Jump to content

అక్కన్న మాదన్నల చరిత్ర/ప్రకరణము 6

వికీసోర్స్ నుండి

ప్రకరణము ౬ - మాదన్న పరిపాలనాప్రారంభము

మాదన్న కావించిన మహోపకారమునకు తానాషాకు ఆతనియం దపారమైన నమ్మకమును ప్రియమును ఏర్పడెను. సర్వాధికారమును మాదన్నకే వదలి తాను వినోదాదికములలోను విద్యావంతులతోను కాలము గడుప నారంభించెను. మాదన్న తత్క్షణమే సామ్రాజ్యములో గొప్ప మార్పు లేవియు తేలేకపోయెను. రాజ్యరక్షణమే ప్రధానముగా నుండెను. అధికారమునకు వచ్చినవెంటనే అక్కన్న మాదన్నలకు తలతిరుగ లేదు. ఈ మహోపకారమొనర్చిన సుల్తానుపై వారికి అపార భక్తి యేర్పడెను. ఆతని పూర్వచరిత్రమంతయు గ్రహించిన వెనుక నాతఁడు కేవలమొకజ్ఞాని ఈరూపున నున్నాఁడని తలంప సాగిరి. అట్టిప్రభువును కొలుచుట మహాభాగ్యమని తలంచిరి. అనుదినమును ఉదయము కచేరికిపోయి సుల్తానునకు నాటివిషయములెల్ల విశదీకరించి తాము చేయఁబోవువానిని మనవిచేసి ఆతని యనుమతి నందుచుండిరి. మునుపటి వజీర్లకును వీరికిని ఎంత భేదము! ముజఫరుమూసాలు తానాషాకు ఏమియు చెప్పెడి వారేకారు. వీరు, సుల్తాను రాజకార్యముల వివరములు తనకు వలదనినను, ఆయనకు నివేదించుట ధర్మమనియు, మర్యాదయనియు చెప్పుచు అతనిని చాల అనుసరించుచుండిరి. భగవంతుఁడు తన కింతటి మంచిమంత్రుల నిచ్చెనుగదా యని తానాషా సంతసించుచుండెను.

మాదన్న మంత్రియైన కొలఁది కాలమునకే దేశమును బాగుపఱిచెను. మొదటిపనిగా కొండలలోనుండి దేశోపద్రవము చేయు జాతులవారిని శిక్షించి పైరుపంటలకు రక్షణ యొసంగెను. జనులను పీడించు జమీందారులను సుంకాధికారులను లాగివేసి సాధువులను ధర్మపరాయణులను వారిస్థానమున నియమించెను. ఈవిధముగా నన్నిజిల్లాలను నిష్కంటక మొనర్చెను. తర్వాత ఆన్నిసుబాలలోను గ్రామగ్రామముగా తనిఖీచేయించి వివరముగా పన్నువసూలు పట్టీలు ఆయాసంవత్సరములకు ప్రత్యేకముగా తయారుచేయించెను. ఇందువలన జనులకు కొంతనెమ్మది యేర్పడెను. ఇనాములు, అగ్రహారములు, దేవ బ్రాహ్మణదానములు, ‘నౌకరీ ఇనాములు’ మొదలైనవాని పాలనలోని అక్రమములను మాన్పించెను. తాను క్రొత్తగా పెక్కు దానములను ఇనాములను ఇచ్చెను. హిందూమహమ్మదీయులకు పక్షపాతములేక శిక్షణ రక్షణ లొసంగుచుండెను,

గోలకొండసామ్రాజ్యము చాలవిస్తృతమైనది. ఉత్తరమున శ్రీయకుళము మొదలు దక్షిణమున పుదుచ్చేరివఱకును, ఆంధ్రదేశమంతయు నీ విశాల సామ్రాజ్యమున చేరియుండెను. కడపజిల్లాయును కర్నూలుజిల్లాలోని తూర్పుభాగమును నేటి హైదరాబాదునందలి కల్యాణీజాగీరువఱకుగల భాగమంతయు ఇందులోనిదే. ఏవో ఒకటిరెండుప్రదేశములు తప్ప ఆంధ్రదేశ మంతయు తానాషాపరిపాలనలో నుండెను. నాటి యాంధ్రదేశమున బంగారము పండుచుండెననిన అతిశయోక్తి కానేరదు. బిజాపురమునందలి నిస్సారప్రదేశమును వదలి తెలంగాణమును ప్రవేశించినంతనే పచ్చని పైరుపంటలు చూపరుల కానందమును గొల్పుచుండినవి. ఫలవృక్షములు నేత్రోత్సవము సేయుచుండినవి. ఈదేశపు వజ్రపుగనులును విశేషవ్యాపారస్థానములైన రేవుపట్టణములును ఖండాంతర ద్వీపాంతరములందు ప్రసిద్ధి నందియుండినవి. తానాషాసుల్తానునకు సంవత్సరమునకు దాదాఁపు మూఁడుకోటుల రూపాయల యాదాయ ముండెను. ఈమొత్తము సుల్తానుయొక్క సకలవినోదాదికములకును చాలి పై పెచ్చు రాజ్యరక్షణకొఱకు విదేశీయులకు వార్షికము లిచ్చుటకుసయితము చాలియుండెను. ఈవైభవమే శత్రువులకు కనుకుట్టాయెను. మొగలాయీలకు ఈసంపదనంతయు చూరగొను దురాశ పొడమెను,

ఔరంగజేబు సింహాసన మెక్కినతర్వాత ముప్పదిసంవత్సరములవఱకు గోలకొండసామ్రాజ్యమునకు శాంతియుండెను. ఇందులకు కారణము, బిజాపూరువలె, గోలకొండ మొగలాయీలను ప్రత్యక్షముగా నెదుర్కొనకపోవుటయే. ఇంతవఱకును మొగలాయీలకు, శివాజితోను అతనిస్నేహితుఁడైన ఆడిల్‌షాతోను యుద్ధము చేయుచుండినందున గోలకొండపై దాడి సలుపుటకు అవకాశము దొరకలేదు. పైగా గోలకొండ వారు ఢిల్లీకి సక్రమముగా కప్పము కట్టుచుండిరి.

గోలకొండ రాజ్యమునకు సరియైన రక్షణ లేదు. దాని యుత్తరభాగము మొగలాయీలు జయించిన రాజ్యమును ఆనుకొనియున్నట్టి విశాలమైన బయలు. దానియందు బిజాపురము యొక్క రక్షణకున్నట్లు దుర్గమపర్వతములుగాని, నీరు దొరకని ఎడారిగాని మఱియెట్టి నైసర్గిక నిరోధముగాని లేకుండెను. కాని ఎంతకాలము బిజాపూరు స్వతంత్రరాజ్యముగానుండునో అంతవఱకు గోలకొండకు అపాయములేదు. ఈవిషయమును చక్కఁగా నెఱిఁగినవాఁ డగుటచే నౌరంగజేబు పాదుషా, గోలకొండను మొదటజయించి తనసామ్రాజ్యమందు కలుపుకొనుటకు యత్నింపలేదు అట్లుచేయుటయు అసాధ్యముగానుండెను.

మాదన్న పంతులు కొలఁదిమార్పులతో తత్పూర్వము గోలకొండవా రనుసరించుచుండిన విదేశాంగనీతినే యనుసరించెను. క్రీ.శ. 1636 వ సంవత్సరము నైజాముషాహిరాజ్యము పడిపోయినది. అదిమొదలు ఎట్లు ఈ మొగలాయివారిని తప్పించుకొందుమా యను భీతి దక్షిణరాజ్యములకు పట్టినది. గోలకొండవారికిని అదేభయము. అందుచేతనే గోలకొండసుల్తానులు మాటమాత్రమునకు ఢిల్లీపాదుషాకు వశపడియుండిరే గాని వాస్తవముగా, లోలోపల, బిజాపూరు ఆడిల్‌షాహివారికి ధనసహాయము చేయుచుండిరి; మొగలాయీలు బిజాపురము మీఁదికి దాడివచ్చినప్పు డంతయు తమసైన్యములను ఎల్లల కడకు పంపుచుండిరి. మొగలాయీలు తాము బిజాపూరుమీఁదికి దాడి వెడలినయెడల గోలకొండవారు తమసైన్యముమీఁదికో తమరాజ్యముమీఁదికో దండెత్తివచ్చి బిజాపురమువారికి సహాయముచేయుదురని ఎఱిఁగియుండిరి.

మాదన్న ఈమార్గమునే యనుసరించెను; బిజాపురము వారితో విరోధింపలేదు, స్నేహమే చేయుచుండెను. కాని బిజాపురవ్యవహారము ఇప్పుడు చాల గందరగోళముగానుండెను. అంతఃకలహములు జరుగుచుండినవి. ఇట్టిరాజ్యముతో స్నేహము ఈకాలమున అసాధ్యముగాను నిరుపయోగముగాను నుండెను. ఈవిషయములెల్ల మాదన్న ఆలోచించెను; నిరంతరము జయముగాంచుచుండిన మహారాష్ట్రులతో స్నేహము మొదలుపెట్టెను; శివాజీతో నుత్తరప్రత్యుత్తరములు ప్రారంభించెను.