అక్కన్న మాదన్నల చరిత్ర/ప్రకరణము 9
ప్రకరణము ౯ - శివాజీ తానాషాను దర్శించుట
ఊరేగింపు దాద్‌మహల్‌కడకు వచ్చి నిలిచినది. ఎల్లవారును వారివారిస్థానములలో దిద్దితీర్చినట్లు నిలువఁబడిరి. శివాజీయును అతనియుద్యోగస్థులు ఐదుగురును అక్కన్నమాదన్న లును గోలకొండప్రధానులు మఱికొందఱును వెంటరాఁగా నగరులోనికి పోయిరి. అచట నొక ప్రాంగణమున గుఱ్ఱములు దిగి విశాలమైన యాస్థానమంటపమునకు మాదన్న శివాజీని తోడ్కొనిపోయెను. అనుచరులు ఒకయడుగు వెనుక రాఁ దొడఁగిరి. లోనప్రవేశింపఁగానే తానాషాయును అతని యనుచరులును ఎదురువచ్చిరి. తానాషా శివాజీని కౌఁగిలించుకొని తనప్రక్కన రాజోచితమైన రత్నకంబళముమీఁద జలతారంచు పట్టుదిండ్లకు ఆనుకొనునట్లు కూర్చుండఁబెట్టుకొనెను. సుల్తానును శివాజీయు కూర్చుండఁగానే సుల్తానుసైగచే వారిప్రక్కనున్న మహామాత్యుడు మాదన్నయు మహాప్రచండదండనాయకుఁడు అక్కన్నయు కూర్చుండిరి. మిగిలినవారందఱును నిలువఁబడియే యుండిరి. లోపలనుండి సన్నని కంతలగుండ అంతఃపురస్త్రీలు ఈవేడుకలు చూచుచుండిరి. శివాజీ యంతటివాఁడు ఇంట ప్రవేశించుట యనఁగా నాగుబాము సాధువై మనప్రక్కవచ్చి కూర్చుండుట వంటిదిగాను, ఆనాగమును అట్లు కొనివచ్చినమాంత్రికుఁడు మాదన్న యనియు వారు తలంచుచుండిరి.
మూఁడుగంటలసేపు శివాజీ తానాషాలు గోష్ఠిసలిపిరి. మొదట పరస్పరము ఆచారోపచారములు కుశలప్రశ్నలు మొదలైన మామూలుకార్యక్రమము జరిగినది. తర్వాత శివాజీ కావించిన మహత్కార్యములను గుఱించియు నాతని ధైర్యసాహసములనుగుఱించియు సభ్యు లుద్ఘోషించుచుండఁగా తానాషా ఆనందముతో వినుచుండెను. సభ్యులవర్ణనలకు తనివిఁజెందక శివాజీ ‘ఈక్షామదేవతలు సరిగావర్ణింపలేరు’ అన్నట్లు తానే వర్ణింపసాగెను. ఎట్లు తాను అఫ్జల్‌ఖానును కడతేర్చినదియు, ఆతఁడు ద్రోహమెంచిరాఁగా తా నందులకొనర్చిన ప్రతిక్రియయు, తనది ద్రోహము కాదనియు విరివిగా నుద్ఘాటించెను. తర్వాత తానాషా ఔరంగజేబునుగూర్చి ప్రస్తావింపఁగా శివాజీ, పాదుషా నీచుఁడనియు, తనకు మొగలాయీలు తామొనర్చిన వాగ్దానాదికములను నెఱవేర్పక అల్పులుగా ప్రవర్తించిరనియు, సభలో తా నెట్లు పాదుషాను ధిక్కరించి వెడలివచ్చినదియు, తర్వాతిఖైదును, ఆఖైదునుండి తాను తప్పించుకొనినవిధమును, ఆవచ్చుటలో జరిగిన విశేషములను కథగా చెప్పెను. తర్వాత తాను సూరత్తును కొల్లగొట్టినదియు, దుర్గములను కూల్చినదియు, మొగలాయీవారిని ఏడిపించినవిధమును వర్ణించెను. ఆవిధముగా చాలసేపు మాటలాడిన ఛత్రపతికి తానాషా ఆభరణము లొసంగి వస్త్రాదికములిచ్చి గుఱ్ఱములు, ఏనుఁగులు మున్నగు వాహనాదికములిచ్చి విశేషముగా గౌరవించెను. తానాషా కనుసన్నచే మాదన్నయు అతనియనుచరులును శివాజీ పరివారమునకు తగినమర్యాద లొనర్చిరి. సభ లేవఁగానే తానాషా శివాజీపై అత్తరుపన్నీరు మొదలైన సువాసనలు చల్లి తాంబూల మొసంగి స్వయముగా మెట్లవఱకును వచ్చి విడిదికి సాగనంపెను. శివాజీ విడిదికి పోవుచు మరల మార్గమంతయు డబ్బులు చల్లుచుపోయెను. అక్కన్న మాదన్నలు శివాజీతోకూడ నాతని విడిదలకేఁగి ఆతని కచట అన్నియేర్పాటులును చేయించి మరల సాయంకాలము వత్తుమనిపలికి వీడ్కొలిపిరి. తానాషాను వారు వచ్చి మరల దర్శించిరి. శివాజీసందర్శనమునకు అందఱును చాల సంతోషించి మాదన్నను మెచ్చుకొని శివాజీరాయబారిని శ్లాఘించిరి. శివాజీసౌజన్యమునకు తానాషా సంతోషించెను.
ఆమఱునాఁడు అక్కన్నమాదన్నలయింట శివాజికి విందు ఏర్పాటాయెను. వైభవముతో మహామంత్రులు శివాజిని ఆతని ముఖ్యవర్గమును తమ భవనమునకు కొనిపోయిరి. ఆ బ్రాహ్మణగృహమును శివాజి పావుకోళ్లులేకయే ప్రవేశించి భానూజీ భాగ్యమ్మలకు సాష్టాంగముగా నమస్కరించి ఆ వృద్ధ దంపతులచేత దీవనల నంది వారికోర్కిమీఁద వారియెదుట వారమర్చిన తివాసిపై కూర్చుండెను. కొంతసేపు భానుమూర్తి పంతులు మహారాష్ట్రభాషలో శివాజిని వినోదించెను. శివాజిని తెచ్చి అతనిచేత తనకు మ్రొక్కించిన కొమాళ్లపై ఆయనకు చెప్పరానిసంతోషము. కొంతసేపైనతర్వాత భానూజిపంతులు శివాజికి స్నానాదికముల కేర్పాటుచేయించి మడిగా నాతని పూజాగృహమునకు కొనిపోయి ఆశీర్వదించి భగవత్ప్రసాద విుప్పించి, బ్రాహ్మణసంతర్పణ యైనవెనుక భోజనాదికమున కేర్పాటు చేయించెను.
సేవకులు, పరిచారకులు, వంటవాండ్రు, శివాజిపరివారమును చూచుకొనుచుండఁగా భానూజీ భాగ్యమ్మలు మర్యా దకు శివాజికి ముందుభోజన మిడుదుమనిరి. ఆతఁడు వారు ముందుభుజించినగాని తానుభుజింపనని పట్టుపట్టగా విధిలేక తా మెల్లరును శివాజి క్షమను నూర్లపర్యాయము ప్రార్థించి భుజించిరి. తర్వాత శివాజిని కూర్చుండ నియోగించి చెంతకూర్చుండి భానూజి మహారాష్ట్రభాషలో మాటలాడుచుండఁగా భాగ్యమ్మ స్వయముగా పరిచారకులు తెచ్చియిచ్చిన పళ్లెముల నందుకొని వడ్డించెను. అక్కన్నమాదన్నలు తండ్రియెదుట కూర్చుండు వారుకారు; దూరమునుండి వచ్చుచు పోవుచు, నడుమనడుమ తమకుతోఁచిన పండో, లేహ్యమో, మురబ్బాయో తెచ్చి పెట్టుచుండిరి. విశ్వనాథ మృత్యుంజయులు మహారాష్ట్రుల బలగమునంతయు పరికించుచుండిరి.
శివాజి ఈమర్యాదకు పరమానందభరితుఁ డాయెను. భోజనానంతరము తాంబూల చర్వణమైనవెనుక శివాజి ఎల్లవారికిని రత్నాదికములు భూషలు నిచ్పి బయలుదేరెను. అక్కన్న మాదన్నలు తండ్రిచేత శివాజికి వస్త్రములు ఏనుఁగులు గుఱ్ఱములు మొదలైనవాని నిప్పించిరి. శివాజి ఆ వృద్ధ దంపతులకు సాష్టాంగముగా నమస్కరించి వీడ్కొనెను. అతని యనుచరులును ఆ పార్వతీపరమేశ్వరులకు అట్లేచేసి బయలుదేరిరి. మాదన్న మరల మహారాష్ట్రపతిని మర్యాదగా బసలో విడిచివచ్చెను.
ఇంతవరకు శివాజీ మాదన్నలు వ్యవహారవిషయములు మాటలాడలేదు. అబుల్‌హసౝ తానాషాకు శివాజియందు చాలస్నేహ మేర్పడెను; పూర్వముండిన జంకు పోయెను. మొగలాయీసామ్రాజ్యమును గడగడలాడించుచున్న ఈవ్యక్తిని ప్రక్కనపెట్టుకొని కంటితో చూచినాఁడు. రాక్షసకృత్యము లొనర్చుచున్న మహారాష్ట్రవీరులను సైనికులను మాదన్నయొక్క మంత్రబలముచే ఇంట తెచ్చిపెట్టుకొని చూచినాఁడు. శివాజి చాల సరసుఁడనియు, సౌజన్యవంతుఁ డనియు, మహాసత్త్వుఁ డనియు, సైన్యశిక్షణలోను కార్యదీక్షయందును అసామాన్యుఁడనియు తలంచెను. ఆతనిస్నేహముండిన మొగలాయీల భయ మెంతమాత్రముండదని నమ్మకము కుదిరెను. మాదన్న రాజనీతిని కొనియాడెను. శివాజి ఏమికోరినను ఒసంగి ఆతనితో సంధిచేసికోవలసినదని మాదన్నను కోరెను. శివాజితో మాదన్న ఆలోచించి ఒక పథకమును కుదుర్చుకొనెను. దక్షిణదేశమును జయించుటకు శివాజికి దినమొకటింటికి మూఁడువేల హొన్నులు లేదా నాలుగునరలక్ష రూపాయలు నెలనెలకు ఇచ్చునట్లును, తమ సేనాధిపతి (సార్-ఇ. లష్కర్) యైన మీర్జా మహమ్మద్ అమీౝ అనునతనినాయకత్వమున వేయిగుఱ్ఱపు దండును నాలుగువేల కాల్బలమును పంపునట్లును ఒప్పకొనెను. కొంత తుపాకులు ఫిరంగులు వానికి కావలసిన మందుసామానులు, ఒప్పుకొన్న ద్రవ్యములో కొన్నినెలలది ముందుగానే ఖర్చులకు ఇచ్చుటకుకూడ ఒప్పుకొనెను. ఈసహాయమునకు బదులుగా శివాజి దక్షిణదేశమును జయించి తనతండ్రియైన షాజికి చెందనిభాగముల నన్నిఁటిని గోలకొండవారి కిచ్చునట్లు ను, పూర్వము తనతండ్రి పాలించుచుండిన ప్రదేశములను తానుంచుకొనునట్లును వాగ్దాన మొనర్చెను. మొగలాయీలవలన గోలకొండకు ఎట్టి యుపద్రవమును తాను రానీయనని శివాజి తానాషా ఎదుట ప్రమాణము చేసెను. తానాషాయును పై యుద్ధద్రవ్యముగాక రక్షణవిధానమునకుగాను సంవత్సరమునకు శివాజికి లక్షహొన్ను లిచ్చునట్లును మహారాష్ట్రుల రాయబారి నొకనిని తనయాస్థానమం దుంచుకొనుటకును ప్రమాణ పూర్వకముగా నొప్పుకొనెను.
శివాజి గోలకొండలో ఒకనెలదినము లుండెను. ఈనెల యంతయు ఊరిలో నుత్సవములు జరుగుచునేయుండినవి. శివాజికి తానాషా రెండుపర్యాయములు దర్శన మొసంగెను. వ్యవహారములనుగుఱించి మాదన్నయే మాటలాడుచుండెను. మరల దర్శన మిచ్చినప్పుడు మరల విస్తారము అనర్ఘ్యవస్తువిశేషములను తానాషా శివాజి కొసంగెను. తానాషా తనసౌధమున పైన కూర్చుండి ప్రక్కన శివాజిని కూర్చుండబెట్టుకొని ప్రజలకు దర్శనమిచ్చెను. తానాషాయొక్క మంత్రులు సేనాధిపతులుమొదలు సామాన్యసైనికులవఱకు అందఱును రాజవందన మొనర్చిరి. వెంటనే మహారాష్ట్రులును అట్లే తానాషాకును శివాజికిని వందన మాచరించిరి. తానాషా మహారాష్ట్ర సైన్యమునకును అధికారులకును సత్కార మొనర్చెను. ఈ వైభవమంతయు నైనవెనుక తానాషా శివాజి గుఱ్ఱముమెడలో వెలలేని వజ్రహారమునువైచి చాలమర్యాదచేసెను. హైదరా బాదులోని ప్రభువులందఱును ఆదినము శివాజికిని ఆతనిబృందమునకును విందొనర్చిరి. విందైనవెంటనే తానాషాకు మహారాష్ట్రవీరుల శౌర్య బలాదికములను చూపనెంచి శివాజి యశాజికంకు అనువానిని ఏనుఁగుతో పోరాడుమనెను. గోలకొండవారి ఏనుఁగులలోని యుత్తమ మత్తేభమును తానాషా తెప్పించెను. ఆవీరుఁడు కత్తితో నాయేనుఁగుతో కొన్నిగంటలు పోరి దానికి రోషముపుట్టించి తుదకు దానితొండమును నఱికి తఱుమఁగొట్టెను.
తానాషా—శివాజి అన్నగారూ, మీయొద్ద ఎన్ని గొప్ప ఏనుఁగులు ఉన్నవి?
శివాజి – తానాషాసుల్తాౝభాయి వీరందఱును మా యేనుఁగులే.
అని తనవీరులనుచూపి సుల్తానును నవ్వించెను.