అన్నమాచార్య చరిత్రము/అన్నమయకు దేవి ప్రత్యక్షమగుట

వికీసోర్స్ నుండి

నితరు లెవ్వరి యాత్మ లెఱుఁగనియట్టి-
యతని యాఁకలి జగదంబ తా నెఱిఁగి

యలమేలుమంగ తియ్యము నెయ్య మెసఁగ
బలుచన్నుఁగవ తుదఁ బాలు చిప్పిలఁగ

మినుకారు క్రొక్కారు మెఱుఁగుచందమున
ఘనపయోధరములఁ గడుఁజూడఁ గలిగి

దినుసైన లేఁబువ్వుఁదీగె కైవడిని
మొనసిన బలుమొల్లమొగడలఁ దనరి

పనుపైన రాచిల్కభాతిఁ జక్కెరలు-
గొసరెడు పల్కుల గొనబు చూపుచును

విరివంటివాని చే వెడవింటి నారి
దొరసి నిక్కిన కొప్పుతో నొప్పుమీఁఱి

కమనీయమగు చంద్రకళ సోయగమున
నమృతాధరస్ధలి నలరి చూపట్టి

కులుకుఁదావుల తమ్మికొలని భావమునఁ
బొలుచు హంసక నాదములు బిడారించ

పెద్దముత్తైదువ పేర్మితో బాలు
నొద్దకు నేతెంచి యూఱడింపుచును

పడుచ! యేమిటి కిటఁ బడియున్నవాఁడ-
వద(డ?)లక లేచి రమ్మన్న, నా శిశువు

పైకొన్న యాఁకలి బలుదవ్వు నడచి
రాకఁ గన్నులు గానరావు మాయమ్మ!

అందులకొక యుపాయముఁ జెప్పి నాకుఁ
గందర్పజనకునిఁ గనజేయుమమ్మ!

యనవుడు కమలమహాదేవి శిశువుఁ
దన కృపామృతధారఁ దనివి నొందించి

బాలక! యీ మహాపర్వతేంద్రంబు
లాలిత సకల సాలగ్రామమయము

ఘనులకు నిది చెప్పుఁగాళ్ళ నెక్కంగఁ
జనదు నీ చెప్పులు సడలించి వైచి

కనుఁగొను కన్నులఁ గనవచ్చు ననిన,
విని బాలుఁ డట్ల కావింతు నే ననుచు

గ్రక్కునఁ బాదరక్షలు దీసివైచి
యక్కొండఁ గనుఁగొనునపుడు, గన్నులకు

వనమాలికలచే సువర్ణరేఖలను
గనుపట్టు గొనవెండ్రుకల కురంగముల

వేణు బాణాసన వితతచక్రముల
రాణించి ధరణీవరాహవైఖరుల-

నా రమానారాయణాకృతి గలిగి
శ్రీరామకృష్ణ లక్ష్మీనృసింహాది

మూర్తులన్నియు నొక్క మొత్తమైనట్లు
వర్తింపుచున్న నా వడువు వీక్షించి

మహిత సాలగ్రామమయమౌ నటంచు
బహువిస్మయము నొంది ప్రణతు లొనర్చి

యా జగజ్జననికి నభివాదనంబు-
లోజఁ గావింప నయ్యువతీలలామ

శౌరియుఁ దాను నిచ్చలు పొత్తుగలసి
యారగించిన ప్రసాదాన్నముల్ దెచ్చి

పరిపరిరుచుల నేర్పడ సేదదేర
పెరిమతో భుజియింపఁబెట్టి యూరార్చి

తిరుమలప్పని దేవదేవునిఁ గొలువ-
నరుగుమటంచు నయ్యరవిందసదన

తొల్లింటికరణి కౌస్తుభరత్నహారు-
నుల్లంబుమీఁదట నుండె నుండుటయు,

శ్రీమూర్తులందుల చిహ్నంబు లిపుడు-
నా మహాచలశిలలందు నింపొందు-