అక్కన్న మాదన్నల చరిత్ర/ప్రకరణము 4
ప్రకరణము ౪ - అక్కన్నమాదన్నల స్వప్నములు
అక్కన్న మాదన్నలు తానాషాకొలువులో ప్రవేశించి వారము దినములైనవి. అనుదినము రాజగృహమునకు పోవుచు తమ యుద్యోగమును నిర్వహింప మొదలిడిరి. చాల సులువుగా వీరు అన్ని కార్యములను చూచుకొనుటచే ఇతరులు మహమ్మదీయులు పెక్కింటికి వీరి సాయమపేక్షింపసాగిరి; మిత్రులేర్పడిరి. సుల్తాను రహస్యముగా వీరి శక్తిసామర్థ్యములను పరీక్షించు చుండెను. ఆయవ్యయ విధానములలో వీరు లెక్కలు తయారు చేయుటను చూడవలెనను మిషతో వీరిని తన కులయత్ ఖానాకు పిలిపించుకొని ప్రసంగించుచుండెను. వారితండ్రి భానూజీపంతులు కొమారుల యభివృద్దిని ఎఱిఁగి సంతోషించినను ఓరుగంటిలోనే యుండెను.
ఇట్లుండ ఒకనాఁడు అన్నదమ్ముల కిరువురకును చాల మంచి కలలు వచ్చినవి. వెంటనే మేల్కొని వారు ఒకరితో నొకరు చెప్పుకొనిరి. తెల్లవారిన తర్వాత స్నానాది నామధారణము లైనవెనుక పూజాగృహము ప్రవేశించిరి.
మాడుపల్లి కృష్ణభట్టుగారు వారి పురోహితులు. సోదరు లిరువురును వారిని సమీపించిరి―‘భట్టుగారూ, జపమైనదా?’
భట్టు―‘ఆ అయినది నాయనా, ఇంద తీర్థము’ అక్కన్న మాదన్నలు తీర్థము గ్రహించి భట్టుగారిముందు పీటపై కూర్చుండిరి.
అక్కన్న―భట్టుగారూ, మాకిఱువురకు నిన్నరాత్రి అద్భుతమైన స్వప్నములు వచ్చినవండీ; చాల ఆశ్చర్యముగా నున్నది. వాని ఫలము తాము చెప్పవలెను.
భట్టు―శుభము, శుభము. మీకు ఇటీవలనే సుల్తాను దర్శనము, రాత్రి శుభస్వప్నము. ఈ గోలకొండసామ్రాజ్య ధౌరేయు లగుదురుకాఁబోలు. చెప్పుడు బాబూ.
అక్కన్న ― తమ యాశీర్వచనము. మూఁడవజామున నేను ఎక్కడనో దేవాలయములో నున్నాను. చుట్టును భక్తులనేకు లుండిరి. తటాలున దీపారాధన జరిగినది. ఎదుట భగవతి భవాని కనఁబడుచున్నది. విగ్రహము కాదు. దేవి ప్రాణముతో నుండెను. చేతుల నాడించుచు ఎల్లవారిని చూచుచు నుండెను. నాకు ఆశ్చర్యముతో నేమియు తోపలేదు. మాదన్న నాప్రక్కనే యుండెను. ఆభక్తకోటిలో తానాషాకూడ కనఁబడుచుండెను. ఈ మహమ్మదీయుఁ డెట్లు గర్భాలయములోనికి రాఁగలిగెనని నా కాశ్చర్యమాయెను. మాదన్నవైపు చూచితిని. ఇంతలో నాతఁడు ‘చూడు, చూడు, అన్నయ్యా అమ్మవారు పిలుచుచున్నది’ అనెను. అటు చూతునుగదా భక్తులుగాని తానాషాగాని ఎవరును లేరు, భవానీదేవిమాత్రము కనఁబడుచుండెను. ‘అక్కన్నా, ఇంద, ఈకరవాలము గ్రహింపుము, మాదన్నా ఈ పాశము నీకు. మీకు మేలగుగాక’ అని అంతర్ధానమాయెను. ఆస్వప్నము తమ్మునికి కూడవచ్చినది.
మాదన్న―ఔనండి, మా యిరువురి స్వప్నములును ఒకటే. మేము ఏకకాలమున మేలుకొని ఒకరినొకరము చూచుకొని కొంతసేపుండి తర్వాత స్వప్నవృత్తాంతములను చెప్పుకొంటిమి. ఏమాశ్చర్యము!
భట్టు ― ఆహా! దివ్యమైనకల. స్వప్నశాస్త్రములో చెప్పినట్లు మూఁడవజామునవచ్చినకల మూఁడు నెలలలో ఫలమిచ్చును. మీకు ఈవసారత్‌నౌకరి మూఁడునెలలుమాత్రమే. తర్వాత, అక్కన్నా, నీకు మహాసేనాధిపతి పదవియు, మాదన్నా, నీకు మహామంత్రిత్వమును లభించును. అమ్మవారి ప్రసాదము వృథాపోదు. భక్తకోటిలో మీకు తానాషా కనఁబడుటచే నాతఁడు మహాభక్తుఁడనియు, గొప్పవేదాంతి యనియు, మహమ్మదీయుఁడేయైనను పూజ్యుఁడని తెలిసికొనవలయును. అక్కన్న మాదన్నలు ― ‘అంతయు అమ్మవారి యనుగ్రహము’ అని దేవిపటమునకు నమస్కరించుచుండఁగా, ఇంతలో, వారిమేనల్లుఁడు గోపన్న వచ్చి ‘తానాషాసుల్తాను వారు మామయ్యలకోసము కబురుపంపినారు. జవాను వచ్చి యున్నాడు. ఏదో తొందరపనియట’ అని చెప్పెను. వెంటనే అక్కన్న మాదన్నలు ఉడుపులు ధరించి బయలుదేరిపోయిరి.