అక్కన్న మాదన్నల చరిత్ర/ప్రకరణము 5
ప్రకరణము ౫ - ఉపాయసిద్ధి
తానాషా సుల్తాను గొప్ప ఎత్తుగడలో నుండెను. తనకు తొలుత రాజ్యప్రాప్తికి కారకులైన ముజఫరు మూసాఖానులు తన్ను కేవల మొకబొమ్మగాచేయుట ఆతనికి కష్టముగానుండెను. వారిని తొలఁగింప నెంచియుండెను. సుల్తాను హృదయమును మాదన్న, మేధావి, క్షణములో గ్రహించెను. సుల్తానుతో నాంతరంగిక సంభాషణ మొదలిడెను; ముజఫరుమూసాలను తత్క్షణమే తొలఁగించిన నిందవచ్చుననియు ఆపని క్రమముగా చేయవలయుననియు మాదన్న సుల్తానున కుపాయముచెప్పెను. ఆయిరువురకును పరస్పరవిరోధ మేర్పడునట్లు చేయుమనెను. వారిలో ఒకనినిమించి యొకనిని, మర్యాద చేయుచుండు మనెను.
నాఁడు తానాషా మాదన్నచే నీతంత్రమును గ్రహించి అట్లేచేయ నారంభించెను. ముజఫరు మూసాలు ఒక్కొక్కఁ డును సుల్తానునకు తానే ఆప్తుఁడనియు, సుల్తానునకు సాయముచేయు ప్రాధాన్యము తనదేయనియు మఱియొకఁడు తనస్థానము నాక్రమింపఁజూచు శత్రువనియు తలంపసాగెను. వారిలో ద్వేషము వర్ధిల్లసాగినది. ఈద్వేషము వారిసేవకులలోకూడ వ్యాపించి వారు వీథులలో కొట్టుకొనువఱకు వచ్చినది. ఒక దినము మూసా ముజఫరులు పరస్పరము దూషించుకొని రాజ వీథులలో చాల అల్లరిగావించుకొనిరి. వెంటనే ఆవిషయము సుల్తానువఱకు పోయినది. సుల్తాను మాదన్నను రహస్యముగా సలహా యడిగెను. మాదన్న ఇట్లునేర్పెను—వారిరువురను ప్రత్యేకముగా పిలిపించి ఒక్కొక్కనితోను అతనిమీఁదనే తన కభిమానమనియు ఇంకొకనిమీఁద ద్వేషమనియు నమ్మికపుట్టించి, తర్వాత ప్రతిష్ఠకొఱకు నలువురయెదుట తాను దర్బారులో వారిని మందలింపఁబోవుచున్నాననియు, దానిని వేఱుగా భావింపరాదనియు పలికి ఇరువురకును ఒకమారు బుద్ధిచెప్పవలసినది — అని. సుల్తాను ఆప్రకారమేచేసెను. ఇంతవఱకు, మంత్రుల చేతి కీలుబొమ్మ సుల్తానని తలంచుచుండినప్రజలు ఇప్పడు కొంత భయపడసాగిరి. సుల్తాను వాస్తవముగా బలవంతుఁడనియే తలంచిరి. ఆమంత్రు లిరువురును ఇది నాటకమేగదా యని తలంచియుండిరి. ఈవిధముగా రెండుమూఁడుపర్యాయములు జరిగినది. మూసాముజఫరులు కత్తియుద్ధమునకుకూడ సంసిద్ధులైయుండిరి. ఇంతలో అక్కన్న మాదన్నలు లంచములిచ్చియు బెదరించియు ప్రభువులను సామంతులను ఉద్యోగులను యోధాగ్రేసరులను సుల్తానుపక్షమునకు త్రిప్పియుండిరి. మంత్రులకు గౌరవము తగ్గుటతోకూడ బలమును ఉడిగెను. వీరు సుల్తానును త్రిప్పచున్నా రనుమాటపోయి వీరు సుల్తానునకు లొంగిపోవుచున్నారుగాని సుల్తాను వాస్తవముగా సాధువు, లేకున్న వీరిని ఎన్నఁడో కడతేర్చియుండునని జనులు చెప్పకొన సాగిరి.
నాలుగవపర్యాయము చాలరచ్చ జరిగెను. మూసా ముజఫరులు దర్బారులోనే పరస్పరము దూషించుకొనిరి. సుల్తానుయొక్క మాటలను సయితము లక్ష్యముచేయక తిట్టు కొనుచుండిరి. సుల్తాను తనగౌరవమును దర్బారుగౌరవమును కాపాడుకొనవలసియుండెను. సుల్తాను మాదన్నను చూచెను. మాదన్న కనుసైగ చేసెను. వెంటనే తానాషా వారిరువురను ఖైదుచేయుటకు ఆజ్ఞయిచ్చెను. ముందే మాదన్న ఏర్పాటుచే కాచుకొనియుండిన రక్షకవర్గము మూసాముజఫరులను బంధించి కొనిపోయిరి. ఆశిక్ష న్యాయ్యమనియే ప్రజలు తలంచిరి. ఈ మారుకూడ సుల్తాను ఆత్మగౌరవమును నిలువఁబెట్టుకొనుట కొఱకు అట్లుచేసెనని ఆభ్రాంతులు తలఁచిరి. కాని సుల్తాను వారికి మరి విడుదలలేకుండఁజేసెను; వారి యాప్తవర్గమును పూర్తిగా శిక్షించెను. కొందఱు సుల్తానునకు పాదాక్రాంతులై వారిమన్నన వేడిరి. తత్క్షణమే సుల్తాను మూసాముజఫరులు అయోగ్యు లనియు వారికి తానిచ్చినది లఘుశిక్షయనియు నుద్ఘోషించి, మాదన్నను వజీరుగ నియమించి అతనికి ‘సూర్య ప్రకాశరావు’ అను బిరుదము నొసంగెను. అక్కన్నను మహాసేనాధిపతిగా నేర్పాటుచేసెను. వారిమేనల్లుఁడు గోపన్నకు మాదన్న సిఫారసుమీఁద భద్రాచలమున తాసిల్దారుద్యోగ మిచ్చెను. వానితమ్ముఁడు వెంకన్నకు ‘రూస్తంరావు’ అను బిరుదిచ్చి ఫౌజుదారు (సేనాపతి)గా నియమించెను. మాదన్న సిఫారసుమీఁద సుల్తాను మహమ్మద్ ఇబ్రహీం అనువానిని మొదట సార్-ఇ-ఖేల్ (అశ్వసాహిణి)గాను తర్వాత నవాబుగాను చేసెను. తర్వాత సుల్తానుయొక్క ఆజ్ఞమీఁద అక్కన్న మాదన్నలను నవాబు లందఱును ఏనుఁగుపై నూరేగించి వారి బసకు కొనిపోయి అచ్చట వారికి చాలగౌరవముచేసి నజరులు చెల్లించి పెక్కుసలాములతో వీడ్కొనిరి. దేవీప్రసాదము ఈవిధముగా నెఱవేరెను.
భానుమూర్తిపంతులు కొమారుల యభ్యుదయమునకు సంతోషించి భార్యతోవచ్చి గోలకొండలోనే నివసింపసాగెను. హనుమకొండలోనుండి మాదన్నసోదరులును వచ్చిరి. విశ్వనాథునకు బక్ష్‌గిరి, అనఁగా సైన్యమునకు జీతము పంచియిచ్చు నధికారమును, మృత్యుంజయునకు పీష్వాయుద్యోగమును లభించినవి. పదవీస్వీకారానంతరము సుల్తానుయొక్క అనుమతి నంది అక్కనయు నాతనిసోదరులును తమ కనుకూలముగా నొక యింటిని కట్టుటకు ప్రారంభించిరి. తండ్రితోను తమవిద్వాన్జీ యైన మాడుపల్లి కృష్ణభట్టుతోను ఆలోచించి ఖిల్లా (కోట)కు తూర్పున సాహుబండ్ అనుచోట, శతాబ్దములు 1593 అగు విరోధికృత్సంవత్సరము మాఘ శుద్ధ పంచమినాఁడు (క్రీ. శ. 1672 జనవరి 21వ తారీఖున) శంఖుస్థాపన మొనర్చి మూఁడు నెలలలో కట్టడము పూర్తిచేసి, శకము 1594 పరీధావి వైశాఖ శుద్ధ సప్తమినాఁడు (క్రీ. శ. 1672 ఏప్రిలు 22 తేది) గృహప్రవేశ మొనర్చిరి.