Jump to content

అడవి శాంతిశ్రీ/చతుర్ధ భాగం

వికీసోర్స్ నుండి

చతుర్ధభాగం

పూంగీ ప్రోలు

పూంగీప్రోలు సముద్రతీర మహాపురం. మోసలపురం, శ్రీకాకుళం, శంబరద్వీపము, కళింగపట్టణము, కురంగపురం, తామ్రలిప్తి, కావేరీపట్టణము మొదలగు పెద్ద రేవుపట్టణాల ఒకటి.

అప్పటికి అయిదారు శతాబ్దాలనుంచి కృష్ణాతీరంనుంచి పినాకినీతీరం వరకు ఉన్న సముద్రతీర శాలిభూభాగానికి క్రముక రాష్ట్రమని పేరు. ఈ క్రముక రాష్ట్రం రాను రాను రెండుభాగాలయింది. ఒకటి క్రముక రాష్ట్రమూ, రెండవది పూంగీ రాష్ట్రమూ. కృష్ణానదీ ముఖద్వార దేశము క్రముక రాష్ట్రము, అక్కడనుంచి నైఋతీ భూభాగము పూంగీ రాష్ట్రమూ అయినవి. క్రముకమన్నా, పూంగీ అనినా పోకలనే అర్థం. ఈ పోకదేశం నిండా పోకచెట్లు విరివిగా ఉండేవి. శాతవాహనుల కాలంలో ఈ రెండు పేర్లూ వాడుక లోనికి వచ్చాయి. క్రముకరాష్ట్రం నుండి ధాన్యకటకంవరకు ధనకరాష్ట్రం. ధనకరాష్ట్రానికి పడమట పల్లవభోగము, పల్లవభోగానికి పడమట అడవిరాష్ట్రం; ఆ రాష్ట్రానికి ఉత్తరం కురవదేశమూ, పడమట చోళ రాష్ట్రమూ ఉండేవి.

మోసలపురంలోపాటు పూంగీప్రోలు ప్రసిద్ధ రేవుపట్టణం అవడం చేత ఇక్కడికి సముద్రాలావల ఉన్న అనేక ద్వీపాలనుండి ఓడలు వచ్చేవి వర్తకానికి. రాజ్యాలు స్థాపించడానికి అనేకులాంధ్రులు నౌకాయాత్రలు కావించేవారు. యవన సువర్ణ మలయ బలిద్వీపాలలో రాజ్యాలు స్థాపించిన ఆంధ్రులచుట్టా లాయాద్వీపాలకు వెళ్ళేవారు. వలసపోయిన ఆంధ్రులు మాతృదేశము మళ్ళీ చూడడానికి వచ్చేవారు. బౌద్ధ ఆర్య మతాచార్యులు ఆయాద్వీపవాసులకు దీక్ష ఇవ్వడానికి పోయేవారు.

బ్రహ్మదత్తప్రభువు కోటలో తన విడిదిలో ఉంటూ, ఆ మహాపట్టణం అంతా తిరిగి చూచివచ్చేవారు. చీనావారు, సువర్ణద్వీపవాసులు, యవద్వీప వాసులు ఆ నగరం అంతట నిండి ఉన్నారు. పూంగీప్రోలులోనూ బౌద్ధ చైత్యాలున్నవి. కాని ధాన్యకటక చైత్యాలకు, విజయపుర, ప్రతీపాలపురము మొదలయిన నగరాలలో ఉన్న చైత్యాలకు, ఉన్న మహత్యమూ, ప్రతిష్ఠా వీనికి రాలేదు. ఈ నగరంలోనూ ఏడెనిమిది సంఘారామాలున్నాయి. ఏ సంప్రదాయానికి చెందిన భిక్కులు, ఆయా సంఘారామాలలోకే వెడుతూ ఉండేవారు.

బ్రహ్మదత్తప్రభువు పూర్తిగా ఆర్షసంప్రదాయంవాడు అయినా పూంగీప్రోలు వచ్చిన రెండుమూడుదినాలు నగరం అంతా చుట్టి చూస్తూ అన్ని సంఘారామాలకు వెళ్ళి వచ్చినారు. మహాచైత్యవాదుల సంఘారామం సంఘారామాలన్నిటికీ దూరంగా సముద్రతీరంలో ఉన్నది. బ్రహ్మదత్తప్రభువు సంఘారామ గోపురద్వారం దగ్గర రథం దిగి, పాదచారియై సంఘారామంలోకి వెళ్ళినారు. అదివరకే అపరవనశైల సంప్రదాయానికి చెందిన ఆ సంఘారామానికి బ్రహ్మదత్తప్రభువు తన అమాత్యుని పంపి కులపతి అయిన వినయ గౌతమ భిక్షాచార్యులను మరునాడుదయం దర్శించుటకు అనుజ్జపొందెను. - ఈ దినం ఉదయం బ్రహ్మదత్తప్రభువు ఆ సంఘారామం ప్రవేశించగానే సంఘారామ వ్యవహర్త అయిన భిక్షువు వారిని ఎదుర్కొని, వారి నమస్కృతులంది ప్రతి నమస్కారంచేస్తూ “బుద్ధం శరణం గచ్చామి” అని బ్రహ్మదత్తప్రభువును ఆ విహార మందిరాలలో నుండి ఒకచోట పోకవనంలో ఉన్న చిన్న పటకుటీరానికి కొనిపోయినాడు. ఆ పటకుటీరంలో కులపతి వినయగౌతమ భిక్కువాసం. వినయగౌతమభిక్కు చీనాదేశము నుండి వచ్చిన పవిత్రమూర్తి. సంస్కృత, ప్రాకృత, పాలి మొదలగు భాషలన్నీ అనర్గళంగా చదివి, అఖండ పాండిత్యము సంపాదించినాడు. ఆ వృద్ధ చైనీయ భిక్కునకు బ్రహ్మదత్త ప్రభువు నమస్కరించి, ఆయన చూపిన తుంగచాపపై అధివసించెను. బ్రహ్మదత్తప్రభువు చీనా మొదలగు దేశాలు, చైనీయుల ఆచార వ్యవహారాదులన్నీ తెలుసుకొన సాగినారు. వారిరువురకు వేదాంత విచార చర్చ జరిగినది.

స్వామిని ఒకసారి తప్పక విజయపురం దయచేయ మహారాజు శాంతిమూల ప్రభువు, మహారాణి మాఠరిసారసికాదేవీ ప్రార్థించినారని తెలిపెను. వినయగౌతమభిక్కు సంతోషం వెలిబుచ్చుతూ, తామీదివరకే రెండుమూడు పర్యాయాలు శ్రీశ్రీశ్రీ బోధిసత్వ నాగార్జున పరమార్హతుల ధర్శించామనీ, వారిని ఇంకొకపర్యాయం దర్శిస్తామనీ మహారాజునకూ, మహారాణికీ తమ ఆశీర్వాదాలు తెలియజేయండనీ తెలిపినాడు.

బ్రహ్మదత్తుడు సెలవు పుచ్చుకొని విడిదికిపోయి స్నానాదికాలు కావిచ్చి ఆ దినము తాను పూంగీమహారాజు స్కందశ్రీ ప్రభువుతో భోజనం చేయవలసి ఉన్నందన సముచిత వేషుడై, యువరాజు పూంగీయ స్కందసాగరనాగప్రభువు, ఇరువదిఏండ్ల యువకుడు తన్ను ఆహ్వానింప రాగా ఇరువురూ కలిసి మహారాజు అంతఃపురానికి వెళ్ళినారు. బంధు గృహంలో మహారాజు స్కందవిశాఖాయనక ప్రభువును సత్కరించినారు. బ్రహ్మదత్తప్రభువు మహారాజుకు నమస్కరించి దాసీజనము కాలుచేతులు కడిగి, మెత్తని వస్త్రాలచే తడియొత్త భోజనగృహానికి యువరాజు స్కందసాగర ప్రభువుతో జనినాడు.

సుందరాలంకార శోభితమగు భోజనగృహంలో మణులు పొదిగి, బంగారుతీగల పోగారించిన గంధతరు పీఠికలపై వారంద రధివసించినారు. స్కందశ్రీ ప్రభువు గురువులైన శివాచార్యులవారు ఎదురుగా మహాపీఠంపై అధివసించి ఉన్నారు. వారికి నమస్కరింనే బ్రహ్మదత్తప్రభువు అసనమలంకరించెను. ఉద్దండపండితులు, యజ్ఞయాగాదులొనర్చిన బ్రాహ్మణులూ వారితోపాటు కూరుచున్నారు. రాజబంధువులనేకులు వీఠాల అలంకరించినారు.

ఆ దినమున స్కందశ్రీప్రభువు బ్రహ్మదత్తప్రభువునకు ఇరువది నాలుగు శాకములు, పదునెనిమిది పచ్చళ్ళు, నూరుపిండివంటలు, ఎనిమిది క్షీరాన్నములు, నాలుగు పులుసులు, మూడువిధాలైన పెరుగులతో దేవతలు మెచ్చే విందు గావించెను. ఆంధ్రులవంట లోకాద్భుతమని అఖిలభారతవర్షమూ చెప్పుకుంటారు. ఆ దినాన వండినవంటకాలు నలభీములకు పాఠాలు నేర్పే మహత్తుకలవి. భోజనాలైనా వెనుక పదహారు విధాల తాంబూలాలు అర్పించారు స్కందశ్రీ ప్రభువు తమ అతిథులకు.

2

తాంబూలచర్వణం కాగానే, స్కందశ్రీ మహారాజూ, బ్రహ్మదత్తప్రభువూ ఆలోచనా మందిరాని కేగిరి.

“మహాప్రభూ! మా మహారాజుగారు, తమ్ము సకుటుంబంగా విజయపురంలో జరుగబోయే వసంతోత్సవాలకు ఆహ్వానింప నన్ను పంపినారు. వారి రాయబారిగా మహాప్రభువులను సకుటుంబంగా ఆహ్వానిస్తున్నాను.”

“బ్రహ్మదత్తప్రభూ! ఇక్ష్వాకులకు, మాకు అరమరికలు లేవని మీరెరుగనిది కాదు అయినా, చిన్నవారికి రాచకార్యాలు అవగాహనకావు. క్రిందటి వసంతోత్సవంలో అమ్మాయి మనస్సు చాలా బాధపడినట్లుంది. ఈ సంవత్సరం వసంతోత్సవాలు ఇక్కడే చేయాలని ఆమె మరీ మరీ పట్టుపడుతున్నది. యువరాజూ చెల్లెలి మాటే లెస్స అంటున్నారు.”

“నేను రాజకుమారితో, యువరాజుగారితో మాట్లాడి వారి మేనమామ ఆహ్వానం వారి కందియ్య దలచుకొన్నాను ప్రభూ!" ,

స్కందశ్రీ మహారాజు “అది బాగుంది, ప్రభూ!” అని బ్రహ్మదత్త ప్రభువునకు వీడ్కోలిస్తూ వారిని తమ మందిరాల ముఖద్వారం వరకూ సాగనంపినారు.

బ్రహ్మదత్త ప్రభువు తమ విడిదికిపోయి, వస్త్రాలు మార్చుకొని, కొందరు గాయనీమణులు వీణాది వాద్యాలపై వాయిస్తూ మధురకంఠాలతో పాడుతూ ఉండగా ఆలకిస్తూ పది లిప్తలు విశ్రమించెను. సాయంకాలం కోటలోని భేరీ పదవ ముహూర్తము మ్రోయించేవేళకు నిద్రలేచి, స్నానంచేసి శుభ్రవస్త్రాలు ధరించి, అలంకారికుడు అలంకరించిన వెనుక, చతుశ్శాలలోనికి, అక్కడనుండి పూర్వసభాగృహంలోనుండి పాంగణానికి వచ్చి, తనకై సిద్ధంగా ఉన్న నాలుగు గుఱ్ఱాల రథాల ఎక్కి అడవి స్కంద విశాఖాయన బ్రహ్మదత్తప్రభువు యువరాజు దర్శనార్థం వెళ్ళినాడు. తన్నెదుర్కొన వచ్చే పూంగీయ స్కంద సాగరనాగయువరాజును కలుసుకొని, కౌగిలించుకొన్నాడు. ఈ ఇరువురు యువకులు కలిసి క్రీడాగృహానికి వెళ్ళినారు.

బ్రహ్మదత్తుడు: ప్రభూ! మీ మేనమామగారు తమ్ము, రాకుమారిని స్కందశ్రీ మహాప్రభువును, మహారాణిని ఈ ఏడు విజయపురంలో జరిగే వసంతోత్సవాలకు ఆహ్వానింప పంపినారు.

స్కందసాగరనాగ: బ్రహ్మదత్తప్రభూ! మా సోదరికి ఈ ఉత్సవాలపై అంతగా ప్రతి ఉన్నట్లు లేదు. ఆమె రాకుండా మేము రాగలమా అని ఆలోచిస్తున్నాము. .

బ్రహ్మ: మీరు చెప్పింది ఆలోచించవలసిందే. రాజధర్మాలు మీ రెరుగనివికావు. రాకుమారి వైమనస్యానికి కారణాలు లేవననుగాని క్షత్రియుత్వం అవలంబించిన బ్రాహ్మణులం మనం. అటు క్షత్రియధర్మమూ నెరపాలి, యిటు బ్రాహ్మణ ధర్మమూ నెరపాలి. శ్రీరామచంద్రుడు రాజధర్మం కోసం కదా సీతాదేవిని అడవులకు పంపించింది.

స్కందః ప్రభూ, ఏమిటా రాజధర్మం?

బ్రహ్మ: ప్రజారంజనమూ, శాంతిని.

స్కందః ప్రజాశాంతి అంటే? బ్రహ్మ: ప్రభూ! దినానికో భూపతి వస్తూంటే భూమిలో శాంతి ఏలా ఉంటుంది?

స్కంద: నిజమే.

బ్రహ్మ: రాజు నీరసిస్తే, పరరాజుకు బలం ఎక్కువౌతుంది.

స్కంద: చిత్తం!

“అప్పుడు పరరాజు ఎత్తివస్తాడుకదా?”

“అవును ప్రభూ!"

“అయితే రాజుకు బలమిచ్చే గొప్ప ఓషధి రాజ బంధుత్వాలు!”

“అవును.”

“ఈ బంధుత్వాలు ఎక్కువ చేసుకోవాలంటే నలుగురయిదుగురు రాజులతో వియ్యమందాలి. అప్పుడు ఆ రాజుకు ఎంతో బలం! పాండవులు ద్రుపదునితో, మాత్స్యునితో వియ్యమందారు కాదా?”

“చిత్తం నా కర్థమయింది.”

“వీరపురుషదత్తప్రభువు పూంగీయ రాజకుమారి శాంతశ్రీని తమ ఆత్మేశ్వరిగా ప్రేమిస్తున్నారు. మనకు వాసిష్టుల సహాయం కూడా అవసరం, మాళవుల సహాయమూ అవసరమే.”

“చిత్తం. బ్రహ్మదత్తప్రభూ! తమ మాటలు మా చెల్లెలితో చెప్పి ఆమెను విజయపురోత్సవాలకు వచ్చేటట్లు చేయ ప్రయత్నిస్తాను.”

బ్రహ్మదత్త ప్రభువు యువరాజు సెలవుపొంది తమ విడిదికి వెడలి పోయినారు.

స్త్రీల హృదయం పురుషునికి తెలుస్తుందా అని బ్రహ్మదత్తు డనుకొన్నాడు. మనుష్యులలోని సర్వశక్తులూ స్త్రీలే అయితే, పురుషునికి స్త్రీ హృదయం ఏలా తెలుస్తుంది! స్త్రీకి పురుషుని హృదయం మాత్రం అర్థం అవుతుందా ఏమి! శ్రీరామచంద్రుడు ఎందుకు సీతను అడవులకు పంపినాడు? ప్రజారాధనంకోసమే కదా! సీతామహాసాధ్వి నెంత ప్రేమించినా ఆ ప్రేమ రాజధర్మాన్ని త్రోసివేయలేదు. కాని శ్రీరామచంద్రుడే వీరపురుష దత్తుడై ఉద్భవిస్తే బహుభార్యాత్వం అంగీకరించునా? తనకీ రాజధర్మ నిర్వహణ తప్పదు. హృదయం విరక్తమైనా రాజులకు ధర్మానురక్తి తప్పనిదే. తన వైరాగ్యానికి కళంకం ఉద్భవించింది ఇది కళంకమా?

3

పూంగీయ రాజకుమారి భవనంలో స్కందసాగర నాగప్రభువు ఆమెను కలుసుకొన్నాడు. జగత్ప్రసిద్ధినందిన వాసిష్టీపుత్రి ఇక్ష్వాకుశాంతశ్రీ సౌందర్వానికి ముగ్ధులై ఎంతమంది రాజపుత్రులు ఆమె చిన్నతనంలో ఆమె నుద్వాహంకావాలని స్వప్నాలు కనలేదు. కాని అన్నగారైన శాంతిమూల మహాసామంతుని స్నేహితుడు, వీరుడు ఆయిన పూంగీరాష్ట్ర సామంతునే ఆమె వరించింది.

పూంగీయ స్కందశ్రీ శాంతశ్రీల ప్రేమ కవిలోక ప్రశంస లందుకొన్నది. వారికడుపున యువరాజు స్కందసాగర ప్రభువు, శాంతశ్రీదేవి ఉద్భవించారు. పూంగీయ రాజకుమారి శాంతశ్రీ అపురూప సౌందర్యవతి, శాంతశ్రీ రాకుమారి ప్రత్యూష హిమబిందు స్నాతయైన చంపకకుసుమంలా వెలిగిపోతూ, తన లీలోద్యానవనంలో పుష్పాచయం చేస్తున్న సమయంలో చెల్లెలితో మాట్లాడడానికి యువరాజు స్కందసాగర ప్రభువు అక్కడకు వేంచేసినారు.

“అన్నయ్యగారూ! ఇంత ప్రొద్దున్నే వచ్చినారు?” అని ఆ బాలిక యువరాజు కడకు పరుగిడి వచ్చి ప్రశ్నించింది.

“బ్రహ్మదత్త ప్రభువు నన్ను కలుసుకొని ఎన్నో విషయాలు చెప్పినారు.”

“చెప్పరా మరి! మామయ్యగారి రాజకీయాలు మామయ్యగారివి. ఆ రాజకీయాలలో భాగం బ్రహ్మదత్తప్రభువు?”

“అంత సంతోషంగా ఉన్నావు! పారిజాతపుష్పాల ప్రోవులా ఉన్నావు, అదేమి తల్లీ, అలా మాట్లాడుతావు.”

“ఎట్లా మాట్లాడాను? నాకా సంతోషం? నేను రూపెత్తిన దుఃఖవతను.”

“రాజధర్మము చేయకలిగే విపర్యాయాలు రాచపుట్టువులకు తప్పదమ్మా చెల్లీ.”

“మీ కేమి నాన్నగారూ, మీరు మగవారు, అదృష్టవంతులు. మగవారి ధర్మాలులేరు, స్త్రీల ధర్మాలు వేరు. మగవారు ఏమిచేసినా చెల్లుతుంది.”

“ఎందుకంత ఉద్వేగం చెల్లీ!”

“బ్రహ్మదత్త ప్రభువు రాయబారం నా కర్థం కావటంలేదనా? ఆ నిష్ఠుర రాజధర్మానికి నేను బలికావాలనేకదా వారి రాయబారం.”

“చెల్లీ! బావగారు అస్వతంత్రులు.”

“బావగారికేం? పాపం అధికస్య అధికం ఫలం. వెనక శ్రీకృష్ణుడు లేడా? ఆ తర్వాత ఉదయనుడు, ఆ తర్వాత అగ్నిమిత్రుడూ, మామయ్యగారూ!'

“అయితే బావగారు అందరితోపాటే.”

"అవునండీ మీరు మగవారు. చెల్లెలినయితేనేమి నేను ఆడదానినిగా! అందుకని మీకు చీమయినా కుట్టదు.”

“నాకు మతిపోతున్నదమ్మా!”

“నా విషయంలో మీకు మతిపోవడం మంచిదికాదు. నేను బౌద్ధ భిక్కుని కాదలచుకొన్నాను. ఇక్ష్వాకు యువరాజుగారు వారి రాజనీతినీ, ధర్మాన్ని అడ్డంలేకుండా ఉపయోగించుకోనియ్యండి.”

“నిన్ను బావగారు హృదయమార ప్రేమిస్తున్నారని నేను అభిప్రాయం పడ్డానే?”

“హృదయమార ప్రేమిస్తున్నారా? పాపం! నాకు చాలా విచారంగా ఉంది. వారు ఆత్మారగా భట్టిదేవిగారిని, మనస్సారగా ఉజ్జయినీ రాజకుమారిని, ప్రియమారగా బాపిశ్రీ కుమారిని ప్రేమిస్తున్నారు.”

“ఆయాస పడకు చెల్లీ. మనం రాచబిడ్డలం కావడంవల్ల మన సౌఖ్యంకంటె దేశసౌఖ్యం ప్రధానం మనకు. ఇంతకంటె ఏమి చెప్పగలను?”

“అన్నగారూ! మీరు కలతపడకండి. ఏదో మతిలేనిదాన్ని. మీరందరూ విజయపురం వసంతోత్సవాలకు వెళ్ళుదామంటే నా అభ్యంతరం లేదు. నాయనగారు ఆనతిస్తే ఏపని అయినా సంతోషంగా చేస్తాను.” ఆ మాటలంటూ ఆ బాలిక అక్కడినుండి మెరుములా మాయమైంది. చెల్లెలి మాటలకు ఆశ్చర్యమందుతూ, ఏదో భయం తన్ను అవహింపగా, కనుబొమలు ముడివడగా, ఆలోచిస్తూ స్కందసాగర యువరాజు అక్కడినుండి వెళ్ళిపోయెను. పూంగీయ శాంతశ్రీ రాకుమారి పరుగున మాధవీ నికుంజంలోనికి పోయి, అక్కడ ఒత్తుగా పడియున్న బండిగురువిందపూలపై బోర్లగిలపండుకొని పట్టజాలని దుఃఖంతో కరిగి పోయింది.

4

ఆంధ్రదేశము సస్యశ్యామలము. చంద్రగుప్తుని కాలంనాడున్న ధాన్యకటకము, శ్రీకాకుళము, కంటకశైలం, ప్రతీపాలపురము, ధనదుపురము, మోసలపురము, మహాకాండూరు, కండరపురము, పూంగీప్రోలు, మహానాగపురము, వేంగీపురము, కొలనిపురము, ప్రతిష్టానము, వైజయంతి, సప్తగౌతమీపురము, ముసిక పురము, గృధ్రహారపురము మొదలగు ముప్పది మహాపురములు నానాటికీ పెరిగి శాంతిమూలుని కాలానికి ఏబది మహానగరాలైనవి. ప్రథమ శాతవాహన మహారాజుల కాలంలోలేని ఏన్నో సామంతరాజ్యాలు ప్రబలినాయి. శాతవాహనుల గురించి గాథలు పెరగిపోయినాయి. బృహత్కథ ఎన్నిప్రతులో వ్రాయించుకొంటూ ఆంధ్రులు దేశాలన్నీ ఆ గాథలచే నింపినారు.

దేశం సుభిక్షం అవడంచేతనూ, రాజులు ఎప్పుడూ ధర్మయుద్ధాలే చేస్తూ ఉండడం వల్లనూ పల్లెటూళ్ళకు ఏమీ ఇబ్బందులు కలుగలేదు. ముట్టడులు జరిగినప్పుడు నగరాన్ని చుట్టి ఉన్న కోటదగ్గరే యుద్ధం జరిగేది. ఏపక్షం వారూ సాధారణ ప్రజలను హింసపెట్టేవారు పైగా వర్తకులకూ, యాత్రికులకూ, సాధారణ ప్రజలకు ఏవిధమైన నిర్బంధము కలుగజేయకుండా వారి దైనందిన జీవితాన్ని సుఖంగా సాగనిచ్చేవారు. వర్తకులు ఇరువాగుల వారితో వర్తకం చేసేవారు. యుద్ధం ముగియగానే, వానవచ్చి వెలిసినట్టు ఉండేదికాని, తుఫాను వచ్చి, వెళ్ళిపోయినట్లు ఉండేదికాదు.

ఆంధ్రదేశంలో పది సంవత్సరాలకో, ఆరు సంవత్సరాలకో అప్పుడప్పుడు గాలి వాన వస్తూ ఉండేది. ఆ సమయంలో పంటలు నాశనం అయ్యేవి. తొలకరికాలంలో వడగళ్ళవానవచ్చేది. పైరు పంటలు కోతలకు వచ్చినవి నాశనం అయ్యేవి. పంటలు నాశనం అయినప్పుడు మహదాంధ్రదేశంలో ఈ గాలివానా, ఈ రాళ్ళవానా అంటని ప్రదేశాలు ఎప్పుడూ ఉండేవి. అవీకాక ప్రతిగ్రామానికీ కరువుగాదెలుండేవి. ప్రతి భూపాలుని కోటలోనూ కరువుగాదెలుండేవి. కాబట్టి వెంటనే ప్రజాసహాయకర్మ అమలులోకి వచ్చేది. ఒక్క కుటుంబంగాని ఒక్క ప్రత్యేక వ్యక్తిగాని ఈతిబాధలేమీ పొందకుండా జరిగి పోయేది.

గ్రామం సంపూర్ణ స్వత్వాలు కలిగిన రాజ్యము వంటిది. ఆ దినాలలో ప్రతి మునుషునకూ రాజకీయ పరిజ్ఞానము కొద్దోగొప్పో ఉంది. ధర్మమంత అక్లిష్టంగా ఉండడమే దీనికి కారణం. విదేశాలకు ఎగుమతి అయ్యే వస్తువులు పట్టణాలలోనే నిర్మించేవారు. వస్త్రాలు, వర్ణాలు, నూనెలు, సుగంధ ద్రవ్యాలు, బంగారము, వెండి మొదలగులోహాలు, లోహపు వస్తువులు పనిముట్లు, ఆయుర్వేద ఔషధాలు మొదలయిన వెన్నియో పెద్దనగరాలనుండి ఎగుమతి అయ్యేవి. ఆంధ్రదేశంలో నేతనేసే ప్రదేశాలలో కొన్ని పూంగీప్రోలు చూట్టూ ఉన్నాయి. సన్ననినూలు, ముతకనూలు, అతిసన్ననినూలు, గ్రామాదులలో ఒడికి అమ్ముతారు. ఆ నూలు అంతా ప్రోగుచేసి దేవసాలీసంఘంవారు కొంటారు. వారే ఆ నూలుకు రంగులు అద్దించేవారు. నేతవారు చిత్ర చిత్ర నేతలతో వస్త్రాలు విన్యాసం చేస్తారు. వణిక్సంఘంవారు ఆ వస్త్రాలను కొంటారు. అప్పుడని ఎగుమతి అవుతూ ఉంటాయి.

బ్రహ్మదత్తప్రభువు ఇవన్నీ పూంగీప్రోలు పట్టణంలో పరిశీలించారు ఎన్ని చూచినా బ్రహ్మదత్తప్రభువునకు ఏమీ తోచడం లేదు. నిర్మల మయిన మనస్సూ, నిశ్చలమయిన హృదయమూ కలిగిన బ్రహ్మదత్తుడు ఏమి తోచక సంతతమూ తిరగడము ఇవిచూచీ, అవిచూచీ కాలక్షేపం చేయడం ప్రారంభించినారు. ఒకసారి ఆయన ఓడయెక్కి సముద్ర విహారం చేసినాడు. ఇదే ఆయనకు మొదటిసారి సముద్రయానం చేయడం.

బ్రహ్మదత్తుడు ఎక్కిన చిన్నఓడ నాలుగు తెరచాపలు ఎత్తుకొని రివ్వు రివ్వున వెళ్ళిపోతున్నది. కెరటాలు సముద్రదేవుని ఉబికే పక్షంలా ఉన్నాయి. ఆ కెరటాలను చీల్చుకొంటూ రివ్వురివ్వున తేలిపోతూ ముందుకు వంగి, పైకి తేలుతూ నాట్యంచేస్తూ ఆ నౌక ప్రయాణం చేస్తున్నది. ఐదారు యోజనాలు అలా వేగంగా వెళ్ళిపోతూ ఉన్నదా తరణి. బ్రహ్మదత్తప్రభువు ఓడ ముందు భాగంలో నావికుని ప్రక్కనే నిలుచుండి ఆ ఓడ సౌందర్యము, ఉబికే తరంగాలలోని నీలిలోతులు, ఎగిరే చేపలు, పోతవాహకు కేకలు, సముద్రంపై తేలిపోయే పక్షులు, నౌప్రాక్దండము నీళ్ళును చీల్చుకొనిపోయే విచిత్రములన్నీ చూస్తూ నిలబడినాడు. ఓడ కొంతదూరం సాగగానే బ్రహ్మదత్తప్రభువుకు కొంచెం తలతిరిగి, వికారం పుట్టి డోకు వెళ్ళిపోయింది. కాని తన సర్వశక్తులు కేంద్రీకరించుకుని, ఆ వికారాన్ని అణచుకొన్నాడు.

రెండుజాములు గడచినవెనక తరణిలోవచ్చిన వంటబ్రాహ్మణుడు సిద్ధంచేసిన భోజనమారగించి, కొంచెం విశ్రాంతి తీసుకున్నాడు. ప్రొద్దు పడమటికి మళ్ళి జాముకాగానే బ్రహ్మదత్తప్రభువు నౌకోపరిభాగానికి విచ్చేసెను. నావికానాయకుడు ప్రభువునకు నమస్కరించి “ప్రభు, ఓడను తూర్పునుండి ఉత్తరానికి మళ్ళించినాము. ఘడియకు గోరుతవేగంతో వెడుతున్నది. అందుకు కారణం గాలి పడిపోవడమే ప్రభూ!” అని మనవి చేసినాడు.

5

బ్రహ్మదత్తునకు పడవ వెనక్కుతిప్పు అనడానికి బుద్ధిపుట్టలేదు. ఏమవునో అవుగాక! వరుణదేవుడే తన హృదయంలోని ఆవేదన తీర్చుగాక అనుకొనినాడు. తీరానికి ఆరుయోజనాల దూరాన ఓడ ఉత్తరాభి ముఖమై పోతున్నది. ఓడలో పది పదినాల వరకు మంచినీరు, భోజన సామాగ్రీ ఉన్నది. ఒకదినము గడిచిపోయినది. ఓడనాయకుడు మరునాడుదయం బ్రహ్మదత్తప్రభువును కలిసికొని “ప్రభూ! మనము కాకుళానికి ఎదురుగుండా ఉన్నాము” అని మనవి చేసెను.

“ఓడను పోనియ్యవయ్యా! గోదావరి ముఖద్వారంవరకు వెళ్ళి తిరిగి వద్దాము.” “చిత్తం మహాప్రభూ!"

ఓడ ప్రత్యూప పవనాలకు ఊగిపోతూ నాట్యకత్తియలా సాగిపోతున్నది. బ్రహ్మదత్తుని హృదయము ఏదో ఆనందంతో నిండి పోయింది.

  ఈ మహాసంద్రమే విశ్వం
  విశ్వమధ్యమ్ములో ఈనౌక!
ఏ తీరమీ మధుర వాతాంకురము పుట్టి
ఏ తీరముల చేర నేతెంచు చున్నదో?
ఏ మహాజలరాశి నీతరంగా లుద్భ
వించి సర్వాశలకు పయనించిపోవునో?
ఏ చిత్రలోకాల నీమనసులోకమ్ము
ఉదయించి కాలాన పదములిడివచ్చునో?"అని పాడుకొన్నాడు.

తాను ధనకప్రభువు. తనరాజ్యంలో బంగారం పండుతుంది. తన కోశాగారంలో కోటకొలది సువర్ణఫణాలు రాసులుపడి ఉన్నాయి. తన తండ్రి బుద్ది బృహస్పతీ, అఖండ వీరుడూ, తమ సైన్యాలు ఇక్ష్వాకురాజ్య సైన్యంలో ముందంజవేసేవి. అందుకనే మహారాజు తనకు కూతునీయ సంకల్పించారు.

తానొక సామాన్యుడైతే మహారాజు తనకు బిడ్డనీయ నెట్లు సంకల్పిస్తారు? కాక, శాంతిశ్రీ రాకుమారి సాధారణ కుటుంబపు బాలిక అయితే నామెను ఉద్వాహం కావడానికి ఒప్పుకుంటాడా తాను? ప్రపంచమంతా ఈలా ధనానికీ, ప్రాభవానికి బానిస అయి ఉన్నదా?

తనకు వివాహం చేసుకోను అనగలిగిన వైరాగ్య భావము లేదు. తన హృదయంలో బౌద్ధ భావాలకు చోటులేదు. తాను ఆర్ష ధర్మ ప్రకారం వివాహం చేసుకోవాలిగదా? అలాంటి సమయంలో మహారాజు తమ కుమార్తెను తనకు ఇస్తామంటున్నారు.

ఈ ఆలోచనకి అడ్డం తగులుతూ, నౌకానాయకుడు పరుగున వచ్చి బ్రహ్మదత్త ప్రభువునకు నమస్కరించి "ప్రభూ! గాలివాన పుట్టే సూచనలు కనబడుతున్నవి. వసంత కాలంలో గాలివానలు రావడం అరుదు. ఇరవై ఐదేళ్ళకో పర్యాయము ఈలాంటి గాలివానలు వస్తూ ఉంటాయి. మనం తీరం చేరడానికి వ్యవధిలేదు! గాలి తీరంవైపునుంచి తూర్పుగా సాగేటట్లున్నది. కాబట్టి మనం ఈశాన్యంగాపోయి మహానదీ ముఖద్వారం చేరుకోడానికి ప్రయత్నిద్దాము” అని మనవి చేశాడు.

ఆ నాయకుడు అనడం ఏమిటి ఇంతట్లో పడమట దూరంగా చక్రవాళాచలముపై నల్లని కాదంబినీమాల ప్రత్యక్షమైంది, గాలిపూర్తిగా ఆగిపోయింది. ఉక్కపోత ఎక్కువైంది. గాలిపీల్చుకోడం కష్టంగా ఉంది. సముద్రపునీళ్ళల్లో తళుకు ఎక్కువైంది. రాబోయే గాలివానపై గౌరవంతో కెరటాలు అడగిపోయినవి.

బ్రహ్మదత్తుడు చిరునవ్వుతో “నీ ప్రయత్నంలో నువ్వు ఉండు” అన్నాడు.

“ప్రభూ! నేను గాలివానకు సిద్ధంచేయాలి మన నౌకను. తాము గాలి వానలో ఎప్పుడు ఓడమీద ఉన్నవారుకారు.” “ఏమీ భయం లేదయ్యా! ఇప్పుడీ ఝంఝామారతమే నా స్నేహితుడు, గురువూనూ! ఆయన దర్శనంకోసమే ఉవ్విళ్ళూరుతున్నాను.”

ఆ నాయకుడు బ్రహ్మదత్తప్రభువువంక ఆశ్చర్యపడి చూచినాడు. ఆయన మోము ఆనందంతో నిండి ప్రకాశమానమైంది.

నాయకుడు విసవిస వెడలపోయి నావికులతో తెరచాపలూ, ఆకాశాన్ని చుంబించేటట్లున్న స్తంభాలు దింపించివేశాడు. తట్లమీదున్న ప్రతివస్తువు లోపలికి పంపించివేశాడు. చివర పని జరిగిందో లేదో, మేఘాలు పడవపైకి వచ్చి వేసినవి. ఒక మహాకల్లోలము మేఘమంతైవచ్చి ఓడమీద విరుచుకు పడింది. బ్రహ్మదత్తప్రభువు ముందు కానులో ఒక మధ్యకొయ్యను గట్టిగా పట్టుకుని నిలిచి ఉన్నారు. ఆ మహాకల్లోలము ఆకాశమంటివస్తున్నది. నౌక లోనికి ఉరికేందుకు వ్యవధిలేదు. ఆ మహావాయువు రాబోతున్నదని ఊహించి, ఆ ప్రభువు ఉత్తరీయము నడుమునకు బిగించి, నావికులు తమ ధోవతులను పైకి బిగించికట్టినట్లు కట్టుకున్నారు. ఆ కల్లోలము విరుచుకు నౌకమీద పడింది. వెంటనే ఆ కొయ్యను గట్టిగా కౌగిలించి పట్టుకొని, ఊపిరిబిగించుకొన్నాడు. చుక్కాని నడుపు మనుష్యుడు తాడుతో చుక్కాని కొయ్యను తన్నుదా కట్టుకొన్నాడు.

ఓడమీద ఆ మహాకల్లోలం విరుచుకుబడబోయేముందే చుక్కానివాడు ఓడను పక్కగా త్రిప్పివేసినాడు. కాబట్టి ఓడ అడ్డదెబ్బ తినలేదు. నావికులందరు లోనికిపోయి తట్టుతలుపులు లోపల బిగించుకున్నారు. నాయకుడు మాత్రం ముందు భాగాన్న ఉన్న జలదేవతా విగ్రహానికి తన్ను కట్టివేసికున్నాడు. కల్లోలము ఓడపైకి దుమికి ఓడను సముద్రగర్భానికి తీసుకొనిపోయి పైకి తేల్చింది. దైనందినము హఠయోగా మాచరించే బ్రహ్మదత్తప్రభువు కల్లోలము విరుచుకుపడగానే కఱ్ఱలో కఱ్ఱ అయినాడు. ఆయన చిన్నకొయ్యలో కొయ్య అయి ఇనుపగొలుసు బిగించినట్లు భల్లూకం పట్టుపట్టినట్లు కొయ్యను కౌగిలించుకొన్నాడు.

6

ఆ కల్లోలము నౌకపైనుండి ఏనుగు లేడికూనను దాటిపోయినట్లు దాటి పోయినది. ఓడవంగిపోయి, తిరిగి సర్దుకుంది. తట్టుపైనఉన్న ముగ్గురు సముద్రంలోనికి కొట్టుకు పోలేదు. కాని ప్రాణంపోవడం తప్పి కన్నులు లొట్టపోయినట్లయింది వారికి. ఆ మహా కల్లోలము వెళ్ళిన దగ్గరనుండీ ఉత్తుంగ తరంగాలు ఓడతో కందుక క్రీడచేస్తున్నాయి. ఓడ మరుసటి ముహూర్తంలో చిన్న చిన్న ముక్కలక్రింద బద్దలుకొట్టేటట్లున్నాయి ఆ భయంకర తరంగాలు. అలాంటి సమయములో ఓడ నడపడం పద్మవ్యూహం చీల్చి వెళ్ళడం వంటిదే! నావికా నాయకుడు, చుక్కానివాడు ఈ లాంటి గాలివానలలో ఎన్నిసారులు ద్వీపాంతరాలకు పోయి వచ్చినారో? కెరటాలకు అడ్డుకోణంగా లేకపోవడంవల్ల గాలికి ఎదురునడవక గాలితో పాటే పోవడంవల్లా ఓడ శర వేగంతో ముందుకు సాగిపోతున్నది.

ఓడ ఎక్కడకు పోతున్నదో? రాచకార్యంకోసంవచ్చి, తీరికూర్చుండి తాను పడవమీద ప్రయాణం చేయడమేమిటి? పూంగీప్రోలులో స్కందశ్రీ ప్రభువుతో తానొకదినము సముద్రవిహారం చేసివస్తాననికదా తెలిపినాడు. ఇంతలో ఈ విశ్వంలో ఏమూల దాగుకొని ఉన్నదో ఈ ప్రళయ ఝంఝామారుతం అదను కనిపెట్టి ఒక్క ఉరుకున తనమీదకు ఉరికింది. ఇంత చిన్న ఓడ ఈ దాడికి ఆగుతుందని నమ్మకంలేదు. పూంగీమహారాజు, విజయపురానికి వెంటనే గజవార్తలు పంపును. తన్ను గురించి దుఃఖించేది తన తల్లి, తండ్రికి ప్రపంచ సుఖదుఃఖాలు అంటనే అంటవు. ఇంక శాంతిమూల చక్రవర్తి తన్ను యువరాజుతోపాటు ప్రేమించారు. ఆయన కొంచెం దుఃఖించవచ్చును. -

గాలివాన తుంపర మంచుగడ్డల వర్షంలాగ గజగజలాండిచే చలిలో నీటి మట్టానికి సమంగా మహావేగంతో లోకాన్ని ముంచెత్తుతూ ఉంది. కారు మేఘాలు కమ్మిచీకటిపడే సమయంలా ఉన్నది. ఆకాశాన్ని అంటే కల్లోలాలు ఒకదానికొకటి తగిలి ఫెళ్ళున పేలుతున్నాయి. ఆ కల్లోలాల నీటి తుంపరలు చేటల కొద్దీ తట్టుపైన పడుతున్నవి. ఒక్కొక్క కల్లోలం కోటిగదాఘాతాల శక్తితో నౌకను మోదుతున్నది. కెరటాల శక్తికి ఓడ మహావేగంగా పూర్వాభి ముఖమై వెళ్ళిపోతున్నది. -

బట్టలన్నీ తడిపి, దేహమంతాతడిసి చలి గాఢంగా పొదివికొన్నది. జుట్టు విడిపోయి బ్రహ్మదత్తప్రభువు తలచుట్టు చిన్న చిన్న నీలికాంతులులా ప్రసరించి ఉంది. కాని ఆ యువక రాకుమారుని హృదయంలో ఏదోమహానందం! పైన సర్వలోకమూ ఏదో భయంకర ఘోషతో బాణపాతంవంటి గాలివానతో శ్రుతికలిపి తాండవిస్తున్నది.

పథములన్నీ ఆవరించిన
ప్రళయదేవత తాండవించూ
ఫెళ ఫేళారావముల అందెలు
ప్రియము నా హృదయానికిన్.

ఎన్ని ముహూర్తాలు అలాప్రళయంలో భాగమై కోడ ప్రయాణించిందో? బ్రహ్మదత్తప్రభువు లోని భాగానికిపోయే తలుపుతట్టి లోనికి వెడలిపోయేను. నాయకునీ, చుక్కానివానినీ లోనికి పంపేందుకు ఇతరులు వెళ్ళి వాళ్ళస్థలాలు ఆక్రమించినారు. బ్రహ్మదత్త ప్రభువు వేడినీరు స్నానమాచరించి రాంకవ వస్త్రాలు ధరించి, భోజనమాచరించి, శయనించి నిదురపోయినాడు. కొన్ని జాములు గాలివానలో భాగమైపోయినందున ఆ ప్రభువునకు ఒళ్ళు తెలియని నిదురపట్టింది. ఎంతకాలము గాలివాన వీచినదో, బ్రహ్మదత్త ప్రభువునకు మెలకువ వచ్చునప్పటికి నిమ్మకునీరు పోసినట్లున్నది. బ్రహ్మదత్తుడు చటుక్కున లేచి ప్రక్కనున్న జయఘంటిక మ్రోగించినాడు. వెంటనే సేవకుడు పరుగెత్తుకొని వచ్చినాడు.

“ప్రభూ!”

“ఎంత ప్రొద్దుపోయింది?”

“ఉదయం మహాప్రభూ!”

“నేను ఆరుయామాలు నిద్రించినానా?”

“చిత్తం దేవా!”

“గాలివాన తగ్గినదా?”

“నిమ్మకు నీరు పోసినట్లున్నది”

“ఓడ!”

“ఒక్కసారి చుక్కాని విరిగిపోయింది. మళ్ళీ ఇంకో చుక్కాని కట్టినారు.” “ఎవరూ నష్టం కాలేదుకదా?”

“అందరూ క్షేమం మహాప్రభూ! ఓడ ఏమీ ఎరుగని నంగనాచిలా ప్రయాణం చేస్తున్నది”

“ఆశ్చర్యమే!”

“చిత్తం.”

“స్నానానికి నీళ్ళు సిద్ధంగా ఉన్నాయా?”

“చిత్తం!”

“మన నౌక ఎక్కడ ఉన్నట్లు?”

“మనం దారితప్పి కొన్ని వందల యోజనాలు వచ్చినామట మహాప్రభూ! రావడంవల్ల సువర్ణద్వీపం దరిదరికి వచ్చినామేమోనని, అతని అంచనా ప్రకారం సువర్ణదీవి నలభై యోజనాల దూరంలో ఉంటుందేమోనని. ఇంక మూడున్నర దినాలలో మనం సువర్ణ ద్వీపమో, మలయా ద్వీపమో చేరగలమని అన్నాడు.”

“అబ్బా! భగవంతుని లీలావిశేషమే!”

బ్రహ్మదత్తప్రభువు స్నానంచేసి సంధ్యావందనాదికా లొనరించి, సముచితవేషంతో తటమీదకు వెళ్ళినాడు. అప్పుడే నావికులందరూ తట్టు మీదికివచ్చి తెరచాపకొయ్యలు ఎత్తివారూ, తెరచాపలు తగిలించువారూ పగ్గాలు బిగించువారునై యుండిరి.

7

ఓడ మూడ దినాలకు సువర్ణ దీవితీరాలకు వచ్చింది. తీరంవెంట ఐంద్రదత్తు (నౌకా నాయకుడు) తన చిన్ననౌకను నడుపుకుంటూ మాయామాయా నగరమురేవు చేరెను. ఆ పట్టణంలో సువర్ణులూ, ఆంధ్రులూ కలిసి ఉన్నారు. అక్కడక్కడ కళింగాంధ్రులు, ఉత్తరకళింగులు, మాగధులు, పాండ్యులు కొన్ని కొన్ని కుటుంబాలవారున్నారు. సువర్ణులు నాగవంశీకులు. గుండ్రని పలచనిమోము, మీసాలు తక్కువ, పసుపుపచ్చని ఛాయ, కళ్ళు కొంచెం వంకర, ఒత్తయిన పెదవులు. సువర్ణనాగులలో ఒక విధమైన సౌందర్యం ఉన్నది. ఇక్కడకు వలస వచ్చిన ఆంధ్రులు గుండ్రని తమ పైశాచప్రాకృతలిపి వీరికి నేర్పినారు. సువర్ణులు కొంచెం అనువాసికంగా మాట్లాడువారు. మాయామాయా పట్టణము ఆంధ్ర శాతవాహన కాలంలో నిర్మించినారు. ఆనాటి నుండి ఆ పట్టణము దినదినాభివృద్ధినంది ఈనాటికి సువర్ణద్వీపములోని ముఖ్యపట్టణమైనది.

ఐంద్రదత్తుడు ఇదివరకు అనేక పర్యాయాలు మాయామాయా పట్టణానికి విచ్చేసినాడు. మహాఘనము (లంగరు) దింపి ఓడను రేపులో బంధించి ఓడ దగ్గరకు వచ్చిన చిన్ననావలో నెక్కి అందరూ పట్టణం చేరిరి. ఐంద్రదత్తుడు ఒక నాగశిబికను మాటలాడి అందు బ్రహ్మదత్త ప్రభువును ఎక్కించి, తానొక పొట్టిగుఱ్ఱము నధిరోహించి మాయామాయా పట్టణ పాలకుడైన ఆంధ్రప్రభువగు కన్హ శాతవాహనరాజు కడకు కొనిపోయినాడు. కన్హ శాతవాహనప్రభువు అడవి ధనక స్కందవిశాఖాయనక బ్రహ్మదత్తప్రభువు రాక విని ఆశ్చర్యంతో తన సభాభవనానికి విచ్చేసినారు. “బ్రహ్మదత్త ప్రభువులా! చాలా ఆనందం! ఎంతో ఆనందంగా వుంది. కథలులా విన్నాము మా జన్మదేశం గురించి.”

కన్హ శాతవాహనుని భాష బ్రహ్మదత్తప్రభువునకు అర్థం కాలేదు. ఆంధ్రభాష ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నది. కన్హ శాతవాహనుని భాష గౌతమీపుత్రుని కాలమునాటి ఆంధ్రముతో సువర్ణ ద్వీపభాష బాగా మిశ్రమం చేసిన భాష. ఆ భాష ఐంద్రదత్తునికి బాగా తెలుసును. ప్రభువులిద్దరూ ఒకరినొకరు నమస్కారం చేసిన తర్వాత ఐంద్రదత్తుడు సగౌరవంగా సమీపాన నిలబడి ఒకరిభాష ఒకరికి తెలియచెప్పుతూ ద్విభాషి అయినాడు.

“ఇక్కడ మన దేశస్థులు ఎంతమంది ఉన్నారు ప్రభూ!”

“ఆంధ్రదేశం వివిధ భాగాలనుండి వచ్చినవారు ఈ చుట్టుప్రక్కల ఇరువదివేల మంది ఉంటారు. అందులో పన్నెండువేల మంది సైనికులే!”

“ఈ శస్థలకూ, మనవారికీ పొత్తు బాగా ఉన్నదా?”

“అవును ప్రభూ! ఈ ద్వీపవాసులకు మాకూ అఖండస్నేహం. చాలాకాలం క్రిందటే ఇక్కడ తధాగత ధర్మం బాగా ప్రాకింది. అంతకు ముందు నుండి కూడా మనదేశాన్నుండి రత్నవర్తకానికి చాలామంది వణిక్కులు వస్తూ ఉండేవారు. ఇప్పటికి సుమారు రెండువందల సంవత్సరాల క్రితం మా పూర్వీకులయిన ప్రభువు కొన్ని కుటుంబాలతో, వేయి మంది వీరులతో ఈ పట్టణ ప్రాంతాలనే దిగి, ఇక్కడ ఈ కోట నిర్మించారు. ఈ కోటచుట్టూ ఈ మహాపట్టణం పెరిగిందట.”

“ తాము మన దేశం వచ్చినారా ఎప్పుడైనా?”

“లేదు. యువరాజు నిచటనిలిపి, ఎప్పుడైనా రావాలనీ, అక్కడి క్షేత్రాలన్నీ దర్శించాలని కుతూహలం. మేము ఇక్కడి రాజకుటుంబాలతో సంబంధ బాంధవ్యాలు నెరపుతున్నాము. మా తల్లిగారు అమరపుర మహారాజుగారి తనయ. నేడక్కడ మా మేనమామగారు రాజ్యం చేస్తున్నారు.”

“తమ పోలికలు అన్నీ మన దేశంలోని ప్రభువుల పోలికలే.”

“నేను మా తండ్రిగారి పోలిక. మా తండ్రిగారు మన దేశంలో పుట్టినారు. మా నాయనమ్మగారు ఆంధ్రదేశపు ఆడబడుచు. మా నాయనగారి పురుడుకోసం ఆ దేశమే వెళ్ళినారట! తాము మాకు అతిథులు కావటంవల్ల ధన్యులం.”

బ్రహ్మదత్తప్రభువు ఓడలో ఉండడం మంచిదికాదని, తమ అతిథి భవనంలో విడిది చేయాలనీ కన్హ శాతవాహనుల మహారాజు కోరినారు. కాబట్టి బ్రహ్మదత్తప్రభువు ఆ అతిథి మందిరం ప్రవేశించారు. ఐంద్రదత్తుడు ఓడలోనికి పోయి బ్రహ్మదత్తుని సేవకునీ, వంటబ్రాహ్మణునీ, పెట్టెలనూ, ఆయుధ పెటికనూ పంపెను.

తనకోసం పూంగీప్రోలులో, విజయపురంలో ఆతురతతో ఉంటారు. ఉండని! మళ్ళీ సముద్రందాటి వెళ్ళడము జరుగునా? ఇంతవరకు తన ఓడ సురక్షితంగా రేవుచేరడమే ఆశ్చర్యం. మళ్ళీ సురక్షితంగా తిరుగు ప్రయాణం చేస్తుందని నమ్మకం ఏమిటి? ఒకవేళ తాను సురక్షితంగా తన దేశం చేరితే మృత్యుముఖాన్నుండి బయటపడిన వానిని చూచినట్లు చూస్తారు తన తల్లిగారు. శాంతిమూల మహారాజు వీరపురుషదత్త యువరాజున్నూ అనందం పొందుతారు. మహారాజకుమారి శాంతిశ్రీ ఏమనుకొంటుంది? మహారాజు బలవంతం చేసి అప్పగించిన గురువు వదలినాడు అని ఆనందిస్తో ఉండే బాలిక, తాను తిరిగి వెళ్ళగానే మళ్ళీ దాపురించాడు ఈ పిశాచి అనుకుంటుంది. ఇంత గాటంగా తనకీ ఆలోచన ఎందుకు కలగాలని బ్రహ్మదత్తుడే ఆశ్చర్యం పొందినాడు.

ఓడ మునిగిపోవచ్చునన్న సమయంలో ఆ అద్భుత సుందరాంగి మోము స్పష్టంగా తనకు ప్రత్యక్షమయింది. తన ఆలోచనా పథాలలో ఆ బాలిక ఎప్పుడూ ప్రత్యక్షమౌతూ ఉన్నది. ఆమె దివ్యమధురవాణి తన హృదయాన్ని గగ్గోలు పరుస్తుంది. తాను ధర్మాభిరతుడే కాని చిత్తాభిరతుడు కానని అనుకున్నాడు. తన మనస్సు ఏలాంటి సమయములోను వికారం పొందలేదు. కాని ఆ లోకైకసుందరిని మహారాజు తనకు శిష్యురాలినిగా చేసినప్పటినుండి తన మనోగతే మారిపోయింది. తన్నేదో ఆనందమత్తత ముంచివేయడం సాగించింది. ఆ బాలికను చూడడము, ఆ బాలిక మాటలు వినడం జన్మకు సాఫల్యం చేకూర్చినాయి అన్న భావం ఏర్పడింది. శాంతి మూలమహారాజుతో జైత్రయాత్రకు వెళ్ళినప్పుడూ అంతే.

ఆమె స్వచ్ఛ సువర్ణాంగాలు, ఆమె మధురకంఠకాకలీన్వనాలు తనకు మతిని పోగొట్టేవి. కాని ఆ బాలిక మాత్రం తన్ను లెక్కచేయకుండానే సగౌరవంగా పాఠాలు చుదువుకొనేది. బ్రహ్మదత్తప్రభువు ఆ బాలికాగతమైన మనస్సు మరలించుకొనే యత్నం మానివేసి ఆ భావమే తన్ను అమృత ప్రవామై ముంచివేయ, అందులో విచిత్రానందంతో తేలిపోసాగినాడు.

8

తన నౌక చిన్నదైనా ఏలాంటి గాలివాననైన ఎదుర్కోగలదని కొంత ధైర్యం పొందినారు పూంగీయ స్కందశ్రీ ప్రభువు. నౌకానాయకుడు ఐంద్రత్తుడు నావికులలో అగ్రగణ్యుడు అనేది కూడా కొంత ధైర్యం సమకూర్చింది. అయినా వేసవికాలంలో గాలివానవస్తే అతిభయంకరంగా వస్తుంది. రాళ్ళవర్షంతో కలిసివచ్చే భయం కూడా ఉంది. బ్రహ్మదత్తుడు ఓడ ప్రయాణం చేసి ఎరగడు. అతడు మహాజ్ఞాని. యువకుడయినా పెద్దలందరూ గౌరవించే రాజ్యాంగవేత్త, ప్రజారంజకుడు, ప్రియదర్శి, ఉత్తమ బ్రాహ్మణుడు. శాంతిమూలమహారాజు కాయన అత్యంతప్రియుడు, మహారాజుకు బ్రహ్మదత్తప్రభువు అల్లుడు కావచ్చుననికూడ కర్ణాకర్ణిగా విన్నాడు.

తాను బ్రహ్మదత్తప్రభువును ఓడ ప్రయాణము చేయనివ్వకుండా ఉండవలసింది అని స్కందశ్రీ పూంగీయప్రభువు చెదిరిన మనస్సుతో సేవకుల పంపి రేవునుండి ఎప్పటి వార్తలప్పటికి తెప్పించుకొంటూ ఉండెను. ప్రళయంగా గాలివాన వచ్చి సముద్రతీరం దేశంమీద తాకిందనీ, సముద్రంలో ప్రయాణం చేస్తున్న ఓడలకిది ఎక్కువ మొప్పమనీ నావికులలో అనుభవంగల వారివల్ల స్కందశ్రీ ప్రభువునకు వార్తలందాయి. నేలమీద ముసురు వానగాలితో దినమున్నర ఉంది. ఆ వెనుక ఫెళ్ళున ఎండ కాసింది. ఈ ముసురు, ఝంఝామారుతము సముద్రంమీద రెండుదినాలపైగా ఉంటుందని నావికులు స్కందశ్రీ ప్రభువునకు విన్నవించారు. మూడు దినాలయినది, నాలుగు దినాలయినది, అయిదు, ఆరు దినాలయినది, సముద్రంనుండి ఏమీ వార్తలులేవు. గాలివాన విడిచినపిదప స్కందశ్రీ ప్రభువు తన యుద్ధనౌకలు నాల్గింటిని సముద్రం నాలుగుదిక్కులా చూచిరండని పంపినారు. ఒక ఓడ ఉత్తరంగానూ, ఒక ఓడ వాయువ్యంగానూ, ఒకటి ఆగ్నేయంగానూ, ఒకటి దక్షిణంగానూ బయలుదేరాయి.

ఓడలు బయలుదేరి మూడు దినాలయినది. అవి తిరిగి రాలేదు. తీరానికి ఇరవై ముప్పై యోజనాల దూరంలో ఏ ఓడయినా మునిగిపోతే నాలుగు దినాలకో, అయిదు దినాలకో శవాలూ శకలాలూ తీరానికి వస్తాయట. అలాంటి వానిని వెదకటానికి సముద్రతీరం పొడుగునా గూఢచారులను, నావికులను ఉత్తరంగా దక్షిణంగా పంపినారు స్కందశ్రీప్రభువు.

పది దినాలయినది, వార్తలు లేవు. ఇంక స్కందశ్రీప్రభువు విజయపురికి ఈ విషాదవార్త ఏలాగు పంపించకుండా ఉండగలడు? ఉన్న విషయాలన్నీ భూర్జపత్రంమీద లిఖించి ధైర్యం చెపుతూ స్కందశ్రీ పూంగీయ ప్రభువు శాంతిమూల మహారాజుకు నమ్మిన సందేశహరునిద్వారా నివేదించడానికి పంపినారు.

అంతఃపురంలో శాంతిశ్రీరాణికి రాకుమారి శాంతశ్రీకి బ్రహ్మదత్తుని ఓడగాలి పాలైంది అని తెలిసినప్పటినుండీ ఏదో భయ మావరించింది.

ఇచ్చట పూంగీయమహారాణి భర్తగారిని కలుసుకున్నది.

“ప్రభూ! ధనకప్రభువు క్షేమంగా తిరిగివస్తారా?”

“ఏమి చెప్పగలం దేవీ?"

“తాము కార్తాంతికులను కనుక్కోకూడదా?”

“మంచిమాట దేవీ ! వెంటనే జ్యోతిష్కుల పిలువనంపుతాను.”

9

అడవిస్కంద విశాఖాయనక బ్రహ్మదత్త ప్రభువు నౌకావిహారానికి వెళ్ళినాడనిన్నీ, సముద్రంలో ప్రళయ ఝంఝామారుతము విసిరిందనీ, బ్రహ్మదత్త ప్రభువుగానీ ఆయన ప్రయాణించే ఓడగానీ జాడైనా లేదనీ పూంగీయ స్కంద విశాఖప్రభువు కమ్మ పంపగానే శాంతిమూల మహారాజు నిర్విణ్ణుడై నిముషములు మాటలాడలేకపోయినాడు.

బ్రహ్మదత్తప్రభువు ఈ ధనకదేశంలో శాతవాహనులతోపాటు రాజ్యంచేసిన ఉత్తమ బ్రాహ్మణవంశంలోవాడు. ప్రతీపాలపురపు ఇక్ష్వాకులకు స్నేహితులై, వారికి కుడిచేయిగా ఉండి వారు మహాసామంతులైనప్పుడు, వారికే సామంతులైనారు ధనక వంశంవారు. ప్రజ్ఞావంతులు, విజ్ఞానధనులను, పరాక్రమ శీలురను కనిన ఈవంశానికి మేటి కిరీటంలా బ్రహ్మదత్తుడు ఉద్భవించాడు.

సకల భారతావనియందూ ధనకరాజ్యమూ, ఇక్ష్వాకుల పాలనంలో ఉన్న కురవ, చోళ, ములక, ఆటవిరాష్ట్రాలూ రామరాజ్యంకన్న ఎక్కువగా పరిపాలించే విధానాలు ఏర్పాటు చేసిన రాజనీతివిశారదుడు ధర్మదత్తప్రభువు. తామా ధర్మదత్తుడు రామలక్ష్మణులా పెరిగినారు తనకన్న కొలది సంవత్సరాలే పెద్ద అయినా ధర్మదత్తప్రభువు తనకు సర్వశాస్త్రాలలోనూ గురువై, మంత్రియై సేనాపతి అయినాడు. ధర్మదత్తు డిప్పుడు మహర్షి, తపసు చేసుకొంటున్నాడు. ఆయన తపస్సునకు వెళ్ళేటప్పుడు తన కుమారుని సన్యాసి కాకుండా చూడండనీ, వాడు ఇక్ష్వాకువంశ భారంవహించే శేషుడవుతాడనీ, వానివలన భవిష్యదాంధ్ర చక్రవర్తివంశం ఒకటి ఉద్భవిస్తుందనీ తెలిపినారు.

తాను, ధర్మదత్తప్రభువూ తమకు బిడ్డలు కలుగగానే వియ్యమంద నిశ్చయించు కొన్నారు. ధర్మదత్తునకు స్కందవిశాఖప్రభువు జన్మించినాడు. అతనికిచ్చి ఉద్వాహం చేయడానికి కొమరితకై తాను తపస్సు చేసినాడు. తనకు శాంతిశ్రీ కుమారికలుగగానే తననోములు ఫలించాయని ఆనందించినాడు. తన బాలిక సాధారణ బాలికవలెగాక విచిత్రస్వభావముగా పెరుగుచున్న కొలదీ, తన దురదృష్టానికి ఎంతవగచినాడు తాను! బాలిక విజ్ఞానవతియే అయినా, అర్థ్రచిత్తతలేని అమాయిక శిశువుగా పెరిగింది. ఏలాగైనా వారిద్దరూ ప్రేమించుకోవాలి. వారిద్దరూ ఆదర్శదంపతులు కావాలి అని ఆశిస్తూ ఉంది, బ్రహ్మదత్తుని తన బాలికకు గురువునే చేసినాడు. అయినా మహారాజు మనస్సు ఎందుకో శంకిస్తూనే ఉండేది.

ఇంతలో ఈనాడు ఆ బాలకుడు ఏమైనాడు? ఆ నౌక ఏమై పోయినది? తానెందుకు ఆ కుమారప్రభువును, ఆ సుందరమూర్తిని పూంగీప్రోలు పంపినాడు? అది ఏదో చెడు ముహూర్తమై ఉంటుంది. శాంతిమూలుని ఆవేదన వర్ణనాతీతమైనది. శాంతిమూలుడంత బాధ ఎన్నడూ పడలేదు. ఆ మహారాజు గంభీరుడు, విరాగి, అయినా నేడు బ్రహ్మదత్తప్రభువు నౌకలో విహారంపోయి గాలివానవల్ల ఏమయిపోయినాడో తెలియకుండా మాయమైనాడు అని వినగానే వికలమనస్కుడై పోయినాడు. ఆయన వెంటనే ఈ వార్త బోధిసత్వనాగార్జునార్హ దేవులకు, మహర్షి ధర్మదత్తులవారికి తెలియ నంపెను.

ధర్మగిరిపై (నాగార్జునకొండపై) ఉన్న శ్రీ నాగార్జునిదేవులకీ వార్త పంపడానికి ఆయన సాహసించడానికి కారణం ఆ శతవృద్ధులైన పరమ శ్రమణకుడు బ్రహ్మదత్తుడంటే అత్యంత ప్రేమగలవారు. వారే బ్రహ్మదత్తుని ఉదంతం గురించి తనకు ఇదమిద్దమని చెప్పగలవారు. ధర్మదత్తమహర్షీ అట్టిప్రజ్ఞావంతులే. ఇక ఈ కఠినవార్త ఏలాగు బ్రహ్మదత్తుని తల్లిగారికి వినిపించడం? మహారాజు ఆలోచనాధీనుడై మహారాణి సారసికాదేవికీ, కుసుమలతాదేవికీ, రాజకుమారి శాంతిశ్రీకి తాము వారివారిని అంతఃపురాలలో సందర్శిస్తామని సందేశం పంపినారు.

సారసికాదేవి పట్టమహిషి. ఆమెకడకు మహారాజు పోయినప్పుడు ఆ దేవి భర్తపాదాలకు నమస్కరించి ఉచితాసనంపై వారి నధివసింపచేసి, “మహాప్రభూ! తాము ఏదో ముఖ్యవిషయం మాట్లాడవచ్చినారు?” అని ఆమె అడిగినది. ఆమె మహారాజు మోముచూచి, అందున్న ఆలోచనాధీనత కనుగొని హృదయము ఝల్లుమన "మహాప్రభూ! తమ వదనంపై ఏదో విషాదచ్చాయ ప్రసరించి ఉన్నది?” అన్నది.

“అవును దేవీ విషాద విషయమే!”

“ఏమది మహాప్రభూ?” “మనం ఎరిగి ఉన్నంతవరకు మన ఓడలు ఎప్పుడూ నాశనంకాలేదు.”

“చిత్తం.”

“మన ఇక్ష్వాకు రాకుమారులు ధైర్యంగా ఓడ ప్రయాణాలు చేయగలరు.”

“అవును దేవా! మా మాఠరీకుమారులు కళింగపట్టణాన్నుండి ఎప్పుడూ ఓడ ప్రయాణాలు చేస్తూనే ఉంటారు.”

“అయితే, నేడు బ్రహ్మదత్తప్రభువు ఓడ ప్రయాణానికి వెళ్ళారు!"

“ఓడ ప్రయాణమా?”

“అవును. నేను పూంగీయప్రభువును, మీ ఆడబిడ్డను, రాకుమారీ, కుమారులను ఆహ్వానింప బ్రహ్మదత్తప్రభువును పంపాను.”

“అయితే ఓడ ప్రయాణమేమిటి?”

“ఆయన కుడిచి కూర్చుండలేక నౌకావిహారానికి వెళ్ళినారు.”

“అయితే మహాప్రభూ....”

“ఆ వెళ్ళడం మొన్న మన దేశంలో ముసురుపట్టలేదు. ఆ దినాన!”

“తిరిగి సురక్షితంగా వచ్చారా?”

“వస్తే నాకు ఈ ఆవేదన ఎందుకు దేవీ!”

“ఏమిటి విషయం విపులంగా చెప్పండి మహాప్రభూ!”

10

శాంతిశ్రీ రాకుమారికి బ్రహ్మదత్తప్రభువు కథనం వినిపిస్తూ మహారాజు ఆ బాలిక మోము జాగ్రత్తగా పరిశీలించ సాగినారు.

“ఏమిటి మహాప్రభూ! బ్రహ్మదత్తప్రభువు సముద్రంలో ఏమై పోయారో తెలియదంటారా?”

“అవును తల్లీ! వారిగతి ఏమైందో? ఆయన బ్రతికి ఉన్నాడో లేదో?”

“ఆ నౌక సురక్షితంగా ఉండకూడదా మహాప్రభూ!"

“ఉంటే ఈపాటికి ఏ తీరమో చేరి ఉండదా?”

“అవతలితీరం చేరకూడదా?”

“చేరవచ్చును. కాని అంతటి అదృష్టవంతుడనా?”

“నాకు మంచి గురువు లభించారని సంతోషించాను నాన్నగారూ!” అంటూ రాకుమారి డగ్గుత్తిక తాల్చింది.

శాంతిశ్రీ 'నాన్నగారూ' అని తన్ను సంబోధించగానే శాంతి మూలుడు వెంటనే ఆశ్చర్యమూ, సంతోషమూ, విషాదమూ పొందినాడు, తన్ను ఇంతకుమున్ను తండ్రిగానే చూడని బాలిక, నేడు 'నాన్నగారూ' అని పలుకరించినది అన్న సంతోషముతోపాటు ఆ మార్పుతెచ్చుటకు కారణమైన బ్రహ్మదత్తప్రభువు ఏమైనాడో అని విషాదం కలిగింది.

“శాంతీ! మామయ్యగారు పూంగీయ స్కందశ్రీ ప్రభువులు వారిని వెదకడానికి తమ యుద్ధనౌకలను పంపారట.” “అలాగునా! వారి ఓడ సురక్షితంగా ఉంటుందని ఎందుకో నాకు తోస్తున్నది నాన్నగారూ!” అని శాంతిశ్రీ కళ్ళనీరు నింపింది.

“ఏమిటి తల్లీ! ఈ కంటినీరు?” అని శాంతిమూలమహారాజు ఆమెను తన హృదయానికి అదుముకొన్నారు.

శాంతిశ్రీ తండ్రి హృదయాన తలవాల్చుకొని తండ్రి మెడచుట్టూ చేతులు చుట్టి శరీరమంతా కదిలేటట్టు వెక్కివెక్కి ఏడ్చింది. ఆయన మనస్సులో కొమరిత చెప్పినట్లు బ్రహ్మదత్తప్రభువు బ్రతికే ఉన్నాడని తోచింది. తన్ను ఓగియార కౌగిలించికొనియున్న కుమారై హృదయాన నిండిన బ్రహ్మదత్తుడు తన హృదయాన చొచ్చి, తొంటికంటె తన కాత్మీయుడైనట్లు తోచి మహారాజు కన్నులు మూసుకొన్నారు. మహారాజు కొమరితను నెమ్మదిగా నడిపించుకొనిపోయి, ఆమె నచ్చటనున్న మంచపీఠముపై పరుండబెట్టి అక్కడే ఒక పీఠముమీద కూర్చుండినాడు. శాంతిశ్రీ చటుక్కున లేచి కూర్చుండెను.

"బ్రహ్మదత్తప్రభువు విద్య అనన్యము నాయనగారూ! ఆయనంత జ్ఞాని ఎవ్వరూ ఉండరు. నాకు బోధించిన గురువులలో ఉత్తములు.”

శాంతిశ్రీ 'నాయనగారూ' అని మహారాజు శాంతిమూలుని ఎన్ని ఏళ్ళనుంచో అలవాటయిన కొమరితలా సంబోధిస్తున్నది. ఆ మాట పాటలా, దివ్య రాగంలా, పరమ మంత్రంలా శాంతిమూలుని చెవినిబడుతున్నది.

“కుమారీ! బ్రహ్మదత్త ప్రభువు నీకు విద్యబోధించింది కొద్దిదినాలే కాదా?”

“కొద్దిదినాలయినా, పండు ఒలిచినట్లే ఆయన బోధించడం. మొదట నాకు ఈ గురువెందుకన్న భావం కలిగింది, కాని మొదటిపాఠం అవుతూనే ఆయన మాహాత్మ్యం అవగాహన అయిపోయింది.”

శాంతిమూలునకు బ్రహ్మదత్తుడు పాఠాలు ప్రారంభించిన మొదటి దినాలు బాగా జ్ఞాపకం ఉన్నాయి. ఆ దినాలలో శాంతిశ్రీ తనకీ గురువెందుకని అన్నది. నేడు ఆ మాటలే లేవు! మహారాజు లేచి, కొమరిత నమస్కార మంది, ఆమెను ఆశీర్వదించి తన అంతఃపురానికి వెడలిపోయినాడు.

శాంతిశ్రీ కదలకుండా అలాగే కూర్చుని ఉంది. ఆమె చూపులు ఎదుటి వస్తువులమీద లేవు. ఆమె ఏదియో ఆలోచనాపథాలలో విహరిస్తున్నది. అప్రయత్నంగా ఆమె కంఠంలోనుండి ఒక పాట ఉదయించింది.

     “ఏమిది ఈ జననము మరణము
     ఎవ్వరు ఈ పురుషులు స్త్రీలూ
     ఎవ్వరు తండ్రి తల్లీ బిడ్డలు
     ఎందుకు ఈ జగమేలా ఎవరికి
                   ఏమిది?...
     గురు వేమిటికీ శిష్యుడేమిటీ
     గురువులు నేర్పే చదువెందులకూ?
                   ఏమిది?........

       ధర్మము ఏది, మర్మము ఎక్కడ?
       కర్మరహితమే మోక్షము నరులకు?
                   ఏమిది?........”

అప్రయత్నంగా ఆమె కళ్ళలో నీరు తిరిగినది. ఆమె మనఃపథాల నౌక ఒకటి ప్రత్యక్షమై నిర్మల నీలాకాశపథాల పక్షివలె తేలిపోతున్నది. ఆ పక్షి వంటి నౌకపై విష్ణువులా బ్రహ్మదత్తప్రభు వామెకు కనిపించినాడు. బ్రహ్మదత్తప్రభువు అలా కనిపించినాడేమి? శ్రీపరమశ్రమణకుని అందంతో సమమైన అందం. అదే కోలమోము, గడ్డం గుంటపడి మామిడిపండులా ఇద్దరికీ! ఆయన నుదురువంటిదే ఈయన నుదురు. ఎప్పుడూ పురుషుల రూపురేఖలనుగూర్చి ఆమె ఆలోచించినదిలేదు. బుద్ధవిగ్రహాలకున్న మోము బ్రహ్మదత్తుని మేము ఆబాలకు నయనపథాల మూర్తించి, నిత్యమైన శిల్పాలలా ఎదుటనే ఉండిపోయినవి.

ఆ బాలిక పద్మాసనాసీనయై యోగినిలా కూర్చుండి, కన్నులరమూతలుపడ

       “జ్ఞానదీప శిఖలు వెలుగ
       మానవులే దేవులంట
       ఆర్హత్వము పొందువారె
       అందమైన మోమువారు
       నావపైన గురుదేవుడు
       నరుల నుద్దరించు మూర్తి
       నీలపథము జ్ఞానపథము
       నీరపథము జీవయాత్ర!
       విద్యలన్ని గరపకుండ
       వెడలిపోయె గురుదేవులు."

ఆ పాట ఆమె కెంతో స్వాస్థ్యమిచ్చినది. ఆమె ఆలాగున కన్నులు మూసుకొని భావాంబరమున సంచరింపసాగింది.


★ ★ ★