టి
పైలావు దొరుఁగంగ బడిపెట్టు పెట్టి

యీ లాగు గాసింప నెదురుమాటాడఁ
జాలక కన్నీరు జాఱ బాలకుఁడు,

ఒంటు సేసెదనని యొకకొంతసేపు
నింటివారలఁ జూచి యొక కొంతసేపు

గడుపుచు నందును గడతేరకున్న
బడిబడి పెట్లను బడి చాల బడలి

ఆ యూర నొక చింతలమ్మను శక్తి-
పాయనిగుడిఁ ద్రాఁచుఁబాముండు ననుచు

జనులెల్లఁ జెప్పి యాశ్చర్యంబు నొంద
వెనుకకుఁ దా నది వినియుండెఁ గనుక

కఱవనీ నా బాధకంటె నా పాము
కఱచిన నెగులెల్లఁ గడకేఁగు ననుచు

కోపంబుతోడ నా గుడిలోని కరిగి
ఆ పుట్టలోఁ దనహస్తంబు నిడిన,

దేవి త్రికాలవేదిని గాన శిశువు
భావించి తోడ రూపమున నేతెంచి

బాలక కాలసర్పముసొచ్చు పుట్ట-
నేల కేలిడితి విందేల వచ్చితివి

అనుడు నారాయణుఁడను బాలకుండు
కనుదోయి కన్నీరు గదుర నిట్లనియె;

అడిముఱిఁ జదువురాదని యయ్యవారు
పఱచు నా పాటులఁ బడనోప కేను

అలసివచ్చితి నిట కన్న నద్దేవి
వలవదు నీకేల వగపు నా తండ్రి !

గొనబుమీఱిన పలుకులజోటి మామ
జనమేజయునకుఁ బ్రసన్నుఁడైనాఁడు

ఆ శంకరాదులు నతని వేడుదురు
కేశవుం డాశ్రితక్లేశనాశఁకుడు

మీ తాళ్ళపాకలో మెఱయుచునుండు-
నా తామరసనేత్రు నాలయంబునకు

వలసుట్టి మ్రొక్కు మవ్వల వాని కరుణ-
నలరుచు సకలవిద్యలు నీకు వచ్చు;

అదియునుఁగాక మూఁడవ తరంబునను
వదలని కీర్తి మీ వంశంబునందు

పరమభాగవతుఁడు ప్రభవించు శౌరి-
వరమున జగదేకవల్లభుండగుచు;

అనుచు నంతర్హితయైన నా పాపఁ-
డనయంబు హర్షించి యరుదందికొనుచు

ఆ తాళ్ళపాకకు నరిగి వేవేగ
జాతరూపాంశుఁ గేశవు గాంచి మ్రొక్క(క్కి?)

స్వామి గేహములకు వలచుట్టి కేలు-
దామరల్ మొగిచి యత్తఱి శరణొంది

స్వామి ! కేశవ ! సరస్వతి మామ ! విద్య
తామసింపక నాకు దయ సేయు మనుడు,

ఆ మాధవునికృప నంబుజాసనుని-
భామ యాతనిజిహ్వపైఁ బాదుకొనియె;

సరగున మఱునాఁడు సని యర్భకుండు
గురునకు మ్రొక్కి మక్కువఁ దనతోడఁ

జదివెడుపడుచు లాచార్యుండు శాస్త్ర-
విదులును జూచి నివ్వెఱఁగంది పొగడ

పంచినచోటెల్లఁ బదమును గ్రమము
కొంచించ కతఁడు గ్రక్కునఁ జెప్పి మఱియు

క్రమ శిఖ జటయు వర్ణక్రమసరణి
బ్రమయక నిజవేదపాఠంబు సలిపి

కడమవిద్యలయందుఁ గడునేర్పు గలిగి
కడఁక వారల మెచ్చు గైకొని వచ్చి

జగతి నందఱుఁ జూచి సర్వజ్ఞుఁ డనఁగ
మిగుల వాక్ప్రౌఢిమ మెఱయుచు నుండె;