Jump to content

అక్కన్న మాదన్నల చరిత్ర/ప్రకరణము 8

వికీసోర్స్ నుండి


ప్రకరణము ౮ - శివాజీ గోలకొండ ప్రయాణము

క్రీ. శ. 1677 సంవత్సరము జనవరినెలలో శివాజీ రాయఘరునుండి బయలుదేరెను. ఆతనితో పలువురు బయలుదేరిరి. నేతాజీఫాల్కర్ అనునతఁడు పదేండ్లకాలము మహమ్మదీయులలో కలసియుండి ఢిల్లీలో కొలువుచేసి మహారాష్ట్రదేశమునకు వచ్చియుండెను. ప్రాయశ్చిత్తముచేసికొని మరల నీతఁడు హిందువయ్యెను. ఇతఁడును ఇట్టివారు కొందఱును శివాజికి తోడై బయలుదేరిరి.

శివాజీసైన్యము హైదరాబాదు రాజ్యపు ఎల్లలలో ప్రవేశించినది. వెంటనే తనసైనికులకు ఎచ్చటను ఎవరికిని ఎట్టి హానిగాని కలిగింపరాదని గట్టియాజ్ఞ నొసంగెను. ఇతరత్ర చేయునట్లు దోపిళ్లు ఇచ్చట పనికిరావనెను. ఎల్లవారితోను స్నేహమర్యాదలు పాటింపవలసినదని కట్టడచేసెను. ఇందుచేత నాతని వెంటవచ్చిన ఏఁబదివేల సైన్యమును సాధువులవలె గోలకొండరాజ్యమున ప్రయాణ మొనర్చిరి.

ఫిబ్రవరినెల వచ్చినది. శివాజీ ససైన్యుఁడై గోలకొండను సమీపించెను. తానాషా శివాజీకి ఎదురేగి తోడ్కొని రాఁదలంచెను. ఆవార్త విని శివాజీ నివారించెను. ‘తానాషా సుల్తానుగారు చాలదొడ్డవారు. నాకన్నను చాలపెద్ద. నావంటి చిన్నవానికి ఆయన ఎదురు రాకూడదు’ అని యామహావీరుఁడు పలికెను. కాని వాస్తవముగా వయసులో శివాజీయే పెద్ద వాఁడు. అందఱకన్ననుచిన్న మాదన్న. అక్కన్న మాదన్నలు మాత్రము కొన్నిమైళ్లు ఎదురువచ్చి శివాజీని సగౌరవముగా కొనిపోసాగిరి.

శివాజీరాకకై గోలకొండకు ఆఱుమైళుల దూరమున నుండిన హైదరాబాదు నగరము అలంకరింపఁబడియుండెను. వీథులును సందులును గొందులును సన్నని కుంకుమకెంధూళులచేతను పసుపుపొడిచేతను తెల్లని బియ్యపుపొడిచేతను రచితములైన రంగవల్లులచేత మనోహరముగానుండెను. రాజమార్గములయందును నాలుగువీథులు కలియుచోటులయందును మహా సౌధములకడను గొప్పగడలు నిలిపి వానికి జెండాలును తోరణములును కట్టియుండిరి. వెదుళ్లచేత అటనట గొప్పదర్వాజాలు కట్టి వానిని అలంకరించియుండిరి. జనులు హిందువులును మహమ్మదీయులును వివిధములైన దుస్తులు ధరించి శివాజీయను ఆ వింతపురుషుని చూచుటకు తమకపడుచు నిలిచియుండిరి. స్త్రీ లందఱును మేడలమీఁదను కిటికీలకడను క్రిక్కిరిసియుండిరి.

మహారాష్ట్రసైన్యము పట్టణములో ప్రవేశించెను. సైనికులును వారి యున్నతాధికారులును బహువిధాభరణములతో ఉజ్జ్వలవేషములను ధరించియుండిరి. వారికిరీటములు, వాని విూఁది బంగారము, రత్నములు, వారి జలతారువస్త్రములు, మహారాష్ట్రవేష మంతయు తెలంగాణమువారికి వేడుకగా నుండెను. ఏఁబదివేలసైన్యము సుముహూర్తమున పట్టణమును చొచ్చెను. ‘ఈసైన్యమేగదా ఢిల్లీపాదుషాకు ప్రక్కలోబల్లె ముగా నున్నది! వీరేగదా రెండేండ్లక్రింద ఏతగిరిని దోఁచి హైదరాబాదువఱకు వచ్చి కొల్లగొట్టినవారు. వీరేగదా వీరాధివీరులకు గండరగండండ్రు!’ అని జనులు ఱెప్పవాల్పక వారిని చూడసాగిరి.

కొంతసేపు మరాటా ఆశ్వికదళము ఖదంత్రొక్కెను. తర్వాత మావలీలనఁబడు వీరుల కాల్బలము నడచెను. వారి వారి దళనాయకులు జగత్ప్రసిద్ధులు - హమ్మీరరావుమోహితే, ఆనందరావు, మానాజీమోరే, సూర్యాజీమాల్సురే, యెశాజీ కంక్ పోవుచుండఁగా జనులు వారిని తమమిత్రులకు చూపి చూపి వారిచరిత్రములను వర్ణించుచుండిరి. వారితర్వాత శివాజీయొక్క ప్రతీహారి సోనాజీనాయకు, వానివెనుక శివాజీయొక్క అంగరక్షకుఁడు బాబాజీదంధేరేయును పోయిరి. వారి విశాలనేత్రములు, నల్లని కనుబొమలు, కుంకుమ చందనములు ధరించిన నొసలు ప్రస్ఫుటముగ కనఁబడుచుండెను. తర్వాత రఘునాథ హనుమంతెయును అతనిసోదరుఁడు జనార్దనహనుమంతెయును, ప్రహ్లాదనిరాజీయు గ్రంథకారుఁడైన దత్తాజీ త్రింబక్, కేశవపంత్, నీలోమోరేశ్వరరావు, గంగాధరపంత్ మున్నగువారును గుఱ్ఱముల మీఁద నేఁగిరి,

వీరిందఱేఁగినను చూపరులలో సంచలనము కలుగలేదు. వారివెనుక గుఱ్ఱములమీఁద మహామంత్రులు సేనాధిపతులు ప్రభువులు పరివేష్టించియుండ అక్కన్న మాదన్నలు ఇరుప్రక్కల వచ్చుచుండగా వారినడుమ సన్నగా చిక్కిపోయినవ్యక్తి జనుల నాకర్షించెను. అతఁడే శివాజి! మూఁడువందలమైళ్లు నడచియున్నందునను అప్పుడే ఏదోజబ్బునుండి తేరుకొనుచున్నందునను చాల బలహీనుఁడుగా కనఁబడుచుండెను. కాని ఇటు నటువీక్షించుచుండిన యాతని నేత్రములలో తైక్ష్ణ్యమును కాంతియు జ్వలించుచుండినవి. పెదవులమీఁది యా ‘మీసాలలో నవ్వులు’ను చక్కఁగా కోటేరు తీర్చినట్లున్న యాతని నాసికయు నాతని కొక శోభనుకూర్చి ‘ఈతఁడు చండశాసనుఁడే గాని దయాళువే’ యని నాఁడు గోలకొండ చూపరులకు తోఁచు చుండెను. ‘శివాజీమహారాజ్‌కు జై’ అని ఆతనిచూచుచునే జనులు అఱచుచుండిరి. స్త్రీలందఱును మేడలనుండి పువ్వుల వర్షమును కుఱిపింపసాగిరి. ఇండ్ల వాకిండ్లలో ముత్తైదువలు హారతు లెత్తుచుండిరి. ఈవైభవమునంతయు చేయించుకొనుచు శివాజీ బదులు తాను బంగారమును వెండిని దారిపొడుగునను వర్షించుచుండెను. హారతులెత్తిన యిండ్లకడ తానే నిలిచి బ్రాహ్మణులచే ఆపళ్లెములలో వరహాలు పోయించుచుండెను. పట్టణములోని పేటల యధికారులు మర్యాద లొనర్చినప్పడు వారికి శివాజీ ఉడుగరలిచ్చి గౌరవించుచుండెను.