అడవి శాంతిశ్రీ/పంచమ భాగం

వికీసోర్స్ నుండి

పంచమ భాగం

బోధి సత్వుడు

బుద్ధత్వం పొందే ప్రతిదివ్యుడూ అనేక బోధిసత్వావతారాలు పొంది దీనమానవ సహాయం చేస్తూ అష్టమార్గాలు తన జీవిత విధానంచే బోధించి అవతారం చాలిస్తూ ఉంటాడు. సిద్ధార్థుడై, శాక్యసింహుడై, బోధిసత్వుడై, అర్హతుడై, బుద్ధుడైన సమంతభద్రుడు ఈ సంపూర్ణావతారం ఎత్తకపూర్వం అనేక బోధిసత్వావతారా లెత్తి, వితరణం, సత్యచింతన, ధర్మచింతనాది మహాగుణాల తన జీవితంలో ప్రదర్శించాడు. శాక్యసింహుడై, బుద్దుడై లోకాన్ని ఉద్ధరించి తుషితలోకంలో ఉన్నవెనుక, ఆయన ఉత్తమశిష్యులలో మహోత్తముడైన మైత్రేయుడు బుద్ధావతారోన్ముఖుడయ్యాడు. అందుకై ఆయన బోధిసత్వుడై నాగార్జున దేవుడుగా అవతరించాడు.

నాగార్జునదేవుడే మహాసాంఘికవాదానికి తండ్రి. మహాసాంఘికవాదం అదివరకే ఉద్భవించినా, దానికి పుష్టికలుగచేసిన అవతారమూర్తి నాగార్జున దేవుడే. ఆ మహాపురుషుడు శుద్ధసాత్వికుడు. బౌద్ధధర్మమును మానవుల దుఃఖము, ఆర్తి, బాధతొలగించడానికై తధాగతుడు లోకానికి ప్రసాదించినారు. ఆలాగే వేదసంప్రదాయాదికాలు లోకానికి ప్రసాదింపబడినవి. లోకం ఎప్పుడూ సమ్యక్‌మార్గంమీద నడిచినప్పుడే లోకశాంతి. అందుకై పూజావైరుధ్యాలను మహాయాన ధర్మ ముపదేశించి సమన్వయంచేసినా డీ పరమపురుషుడు. అతడు అహింసా పరమావతారము. భారతదేశంలో మహాయుద్దాలు చేశాడు. వారి బోధిసత్వగాధలు ప్రజానీకంలో ఎడారిలో చల్లనినీరులా ప్రవహించినాయి. ఆ సత్యమూర్తి నుండివెడలిన చంద్రికాకాంతి లోకం అంతా శాంతి కాంతులతో ఉత్తేజితం చేసింది.

ప్రజలు తమ సంప్రదాయధర్మాన్ని వ్యక్తిగతం అని సంపూర్ణంగా గ్రహించారు. ధర్మం పేరున దారుణాలు జరపడం మానివేసిరి. ప్రజలు స్కందుని, రుద్రుని, విష్ణుని, ఇంద్రుని, బ్రహ్మను, సూర్యుని, అగ్నిని, తధాగతుని దీపాల తిన్నెలయిన చైత్యాలను అరమరిక లేకుండా పూజచేస్తున్నారు. నాగార్జునదేవుడు శతవృద్దయి పండులా తన ఆశ్రమంలో దివ్యమూర్తయి ఉన్నారు. దేశ దేశాలనుండి బౌద్ధభిక్షువులు, అర్హతులు, ఆచార్యులు, భదంతులు ఆ అవతారమూర్తిని దర్శించడానికి వస్తూ ఉంటారు. ఆలా దర్శించడానికి వచ్చినవారు దూరాన నుండే వారికి సాష్టాంగప్రణామాలిడి వెళ్ళిపోతూ ఉంటారు. కొద్దిమంది మాత్రమే ఆ బోధిసత్వావతారునితో మాట్లాడడానికి వీలు. ఎవరికి ఏ అనుమానంఉన్నా ఆ దివ్యరూపుని చూడగానే అవి రహితం అయిపోతవట. వచ్చిన భక్తులకు అతిథి సత్కారాలు నగర పంచాయతీ సంఘం చేస్తూ ఉంటుంది. ధర్మగిరిపై సంఘారామంలోనే అనేక అతిథిగృహాలున్నాయి. కొండక్రింద ఒక చిన్న గ్రామంలో ఉన్న భవనాలు అతిథులు ఉండడానికి కట్టినారు. శ్రీ నాగార్జున దేవునకు బ్రహ్మదత్తుని నౌక గాలివానలో ఏమైనదో తిరిగిరాలేదని వార్త విన్పించినారు ముఖ్యశిష్యులు. వెంటనే ఆ దివ్యమూర్తి నవ్వి, “బ్రహ్మదత్తుడు చేయవలసిన మహోత్తమకార్యాలు ఎన్నో అలా ఉండగా ఏలా మాయంకాగలడు?” అన్నారట.

అంతే ఆయన అన్నమాటలు. వెంటనే ఆ మాటలు శాంతిమూల చక్రవర్తికి వార్త పంపించారు శిష్యులు. చక్రవర్తి ఆ మాటలు వినగానే ఎంతో ఆనందంపొంది, గుండెలలోనుండి బరువు తీసివేసినట్లయిపోవ ఆనందంలో ఆసనంపై చదికిలబడినాడు. ఆ యువకునియందు మహారాజుకున్న ప్రేమ అప్రతిమానం. ఆ మరునాడు శ్రీశైలంనుండి ధర్మదత్త మహర్షి శాంతిమూలునికి వ్రాసిన లేఖ అందింది.

“మహారాజా! బ్రహ్మదత్తుడు కారణజన్ముడు. అతని ఓడ జ్యోతిష గణనం ప్రకారం ఒక విదేశం చేరింది. అతనికి ప్రస్తుతం గండం ఏమీలేదు. ఆ బాలుడు కొలది దినాలలో తమ్మువచ్చి కలుసుకుంటాడు. ఏది ఎట్లయినా కర్మ బలవత్తరము. కర్మను ఆచరించడము, ఆ ఫలము కర్మకే వదలి పెట్టడము భగవాన్ శ్రీకృష్ణుడు సెలవిచ్చిన స్థితప్రజ్ఞుని లక్షణము మహారాజా! మీరేమీ దిగులు పెట్టుకోవద్దు. అన్నీ శుభంగా పరిణమిస్తాయి. మీ జాతకమూ, బ్రహ్మదత్తుని జాతకమూ పరస్పర గాఢసంబంధంతో చాలాకాలం వరకూ ప్రయాణం చేస్తాయి. యువరాజు జాతకానికీ, అమ్మాయి శాంతిశ్రీ జాతకానికి బ్రహ్మదత్తుని జాతకానికీ చాలా సంబంధం ఉన్నది.”

ఈ కమ్మ శ్రీనాగార్జున దేవుల కడనుండి శుభవర్తమానం వచ్చిన నాలుగు ఘడియలకే వచ్చింది. ఇక శాంతిమూలుని సంతోషానికి మేరలేదు. ఆ దినమున ఏకారణం చేతనో అన్నట్లు భిక్షులకు, బ్రాహ్మణులకు వివిధ దానాలు చేయించారు. స్కంద దేవాలయాలలో, చైత్యాలలో పూజలు విరివిగా జరుప ఆజ్ఞలు దయచేసినారు.

మహారాజు వీరపురుషదత్తప్రభువును పిలిపించి “తండ్రీ! వెంటనే పూంగీప్రోలు వెళ్ళి అత్తయ్యగారినీ, మామగారినీ, బావగారినీ, మరదలునూ మన వసంతోత్సవాలకు ఆహ్వానంవేయి. నేను పవిత్రయజ్ఞం ఒకటి తల పెట్టినాను. ఆ విషయంలో మీకందరకూ ఇక్కడనుండి వార్త వచ్చేవరకు మీరు అక్కడే ఉండండి. బ్రహ్మదత్త ప్రభువు ఓడ తిరిగి రావచ్చును” అని తెలిపినారు.

శుభముహూర్తం చూచి వీరపురషదత్త ప్రభువు సపరివారంగా పూంగీప్రోలు వెళ్ళినారు.

2

ఆంధ్రదేశంలో బౌద్ధ, జైన, అర్షమతాలు మూడూ సమంగా ముందుకు సాగిపోతూ ఉన్నాయి.

ఆంధ్రులు ఎప్పుడూ స్వాతంత్ర్యప్రియులు పరివర్తనశీలురు. వారికి “కొత్తో వింత,” అందుచే అర్షసంప్రదాయము విజృంభించి ఉన్నప్పుడు శైవము, కార్తికేయము, గాణాపత్యము, శాక్తేయము రుచిచూస్తూ ఉండేవారు. బౌద్ధధర్మాచార్యులు వచ్చి, బౌద్ధధర్మము బోధిస్తే వెంటనే బౌద్ధధర్మాభిరతులై పోయారు. బుద్ధావతార కాలంనుంచీ సంప్రదాయంగా వచ్చే మార్గాలలో సాంఘికవాదం తీసుకువచ్చినవారు ఆంధ్రులే. సంప్రదాయవాదులగు వీరు స్థవిరవాదులన్నారు. ఆ వాదాన్నే “తెరవాదము” అనికూడా అంటారు.

వైశాలిలో బౌద్ధమహాసంఘ సమావేశం జరిగింది. అలాంటి సమావేశాల్ని “సంగీతి” అంటారు. ఆ సంగీతిలో పెద్దలందరూ సంప్రదాయవాదం గ్రహిస్తే యువజనులు బుద్ధదేవునే భగవంతుడని నమ్మి అవతారభావ మాయనకు కల్పించారు. వీరు ప్రజాహితులు గనుక మహాసాంఘిక వాదమని పిలుచుకొన్నారు. మహాసాంఘిక వాదంలో అనేక చిన్న చిన్నవాదాలు పుట్టుకువచ్చాయి. ఈ వాదాలన్నిటికీ ఆంధ్ర లేక ఆంధ్రవాదాలని పెద్దలు పేరు పెట్టినారు. శ్రీ నాగార్జునదేవుడే బౌద్ధయానానికి శంకరభగవత్పాదులు అద్వైతమునకు వలె దర్శనాలు రచించి శూన్యవాదానికి జనకులయ్యారు. ఇన్ని మార్పులు వస్తూ ఉన్నా ఆ దినాలలో దీక్షలు పుచ్చుకొనడం, దీక్షలు మార్చు కోవడం పెద్ద తప్పుకాదు. తండ్రి బౌద్ధుడు, కుమారుడు శైవుడు, తల్లి జైన ధర్మపరురాలు. కోడలు ఒకవైపు బౌద్ధ చైత్యానికి ఆయక స్తంభం వేయిస్తుంది. వేరొకప్రక్క స్కందపూజ చేయిస్తుంది. మీమాంసలు, జిజ్ఞాసలు, వాదాలు, బౌద్ధాచార్యులకు పండితులకూ, భిక్కులకూ, జైన సన్యాసులకూ మాత్రమే! నమ్మకాలలో తప్ప వివిధ వాదాలవారి సాధారణ జీవితాలలో తేడాలులేవు. జైనుడైనా, బౌద్ధుడైనా ఆంధ్రసంసారివేషం, జీవితమూ ఒక్కటే. ఈవల చైత్యపూజ చేస్తాడు, ఆవల శైవదేవాలయానికి వెడతాడు. మర్నాడు ఇంట్లో బిడ్డకు జబ్బు చేస్తే కొండదేవతకు బలులు పంపుతాడు.

ఆడవి స్కందవిశాఖాయనక బ్రహ్మదత్త ప్రభువు క్షేమంగా వస్తారని శ్రీ నాగార్జున దేవులూ, శ్రీ ధర్మధత్తమహాఋషి సెలవిచ్చినారన్న వార్త పూంగీప్రోలు చేరింది. వెంటనే వాసిష్టీ పూంగీయరాణి శాంతశ్రీదేవి పూంగీప్రోలు దేవత సాగరికాదేవి ఆలయానికి వేయి కొబ్బరికాయలు అర్పించింది. పట్టణ చైత్యాలన్నిటికీ ఒక్కొక్కదానికి వేయిచొప్పున దీపాలర్పించింది. బ్రహ్మదత్తుని జీవితంతో ఇక్ష్వాకువంశ భవిష్యత్తు గాఢసంబంధం కలిగి ఉన్నది అని ఆమెకు పూర్తిగా తెలుసును.

శాంతిశ్రీదేవి చాలా అందకత్తె. రాజనీతిలో మేటి. ఆమె అన్నగారికి కుడిచేయి. ఆమెచెల్లెలు హమ్మశ్రీదేవి చదువుకొన్నది. సంగీత, నాట్య, సాహిత్యాది విద్యలందు ప్రజ్ఞావంతురాలే కాని రాజకీయాలలో ఎప్పుడూ పాలు పుచ్చుకొనేదికాదు. రాజకీయాలు శాంతశ్రీదేవివే! శాంతశ్రీ చాణుక్యదేవుని అర్థశాస్త్రము, శుక్రనీతీ, గౌతమ ధర్మసూత్రాలు, ఆపస్తంభ బౌద్దాయన సూత్రాలు పూర్తిగా చదువుకొన్నది. బౌద్ధమత గ్రంథాలన్నీ అవలోకించినది.

తన మేనల్లుడు, వాసిష్టీపుత్రి భట్టిదేవి కుమారిని తన పట్టపుదేవిగా చేయడం తమకు సమ్మతమే. ఈలాంటి క్లిష్టకాలంలో ఒక్కొక్క పురుషుడు ఇరువురు మువ్వురు భార్యలను చేసుకోవలసి ఉంటుంది. పట్టమహిషి ఎవరైతే నేమీ, ఆ విషయము రాజకీయమై! ఒకసారి రాజవంశం బలపూర్ణమైతే ఆ మీద స్త్రీ పురుషుల ప్రేమయే ప్రధానం అవుతుంది. తాను ప్రేమించి చేసుకొన్నది స్కందశ్రీ ప్రభువును. తన కొమరిత మేనల్లుని ప్రేమించింది. మేనల్లుడామెను గాఢంగా ప్రేమించాడు. వారి విహహం నిశ్చయంకాక వాసిష్టి భట్టిదేవియే పట్టమహిషి కావచ్చుగాక. అయినా స్త్రీహృదయం అతి విచిత్రమయినది. ఒక స్త్రీహృదయం ఇంకొక స్త్రీకి తెలియడం కష్టం. తన బాలిక వనదేవత కానంత మాత్రాన అంత బాధపడడం ఎందుకు? తాను మాత మీ విషయంలో ఏమిచేయగలదు? ఇంతకూ ఆ యువతీ యువకులే మనస్సు స్థిమితం చేసుకోవాలి. చెల్లెలు హమ్మశ్రీ కొమరిత బాపిశ్రీకుమారిని త్వరగా రప్పించాలని ఆ దేవి అనుకొన్నది.

ముప్ఫైఏడు ఏళ్ళు వచ్చినా, వాసిష్టశాంతశ్రీదేవి వింశతి వర్షప్రాయ. పూర్ణయౌవన మధుర్యాంగి, దివ్యసౌందర్యోజ్వల శరీరలా ఉంటుంది. ఆమె నడకలో వయ్యారము, మాటలో గాంధర్వము, కన్నులలో దీప్తి ఏ మాత్రమూ తగ్గిపోలేదు. భర్తను భగవంతునివలె పూజిస్తుంది. అన్నగారంటే దేశకునికన్న ఎక్కువ భక్తి, ఇక్ష్వాకువంశం అంటే భగవదంశా సంభూతమనే ఆమె నమ్మకం. సిద్దార్థదేవుడు ఇక్ష్వాకువంశంలోంచే ఉద్భవించాడు. ఇక్ష్వాకువంశంతో కొంచెం సమమైన వంశం శాతవాహనవంశం. ఇక్ష్వాకులకు మంచిదశలు పోవడంచేత, వారు ఇతరులకు సామంతులయ్యారు. ఇప్పుడు శాతవాహనులు నామకః చక్రవర్తులు. వారి చక్రవర్తిత్వం రక్షించేది తన అన్నగారు.

అన్నగారు శ్రీరామచంద్రుని అపరావతారము. అతిరథశ్రేష్ఠుడు. ధర్మాభిరహితుడు, రాజ్యనీతి విశారదుడు. ఆయనకు తాను ఆలోచన చెప్పునది కాదు. ఒక మహాకార్యంలో నిమగ్నులైనవారికే, ఆ పనిలోని ధర్మాలు, యుక్తాయుక్తాలు తెలుస్తాయి. అన్నగారు బ్రహ్మదత్తప్రభువుతో మంత్రాంగం సలుపుతారు. అవతారమూర్తులు నాగార్జునదేవులు ఏలాంటి క్లిష్టసమస్యనైనా నిమేషంలో తమ పవిత్రాలోచనతో విడదీస్తారు.

ఓహో! ఏమి ఆ అవతారమూర్తి ప్రతిభ! తన చిన్నతనంలోనే మొదటిసారి వారిని చూచింది. యవ్వనదశలో వివాహంకాక పూర్వం వారిని మరల దర్శించింది. తర్వాత ఏడాదికొకసారి వైశాఖ పూర్ణిమ దినాన భక్తులందరితోపాటు వారి పాదాలకెదురుగా సాష్టాంగపడుతుంది. దేశదేశాలనుండి, చీనా సువర్ణద్వీపాలనుండి వేలకువేలు భక్తులా మహాపర్వదినాన వారి ఆశ్రమానికి వస్తారు. పూర్ణిమనాటి రాత్రి శుభమూహూర్తంలో వారి పూర్ణదర్శనము ఆకాశం క్రింద లభిస్తుంది. అనాడు వారిని దర్శంచుకొన్నంత మాత్రాన సర్వపాపాలు హరిస్తాయి. వారి కర్మ పరిపక్వమై పటాపంచలై నిర్యాణము చేకూరి తీరుతుంది.

ఈ ఆలోచనలతో ఆమెకు భక్తి పారవశ్యం కలిగింది. సప్తనాగఫణి చ్ఛత్రమూర్తిగా, మహాతేజోమండల మధ్యస్థుడుగా విన్యసింపబడిన నాగార్జున దేవుని విగ్రముకడకామె వెడలినది. శాంతశ్రీ పూజాగృహంలో స్పటిక శిలా విన్యస్తమైన బుద్ధనాగార్జునదేవుల విగ్రహాలున్నాయి. వేరొకప్రక్క స్కందదేవ విగ్రహమున్నది. శాంతశ్రీదేవి బౌద్ధనాగార్జున దేవుల విగ్రహాల కడ మోకరించి ఇక్ష్వాకు వంశాభ్యుదయానికై ప్రార్ధించింది. ఆ వెనుక ఆ దేవి మనస్సు నిర్మలమై ఏదో మహాభవిష్యత్తు ధవళ గజరూపాన ఆమె అంతన్నేత్రాల ప్రత్యక్షమయింది.

(3)

అంత వృద్ధుడయ్యూ నాగార్జునపుడు ముప్పదియేండ్ల దివ్యశరీరం కలవాడు. ఆయన మాటవణకదు, ఆయన వినికిడి అతినిశితము. ఒక ఏడు పై బడుతున్న కొలదీ ఆ అవతారపురుషుడు ప్రాపంచిక శక్తి మరీబలవత్తరమగుచూ ఉన్నది. ఆయన పండుకొనడు. అహోరాత్రము లరవై ఘడియలు ఏదో పరమయోగాన యోగాసనబద్దుడై, సమభంగికా మూర్తియై, కైలాస పర్వతశిఖరంలా వెలిగిపోతూంటాడు.

ప్రతిదినము తెల్లవారుగట్ల ఆ అవతారమూర్తి లేచి ఆ కొండమీదనే ఉద్భవించే పాతాళగంగాజలంలో కృతావగాహులై, కాషాయాంబరము ధరించి యోగాసనముపైన కూర్చుంటారు. నిర్వకల్పమైన మహాసమాధిలోనికి పోయి ఆయన మూడుఘడియల కాలం అనంత విశ్వాత్మలో లీనమైపోతారు. యోగంలోనుంచి మరల ఈప్రపంచంలోనికి రాగానే ఆ భోధిసత్వుడు కన్నులు తెరిచెదరు. నలుగురు ఆంతరంగిక శిష్యులు ఆయన కన్నులు తెరవగనే ఎదుటకు వచ్చి సాష్టాంగపడి లేచి పద్మాసనస్థులై ఆ దేవుని ఆజ్ఞలకు నిరీక్షింతురు. ఒకరు తాటాకుల గ్రంథము, గంటముతో సిద్ధముగా నుందురు. ఇంకొకరు భూర్జపత్రము, మషీపాత్ర, తూలికతో సిద్ధముగా నుందురు. ఇరువురు ఏకసంధాగ్రాహులు.

స్వచ్చమై, మధురమై, గంభీరమైన శుద్ధాంధ్ర ప్రాకృత భాషలో ఆ మహాభాగుడు వారికి నూతన సూత్రములు, ప్రాచీనగ్రంథాలకు భాష్యాలూ, వ్యాఖ్యానాలూ ఉపదేశింతురు. నలుగురకు నాలుగు గ్రంథాలుపదేశింతురు. ఆ సమయంలో ఆయన పెదవుల వెడలిన మాటలు అమృతకిరణాలై లోకమంతా ప్రసరించును. ఒకరికి రాసాయనికి సూత్రములు చెప్పుదురు. ఇంకొక శిష్యునికి జ్యోతిష్యము. ఈ గ్రంథాలు భూర్జపత్ర లేఖకుడు తాళపత్ర లేఖకుడున్నూ వ్రాయుదురు. మతధర్మాదికాలు ఏకసంతగ్రాహులగు శిష్యులు విందురు. ఈ రీతిని సూర్యోదయాత్పరం ఒక యామంవరకు జరుగుతుంది.

రెండవయామమంతా వివిధదేశాలనుండి అనేకులు, వివిధ విషయాలలో ఈ అవతార పురుషుని పవిత్రాలోచన కోరివచ్చినవారికి ఒకరితర్వాత ఒకరికి ఆ బోధిసత్వులు ఆలోచన చెప్పుదురు. సూర్యుడు ఆకాశమధ్యస్థుడగు నంతవరకూ ఈ రీతిగా సాగుతుంది. ఆ వెనక ఇరువురు భిక్కులు వచ్చి ఆ పరమ పురుషునకు ఫలాహారం సిద్ధమాయెనని నివేదింతురు.

నాగార్జునదేవుడు దేశాలన్నీ పర్యటనచేసి తిరిగి ఆంధ్రభూమి వచ్చినప్పుడు పులమావి చక్రవర్తి తనకు నిర్మించి ఇచ్చిన ఆశ్రమమూ, ఆశ్రమమున్న పర్వతానికి దిగువ లోయలో ఉన్న అపర వనశైలసంప్రదాయ సంఘారామాశ్రమ విహారాదులూ, చైత్యాలూ ఏ మహాదాతలూ చూచే దిక్కులేక దీనావస్థలో ఉన్నాయి. మహాసాంఘికులు ములకదేశంలో ప్రతిష్టానానికి ఉత్తరంగా ఉన్న భగీరాశ్రమ భగీరాశ్రమ సంఘారాశ్రమములకు అనేకులు వెళ్ళిపోయినారు.

సముద్రా లావల ఉన్న ద్వీపాలలో వలసలేర్పరచుకొన్న అనేకులతో భిక్కులు, భదంతులు, ఆచార్యులు సువర్ణ ద్వీపంలో త్రిలింగ మహానగరానికీ, కాకులానికీ, మలయ ద్వీపంలోని కాంభోజదేశంలో కాకులనగరానికి, యువద్వీపంలోని పాండురంగ, అమరావతి, విజయాదినగరాలకూ పోయి సంఘారామా లేర్పరచి, చైత్యాలు నిర్మించి, ధర్మబోధ లోకమంతా వ్యాపింప చేస్తున్నారు.

నాగార్జునదేవుడు తిరిగిరాగానే ప్రజలలో మళ్ళీ భక్తి ప్రపత్తులు పెరిగినవి. చైత్యాలు బాగుచేసినారు. సంఘారామ భవనాలు పెరిగినవి. ఇతర దేశాల భిక్కులు వేలకు వేలు వివిధ సంఘారామాలలో వివిధ సంప్రదాయాల గురించి నేర్చుకొనడానికి రావడానికి ప్రారంభించారు. దేశదేశాలనుండి సాధారణ ప్రజలు యాత్రలుచేస్తూ నాగార్జున పర్వతాశ్రమానికి ఆంధ్రదేశం లోని వివిధ పవిత్ర క్షేత్రాలకూ విరివిగా రాసాగినారు.

నానాటికీ ఈ అవతారపురుషుడు తన ఆశ్రమం వదలిరావడం మానివేశాడు. ఆ దివ్యపురుషుడు రచించిన గ్రంథాలు వేలకువేలు ప్రతులు వ్రాసికొని భిక్కులు వివిధదేశాలకు తరలించుకు పోసాగినారు. ఆయన దర్శనమాత్రాన ప్రజలకు కలిగే పవిత్రానందం ఇంతా అంతా అనికాదు. ఆ మహాభాగుని నామం తెలియని భూభాగం ఈ జంబూద్వీపంలో ఎక్కడాలేదు. సువర్ణయవ కాంభోజ చీనాదేశాలలో ఆ బోధిసత్వుని గురించి అనేక అద్భుతాలైన గాధలు ప్రచారంలోనికి వచ్చాయి. ఈ దినం ఇక్కడుండి మరుక్షణం వేరొకచోట దర్శనమిస్తారని, పక్షిగా మారి ఆకాశ మార్గాన ఎగిరిపోతారని, దర్శనమాత్రాన ఏలాంటి రోగాలైనా కుదిరిపోతాయనీ! ఒక్కొక్కప్పుడు ఆయన దేహం బంగారుమయమై ధగధ్ధగాయ మానంగా వెలిగిపోతుందని అనేక విచిత్రాలుగా చెప్పుకొని, ఆయన పేరు తలచుకొని ఉప్పొంగి పోతూఉంటారు.

4

ఆంధ్రదేశం అంతా సర్వమత వ్యాప్తమై కలకలలాడిపోతూ ఉన్నది. బోధిసత్వ నాగార్జునదేవుని బోధనలు అర్షధర్మపరులైన బ్రాహ్మణ పండితులకూ నచ్చినవి. వారు కూడా తమ దర్శన వ్యాఖ్యానాలయందు నాగార్జున దేవుని వాదనలనేకం చేర్చుకున్నారు.

బ్రహ్మదత్తప్రభువు బోధిసత్వుని తలచుకుంటూ ఆయన బోధలీ సువర్ణ ద్వీపంలో ఎంత అద్భుత ప్రచారంలోకి వచ్చినవా అని ఆశ్చర్యపడుతూ తమ పడవమీద తిరిగి ప్రయాణం చేస్తూ వస్తున్నాడు. ఆ యువక ప్రభువునకు శ్రీ కృష్ణాపదిష్టమైన దివ్యగీత అంతా సంపూర్ణార్థంతో బోధిసత్వ నాగార్జునదేవుని కంఠప్రబోధితమై వినిపించింది. వారి నౌక శాంతవర్తనుడైన ప్రాక్సముద్రవీచీ నృత్యమూర్తియై తేలివస్తున్నది. ఆ నౌక ముందు తట్టుపై కూర్చుండి బ్రహ్మదత్తుడు ఎడతెగని సముద్రవీచికామాలలూ, అంతులేని నీరూ, బ్రహ్మాండచ్ఛత్రమైన ఆకాశము చూస్తూ విజ్ఞానవిశ్వాల ఊహించుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. పరమసుందరియైన శాంతిశ్రీ రాకుమారి ఆ యువకప్రభువు మనోనయనాల ప్రతిక్షణమూ ప్రత్యక్షమవుతున్నది. అవును; తాను సర్వము తెలుసును అనుకుంటూ గర్వించి చివరకు సంపూర్ణ గర్వభంగం పొందిన విషయం ఈ సముద్ర యానంలో పూర్తిగా గ్రహించాడు. ఆ బాలిక శుద్ధసత్వమూర్తి అయినా అయి ఉండాలి, లేదా ఏదో మహా విచిత్ర భావమూర్తి అయినా అయి ఉండాలి. తాను మాత్రం ఆమెకు దాసుడు. ఆమె క్రీగంటిచూపుల మెలగవలసిన బానిస. ఈ మహారహస్యం సువర్ణ ద్వీప అమరావతి నగరంలో కలిగింది. శివమహాక్షేత్రమైన ధాన్యకటకామరావతి పేరుపెట్టి నిర్మించిన ఆ మహానగరంలో ఒక స్థూపం ప్రక్క బోధిసత్వుడైన మంజుశ్రీ విగ్రహం చెక్కి ఉంది. ఆ మంజుశ్రీ విగ్రహంప్రక్క నిలుచుండి ఉన్న మూర్తిని బ్రహ్మదత్తుడు చూచినాడు. ఆ దేవీ విగ్రహ సౌందర్యం అనన్యం. యౌవనవతులయందే ప్రేమ. పడుచువాడు ముసలిఅవ్వను ప్రేమించలేదు. అప్పుడు శృంగారావిర్భావము ఏమవుతుంది? ముసలినాయకుడైనా పడుచు నాయికను ప్రేమించవలసిందే. ముసలి అవ్వను ప్రేమించాలంటే ఏ అమ్మగానో, అమ్మమ్మ, తాతమ్మగానో ప్రేమించవలసిందే.

అలాగే పడుచునాయిక ముసలివానిని చూచి ప్రేమిందగలదా? శకుంతల దుష్యంతుని ప్రేమించింది. రత్నావళి ఉదయనుని ప్రేమించింది. కాని వాళ్ళు కౌమార నాయకులు, ఆ కౌమార నాయకుల సౌందర్యం చూచి నవయౌవనవతి అయిన నాయిక ప్రేమించదు. ఆ నాయకునియందు విశిష్ణ లక్షణాలో ఇంకా ఏవో ఉంటే అవి చూచి, విని ప్రేమించవలసిందే. కాని “ఓ సుందరాకార, ఓ జితమన్మథ” అని నవోఢ నలుబది సంవత్సరాల నాయకుని ప్రేమింపలేదు.

ప్రేమ మానవ జీవితంలోని ఒక మహోత్తమ జంతుస్వభావము. ఆకలి దప్పులులా ఈడు వచ్చిన పురుషునికి స్త్రీకి పరస్పరం వాంఛ కలిగి తీరుతుంది. ఆ వాంఛను ఎవ్వరూ ఆపలేరు. మహర్షులైనా ఆ బాధనుండి తప్పుకోలేరు. తన పూర్వీకుడైన గాంధేయ రాజర్షి బ్రహ్మర్షి యగుటకై తపస్సుచేసి చివరకు మేనకకై తన్ను అర్పించుకొన్నాడు. పశుశక్తి అయినా ఈ వాంఛ ఆహార నిద్రా భయాలకంటె ఎన్నో కొన్నిరెట్లు మహోత్తమం కదా? ఆహార నిద్రాభయాలు వ్యక్తిగతమైనవి. స్త్రీగాని, పురుషుడుగాని, జంతువులుగాని, వ్యక్తిగతంగా వృద్ధిపొందేందుకు మాత్రం ఆహారం తీసుకొంటారు. విశ్రాంతికై నిద్రా, స్వరక్షణకై భయం; కాని జాతి వృద్ధికై సంయోగం. ఈ ధర్మమే మానవునిలో ఒక తపస్సయినది. వివాహకర్మ నిర్మించుకొన్నాడు. అది ఒక పవిత్రయాగమైనది. పరవళ్ళెత్తి ప్రవహించే వరదలకు గట్లు నిర్మాణమైనవి. చివరకు తపస్సయినది. పున్నామ నరకభావం ఉద్భవించింది. “ఓహో! ఎంత విచిత్రమైనవారు మహర్పులు!”

బ్రహ్మదత్తప్రభువునకు శృంగారభావం ఆకాశగంగ భూమికి అవతరించినట్లయింది. తనగంగ శాంతిశ్రీదేవి. ఆమెకు ఈ ప్రాపంచిన చైతన్యమేలేదు. హిమవత్పర్వత శృంగముల త్రుళ్ళింతలాడే గంగకుమాత్రం భూమిపై రక్తి చటుక్కున అవతరించిందా? ఆ గంగను శివుడు జటాజూటాలలోనికి ఆహ్వానించాడు. ఎంత అద్భుతభావం? పరమశివుడు వ్యోమకేశుడు. ఆ కేశాలు సగుణరూపమై జటలుకట్టినవి. ఆ జటలలో తేజోరూపిణియైన గంగ జలరూపంగా జేరింది. ఆ జలాలలో మంచుగడ్డలు. ఆ ప్రదేశానికే మనుష్యుడు వెళ్ళలేడు. హిమాలయ శిఖరాలా జటలు. ఆ శిఖరాలలో భాగీరథిగా, మందాకినిగా, అలకనందగా, గంగాదేవి బహుప్రవాహమై ఉద్భవించి ప్రవహించి, ప్రయాగలో తన్ను తాను చేరుకుంటూ సర్వకళా రూపిణియై, యమునగా వచ్చి ప్రపంచంలో సంగమించి ప్రవహించి మహాసాగర మోక్షం పొందుతూ ఉంటుంది. తన పవిత్ర గంగామూర్తి శాంతి శ్రీదేవిలో శృంగారభావం ఏనాటికౌనా ఉద్భవిస్తుందా? నాగార్జునదేవుల మోము ఏదో దివ్యకాంతులతో వెలిగిపోయింది.

“గుణభద్రా! బ్రహ్మదత్తునికి భిక్షుకదీక్ష ఇవ్వలేను. ఆ ఉత్తమ పురుషుడు బౌద్ధధర్మం అర్ష ధర్మంలో లీనం కావించ ఉద్భవించినవాడు. ఆయన నన్ను చూడడానికి ఈ నగరం వస్తాడు. ఆ సమయంలో శాంతిమూలమహా రాజుకూడా నాదగ్గరకు వచ్చుగాక. వారు నన్ను చూచి వెళ్ళిన మర్నాడు, అమ్మాయి శాంతిశ్రీ రాకుమారిని మన ఆశ్రమానికి ఒకసారి తీసుకొని వచ్చి నా ఎదుట ప్రవేశపెట్టు.” ఆ అవతారపురుషుని అస్పష్టమైన గంభీరవచనాలు ఆగిపోయాయి. గుణభ్రదాచార్యులు నెమ్మదిగా తలవంచి ఆ బోధిసత్వునికి నమస్కరించి వెడలిపోయినాడు.

భిక్షుకులు లోకవ్యవహారాలతో ఎందుకు జోక్యము కలుగజేసుకోవాలి? వారు సర్వసంగపరిత్యాగం చేసి, గుణాలను చంపుకొని, అష్టమార్గావలంబకులై నిర్వాణగాములై ముక్తిపొందాలి కదా అని గుణభద్రుడు రెండు మూడు మారులు భగవంతునితో మనవి చేసుకొన్నాడు. వారు చిరునవ్వు నవ్వి ఊరుకొన్నారు.

భగవానుడు బుద్ధత్వం పొందనున్న బోధిసత్వులు కావడంవల్ల వారి భావాలు, చేతలు సాధారణ మానవుల ఊహల కందవు. ఆ తధాగతులకడకు మహారాజ్యాధిపతులు ఆలోచనకై వచ్చేవారు. సామాన్యులుకూడా తమ కష్టసుఖాలు వారికి నివేదించి సందేహనివృత్తి చేసుకొనేవారు. నిర్వాణపథగాములైన వారికి ఈ ప్రపంచ సంబంధం లోహనిగళరూపమే అని గుణభద్రుని మతం. గుణభద్రాచార్యులు విజయపురంలోనికి వెళ్ళేవారు కారు. ఎల్లప్పుడు ఆత్మానాత్మ విచారణ చేసుకుంటూ, బుద్ధదేవుని మూర్తిని ధ్యానిస్తూ ఉండడమే ఆయన దినచర్య. ఆయన పూర్వాశ్రమంలో ప్రతీపాలపుర నగరవాసి. చిన్నతనంలో కృష్ణానదిపాలైన తల్లిదండ్రులు, భార్య మాయమైపోవడంవల్ల సంసారంరోసి, శ్రీ నాగార్జునదేవుని కడకు చేరి కొన్నాళ్ళకు బౌద్ధదీక్ష పుచ్చుకొని, ఆ అవతార పురుషుని ఒక్కక్షణమూ వదలని ఉత్తమ శిష్యుడు.


★ ★ ★