రసికజనమనోభిరామము/పంచమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

ఓం నమః కామేశ్వర్యై

రసికజనమనోభిరామము

పంచమాశ్వాసము



రాజితగుణసంగా
హారాయితవరభుజంగ హారసుధారు
క్తారాపటీరపారద
హీరాభిశుభాంగ కుక్కుటేశ్వరలింగా.

1


వ.

అవధరింపుము వాణీమనోహరుండు నారదున కి ట్లని చెప్పం దొడంగె నట్లు సఖీజన
కదంబం బూరడింప నిలింపచంపకామోద యిం పూని యాలకింపుచున్నసమయం
బున.

2


చ.

తడయక ఱెక్క లార్చి విదితంబుగఁ దోఁక విదిర్చి లీలమై
మెడ నిగుడించి సోయగపుమేనిహొరంగు దురంగలింపఁగా
బడిబడి ముద్దుముద్దునునుపల్కు లతితియ్యఁదనం బెలర్ప న
ప్పడఁతులమిన్నఁ జూచి యొకపంజరకీరవతంస మి ట్లనున్.

3


ఉ.

ఇంతిరొ యింత వింతవగ పేటికి నేఁటికిఁ జూడు ధారుణీ
కాంతుఁడు సంతసం బడరఁ గ్రన్నన నన్ననవింటిదంటచే
నంతఁ గలంగి బెంగ గొని వాలెము దాలిమి దూలి ఱేపు నీ
చెంతకు వచ్చి హెచ్చుతమిఁ జేకొను మా కొడఁగూడు వేడుకల్.

4


క.

అమ్మా నీసోయగ మపు, డమ్మానిసిఱేఁడు చూచి యరు దందెఁ గదా
యమ్మారునిబెడిదపుఁబూ, ట మ్మాతనిమదిఁ గలంచి యడలించుఁ జుమీ.

5


తే.

గాలి దూలి దూలి గ్రాలి సోలి విరాలిఁ, దేలి వ్రాలి యోలి బాళి మాలి
మేలి తాలి మెల్ల వ్రీలి కలంగెదు, బేల యింతవంత యేల నీకు.

6


సీ.

మరువక రామనామము జపియించుము, వలుదగుబ్బలసాంకవం బలందు

సారెకు రాహుగ్రహారాధన మొనర్పు, తలఁపుము నీలకంధరుని మదిని
దురుమున సంపెంగవిరిసరు ల్నించుము, పొలుపార నాగేంద్రుఁబూజ సలుపు
పర్జన్యునకుఁ బెనుపండువు సేయుము, శరదాగమారంభ మరయుచుండు


తే.

మబల పికకీరహిమకరానంగభృంగ, పవనచక్రాంగచంద్రకిప్రముఖదుష్ట
వితతి నీమీఁద నేమియు విగ్రహించి, పెంపు రాణింప వెతలఁ గాఱింపకుండు.

7


చ.

తలిరుజిరావజీరుబలుదాడికి నోడి కడంక డక్కి పే
రలమటఁ జిక్కి పొక్కెద వహా నవహాటకదేహ నీకు నేఁ
గలుగఁగ నింతవంతఁ బడఁ గారణ మే మిఁక లెమ్ము నెమ్మదిం
గలఁగక పంపువెట్టు మిదె క్రన్నన నన్నరనాథుఁ దెచ్చెదన్.

8


క.

అని యనుఁగుఁజిలుక వలికిన, మనమున నొకకొంతవంత మాని వధూటీ
జనచూడామణి వేడుక, లెనయఁగఁ దిలకించి దాని కి ట్లని పలికెన్.

9


తే.

చక్కెరలు నుక్కెడలు గ్రుక్కి మిక్కుటంపు, మక్కువలఁ జొక్కి చక్క ని న్బెక్కుగతుల
నెక్కొనఁగఁ బ్రోది యిడుట కోపక్కిమిన్న, యక్కఱలు దీర్చి యిపుడు నన్నాదుకొనుము.

10


క.

మకరాంకునకు న్రతికిని, బ్రకటంబుగ నలఁతిముద్దుపలుకులచేఁ గౌ
తుక మొసఁగు వలఁతివఁట యిదె, శుకమా నీప్రౌఢి నేఁడు చూచెదము గదా.

11


ఉ.

మారుని గేరుచారుసుకుమారుని నామహిభృత్కుమారునిన్
గూరిమి మీఱ నీ విటకు గొబ్బునఁ దోడ్కొని తెచ్చి హెచ్చు నీ
ఘోరమనోభవవ్యధలఁ గుంది మదిం దిగు లొందుదాని నో
కీరమనేఁడు నన్ను బ్రతికింపఁ గదే మధురస్వగీరమా.

12


తే.

మంతనంబున నావలవంతతెఱఁగు, విన్నపము సేయు మమ్మగమిన్నతోడ
నింపుసొంపులు నింపునిద్దంపుముద్దుఁ, గలికిపలుకులఁ దేనియ ల్చిలుకఁ జిలుక.

13


సీ.

ఆరాజదర్శనం బబ్బక యుండిన, నయనోత్పలంబు లేక్రియఁ జెలంగు
నాయినురుచిరకరాలంబనము లేక, చేతోంబుజాత మేరీతి నలరు
నాఘనునిబిడదయారస మొదవక, గాఢతాపాగ్ని యేకరణి నడఁగు
నామహేంద్రమహాకటాక్షంబు నెఱయక, సంభోగసుఖ మెట్లు సంభవించు


తే.

నహహ విహగకులోత్తమ యట్టు లగుట, జాగు చేయక వేవేగఁ జని యశేష
భువనమోహనుఁ డైనయయ్యవనినాథుఁ, గడఁకఁ గొనితెచ్చి సన్మార్గగతిని మనుము.

14

ఆ.

అనుడుఁ గీరరాజ మట్ల చేసెదనమ్మ, చెలులఁ గూడి నీవు వలను మీఱ
నెలమి నాడుకొనుచు నే వచ్చునందాఁక, మనికి వదలకుండు మనుచుఁ దెలిపి.

15


తే.

కొమ్మ నీమేని దొకమంచిసొమ్ముఁ దిగిచి, యానవాలుగ మెడఁ గట్టు మనిన నలరి
వనజలోచన గొబ్బునఁ దనపసిండి, బన్నసర మానవా లిచ్చి పనుచుటయును.

16


చ.

వెర విరవార నజ్జలదవేణిని వీడ్కొని వేడ్క మీఱ నం
బరసరణి న్వడిం బఱచి పక్షవతంసము కాంచె నొక్కచోఁ
దెరువున రాజకీరముఖదివ్యపతంగమనోనుకూలభా
స్వరఫలజాలమున్ భువనసారవిశాలరసాలసాలమున్.

17


తే.

కాంచి మెల్లన యయ్యనోకహముమీఁద, వ్రాలి యాక్రిందఁ బటకుటీరంబు చూచి
యిదియె కాఁబోలు నృపుఁ డున్నయిర వటంచు, నాత్మ నూహించుచున్న యయ్యదనునందు.

18


క.

వసుధాసుధాశనప్రభుఁ డసమశరామేయసాయకాకుంచితహృ
ద్బిసరుహుఁ డై పస చెడి దొసఁ, గెసఁగఁ గృశోదరిఁ దలంచి యిట్లని పలికెన్.

19


ఉ.

 హా కలహంసయాన విరహానలవేదన కోర్వఁజాల న
య్యో కలకంఠకంఠి చల మూనక నన్ను సముద్ధరించు మే
లే కమలాయతాక్షి దయ లేక కలంచెద విట్లు వేగ రా
వే కనకోపమాంగి నిను వేఁడెద బిగ్గఁ గవుంగిలించవే.

20


క.

లలనా మరువిరిబరిగో, లల నాడెందంబు గడుఁ గలంగెడు నివ్వే
ళల నాదుకొని కృపాలీ, లల నామోదం బొసంగి లలిఁ బ్రోవఁ గదే.

21


మ.

తళుకుంబంగరుబొమ్మచందమున నందం బారఁ గన్పట్టి యా
సలు పుట్టించి కరంచి వెండియును హా జాలంబు రెట్టింప న
య్యలరుంగైదువుజోదువేదనకు న న్నర్పించి య ట్లేగితే
బలభన్నీలశిలావినీలచికురాబాలా జగన్మోహినీ.

22


వ.

అని మఱియు ని ట్లనియె.

23


ఉ.

హె చ్చగునిచ్చవేఁట కిపు డేటికి వచ్చితి వచ్చి యెచ్చుగా
నిచ్చట నచ్చకోరదృశ నేటికిఁ జూచితిఁ జూచి యూరకే
క్రచ్చఱఁ జెచ్చెరం జనక కామిని నేటికిఁ గోరితిం గటా
ముచ్చట దీరఁ బైకొనక ముద్దియ నేటికిఁ బోవ నిచ్చితిన్.

24

క.

దాన మదిఁ బొదల సంగడి, చానలతోఁ గలసి మెలసి చనువెడ నయయో
పూని కవుంగిటఁ బెనఁచక, మానినిఁ బో నిడితి మందు మానసుఁ డైతిన్.

25


సీ.

గొబ్బిగుబ్బలు చూచి యుబ్బుచుండితిఁ గాని, నిబ్బరంబుగఁ జెంత నిలువనైతి
వాలుఁగన్నులు చూచి సోలుచుండితిఁ గాని, యల్లిబిల్లిగ మాటలాడనైతి
వెడఁదక్రొమ్ముడి చూచి కడిఁదిఁ జెందితిఁ గాని, తివిరి నెమ్మది కోర్కెఁ దెలుపనైతి
మెఱుఁగుఁజెక్కులు చూచి తెఱఁగు దప్పితిఁ గాని, కొసరి తద్దయు వేఁడుకొనఁగనైతి


తే.

నహహ పని మించె నబల యిట్లఱ దలంచె, మరుఁడు పగ గాంచె వేముఱు మదిఁ గలంచె
నెడరు లొదవించె విరిముల్కు లెదను నించె, శివశివా యింక నే నేమి సేయువాఁడ.

26


సీ.

శైవాలధమ్మిల్లచక్రవాకస్తని, కలహంసగామిని పులినజఘన
సారసవదన డిండీరాభదరహాస, యావర్తనాభి కల్హారపాణి
మధుకరరోమాళి మకరజంఘాలత, కచ్ఛపచరణాగ్ర కంబుకంఠి
వీచికావళి మీనలోచన కింజల్క, జాలకరదన మృణాలబాహ


తే.

యగుచు సొగ సూనుదివిజకన్యావిలాస, సరసి నోలాడ కింక దుస్తరతరాబ్జ
శరశరాఘాతశిఖిశిఖాజాతజాత, యాతినాభీతి యల్లఁ జల్లారఁ గలదె.

27


మ.

సవనాదిక్రియల న్సుధాంధులను మెచ్చం జేసి ధన్యాత్ము లై
నవిశేషజ్ఞుల కబ్బుఁ గాక యకటా నాకేటికిం గల్గుని
బ్భువనాతీతవిలాసవిభ్రమకళాభూరిప్రభాంచన్మరు
ద్ధవళాక్షీమధురాధరాధరసుధాధారాసరిద్ధోరణుల్.

28


ఉ.

భూమిని భామినీమణుల భూరినిలాసరసైకమాన్యలన్
వేమఱుఁ బ్రేమ ముల్లమున విస్తరిలం గనుఁగొందుమే కదా
కామునిమోహనాంబకముకైవడిఁ దద్దయు నుద్ది మీఱు న
క్కామినిరూపవైభవము కన్నులఁ గట్టినయట్ల యుండెడిన్.

29


క.

తమిఁ గన్నులార నాఱని, ప్రమదంబున నింక నొక్కపఱి గన్గొనుభా
గ్యము దొరకునొక్కొ నా కా, సమదద్విరదేంద్రకుంభసమకుచకుంభన్.

30


ఆ.

అని తలంచుచున్న యా రాచతలమిన్న, పలుకు లాలకించి యెలమిఁ గాంచి
యిదియ వేళ యంచు మదిలోన నూహించి, నెమ్మి నొక్కచెంతకొమ్మ కుఱికి.

31


క.

కులుకుచుఁ జక్కెరతేనియ, చిలికెడు నిద్దంపుముద్దుజిలిబిలిపలుకుల్
వొలయఁగఁ జతురత వెలయఁగ, జిలు కానాడెంపురాచసింగముఁ బలికెన్.

32


చ.

కటకట రాజచంద్ర యిది కర్జమె నిర్జరకన్యకామణిన్

దటుకున ఘోరమారనిశీతప్రదరంబులపాలు చేసి యి
చ్చటి కిటు చేరి నీవును విశంకటతాపభరాలసుండ వై
యటమటఁ జెందె దేల పదమా ముదమార నెలంతచెంతకున్.

33


తే.

అధిప నీమోహనాకృతి యద్భుతముగఁ, గాంచినప్పటినుండియుఁ బంచశరని
శాతచూతశరాఘాతయాతనావి, ధూతచేతోంబుజాత యై నాతి స్రుక్కె.

34


సీ.

భృంగ మంగనకు బల్సింగ మై పొడకటై, గాలి బాలిక కుగ్రకీలి యయ్యెఁ
బికము చేడియకుఁ గార్మెకముపోల్కె నెసంగెఁ, జూత మింతికిఁ బెనుభూత మయ్యెఁ
బన్నీరు కన్నెకు మున్నీరుతెఱఁ గయ్యెఁ, గలువ చెల్వకు దొడ్డచిలువ యయ్యె
శారి నారికిఁ బెద్దమారి యై కనుపట్టె, హారము చెలికిఁ బ్రహార మయ్యె


తే.

నేమి చెప్పుదు నీకు రాజేంద్రచంద్ర, చంద్రవదనను నిపుడు నిస్తంద్రభావ
భవభవోదగ్రసంతాపసంభవవికార, మంతకంతకు నగ్గలం బగుటకతన.

35


ఉ.

చెప్పెడి దేమి దేవరకుఁ జేడియచందము పాన్పుక్రొవ్విరుల్
నిప్పుక లంచుఁ దద్దయుఁ జలింపుచు నూర్పులు నింపుచుండి ని
న్గుప్పునఁ దోడితె మ్మనుచుఁ గూరిమి నంపిన వచ్చితిం గటా
యిప్పు డిఁ కేమి యయ్యెనొ మృ, గేక్షణ మారవికారవేదనన్.

36


ఉ.

పూనదు మేన మానికపుభూషణము ల్చెలు లెన్ని చెప్పినన్
మానదు నీవిలాసగరిమంబు గణింపక యొద్దిబోటులం
గాన దనూనబాష్పకలికాకృతలోచన యై నిజమ్ము సు
మ్మాననవిల్తునాన నలినానన నీపయిఁ గూర్మి పెంపునన్.

37


తే.

కమ్మవిల్కానిచేతిపూఁగొమ్మ ముద్దు, గుమ్మ రతనంపుబసిఁడికీల్బొమ్మ వలపు
గ్రమ్మ ని మ్మగుకపురంపుదిమ్మ సుమ్మ, కొమ్మ నెమ్మె దలిర్పఁ గైకొమ్మ రమ్మ.

38


ఉ.

అంగము మేల్కడాని నఖంరాంకురముల్ తెలిక్రొత్తముత్తెముల్
ముంగురు లింద్రనీలములు మోవ చొకారపుఁదమ్మి కెంపుఠే
వం గనుపట్టుపల్వరుస వజ్రపుఱ ల్నునుమానికంపుకీ
ల్బంగరుబొమ్మ సుమ్మ నరపాలక బాల కండింది మీఱఁగన్.

39


క.

అండజయానచనుంగవ, యండ న్వసియించుభాగ్య మబ్బిన సుమకో
దండుఁ డన నెంత వినుమా, కొండలతోఁ బోర వచ్చుఁ గువలయనాథా.

40


క.

అని చిలుక పలుకుటయు న, జ్జనవరుఁ డ ఱ్ఱెత్తి చూచి శాఖాగ్రమునం
గనుపట్టునవ్విహంగముఁ, గనుఁగొని యనియెన్ సమగ్రకౌతూహలి యై.

41

తే.

రమ్ము రాచిల్క విరహవారాశిలోన, మునుఁగు నా కొకతెప్ప వై మొనసి నిలిచి
మగువతెఱఁ గెల్ల నెఱిఁగించి మనిచి తింక, నిన్నుఁ గొనియాడ నేజాడ నేర్చువాఁడ.

43


క.

భళిభళీ శుకవికిరమణీ, పలు కిప్పుడ తర్కితోపపన్నం బగుమే
లెలయింపుచు నెమ్మది క, గ్గల మగుకౌతూహలంబు గలిగించెఁ గదే.

44


ఆ.

అనుచుఁ జేరఁ బిలిచి నెన రొప్ప ముంజేత, నునిచి మేను నిమిరి మొనసి ముద్దు
గొనుచు నెమ్మనమునఁ బెనఁచుకూరిమితోడ, నెనసి మఱియు దాని కిట్టు లనియె.

45


శా.

ఏమేమీ రమణీశిరోమణి భళా యిట్లాడి ని న్నంపెనా
నామీఁదం గలకంఠకంఠి కెదలోనం గూర్మి వాటిల్లెనా
భామారత్నముబోటు లిప్పనికిఁ దోడ్పా టై విడంబించిరా
నీమే ల్ప ల్కిఁక దాఁచ నేల చెపుమా నీడోద్భవశ్రేష్ఠమా.

46


చ.

అతితరమారఘోరవిశిఖాగ్నిశిఖాపరితాపభీతి న
య్యతివలమిన్న ని న్నిచటి కంపెడిచో మఱి యేమి వల్కె నీ
మతిఁ గొతుకంగ నేల చెపుమా జగదేకమనోహరప్రభాం
కితనిజతుండనిర్నమితకింశుకమా శుకమా రయంబునన్.

47


మ.

మకరాంకుం డతిసాహసుండు శశిదుర్మార్గప్రచారుండు త
త్పికకీరభ్రమరాహిభుక్సితగరుద్బృందంబు నింద్యం బహా
శుకమా మాటలు వేయు నేటి కిఁక నాచోఁ బ్రేమ వాటించి యా
చకితానంగకురంగశాబనయనన్ జంద్రాననం గూర్పుమా.

48


ఉ.

నిక్కము గాఁగ నాపలుకు నెమ్మది నమ్ము దిటంబు చేసి యో
చక్కె రవింటిమేల్చిరుదుజక్కికొలంపుజగామగండ యా
చక్కెరబొమ్మ కెంబెదవిచక్కెరపానక మాని చొక్కుచోఁ
జక్కఁగ నీకుఁ గమ్మవలిచక్కెర లక్కఱతో నొసంగెదన్.

49


తే.

కోమలికి నీవు తద్దయుఁ గూర్చుననుఁగ, వగుట మరునకు నెఱబంట వగుట నిన్నుఁ
గరము ప్రార్థించుకొనియెద ఖగకులేంద్ర, మగువతోఁ గూర్చి ననుఁ గృప మనుపు మిపుడు.

50


తే.

అనిన శుకరాజ మతనిఁ గన్గొని నృపాల, వంత యిం తేల యిది యానవాలు గాఁగఁ

జేడె దనబన్నసర మంపెఁ జూడు మనుచుఁ
జూపుటయుఁ బుచ్చుకొని తద్ద చోద్య మంది.

50


క.

బన్నసర మపుడు నరపతి, కన్నుల నద్దుకొని యెదను గదియింపుచు న
క్కన్నెలమిన్నం గాంచిన, కన్నన్ డెందమునఁ గూర్మి గదురఁగఁ బలికెన్.

51


ఉ.

సేమమె గోము మీఱురతిచేతినిగారపుపైఁడిబొమ్మ క
య్యామునిపువ్వుగొమ్మకు నొయారపు వలుపురాచకొమ్మకుం
గామునిగీముతోఁటవలికప్రపుదిమ్మకు ముద్దుగుమ్మ కు
ద్దామవచోనిరూఢి మణిదామమ ప్రేమ మెలర్పఁ జెప్పుమా.

52


ఉ.

అంబుజపత్రనేత్రహృదయంబుతెఱం గొకయింత నీకుఁ ద
థ్యంబుగఁ గాన నయ్యెడుఁ గదా ప్రమదామణి దా ననున్ బ్రసూ
నాంబకకేళి నేలి యలరారఁగఁ జేయునొ ఘోరమారదుః
ఖాంబుధిఁ ద్రోచివైచునొ యహా మణిహారమ వేగఁ దెల్పుమా.

53


ఉ.

తాలిమి దూలి జాలి మదిఁ దార్కొన నక్కనకోపమాంగిపై
వ్రాలనికూర్మిఁ గ్రుంగి బలువాసి దొలంగి కలంగుచున్నచో
వేళ యెఱింగి న న్మనుప వేళయ వచ్చితి మేలుమే లహా
నీలకచాకుచాంచలవినిద్రవిహారమ రత్నహారమా.

54


ఉ.

ఊరక కోరిక న్మదమయూరకకీరకదంబబంభరీ
శారికలుం జకోరికలు సారెకుఁ గేరి కలంపఁ జాఁగె న
మ్మారుఁడు క్రూరుఁ డై పొదవె మచ్చిక హెచ్చఁగఁ దెచ్చి కూర్పు మా
హా రమణీయభర్మమయహారమణీ మణీశిరోమణిన్.

55


ఉ.

అన్నులమిన్న ని న్నచటి కంపిన నిం పెనయంగ వచ్చి యా
వన్నెలదొంతి సంతసపువార్త దిటంబుఁ దెల్పి నేఁడు నా
బన్నముఁ ద్రోచి వైచి బన్నసరంబ బళా జగంబునన్
బ్రన్ననసద్గుణోన్నతులపద్ధతు లిట్టివ కావె యారయన్.

56


ఉ.

అక్కమలాయతాక్షి నను నక్కున నొక్కి కవుంగిలించుచోఁ
జిక్కులఁ బెట్టి ని న్సడలఁజేయుదు నంచుఁ దలంచఁబోకు నా
యక్కఱఁ దీఱ యాదుకొనుమా మణిహారము పేరు మీఱ న
మ్మక్క పరోపకారవిహితాత్ము లిలన్ దమసేగి యెంతురే.

57


తే.

కలికియురమున నెత్తావికలప మలఁది

విరిసరంబులు దమి నించువేళఁ జాల
వఱలఁ జేయుదుఁ గాని మే ల్మఱచి యేను
నిన్నుఁ జిక్కుల నిడఁ జుమీ బన్నసరమ.

58


ఉ.

సాంకవగంధసారఘనసారమృగీమదసారసౌరభా
లంకృత మైనవేల్సునవలాతలమిన్నయురంబుపై నీరా
తంకగతి న్సుఖించునమిత మ్మగుభాగ్యము నీకు నబ్బె నా
కింక మ ఱెన్నఁ డబ్బు వచియింపఁగదే మణిహారరాజమా.

59


సీ.

కలకంఠిజఘనభాగం బంటి యుంటకుఁ, గాంచి యేపుణ్యంబు గాంచినదియొ
వెలఁదిచెక్కులచెంత వ్రేలుచుండుట కేయు, పాసన చేసితో బవిరజోడు
కలికివాతెఱపానకము చవి గొనుటకు, ముక్కర యేవేల్పు మ్రొక్కుకొనెనొ
పొలఁతిముద్దుమొగంబుఁ బొదవియుండుటకుఁ జే, ర్చుక్క యేవ్రతముల స్రుక్కె నొక్కొ


తే.

కంజముఖిమేటిసిబ్బెంపుగబ్బిగుబ్బ, గుబ్బలులదండ నుండ నేఘోరతపము
సలిపితివు నీవు మీభాగ్యసరణి ధరణి, నెన్నఁదరమా కడానిహొన్ బన్నసరమ.

60


చ.

పలుకులు వేయు నేల విను పైదలిపైఁ దలకొన్నకూర్మి నేఁ
దెలుపఁగఁ జాల బాల నిటఁ దెచ్చి రయంబున నాయురంబునన్
నిలుపుము కాక యున్న నిదె నెమ్మది నమ్మదిరాక్షి పేరుగా
మలయుకడానిబన్నసరమా విను నక్కునఁ జేర్చి చొక్కెదన్.

61


తే.

అనుచుఁ బలవింపఁ గీర మోయధిప యింక, నిచట జాగేల వేగ నయ్యింతి నిన్న
క్రీడమై నున్న మనికికి వేడు కలర, రమ్ము చక్కఁగఁ బొసఁగుఁ గర్జమ్ము లెల్ల.

62


వ.

అని మఱియు ని ట్లనియె.

63


ఉ.

అమ్మదచంచరీక రుచి, రాలకజాలక దా నొకింత డెం
దమ్మునయందు నాపలుకు నమ్మక యమ్మకరాంకకంకప
త్రమ్ములదాడి నే మగునొ రాజకులైకలలామ జాళువా
కమ్మ లిఖించి నాయఱుతఁ గట్టుము చెచ్చెర నేగి యిచ్చెదన్.

64


వ.

అనిన నతం డట్ల కాక యని లేఖ లిఖియించి యీలేఖ యా లేఖవధూవతంసమ్మున కి
మ్మని గట్టిగ మెడం గట్టిన.

65


క.

దిట్టతన మెలయ నప్పుడు, చెట్టుప లల్లార్చి యెగసి చెచ్చెర దిని న
ప్పిట్ట నెఱిఁ బఱచి కొనబుల, ప ట్టగు తనమొదలినెలవుపట్టునఁ జేరెన్.

66


వ.

అయ్యవసరంబున.

67

తే.

వంతఁ గలఁగుచుఁ దెఱగంటి వాలుగంటి, యల్లనృపుఁ దెత్తు నని పూని యరిగినట్టి
చిలుక రాదయ్యెఁ దడ వేల చేసెనొక్కొ, యనుచు గాదిలిచెలికత్తియలను బలికె.

68


సీ.

చెలులార ముద్దురాచిలుక రానెలప్రోలి, కేరీతి నురుగతిఁ జేరఁగలదు
చేరి యేరికిఁ బ్రవేశింపఁ జెల్లనిలోన, గరు మఱి యేభంగిఁ జొరఁగఁగలదు
చొచ్చి యచ్చట నిచ్చ నిచ్చ హెచ్చగుఠీవిఁ, గ్రాలు నేలిక నెట్లు గాంచఁగలదు
కాంచి యించుక మదిఁ గొంచ కేతెఱఁగున, నతనితోఁ దగుమాటలాడఁగలదు


తే.

మాటలాడిన విని రాజమన్మథుండు, కౌతుకం జార నిచ్చోటి కేకరణి వచ్చు
వచ్చుట హుళక్కి కటకటా పచ్చవిల్తు, దాడి నిం కెవ్విధంబునఁ దాళుదాన.

69


ఉ.

అక్కట మిక్కుటంపుఁదమి నక్కరుణానిధి నాడు చెల్మికై
మక్కువ మీఱఁ జేరి బతిమాలినఁ గా దని వీడనాడి నన్
జిక్కులఁ బెట్టి యిట్టివెతఁ జెందగఁ జేసితి రమ్మలార యిం
కెక్కడిమాట యాతఁ డిట కేటికి వచ్చు నృపు ల్పరాఙ్ముఖుల్.

70


ఆ.

కుసుమశరశరార్తిఁ గుందుచుఁ జిల్కను, రాయబార మనుప రాక మసలెఁ
బక్షు లేడ రాచపను లేడ యనుచు లోఁ, దలఁప వలదె వెడఁగుఁదనము గాక.

71


తే.

కోరి యేప్రొద్దు సానులకూటములను, దవిలి కలకంఠు లెడపక దరుల మెలఁగ
భోగినులు చుట్టుకొనియుండఁ బొదలుభూమి, భృద్వరుం డింక నీవంక కెట్లు వచ్చు.

72


తే.

అహహ దక్షిణనాయకుం డగుచు జనులఁ, జాల నలయించు పెద్ద గాఁబోలు నాతఁ
డటులఁ గాకున్న మారక భటులచేతి, యాతనలఁ గుందఁ జేయునే యబలలార.

73


వ.

అని చింతించుచున్నసమయంబునం జిలుక యాకలకంఠిమ్రోల లీలం గనుపట్టిన దా
నిం గని యావన్నెలగని యి ట్లనియె.

74


క.

అండజసత్కులమండన, నిండారుకుముదంబుతోడ నిక్కము చెపుమా
గుండియ లదరెడుఁ గాయో, పండో నీ నేగినట్టిపని వైళమునన్.

75


ఉ.

అంగజుఁ గ్రుంగఁ జేయునెఱయందపుఁజందపురాచమిన్న నె
బ్భంగిఁ గనుంగొనం బొసఁగెఁ బాయక యాయెకిమీనితోడ నే
యంగున మాట లాడితి ధరాధిపుఁ డే మని పల్కెఁ దెల్పు నా
బంగరుముద్దుచిల్క నినుఁ బ్రాణపదంబుగ నెంచి పెంచితిన్.

76


క.

చిలుకా యారాక్రొన్నన, విలుకానిం దేక నీవు నే వచ్చుటచే
నలు కాత్మం దళుకొత్తఁగఁ, బలుకాఱియలం గృశింపఁ బాల్పడితిఁ గదే.

77


వ.

అనినం బక్షి యాసరోజాక్షి నీక్షించి యిట్లనియె.

78

తే.

మానినీమణి నీయాజ్ఞ పూని యేను, సరభసంబుగఁ జని చని తెరువులోన
నొక్కసహకారభూరుహం బెక్కి దిక్కు, లడయుచున్నంతఁ జెంత నత్తరువుక్రింద.

79


సీ.

నిదురలేవడిఁ గెంపు నెఱయుకన్గవతోడఁ, బొడిపొడి యైనమైపూఁతతోడ
సడలినరతనంపుబెడఁగుసొమ్ములతోడ, బడలి చె న్నెడలినయెడలితోడ
నుడుగక పొడము నిట్టూర్పుగాడ్పులతోడ, జిగి దొఱంగిన ముద్దుమొగముతోడఁ
జెక్కునఁ జేర్చిన చెయిదామరలతోడ, జాలిఁ దూలెడుమానసంబుతోడ


తే.

న్రాలి హా భువనైకవిభ్రమవిలాస, భాసమానాంగి ననుఁ గృపాపాటవమున
మనుచు మనుచు మనోజవేదనలఁ గనలు, చున్న నెఱవన్నియలరాచమిన్నఁ గంటి

80


ఉ.

ఓ చిగురాకుఁబోఁడి విను మొక్కపటావసధాంతరంబునన్
నీచెలువంబె సారెకు గణింపుచుఁ గంపిలుచుండి దండ నన్
జూచి మనోజువాజి యనుచుం బలవింపఁ దొడంగె నౌర యా
రాచకొలంపురేదొరవిరాలితెఱం గిఁక నేమి చెప్పుదున్.

81


సీ.

హా ప్రభావప్రఫుల్లాంభోజలోచన, హా శరద్రాకాసుధాంశువదన
హా సమదద్విరేఫాలకజాలక, హా తప్తచామీకరాభగాత్రి
హా దిశాకుంభికుంభాంచితకుచకుంభ, హా పరిపక్వబింబాధరోష్ఠి
నా హీరశకలమనోహారరదనాళి, హా నవదర్పణోద్యత్కపోల


తే.

హా జగన్మాన్య గంధర్వరాజకన్య, యహహ మారున కిటుల న న్నప్పగించి
గొడవఁ జెందించి కుందించి జుడిఁగి చనితె, యంచు ని న్నెంచు నతఁడు క్రొమ్మించుఁబోఁడి.

82


తే.

ఏమి చెప్పుదు మఱియు నబ్భూమిజాని, యువిద నీచొక్కటపురూప మొక్కచిత్ర
ఫలకమున వ్రాసి ముందఱ నిలుపుకొని ని, తాంతమోహాతిరేకంబు దనరఁ బలికె.

83


క.

ఏమే యోమేచకకచ, యేమే వామేక్షణామణీ హేమఘృణీ
యేమే సోమోపమముఖి, యేమే మో మెత్తి చూడ కిటు లెంతురఁటే.

84


క.

పచ్చనివిలుదొర పైపైఁ, గ్రచ్చఱ విరిములుకు లేసి కాఱియ నిడుచో
మచ్చిక నన్ బ్రోచుటకై, వచ్చితివా ముద్దగుమ్మ, వలఁతివి లెమ్మా.

85


క.

నానా చూడవు మదకల, యానా యానలినశరునియాన సుమీ న

న్నానన మెత్తి కనుఁగొని, సూనాస్త్రక్రియల నొఱపు చూపకయున్నన్.

86


క.

అలుకా పలుకవు మరువిరి, చిలుకా రతిచేతిముద్దుఁజిలుకా యలుకా
తలుకారుమేలిబంగరు, మొలకా వలకాఁక ముట్టముల కాయెఁ గదే.

87


వ.

అని పలికి మఱియుం దత్తరంబున.

88


చ.

చెక్కిలి ముద్దు వెట్టుకొనుఁ జేతఁ దురంబము దువ్వు నెమ్మదిం
జొక్కి కవుఁగిలించుకొనఁ జూచుఁ జనుంగవ యంటఁ బోవు నో
చక్కెరబొమ్మ న న్మదనసంగరలీలల నేలు మంచుఁ బె
న్మక్కువ మీఱ మ్రొక్కి బతిమాలు వివేకము మాలి తూలుచున్.

89


సీ.

కావిచక్కెరముద్దుమోవి యానఁగఁ బోయి, సారె కూరక నోరు చప్పరించుఁ
బెనఁగి క్రొన్ననపానుపునకుఁ దార్పఁగఁ బోయి, తరలక యున్నపాదములకొఱగుఁ
గడఁక మీఱఁగఁ బోఁకముడి వదల్పఁగఁ బోయి, గడగడ వడకించుఁ గరయుగంబు
గబ్బిచన్గవ యొత్తి కౌఁగిలింపఁగఁ బోయి, కళవళంబున బయ ల్కౌఁగిలించుఁ


తే.

బ్రేమ మాటాడు మని పల్కరించఁ బోయి, మా ఱ్వలుకకున్న వెడవెడ మాటలాడుఁ
గన్న యన్నులతఱమె యన్నన్న చిన్ని, మన్నుదొర మిన్న వలవంతచిన్నె లెన్న.

90


క.

కొమ్మా యనుఁ బలుకవె విరి, కొమ్మా యను నీకు నింత కొఱకొఱ చెల్లెన్
బొమ్మా యను నునుఁజిత్తరు, బొమ్మా యను రాజమౌళి పొదలు విరాళిన్.

91


తే.

అట్టివిరహార్తిఁ గుందుచున్నట్టిమనుజ, వల్లభుని గాంచి నీకెఱఁ గెల్లఁ దెలియ
విన్నవించిన నతఁడు న న్నెన్నరాని, కనికరము మీఱఁ జూచి యి ట్లనుచుఁ బలికె.

92


ఉ.

కోమలిమీఁద నాకుఁ గలకూరిమి దేవుఁ డెఱుంగుఁ జిల్క నీ
కే మని చెప్పువాఁడ నిపు డించుక నీవును జూచితే కదా
భామినిమోవిచక్కెరలపానక మానక మాన నేర దీ
కామదురాపతాప మిఁక గట్టిగ దానిఁ బరిగ్రహించెదన్.

93


వ.

అని పల్కి.

94


తే.

కమ్మవిల్కానిఁ దెగడు నయ్యెమ్మెకాఁడు, కొమ్మ నామాట నీ వెద నమ్మ వనుచుఁ
గమ్మ లిఖియించి పంచె నిక్కమ్ము గాఁగ, నమ్ము మిదె వచ్చు నతఁడు నీయిమ్మునకును.

95


వ.

అనిన నచ్చాన చెచ్చెర నచ్చీటి విచ్చి పుచ్చుకొని నెచ్చెలి కిచ్చిన నది యిట్లని
చదువం దొడంగె.

96


సీ.

శ్రీమత్సకలలోకసీమంతినీజనా, తీతనిరంతరద్యోతమాన
వరరూపలావణ్య వైభవశాలిని, యైనసుశ్యామాభిధానదివ్య

గాంధర్వకులరాజకన్యాలలామకు, ఘనుఁడు ఋతుధ్వజావనివిభుండు
పనిచినశోభనపత్రిక నీవు నా, కనుదోయి కబ్రంబు గదుర నెదురఁ


తే.

గడఁకఁ బొడకట్టి యప్పుడె జుడిఁగి పోవు, టాదిగఁ బ్రసూనవిశిఖజ్వరార్తిఁ జెంది
కుందుచున్నాఁడ నింక నీకోమలాధ, రాధరసుధారసం బిచ్చి యాదుకొనుము.

97


ఉ.

ఏ మని తెల్పువాఁడ నొకయింతయు నక్కటికంబు లేక న
న్నామనిఱేఁడు రేదొరయు నంచలు దేఁటులు గీరశారికల్
కాముఁడు గండుఁగోయిలలు గాఱియ పెట్టుతెఱంగు నీవు లోఁ
గామినికామినీజనశిఖామణి మత్తమరాళగామినీ.

98


క.

అని చదివిన విని వనితా, జనరత్నము సిబ్బితియును సంతసమును నె
మ్మనమునఁ బెనఁగొనఁ జిలుకం, గనుఁగొని యి ట్లనియెఁ బ్రేమ గడలుకొనంగన్.

99


శా.

ధాత్రీనాథశిఖామణిం గని యథార్థం బొప్ప మత్కార్యమున్
శ్రోత్రానందము గాఁగఁ దెల్పి యతనిం జొక్కించి వే క్రమ్మఱం
జిత్రప్రక్రియ నేగుదెంచి యశముం జేకొంచు మేల్మే లహా
పత్రీ పత్రికఁ దెచ్చి నిల్పితివి నాప్రాణంబు లిప్పట్టునన్.

100


క.

శ్రీరమణికి గీరమణికి, నీరమణీయోక్తి యుక్తి నెఱపుచుఁ దచ్చే
తోరమణులఁ గూర్తువు నిన్, గీరమణీ నే నుతింప నేర్తునె యింకన్.

101


వ.

అని చిలుకం దిలకించి పలికి కలికి చెలికత్తియలుం దానును మనోవికాసంబున భా
సిలుచుండె నాసమయంబున.

102


తే.

చక్రపరిపాలన మొనర్ప జగమువిందుఁ, దరలి వచ్చెను నీ వింక నరుగుమంచు
సురలు శశికంచుమేలిబంగరపుఁగమ్మ, చు ట్టనఁగ సభ్రమున వేగుచుక్క వొడిచె.

103


తే.

చక్రరిపుఁ డగురాజశాసనమువలన, నెంచి మారుండు పాంథుల నేయఁ జాఁగెఁ
గావ రావే యటంచు జగంబువిందుఁ, గూర్చి మొఱ చేసెననఁగఁ గుక్కుటము లఱచె.

104


సీ.

అసమానవాసనా లసమానమల్లికా, ప్రసవమంజరులపై ముసరి ముసరి
విమలామృతాకీర్ణకమలాకరోత్ఫుల్ల, కమలానుషంగంబు గాంచి కాంచి
మృదులాతిశోభనచ్ఛదలసద్ఘనసార, కదళీవనంబులఁ బొదలి పొదలి
యేలాలతాజాలడోలాతతవిహార, లీలలఁ బలుమాఱు సోలి సోలి


తే.

యుపరిసురతక్రియాక్లిన్నచపలలోచ, నాఘనస్తనభాగనిదాఘసలిల
బిందుసందోహవిహృతిఁ బెంపొంది పొంది,వీచె వలినాలిచలిగాడ్పు లేచి యపుడు.

105


తే.

అతులగతుల నితాంతోపరతులఁ బతుల

మతుల కామోద మొనఁగూర్చి నుతులు గన్న
సతులనెరజాణతనపుసుస్థితుల కెలమిఁ
జెలఁగి తల లూఁచె నన దీపశిఖలు వడఁకె.

106


తే.

కలకలధ్వానములతో ఖగంబు లెగసి, చదలఁ జరియించెఁ దమకులస్వామి యైన
యరుణుఁ డుదయించుచో నెదు కరుగుదెంచి, యతని దర్శింప సమకట్టినవియొ యనఁగ.

107


చ.

గుసగుసలాడి పల్లవుల గొబ్బున వీడ్కొని యుత్తరీయముల్
ముసుఁగులు పెట్టి దట్టముగ మోముల నిద్దురచొక్కు దేఱ వె
క్కసమున దిక్కు లారయుచుఁ గ్రంతలవెంబడిఁ దారి తారి పల్
దొసఁగు లెసంగులోఁగిళులు దూఱిరి క్రమ్మఱి జారకామినుల్.

108


సీ.

కమ్మవాతెఱపానకమ్ములు చవి చూపి, నిద్దంపుచెక్కులు ము ద్దొసంగి
కులుకుసిబ్బెపుగబ్బిగుబ్బ లంటఁగ నిచ్చి, దట్టంపుఁగౌఁగిలింతలఁ బెనంచి
తమి రేఁచి నీవిబంధములు విప్పఁగ నిచ్చి, జఘనసంస్పర్శనోత్సవ మొనర్చి
బహువిధరతికళామహిమలఁ జొక్కించి, జిలిబిలిసాలపుఁబల్కులఁ గరంచి


తే.

మెల్లమెల్లనె చేతిసొ మ్మెల్ల లాగి, తెల్లవాఱినఁ దమదెస వెల్లి బెల్లి
తల్లులను దార్చి గణికామతల్లు లిండ్ల, వెళ్లఁ దోలించి రత్తఱిఁ బల్లవులను.

109


సీ.

కడఁకతో నిదుర మేల్కాంచి దిగ్గనఁ బాన్పు, దిగి కటిస్థలిఁ గోక బిగియఁ గట్టి
పెనుగొన్నముత్తెంపుఁబేర్లు చి క్కెడలించి, వదలినతొడవులు గుదురుపఱచి
విరులతావులు గ్రమ్ము కురులు క్రొమ్ముడి దిద్ది, కులుకుఁబాలిండ్లఁ గంచెల ఘటించి
మొకమున నెలయుకాటుక పైఁటకొన నొత్తి, పుక్కిటివిడె మొక్కచక్కి నుమిసి


తే.

యందియలు మ్రోయ మట్టియ ల్గ్రందు సేయ, నిదురచొక్కుల నడుగులు గొదుకు పూన
సతులు పడకిండ్లు వెలువడి చనుహొరంగు, ప్రియులడెందంబు లపుడు తద్దయుఁ గరంచె.

110


ఉ.

విక్కుచుఁ బోయి యాగడపు వెంపరతొత్తులయిండ్లు దూఱి బల్
రొక్కము గుమ్మరించి కడఁ, ద్రొక్కుచు నేగినదాఁక రాక వాం
డ్రొక్కెడ వైచి పోవుట కయో యని రెంటికిఁ బాసి గ్రుడ్లనీ
ళ్గ్రుక్కుచు జాఱి రిక్కలకుఁ గొత్తబొజుంగువెడంగు లయ్యెడన్.

111


క.

తూరుపు తెలతెలవాఱినఁ, దారలు గృహదీపములును దమి లంజియలం
జేరిన సిగ్గరిబొజుగున్, బారులమోములును దెల్లఁబాఱె నొకంతన్.

112

వ.

అంత.

113


మ.

బిసినీకాంతవియోగసంజనితగర్భీభూతతాపజ్వరో
ల్లసదార్తిం గృశియించుచున్న యెడఁ గల్యప్రాజ్ఞవైద్యుండు నే
ర్పెసఁగం దత్ప్రబలోపతాప ముడుపన్ హేలాగతిం దెచ్చుబ
ల్రససిందూరపుటుండయో యనఁగ మార్తాండుండు దోఁచెన్ దివిన్.

114


సీ.

చక్రరక్షణకళాచాతుర్యశాలి దా, నినశబ్దవాచ్యుఁ డై యెసఁగు టరుదె
సతతతమోగుణోచ్చాటనచణుఁడు దా, లోకబాంధవుఁ డై వెలుంగు టరుదె
కమలాధికామోదకరమూర్తియుతుఁడు దా, హరిసమాఖ్య వహించి యలరు టరుదె
విష్ణుపదాసక్తి విహరించుమేటి దాఁ, బరమహంసఖ్యాతిఁ బరఁగు టరుదె


తే.

యనుచు ననచినవేడ్క బుధాళు లెల్లఁ, దను నుతించుచు సమయకృత్యములు దీర్ప
సకలజనులకు లోచనోత్సవము మీఱ, ధరణి వెలుఁ గొందె భవవార్ధితరణి యగుచు.

115


తే.

మున్ను దా నపరాసక్తిఁ జన్న ఖిన్న, యగుచుఁ బద్మిని నెమ్మోము మొగిచె నంచుఁ
దరణి యచ్చేడియకు నంపుధౌతపటము, లనఁగ నంచలు గొలఁకుల కపుడు డిగియె.

116


క.

తమ్మికొలంకులపై జుం, జు మ్మని తుమ్మెదలు మెఱయుచొ ప్పలరె సరో
జమ్ములు మీదొర వచ్చెన్, లెమ్మని మేల్కొలుపుచున్న లీల దలిర్సన్.

117


క.

తమి యెల్లఁ దీర్చి తమప్రియ, తముఁ డగురా జస్తమింపఁ దఱిఁ గని వచ్చెం
దిమురునఁ జండప్రభుఁ డని, కుముదంబులు మోము మోడ్చి కుముదము లయ్యెన్.

118


తే.

చక్రములు పొంగె దస్యుసంచయ మడంగెఁ, దమము చెంగె ద్విజప్రతానము చెలంగె
సరసులం దెల్లఁ గమలాతిశయ మెసంగె, జగము విం దగునినుఁడు తేజమునఁ బ్రబల.

119


తే.

అపుడు సురకామినులు సమయార్హవిధులు, దీర్చి మణిభూషణాంబరదివ్యగంధ
దివ్యమాల్యాదికంబులఁ దేజరిలుచు, సరవి నక్కన్యఁ దోడ్కొని సరగ నరిగె.

120


తే.

తమరు దొలునాఁడు మెలఁగినతావు చేరి, యచట నభినవగానవిద్యావినోద
లీల నలరారుచుండి రబ్బాల నెదను, నిలిపి వలవంత గుందుచు నృపతి యచట.

121

తే.

కష్టతరముగ రేయెల్లఁ గడపి మఱియుఁ, దత్తరింపుచు వేఁకువతఱిని లేచి
యాచిగురుటారుఁబోఁడి సోయగము దద్ద, తనమనంబున ని ట్లని తలఁపఁ దొడఁగె.

122


మ.

స్మరియింతున్ స్మరమండలేశ రవిరాజత్ప్రాజ్యరాజ్యేందిరన్
హరిణాక్షిన్ హరినీలనీలచికురన్ హర్యక్షమధ్య న్మనో
హరకార్తస్వరవిగ్రహన్ భుజగరోమాళిన్ సముద్యత్సుధా
కరబింబప్రతిమానచారుముఖి నగ్గంధర్వరాట్కన్యకన్.

123


చ.

వలకొని బోటికత్తె లిరువంకల డాసి భజింప నింపుగా
జిలిబిలిపాట పాడునెడఁ జేతిక డానిపసిండివీణెకా
యలబలుఱాపునం బొదలి యాడెడునక్కలకంఠకంఠి ను
న్గులుకుమిటారిగబ్బిచనుగుబ్బలసౌ రెద నెంతు నెంతయున్.

124


చ.

అఱమఱ లేక నేఁ దఱిసి యాడ వసించినఁ జూచి నానతో
బిఱబిఱు లేచి హేమమణిపీఠము డిగ్గి కురంగటన్ హొయల్
మెఱయ నొకింత కన్మొగిచి మిన్నక యున్నపొలంతిమిన్నవా
ల్చుఱుకుఁబిసాళిక్రొందళుకుఁజూపుల కోపు మదిం దలంచెదన్.

125


చ.

పస యొసఁగం బొసంగునునుబంగరుబొమ్మతెఱంగునన్ దరిన్
వెసఁ గనఁబడ్డ నే వలచి వేమరు నామరుఁ డేఁపఁ దద్దయున్
బిసరుహసాయకక్రియకు వేఁడిన మో మఱ వంచి లోననే
ముసిముసినవ్వు నవ్వుకొనుముద్దులగుమ్మహొయ ల్గణించెదన్.

126


క.

వలఁతితనం బెలయఁగ నా, చెలికానికి నుత్తరంబు చెప్పుచు ముద్దుల్
చిలికెడువప్పొలఁతుకనును, జిలిబిలిపలుగులహొరంగు చింతింతు మదిన్.

127


క.

తలవంచి పసిఁడిగద్దియ, కెలనన్ నాపలుకు లాలకింపఁగ ముంజే
చిలుకఁ బలికించి కులికెడు, తలిరాకుంబోఁడివగలు తలఁపున నెంతున్.

128


చ.

అగణితలీల ఱా ల్గరఁగునట్లుగఁ జె ట్లిగిరించునట్లుగా
మృగఖగపన్నగాదు లెలమి న్విని చొక్కఁ బసిండివీణె బా
గుగ సుతి గూర్చి యామనిని గోయిల గొల్చినభంగిఁ బాడునా
సొగసులదొంతియబ్బురపుశోభనగానవిధాన మెన్నెదన్.

129


చ.

చెలిమి వెలందు లిమ్మునకుఁ జెచ్చెరఁ దోడ్కొనిపోవుచున్నచో
గొలగొలలాడుచు న్వెనుకఁ గోకిలకీరమయూరశారికల్
బిలబిల నేగ వాని నదలించునెపంబున నన్నుఁ గూర్మితో

సొలసి గిఱుక్కునం దిరిగి చూచునొయారియొయార మెన్నెదన్.

130


క.

పొంగారువేడ్కఁ బూచిన, తంగెడుక్రియఁ జూడ నలరి తమి రేఁచినయా
బంగారుబొమ్మగడితపు, సింగారం బెన్నుకొంచుఁ జిత్తమునందున్.

131


చ.

తొలకరిక్రొమ్మెఱుంగుక్రియఁ దోరపురత్నశలాకపోలికన్
దళుకుపఁబసిండిబొమ్మవలె దర్పకవైభవలక్ష్మికైవడిన్
నలువుగ మ్రోలఁ గానఁబడి నామది యల్లఁ గరంచి చన్నయా
చిలుకలకొల్కిసోయగము చిత్తమునన్ స్మరియింతు సారెకున్.

132


సీ.

కులుకుసిబ్బెపుగబ్బిగుబ్బల వ్రేఁకున, గడగడ నసదులేఁగౌను వడఁకఁ
గ్రందుగా రతనంపుటందెలు గజ్జెలు, ఘలుఘల్లు మని పెల్లుకాళ్ల మొఱయఁ
గడితంపుఁగీల్జడ కటిమండలంబునఁ, బలుదెఱంగుల లాస్యకలన నెఱప
మురు వైనహురుమంజిముత్యాలచేర్చుక్క, ఫాలభాగమున నుయ్యాల లూఁగ


తే.

భావమున నన్ను విడనాడి పోవలేని, కూర్మి నందంద తిరిగి కన్గొనుచుఁ జనెడు
పడఁతుకలమిన్నమురిపెంపునడలసొంపు, చెలఁగి నాడెందమునఁ బాదు కొలుపువాఁడ.

133


తే.

అని తలఁచుచుండి యంత నయ్యవనిజాని, వేగుటయు లేచి సమయార్హవిధులు దీర్చి
సచివుఁడును చాను వేవేగఁ జని నిలింప, తరుణు లున్నప్రదేశంబు దఱిసి యచట.

134


క.

కాంచె నుదంచన్మణిమయ, కాంచనపాంచాలికానికాయములఁ గడున్
వంచింపుచుఁ దొలకరిక్రొ, మ్మించున్ దీవియను మించు మించుంబోఁడిన్.

135


క.

మఱియును.

136


సీ.

శుకవాణి నభినవముకురబింబకపోల, నలికులవేణి నేణాంకముఖిని
గంభికుంభస్తని నంభోజదళపాణి, నహిరోమవల్లరి నచలజఘన
నండజయాన నఖండతేజోనిధిఁ, జంపక నాసఁ గాంచననిభాంగి
నావర్తనాభి నిందీవరలోచన, నణుమధ్య నుత్ఫుల్లహల్లకాంఘ్రి


తే.

నఖిలభువనైకమోహిని నబ్జకంఠి, నతులశృంగారవారాశి నన్నిలింప
చంపకామోద నెనలేనిసంతసమునఁ, గాంచె నృపవరాళి కన్నులకఱవు దీర.

137


వ.

అట్లు గాంచి.

138


క.

కొంచింపక వడిఁ బెన్నిధిఁ, గాంచినపేదయునుబోలె ఘనతరహర్షో
దంచితమానసుఁ డై యా, పంచాననమధ్యఁ జేరి పలికెం బ్రేమన్.

139

తే.

వినుము తనుమధ్య మాటలు వేయు నేల, వెలయునీరూపలావణ్యవిభ్రమములు
గాంచినప్పటినుండియుఁ బంచశరుఁడు, నిల్వఁగానీఁడు ప్రాణము ల్నిలుపు నేఁడు.

140


క.

అరవిందనయన విను మ, మ్మరుఁ డిఁక హింసింపకుండ మనుపుము కరుణం
బరికించి ము "న్నహింసా పరమో ధర్మ" యని స్మృతులు పలుకన్ వినవే.

141


సీ.

కులుకుచు జిలిబిలిపలుకులఁ గపురంపుఁ, బలుకులు తులకింపఁ బలుకఁగదవె
తళుకు లీనుపిసాళికలికిక్రేఁగంటివా, ల్చుఱుకుఁజూపులఁ దేఱి చూడఁ గదవె
కమ్మచక్కెరపానకమ్ము లిమ్ముగఁ గ్రమ్ము, నివురుకెమ్మెూవి ము ద్దిడఁగఁ గదవె
చెన్నారుచిన్నారివన్నెలక్రొన్నెల, నగఁ జాలుచిఱునవ్వు నవ్వఁ గదవె


తే.

యెద ననుం గదియించి యియ్యదనమదన, కదనలీలల నలరింపఁ గదవె కుంద
రదన నవచూతదళరదచ్ఛదన త్రిదివ, సదన పరిపూర్ణపూర్ణిమాచంద్రవదన.

142


చ.

సమదగజేంద్రకుంభవిలసత్కుచకుంభయుగంబు ఱొమ్మునం
దమి నిగుడన్ ఘటించి ప్రమదమ్మున బిగ్గఁ గవుంగిలించి యీ
సుమశరతాప మార్చి నను సొంపుగఁ బ్రోవు మదభ్రమద్భ్రమ
ద్భ్రమరవినీలవేణి నినుఁ బల్మఱుఁ గేల్మొగిడించి వేఁడెదన్.

143


క.

అని దీనత దోఁపఁగఁ బ, ల్కిన విని తల వంచి యామృగీదృశ యపుడే
మిని పల్క కూరకుండిన, జనవల్లభుఁ గాంచి యొక్కసఖి యి ట్లనియెన్.

144


క.

నరపాలక యీబాలిక, మరుపాలఁ గడుం గలంగి మరి నీపై ని
బ్బరమున నిలిపిన దిఁక దే, వరచిత్తము వచ్చినట్లు వర్తింపఁ దగున్.

145


ఆ.

అనిన సంతసిల్లి యవనిపుఁ డటు లేచి, యింతులార యిన్నగాంతికమున
నొక్కపటకుటీర మున్న దచ్చటికిఁ బో, దము ముదంబు మీఱఁ దరలి రండు.

146


క.

అనవుడు వా రజ్జననా, థునివెంబడి నంబుజాక్షిఁ దోడ్కొని సరగన్
ఘనతరకుతుకాన్వితహృ, ద్వనరుహ లై యరిగి యరిగి తగ నొకచోటన్.

147


సీ.

సకినెలపట్టెమంచము దోమతెర జర, తారుబాలీసు క్రొందరటుపఱపు
కుతినీతలాడ తళ్కుఁబసిండిచందువా, నిలువుటద్దములు పన్నీటిగిండ్లు
జాలవల్లికలు ముత్యాలజాలీలు పెన్, వింజామరలు వట్టివేళ్లసురటి
కపురంపుబరిణెలు కస్తూరివీణె జ, వ్వాదిక్రోవులు పటనాసిపెట్టె


తే.

తమ్మపడిగము మంచిగందంపుఁగోర, తబుకు చిన్నారియడప మత్తరువుకుప్పె
మొదలు గలదివ్యవస్తుసంపదలఁ బొదలు, నమలమణిమయపటపటీరాంతరమున.

148


తే.

అందఱు ప్రవేశ మొంది రానందలీల, నపుడు నృపుఁడు నితాంతప్రహర్షభా

మానమానసుఁ డై సొగసూని దాని, నెనయఁ గోరుచు నెపు డెప్పు డనుచు నుండె.

149


వ.

అంత దినాంతం బగుటయు.

150


సీ.

కలికికెన్నులఁ క్రొత్తకజ్జలం బెలయించి, తురుమున గొజ్జెంగవిరులు దుఱిమి
నొసలఁ గస్తురిరేఖ పస యెసంగఁగఁ దీర్చి, కలపంబు నెమ్మేనఁ గలయ నలఁది
బెడఁగు చెంగావిపావడ కటి ఘటియించి, చలువమడుంగుదువ్వలువఁ గట్టి
జిలుగుపైఠాణికంచెల యెదఁ గదియించి, యఱుత మల్లెసరంబు లలర నించి


తే.

హారకేయూరకటకమంజీరకాంచి, కామణిగ్రైవతాటంకకంకణాద్య
శేషభూషానికాయ మక్షీణలీలఁ, దొడిగి కై చేసి బోటు లప్పడఁతి కనిరి.

151


క.

ఎలనాగ నీవు గోరిన, చెలువుఁడు నీ కబ్బె నింక సిబ్బితిమై బె
గ్గిలి యుండక మదనాహవ, కలనావైఖరులు వెలయఁ గలయుము వీనిన్.

152


సీ.

చెలువుఁడు కేల్వట్టి సెజ్జకుఁ దార్చుచోఁ, బెనఁగి వెన్కకుఁ జక్కఁ జనెదు సుమ్ము
విభుఁడు నున్గపురంపువిడె మిడ వచ్చుచోఁ, గొదికి మాఱ్మొగము పెట్టెదవు సుమ్ము
వరుఁడు గంచెల యూడ్చి సిరిగంద మలఁదుచో, నుదరి పెన్ రంతు చేసెదవు సుమ్ము
ఛవుఁడు గొప్పునఁ బువ్వుదండలు గట్టుచోఁ, గెరలి చే యొగ్గి యాఁగెదవు సుమ్ము


తే.

ప్రియుఁడు గాటంపువలపులఁ బెల్లు రేఁగి, యల్లనల్లన యిక్కువ లంటి తుంట
వింటిబల్దంటపనులు గావించునపుడు, కసరి విసికించెదవు సుమ్మ పసిఁడిబొమ్మ.

153


ఉ.

అంటిమి గాని యోవికసితాంబుజపత్రవిశాలనేత్ర ము
న్గంటిమి గాదె నీకుఁ గలగాటపుఁగూర్మి తెఱంగు మేలు బ
ల్దంటవు తెల్ప నేటి కిఁకఁ దప్పక యిప్పెనుఱేనిఁ గూడి పూ
వింటివజీరునాలమున నేమఱుఁబ్రేమమెయి న్సుఖింపుమా.

154


క.

అను ననుఁగుఁజెలులపలుకులు, విని యనిమిషరాజకన్య వ్రీడానమితా
ననవనరుహ యై చుఱచుఱఁ, గరుకొని వారల నొకింతఁ గసరుచుఁ బలికెన్.

155


ఉ.

అమ్మకచెల్ల మీరు నను నారడిఁ బెట్టి జుడింగి పోవ ను
ల్లమ్మునఁ బూనినా రవు బళా సరిలే కన వచ్చె మీవీవే
క మ్మిపు డేను వెంబడినె క్రమ్మఱ వచ్చెదఁ గాని హా యిఁకన్
మి మ్మెడఁబాసి యిం దొకనిమేషము నొంటిఁ జరింప లేఁ జుఁడీ.

156


చ.

కటకట మీర లిట్టిబలుకట్టడ లౌట యెఱుంగ నేర కి
చ్చటి కిటు నమ్మి వచ్చుటకు సారెకు బూమెలు పన్ని నన్ను బి
ట్టటమట నొందఁజేసెదరు హా కొద యేమిటి కమ్మలార మీ

కుటిలత గానవచ్చె నిదిగో పెఱమాటలు వేయు నేటికిన్.

157


క.

అని పలుకుచుఁ గేలీగృహ, మునకుం జొరకున్న చిన్నిముగుదలమిన్నం
గనుఁగొని వినయమ్మున న, య్యనుఁగుంబువుఁబోఁడు లొత్తి యని రిట్లనుచున్.

158


శా.

చాలా బేలవె మేలుమే లిపు డహా, బాగాయె లే గాఁపురం
బీలా గైన ధరిత్రిఁ గన్నియల ము న్వీక్షింపమే వార లీ
మేలంబు ల్పచరించి క్రచ్చుకొనిరే మేల్పట్టులం దయ్యెడన్
జాలుం బాలు బెడంద యేల పదమా క్ష్మాకృత్సమీపోర్వికిన్.

159


సీ.

చెయివట్టి పూసెజ్జఁ జేర్పఁ బోయెడు వెలం, దుక కరంబు విదల్చి త్రోచి వైచి
యబ్బబ్బ పద గదె గబ్బి యంచు నదల్చు తరలాక్షిఁ గ్రొవ్విరిదండఁ గొట్టి
వగలాడి యిపు డెంత బిగెసెదే యని నవ్వు, మెఱుఁగుఁబోఁడిని బండ్లు గొఱికి తిట్టి
సరిసరి బులు పెల్ల సడలేనో యిపు డను, భామినీమణి నెఱ్ఱఁబాఱి చూచి


తే.

పూని యిర్వురు మువ్వురు పొదుగఁబట్టి, ముందఱికిఁ ద్రోయ గడితంపుమున్నఱికల
నడుగు దరలక యిడిగిలఁ బడి పెనంగు, చున్నకన్నెకు మఱియు నయ్యన్ను లనిరి.

160


క.

అల్లపుడు పెక్కులాగుల, నెల్లఱ బతిమాలుకొంటి వెడలనికూర్మిన్
జెల్లంబొ యేమె యోసెమ, మల్లడిగొని పెనఁగె దిపుడు మాతో మిగులన్.

161


క.

అగ్గలపువలపుసొలపుల, బెగ్గిలుచుండితివి మున్ను ప్రియనాథునితో
డగ్గఱఁగఁ జేయునపు డీ, సిగ్గేటికిఁ బొడమెనమ్మ చిత్తరుబొమ్మా.

162


క.

బిఱబిఱ విభుకడ కరుగక, కొఱకొఱ లాడెద వ దేమి గోరము మేల్మేల్
వెఱఁ గయ్యెడిఁ గద నీచెడు, కఱదలు గనుఁగొన్న నెన్నఁ గన్నెలమిన్నా.

163


సీ.

చేరి కాళ్లఁ బెనంగు. గారాపుటనుఁగురా, యంచబోదలఁ బో నడంచె దేమి
తెలియాకుమడుపు చేతికిఁ దెచ్చి యిడుబోటి, కత్తియ నదలించి కసరె దేమి
జిలుఁగుఁబయ్యెదచెంగు జీరాడ నది చక్క, సవరించు చెలిఁ దిట్ట సణిగె దేమి
పద మహూర్తము డాసెఁ బతిచెంత కని తెల్పు, చేడెపైఁ గన్నెఱ్ఱఁ జేసె దేమి


తే.

వారిజాక్షిరొ యిటువంటివారె కారె, కోరి సారెకుఁ బువ్వులకోరిబల్వ
జీరుపోరులఁ గేరి యయారె మగల, నోల లాడించి ప్రోడ లై యుండువారు.

164


చ.

అని యిటు లూరడించి చెలు లవ్విభుచెంతకు నింతి మిన్నఁ దో
డ్కొని చని పూసెజ్జకడఁ గోమలి నుంచి నృపాలచంద్ర యి
య్యనిమిషకాంత నెంతయుఁ బ్రియం బలరారఁగ నేలు కొమ్ము కొ
మ్మని తగ నప్పగించి వెస నందఱు జాఱిరి మన్కిపట్లకున్.

165

చ.

అపుడు నృపాలుఁ డమ్మధుకరాలకజాలకసోయగంబు గా
టపుఁదమి మీఱఁ గన్గొని తటాలున ముంజెయి కట్టి పూలపా
నుపునకుఁ దార్చుచోఁ జెలఁగె నూపురభూరిఝుళంయుళధ్వనుల్
విపులగతి న్మనోధవుఁడు విల్లు గుణధ్వని చేసెనో యనన్.

166


ఉ.

ఇందునిభాస్య నాన నపు డీడిగిలం బడి పూలపాన్పునం
జెందక యున్న ఱేఁడు వలిచెక్కులు గన్నులు మోవి ఫాల మా
నందము మీఱఁ జుంబన మొనర్చుచు నిక్కువ లంటుచున్ హొయల్
గ్రందుకొనం గుచంబు లెద గట్టిగఁ బట్టి కవుంగిలింపుచున్.

167


క.

మెల్లనె పూసెజ్జకు దివి, షల్లలనామణిని దిగిచి • జానుగ మృదధ
మ్మిల్ల మొకించుక నిమురుచు, హల్లకదళపాణి కిట్టు లనియెం బ్రేమన్.

168


క.

నాన యిటు లేమిటికి నలి, నానన కెమ్మోవి పంట నానఁగ నిడినన్
నాననవిల్తునిచెయివుల, నానందింపఁగ నొనర్చి యలరింపఁ గదే.

169


ఉ.

దండిగఁ దావిచెంగలువదండలు క్రొమ్ముడిఁ జుట్టనిమ్ము క
న్పండువు గాఁగ గబ్బిచనుబంతులు పట్టఁగ నిమ్ము పుష్పకో
దండునికేళి నేలి ప్రమదంబునఁ దేలఁగ నిమ్ము మత్తవే
దండసమానయాన యొకదండము నీకు నొసంగి వేఁడెదన్.

170


చ.

పలుచనితేనియల్ చిలుకఁ బల్కవె కోకిలవాణి లేఁతన
వ్వులు వొలయంగ నన్ గృప దవుల్కొన జూడు సరోజపాణి పె
న్వల పలరాడ ము ద్దొసఁగి వాంఛలు దీర్చు మదాలివేణి య
గ్గలముగఁ గౌఁగిలింపఁ గదె కంతునిమేలిపఠాణి పోణిమిన్.

171


సీ.

పాలిండ్లు కెంగేలఁ బట్ట నిచ్చిన మేటి, కళుకుబంగరుగిండ్లు కాను కిత్తు
వలపార ననుఁ జూచి కిలకిల నవ్వినఁ, బేరైనముత్యాలపేరు లిత్తుఁ
దావినిద్దంపుఁగెమ్మోవి ము ద్దొసఁగిన, సొంపు రాణింపుబల్కెంపు లిత్తుఁ
దళుకులేఁజెక్కుటద్దము లంట నిచ్చిన, వెల లేనివజ్రంపుఁబలుక లిత్తుఁ


తే.

బూలపాన్సునఁ గొద లేని హాళి నతను, కేళి నోలాడఁ జేసిన లీలఁ గ్రాల
మేలిసామ్రాజ్య మిత్తు నివ్వేళ యింత, గోలతన మేల నను నేలుకొనవె బాల.

172


క.

అని బుజ్జగించి పలుకుచు, జనపాలకమౌళి వేల్పుచానయెయారం
బున కాత్మ నంతకంతకు, ఘనతరమోహాతిశయము గడలుకొనంగన్.

173


సీ.

కపురంపువిడె మొసంగఁగఁ బోవునెపమునఁ గావినున్మోవిఁ బల్గం ట్లొనర్చి

వలపుఁగస్తురిగంద మలఁదునెపంబునఁ, గులుకుసిబ్బెపుగబ్బిగుబ్బ లంటి
జాళువామొలనూలు సవరించునెపమున, డం బార ఘనజఘనంబు నిమిరి
యలరి గొజ్జెఁగదండ లలరించునెపమున, విప్పారు నెఱిగప్పుఁ గొప్పు దువ్వి


తే.

తరుముఁజెక్కులు చుంబించి వళులు నారుఁ, బొక్కిలియుఁ గేల గిలిగింత పొడమ ముట్టి
నీవి సడలించి స్మరశాస్త్రనియతి వెలయ, రతులఁ గరగించి నృపతి యారాజముఖిని.

174


సీ.

వితతదంతక్షతావృతసుధాధరయు స, మంచితనిశ్వాసమారుతయును
శితనఖరాంకురాంకితకుచకుంభయు, ఘర్మకణాక్లిన్నగండతలయు
వదనాంబుజాతసంవ్యాప్తశిరోజయు, ఘనతరసీత్కారగళరవయును
గణితమంజీరకంకణకింకిణీకయుఁ, దరళితహారలతాప్రకరయు


తే.

గళదనూనమృగీమదకర్దమయును, సదమలానందపరవశసంహననయు
నగుచు సురకాంత మిగులసౌఖ్యం బొనర్చె, నంగభవకేళి నానృపఃపుంగవునకు.

175


సీ.

చెలువంపుఁగనుబొమ, ల్సింగిణీవిండ్లుగాఁ, జుఱుకుఁజూపులు శరస్తోమములుగ
గాటంపునూఁగారు ఘనకృపాణము గాఁగ, సోగక్రొందెలిగోళ్లు సురెలు గాఁగఁ
బిగికౌఁగిలింతలు పెనుగులాటలు గాఁగ, సుషమాంగరాగంబు జోడు గాఁగ
నఖదంతపదవితానము పోటుగంట్లుగా, ఘర్మతోయంబు రక్తంబు గాఁగఁ


తే.

కటకనూపురకింకిణీకంకణప్ర, ణాదములు భూరికలకలనాదములుగ
గామినీమణి యతనుసంగ్రామకేళి, సలిపె నప్పుడు నృపకులతిలకుఁ దొడరి.

176


సీ.

వదలిననెఱికొప్పు వారివాహము గాఁగఁ, దనురుచు ల్మెఱుఁగుమొత్తములు గాఁగ
గళరవంబు లనూనగర్జాధ్వనులు గాఁగ, కలపుటూర్పులు గంధవాహములుగ
గళితముక్తాఫలంబులు వడగండ్లుగాఁ, గింకిణీధ్వనులు భేకీధ్వనులుగ
సీత్కృతారవములు చిమ్మెటరొదలుగా, బెడఁగులేనగవులు ఫేనములుగ


తే.

మేన జాల్కొనుచెమ్మట ల్వాన గాఁగఁ, గరఁగుమృగనాభిపంకంబు బురద గాఁగ
నఖపదము లింద్రగోపబృందములు గాఁగ, మగువసురతంబు వర్షాగమంబుఁబోలె.

177


తే.

అంత సురతాంతవేళ నయ్యింతి నంక, తలమునం దిడి గుబ్బలఁ గలప మలఁది
కురులు కొప్పిడితొడవులు గుదురుపఱచి, కడిఁది నెత్తావికపురంపువిడె మొసంగి.

178


క.

వలినాలికమ్మగాడ్పులు, వొలయఁగఁ బూసు టికేలఁ బూని విసరుచున్
జిలిబిలినునుఁబలుకులఁ జెలి, నలరింపుచు రేయిఁ గడపె నవనిపుఁ డెలమిన్.

179

వ.

అంత.

180


సీ.

సారసకల్హారసదమలవాఃపూర, పూరితకాసారతీరములను
బరికల్పితాలీనపరభృతసంతాన, వలయీకృతోద్యానవాటికలను
బహుళదరీప్రాంతభాసమానాశ్రాంత, విస్తృతశశికాంతవేదికలను
సరసవిభాదభ్రచంద్రికాసంశుభ్ర, తలనుదగ్రసితాభపులినములను


తే.

బ్రతిదినంబును హితరీతిఁ జతురశీతి, బంధబంధురరతికళాపారవశ్య
లీలఁ గ్రీడింపుచుండె నిలింపమాన, వతియుఁ గాను ఋతుధ్వజక్షితివరుండు.

181


సీ.

పువుఁబోఁడికటిచక్ర మవనిభాగము గాఁగఁ, గలికినెమ్మెయి కనకంబు గాఁగఁ
దరుణిగుబ్బలు మేటిగిరిదుర్ములు గాఁగఁ, బడఁతిచెక్కులు హీరఫలకములుగ
గజయానకంధర విజయశంఖము గాఁగఁ, గాంతజంఘులు వీరకాహళులుగఁ
బొలఁతులమిన్నపొక్కిలి మహానిధి గాఁగ, లలనవేనలి ఘనలక్ష్మి గాఁగ


తే.

నెంచి నిజరాజ్యవైభవోద్వృత్తి యెల్ల, మఱచి నిస్తులమదనసామ్రాజ్యవైభ
వానుభవలీలఁ గొలుచునన్నరేంద్రుఁ, డతులితామోదహృదయుఁడై యలరుచుండె.

182


వ.

అని నారదమహామునీంద్రునకుఁ జతురాననుం డెఱింగించిన నతం డతని నవ్వలికథా
విధానం బడుగుటయును.

183


శా.

వ్యాకీర్ణాభజటాటవీతటనితాంతాలంబితోద్యత్తమి
ప్రాకాంతాప్రథితప్రభాసముదయాశ్రాంతప్రఫుల్లన్మహా
నాకద్వీపవతీవినిర్మలజలాంతర్భాగభాగ్దివ్యరే
ఖాకాంతోత్పలకైరవప్రకరభాగా పార్వతీవల్లభా.

184


క.

కాండనిధిశయ కాండా, కాండధరోద్దండదర్పఖండన వృషరా
ట్కాండ బహుకాండకాండవి, చండా నిర్దళితవిద్విషద్వేదండా.

185


మాలిని.

కలితగుణకలాపా కాంచనాహార్యచాపా
జలజనయనరోపా సంహృతాశేషపాపా
బలవదరిదురాపా భానుకోటిప్రతాపా
విలసితభవతాపా వేదవేద్యస్వరూపా.

186


గద్యము.

ఇది శ్రీమత్కుక్కుటేశ్వరకరుణాకటాక్షనిరీక్షణసంలబ్ధసరసకవితాసామ్రా
జ్యధురంధర ఘనయశోబంధుర కౌండిన్యసగోత్రపవిత్ర కూచిమంచిగంగనామాత్య
పుత్త్ర సకలసంస్కృతాంధ్రలక్షణకళాకౌశలాభిరామ తిమ్మకవిసార్వభౌమప్రణీతం
బైనరసికజనమనోభిరామం బనుశృంగారరసప్రబంధంబునందుఁ బంచమాశ్వాసము.