Jump to content

అన్నమాచార్య చరిత్రము/అన్నమయ్య తిరుమలయాత్ర

వికీసోర్స్ నుండి

నింటివారలు పిల్చి యేమి చెప్పినను
గెంటనాడక పరికించి సేయుచును

జననియు నన్నయు జనకుండు వదినె
యును గొన్నిపనులు సేయుచుఁ దన్నుఁ బిలిచి

పసులకు కసవుఁ దేఁబనుప బాలుండు
వెస నేఁగి వాఁడి లవిత్రంబు పూని

మరకతాంకూరకోమల భర్మరుచులఁ
గరమొప్ప పచ్చని గఱిక వీక్షించి

పాపవల్లరుల శ్రీపతినామ హేతి
నేపారఁ దఱుగు యోగీంద్రుచందమున

కెసిమస నొక పిడికెఁడు గోసి మఱియుఁ
గసవు గోయఁగఁబోయి కడవ్రేలు సోఁకి

వడియు నెత్తురు సూచి వాక్రుచ్చి శౌరి-
యడుగులు దలఁచి శ్రీహరి హరీ ! యనుచు

నీ కోఁతకొలఁది నాదెఱిఁగిన వదినె
చేకోఁత పడఁగాదు చీ రోఁత యనుచు

హరి చరాచరదేహి యని పెద్ద లనఁగ
నిరవొంద నెఱిఁగియు నిటు సేయఁదగునె

చిడిముడి నేమి చేసెదనంచు చేతి-
కొడవలి నేల గ్రక్కునఁ బాఱవైచె;-

నెన్నటి చుట్టంబు లిటువంటివార-
లెన్నటి బంధుండ నేను వారలకు-

నీ వట్టివెఱ్ఱి నాకేల కావింప
భావింప నాలోనఁ బాయ కెల్లపుడు

తల్లియుఁ దండ్రియు దైవంబు గురువు-
నెల్లసంపదలునై యెల్లచందముల

ననుఁబ్రోచు శేషాద్రినాథునిఁ గొలిచి
మనియెద ననుచు నెమ్మది పాదుపఱిచి

నలుదెసల్ పరికించి నానావిధముల
విలసిల్లు శ్రీరాగవెల్లువల్ వోలె

దండెలు శ్రుతిగూడి తాళసంగతుల
దండిమద్దెలలు బిత్తరముగా ముట్ట

నానందబాష్పము లడర నాగతుల-
నా నందనందను నంకించి పాడి

తన్మయులగుచుఁ జిత్రపునాట్యగతులఁ
జిన్మయునందునే చిక్కి చొక్కుచును

సనకాదులను పేరఁ జనుదెంచువారి-
ననుపదంబు నిది మహర్లోకమనుచు

గోవింద గోవింద గోవింద యనుచు-
నా వరుసనె నరహరి హరీ యనుచు

తిరుమలప్పను నాదు దీరకమున్న
వరములప్పని మ్రొక్కి వర్ణించువారి

నెఱులందు రంగువన్నెలు పిసాళించు-
నొఱపైన నిడుద మయూరకంఠములు

నటియించు కృష్ణాజినపుఁగిరీటములు
బటువైన బేగడ పాఱుటాకులును

పీలికుచ్చుల నెక్కు పెట్టిన దిండ్లు
ఫాలరేఖల నిండు పట్టెనామములు

ఘనమైన శంఖచక్రముల ముద్రికలు
పనుపడ దేవరబాణముల్ పూని,

కోనేటిరాయఁడె కొండలవాఁడె
కానికరూకలఁ గనఁజాలువాఁడె

వరుస బంగరుమేడవాఁడె తిమ్మప్ప
వరముల రాయఁడె వాఁడె తిమ్మప్ప

గొడ్డురాలికినైనఁ గొమరుల నొసఁగి
వడ్డికాసులఁ గొనువాఁడె తిమ్మప్ప

అనుచుఁ బేరమువారి యడుగుల నిడిన
దిను సైన కంచుటందియలు సారెకును

ఘల్లుఘల్లునఁ బాతకముల గుండియలు
ఝల్లుఝల్లను విలాసములును మెఱయఁ

గరముల బొణిగెలఁ గడురమ్యముగను
పరిషజ్జనంబుల పజ్జ నేఁగుచును,

ముక్తిదాయక పురములు నేడు చూడ
యుక్తి వేంకటగిరి యొద్ద నున్నట్టి-

పల్లెలో గొల్లలపాలింటి శక్తి-
యల్లారునని మును లనిశంబుఁ బొగడ

గనుపట్టునట్టి యా గ్రామంపు శక్తిఁ
గనుఁగొని బహు నమస్కారముల్ జేసి

అళిపుళిసింగరి నర్చించి మ్రొక్కి
తలి(ల?)యేఱుగుండు సందర్శించి కదలి

పెద్ద లెక్కుడుగాఁగఁ బేర్కొనుచుండు-
పెద్దయెక్కుడుఁ గూర్మి పెనఁగొన నెక్కి

కపురంపుఁదావులు గడునూలుకొలుపుఁ-
గపురంపుఁగాలువఁ గడచి యంతంత-

నా మహాచలవీథి నలరారు పుణ్య-
భూమిజంబులఁ బుణ్యభూముల జనులఁ

బావననదుల శోభన వస్తుతతుల
సేవించికొనుచు మచ్చిక వచ్చి వచ్చి

వేకువజామున వెడలి జామెక్కు-
దాఁక మిక్కిలి యెండదాఁకంగ నడిచి

యెన్నఁడు తల్లిపక్కెడసి యొండెడల-
నున్నట్టివాఁడు కాకుండుటవలన

కడపవాకిలి దాఁటి కడయిండ్లకడకు
నడచుట మునుపు నెన్నఁడు లేదు గనుక

నాఁకట నసురుసురై బాలకుండు
మోఁకాళ్ళ ముడుపు నిమ్ములఁ జేర వచ్చి

కమ్మని గణుపుచెంగట వాటమైన-
తుమ్మెదతొలుల సందుల చల్లగాలి

రాణ దూఱఁగ వింతరాగంబు పొలఁగ
వేణునాదము సేయు వెన్నుఁడో యనఁగ

పరువంపుఁ దలిరుజొంపములఁ బెంపొలయు
మరకతశ్యామ నిర్మల నిజాకృతుల-

నెదురు చల్లనితావు లెసఁగించు వెదురు-
పొదక్రిందఁ గూర్చుండి పొలయు లేఁజెమటఁ

దొడిగిన చెప్పులతోడనే మిగుల
బడలిక నొకరాతిపై శయనింప,