అన్నమాచార్య చరిత్రము/అన్నమయ స్వామిని దర్శించుట

వికీసోర్స్ నుండి

బంగారుగాదెలపజ్జ సాష్టాంగ-
మంగవింపుచుఁ బులకాంకితుఁడగుచు

గ్రక్కున దగ్గఱఁ గనుపట్టు పసిఁడి-
టక్కుల తలవాకిటను గానవచ్చు-

ధళ ధళల్ తులకించు దరచక్రహస్త-
ములు బొడ్డుమానికమును గఠారమును

మంజీర కింకిణీ మంజులపాద-
కంజద్వయంబును గాంచనాంబరము

కటిమీదఁ జేర్చిన కరపంకజంబు
తటుకున వరమిచ్చు తమ్మి కెంగేలు

కులికెడు మణిమయ కుండల ద్యుతులు
కలకలనగు ముద్దుగారు నెమ్మొగము

మంచిముత్యాల నామంబుపైఁ గాను-
పించు రత్నాంశుదీపిత కిరీటంబు

తట్టుపునుంగు పూఁతయుఁ గిరీటాదిఁ-
జుట్టిన చెంగల్వ చొళ్ళెంపుదండ

వనమాలికయును శ్రీవత్సకౌస్తుభము
అనుపమ దివ్యభూషాదివైఖరులు

గలిగిన దివ్యమంగళ విగ్రహంబు
గలయంగఁ గన్నుల కఱవెల్లఁ దీర

సేవించి తనివోక శ్రీవేంకటేశు
దేవుని మఱియుఁ గీర్తింపంగఁదొణఁగె;

కంటి నయ్యఖిలాండకర్త నే నధికుఁ
గంటి నా యఘము నిక్కము వీడుకొంటి

పావనంబైన పాపవినాశనమ్ము
కోవిదుల్ కొనియాడు కోనేఱు గంటి

నావంటి దీను విన్నప ముద్ధరించు
శ్రీవేంకటేశ్వరు సేవింపఁగంటి

అను నర్థ మలవడ నా దేవునెదుట-
ననువుగా సంకీర్తనంబులు సేయఁ

దనుఁజూచి యచట నందఱు మెచ్చి మెచ్చి
చనవిచ్చి తీర్థప్రసాదంబు లిడుచు

ఎదజేర్చి శఠకోప మిడుచు దీవింపఁ
దదనుజ్ఞ నొక విడిదల కేఁగె; నంతఁ-

బ్రాయమెక్కుచు విష్ణుపదపల్లవంబు-
చాయ చాయల నెఱసంజఁ జూపట్టె-

నల కలానిధి; భక్తి కా రాత్రి మేను
పులకించెనన మింటఁ బొడమెఁ దారకలు;

గగనాచ్యుతుఁడు సుధాకలశంబు గొన్న-
పగిదిఁ జందురుఁడు చూపట్టె నెంతయును;

అరయ నన్నయగురు ననురక్తి బెరయు-
హరిబింబమోయన హరిబింబ మలరె;

హరిచరణ స్మరణాశక్తుఁ డగుచు
హరివాసరంబైన యమ్మఱునాఁడు-

నీరీతి నెనిమిది యేఁడుల పిన్న-
బాలుఁడయ్యును నిష్ఠఁ బనిఁబూని యతఁడు

దైత్యుఁదారకు గొంచు దఱిగిన బ్రహ్మ-
హత్య సేనానిఁ బాయఁగఁ జేయునట్టి-

కొమరధారను, దేవకులములు గొలుచు-
నమరతీర్థమును, నయ్యంజనాదేవి

కనకాంబరుని మెచ్చుఁ గను పనిమంతు
హనుమంతుఁ గాంచిన యాకాశగంగ

సారెకు జనుల దోసములు నీరగుచుఁ
బాఱిపోఁజేయు పాపవినాశనమును

బార్థు కోరికలిచ్చు పాండవనామ-
తీర్థంబు మొదలైన దేవతీర్థముల-