రసికజనమనోభిరామము/చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

ఓం నమః కామేశ్వర్యై

రసికజనమనోభిరామము

చతుర్థాశ్వాసము


విజితకూచిమంచిమ
హావంశాభరణగంగనారియమనోరా
జీవాకరచక్రాంగా
గోవల్లభశుభతురంగ కుక్కుటలింగా.

1


వ.

అవధరింపుము వారిజాసనుండు నారదున కి ట్లని చెప్పం దొడంగె నట్లు ఋతుధ్వ
జమహీమండలాఖండలుఁ డఖండపుండ్రేక్షుకోదండప్రచండకాండపరంపరాకంపిత
స్వాంతుం డై కలంగుచుండె నంత నక్కడ.

2


తే.

వేల్పుకన్నెయు నద్ధరావిభు నుదగ్ర, మోహనాకారరేఖ సమ్మోద మొదవ
డెండమున నిల్పి మిగులఁ గడిందివలపు, మొలక లెత్తఁగ నిజగృహంబునకుఁ జేరి.

3


సీ.

పగడంపుఁగోళ్ళహొంబట్టెమంచము దోమ, తెర జరతారుమేల్పరపు తగటు
చందువా ముత్యాలజాలీలు కుతినీత, లాడ దంతపుఁబావజోడు పసిఁడి
దువ్వెన చిటిచాప తూఁగుటుయ్యెల దివ్వె, గంబము ల్పచ్చలగద్దెపీఁట
జాళువాచందువ ల్జాలవల్లిక తమ్మ, పడిగము నెత్తంపుఁబలక రుద్ర


తే.

వీణె వింజామరలు వట్టివేళ్లసురటి, తబుకు కపురంపుబరిణె గందంపుఁగుడక
చిన్నియడపంబు రతనంపుఁజిలుకపంజ, రమ్ములును గలయొకమిద్దెటిమ్మునందు.

4


తే.

తొడవు లన్నియు నెడలించి యడలు మించి, యొడలు బడలంగ మది జాలి గడలుకొనఁగ
మెఱుఁగుకొనగోళ్ళఁ గన్నీరు మీటుకొనుచు, వెడఁదచిటిచాపపై వడి నొడలు వైచి.

5


తే.

కళవళింపుచు మే న్గడగడ వడంకఁ, బండ్లు గొఱుకుచు మూల్గుచుఁ బదరి నగుచు

నోలిఁ బండుచు లేచుచు నులికిపడుచు, నుండె వలరాచబలుబూచి యొదవి యబల.

6


వ.

మఱియును.

7


సీ.

తలయూఁచు నెదలోనఁ దలఁకి గుప్పున లేచుఁ, జిలుకలఁ గొట్టు నెఁచ్చెలులఁ దిట్టుఁ
దనలోనఁ దా నవ్వుఁ గినిసి యంచల ఱువ్వుఁ, గన్నులు మూయు నల్గడలు రోయు
దైవంబు దూఱుఁ జిత్తవికారమునఁ దారుఁ, దహతహ చెందు వేదనలఁ గుందుఁ
బిలువకే పల్కుఁ గోయిలకూఁకలకు నుల్కు, గలవరించు నభంబుఁ గౌఁగిలించుఁ


తే.

గలఁగుఁ బిమ్మటఁ గుడుచు బెగ్గిలు వడంకు, బెదరుఁ గన్నీరు నించు దూపిలుఁ గృశించుఁ
బంచశరఘోరశితచూతభల్లభగ్న, మానసాంభోజ యగుచు నమ్మంజువాణి.

8


క.

అటు లుండి కొంతవడి కా, కుటిలాలక యంతకంతకు న్మనమున మి
క్కుట మై పెరిఁగెడువెతలం, గటకటపడి యి ట్లనుం దగం దనలోనన్.

9


ఉ.

అక్కట పాపజాతిచెలు లక్కటికం బొకయింత లేక తా
రక్కడ నడ్డు దాఁకి బిగి యారఁగ నవ్వగకానికౌఁగిటం
డక్కఁ బెనంగనీక మగుడన్ కొని తెచ్చి మనోజవేదనన్
జిక్కువడంగఁ జేసి యఱఁజేసి రహా యిఁక నేమి సేయుదున్.

10


ఉ.

ఎవ్వరి వేఁడుకొందు నిఁక నేగతి నివ్వెత వీడుకొందు నేఁ
డివ్విధ మెల్ల నెచ్చెలుల కేర్పడఁ జెప్పిన దిట్టకూళ లై
నవ్వులఁ బెట్టి యందఱు వినం గడునామునఁ ద్రుళ్లుకొంచుఁ దా
రవ్వల ఱవ్వలం బఱపి యంకిలి సేయక మాననేర్తురే.

11


ఉ.

ఆద్దిర వానిచెల్వము జయంతునిఁ గంతుని నవ్వసంతునిం
దద్దయు గెల్వఁగాఁ దివురుఁ దప్పక యొప్పులకుప్ప లైనలే
ముద్దులగుమ్మ లాభువనమోహనవిగ్రహుఁ గాంచినంతలో
నుద్ది యిడంగ రానివిరహోదధి బిట్టు మునుంగకుందురే.

12


ఉ.

పున్నమచందురుం దెగడుఁ బూపనిగారపుముద్దుమోము వా
ల్గన్నులు తమ్మిరేకులచొకారము దూరము సేయు జాళువా
వన్నియఁ గేరుఁ జెక్కులు కవాటముదీటువెడందఱొమ్ము హా
కన్నులఁ గట్టిన ట్టిపుడు గానఁగ నయ్యెడు వానియందముల్.

13


ఉ.

పంటికొలందిఁ జక్కెరలపానక మూరెడుకావిమోవి పె
న్గంటి యొనర్చి గుబ్బ లెద గట్టిగఁ జేర్చి కవుంగిలించి పూ
వింటివజీరునాలమున వేమఱుఁ బ్రేమ దలిర్ప వానితో

జంటఁ బెనంగ లేనియలంజవ్వన మేటికి మవ్వ మేటికిన్.

14


క.

అని యిటు లనివారిత మగు, మనసిజవేదనఁ గలంగు మహిలామణిఁ గ
న్గొని యనుఁగుఁజెలు లందఱు, ఘనతరచింతాభరంబు గడలుకొనంగన్.

15


ఆ.

పొలఁతులార యిపుడు నెలఁతకు విరహార్తి, బలిత మయ్యెఁ జేయుపని యిఁ కెద్ది
కలదు చూడుఁ డంచు వలకొని యందఱు, నిందువదనఁ జూచి యిట్టు లనిరి.

16


క.

నీహారకరముఖీ యిటు, లాహా మోహాతిరేక మలరారఁ గడున్
హాహా యని సొలయుచు ఘన, సాహసవృత్తిన్ మెలంగఁ జనునే చెపుమా.

17


తే.

కన్నియవు గాని పోడవు గావు నీవు, కువలయాక్షిరొ సి గ్గెల్లఁ గొల్లఁ బెట్టి
పలుదెఱంగుల నొఱగంగఁ బాడియగునె, యహహ నీడెందమున నింత యళుకు లేక.

18


క.

బాలా వనమృగమదజం, బాలాతతమృదుకపోలభాలా మేలం
బేలా బేలా యిటువలె, మేలా మేలాగు సడల మెలఁగఁగ నీకున్.

19


చ.

తలఁపున నొక్కయన వసుధాతలనాథకుమారుఁ గోరి
దళుకుఁబసిండివన్నియలఁ దద్దయుఁ గేర్నెఱసోయగంపుమే
న్పలువలకాఁకలం గరగి పాఱఁగఁ జేసె ది దేమి మే ల్బళా
చిలుకలకొల్కి నీవెడఁగుఁజిన్నియ లెన్నఁ గ్రొత్త లయ్యెడిన్.

20


సీ.

పెంపార వలిజిలిబిలిపాటఁ బాడుచు, నింపుగా వీణ వాయింప వేమి
గమగమవలచు చక్కనిమంచిగందంబు, వలుదచన్గుబ్బల నలఁద వేమి
జిగిమించు క్రొత్తగొజ్జఁగివిరిసరములు, సొగసుగాఁ గ్రొమ్ముడిఁ జుట్ట వేమి
తళుకుఁ గొమ్మించుటద్దము చూచి నొసలను, దీరుగాఁ గస్తూరి దిద్ద వేమి


తే.

చిలుకబోదల మచ్చికఁ జేసి ముద్దు, చిలుక మురిపెంపుమాటలు చెప్ప వేమి
కడిఁదిరతనంపుఁదొడవులు దొడగ వేమి, తెఱవ నీ కిది యేలాటి తెఱఁగు చెపుమ.

21


ఉ.

చెంత మెలంగునూడిగపుఁజేడెల బి ట్టదలించె దేమి ము '
న్నెంతయుఁ బ్రేమతోఁ బెనిచి యిడ్డ మయూరమరాళశారికా
సంతతులం గన న్మెఱయ సారెకుఁ బాఱ నడంచె దేమి సీ
మంతవతీలలామ యది మంచిదె నీమది నెంచి చూడుమా.

22


చ.

మదనసమానమూర్తి యని మానవనాథకుమారశేఖరున్
మదిఁ దలపోసి యిట్లు పలుమాఱు గృశింపఁగ నేల నీకు స

మ్మద మగున ట్లొనర్చెదము మాపలు కిమ్ముగ నాదరించి యో
మదకలహంసయాన వినుమా యనుమాన మిఁకింత యేటికిన్.

23


ఆ.

అనుచు నిటు లనుంగుననఁబోఁడు లాడిన, పలుకు లాలకించి కలికిమిన్న
కడఁకతో నొకింత కలఁకలో నుడిగి య, య్యిగురుఁబోండ్లఁ జూచి యిట్టు లనియె.

24


సీ.

చెలులార వినుఁడు కల్వలఱేని వలఱేని, నలువారఁ బలుమాఱు గెలువఁ జాలు
వలఱేనిసోయగం బెలమిఁ గన్నులఁ జూచి, నంత నుండియు డెంద మతనియందె
తవిలి క్రమ్మఱక వంతలఁ గలంగఁగఁ జాఁగె, నహహ మోహము నిల్ప నలవి గాదు
శుకమయూరమరాళపికశారికామధు, వ్రతచమూసహితుఁ డై రతివరుండు


తే.

వెతలఁ బఱచుచునున్నాఁడు వేయుగతులఁ, దఱచు లిం కేల యీవేళఁ దాళఁ జాలఁ
జక్కఁగా మీకుఁ గేల్మోడ్చి మ్రొక్కు లిడెదఁ, జెలిమి దైవార నుసురులు నిలుపరమ్మ.

25


చ.

వినుఁ డొకమాట చెప్పెద నవీనకృపామతి నాదరించి యి
ప్పని యొనరించి వేదనలఁ బాపుఁడు మీ రిటు గాక యున్నచో
నెన రెడలించి నాయెడల నేరము లెంచి చలంబు మించ నో
యనుఁగువెలందులార కడునారడిఁ బెట్టకు రమ్మ వేఁడెదన్.

26


ఆ.

అనిన బోటికత్తె లమ్మ నీ కిపు డింత, చింత యేల వట్టిఱంతు లేల
నెమ్మి నుండి నీకు సమ్మదం బొనఁగూర్తు, మనుచు నూరడించి యనిచి రెలమి.

27


తే.

అటులఁ జెలు లూరడించిన నాసఁ దవిలి, యన్నిలింపాంబుజాతదళాయతాక్షి
యతితరాభీప్సితావృతస్వాంత యగుచుఁ, గొంతదిట మూని యున్న యనంతరమున.

28


సీ.

చెఱకుసింగిణివింటఁ గఱకుతుమ్మెదవారిఁ, దవిలించి విరిదొన ల్రవళిఁ బూని
కడిఁది గేఁదంగిరేకడిదంబు మొలఁ జెక్కి, సురపొన్నక్రొన్ననజోడు దొడిగి
పలుమొల్లసరములపాగ బాగుగఁ జుట్టి, మేలినెత్తమ్మిపూడాలు వట్టి
రాణించుచిలుకపఠాణితేజీ నెక్కి, గండుఁగోయిలదండు నిండి కొలువ


తే.

నలరువిలుకాఁ డనెడిపేరి బలుసిపాయి, హాళిఁ బైకొని కో యని యార్చి పేర్చి
కలికివలిగబ్బిగుబ్బగుబ్బలులనడుమ, వాఁడివిరిముల్కి డుస్సిపోవంగ నేసె.

29


క.

ఏసిన హా యని సోలి వి, లాసిని వడిఁ దెలిసి పెక్కులాగుల వెతలన్

వేసరి యేమియుఁ దోఁచక, గాసిలుచుం జెలిమివెలఁదుకల మొఱఁగి వెసన్.

30


సీ.

పట్టెలఁ గే లూని పాన్పు మెల్లన డిగ్గి, గిలుకుపసిండిపావులు దొడుగక
మినుకుచేలచెఱంగు మేలుముసుం గిడి, పుడమిపైఁ దడఁబడ నడుగు లిడుచు
వీడిననెఱికొప్పు వీఁపున జీరాడ, గాటంపుటూర్పులు గడలుకొనఁగ
జిలిబిలిచెమటసోనలు మేన జాల్గొన, జిలుఁగునెన్నడుమునఁ జేయిఁ జేర్చి


తే.

జంటఁ బిలపిలఁ జనుశుకశారికామ, యూరకాదంబవితతుల నులికి పాఱఁ
దఱుముకొనుచు నొకర్తును దారి వట్టి, తరలెఁ దరలాక్షి యంతికోద్యానమునకు.

31


వ.

అట్లు తరలి చని వనిం బ్రవేశించి.

32


సీ.

కమ్మపుప్పొడి ముండ్లకరణి నంఘ్రులు గాఁడ, నలరులు మరుతూపులట్ల తగులఁ
బికరావములు పెద్దపిడుగుల ట్లదలింపఁ, గేకులు పులులట్ల ఢాక చూపఁ
గొదమతేంట్లు తుపాకిగుండ్లపోలికఁ దాఁక, నలఁతిగాడ్పులు బూచులట్ల పొదువఁ
దలిరుటాకులు కటారులమాడ్కి మెయి సోఁకఁ, గపురంబుపెంధూళి గతిని గప్ప


తే.

నడలి యెచ్చోటఁ గా లూన నలవి గాక, మరలి పూఁదేనెసోనలు గురియుచున్న
తలిరుజొంపంపులేమావితరులనడుమ, మేలికపురంపుఁదిన్నెపై మేను చేర్చి.

33


తే.

ఏమి సేయుదుఁ గటకటా యించువిల్తుఁ, డేఁచ నిలు వెళ్లి వనిఁ జేరు టెల్ల నిపుడు
గన్గొనఁగఁ బీడ విడచి బిగాది పట్టి, నట్టు లయ్యె నిం కెచ్చోటి కరుగవలయు.

34


సీ.

గడితంపుమొగిలిరే కడిదంబుఱొమ్మునఁ, గదియించి డుస్సిపో నదుముదాన
మేటిగొజ్జెఁగనీటియేటికాలువలోనఁ జుఱు కూని చివ్వున నుఱుకుదాన
దాకతీవను బూవుందండ చేరిచి మెడ, యిఱియంగ నురి బిగియించుదాన
విరిదేనెలోనఁ గప్పురము వోసి మెదించి, తడయ కొక్కుమ్మడిఁ ద్రావుదాన


తే.

గాక యుండిన సితగరుత్కోకశౌక, కోకిలానీకమత్తమధూకచంచ
రీకశారీకదంబంబు లేక హేళి, దాఁకి పైకొన నిఁక నిల్వఁదరమె యిందు.

35


చ.

అళులుఁ బికంబులు న్శుకము లంచలు శారికలు న్మయూరముల్
గొలగొలలాడుచుండ నివి కూఁత లిడన్ బెగడొంది యయ్యయో
చెలుల మొఱంగీ యిచ్చటికిఁ జేరుట యెల్లఁ దలంచి చూడగా
ములు వెడలించి కొఱ్ఱు బిగమొత్తినచందము దోఁచె నియ్యెడన్.

36


వ.

మఱియును.

37


తే.

హరహరా యంచు రామరామా యటంచుఁ, జక్రధర యంచుఁ బలుమాఱు సంస్మరించు

మకరకేతనపరభృతమందగంధ, వహులదాడికి మోడి యావన్నెలాఁడి.

38


సీ.

ముద్దుగుమ్మకు శిలీముఖ మయ్యెఁ దుమ్మెద, యలికుంతలకి సోఁకు డయ్యె గాడ్పు
కలికికిఁ బుండరీకం బయ్యె నెత్తమ్మి, యంబుజాక్షికి బర్హి యయ్యె నెమిలి
యతివకుఁ బున్నాగ మయ్యెను సురపొన్న, కొమకుఁ గాండం బయ్యె హిమజలంబు
కంబుకంఠికిఁ బరాగం బయ్యెఁ బుప్పొడి, సతికిఁ గోకం బయ్యెఁ జక్రవాక


తే.

మంగభవఘోరసాయకాయాతయాత, నావికంపితహృదయరాజీవ యగుచు
నంతకంతకు సంతాప మతిశయిల్ల, నుపవనంబునఁ బ్రచరించుచుండు నపుడు.

39


క.

అత్తఱిఁ బుత్తడిగీమున, బిత్తరిఁ గానక కరంబు బెగ్గిలి యనుఁగుం
గత్తియ లందఱు నొకచో, మొత్తము లై తత్తరిలుచు మురి సడలంగన్.

40


ఉ.

హా లలనాశిరోమణి గృహంబును వెల్వడి మన్మథానల
జ్వాలల కోర్వ కెచ్చటికిఁ జాఁగెనొ యెయ్యెడ నేమి యయ్యెనో
వైళమ చూడరే యనుచు వావిరి నారయుచున్న యప్పు డా
బాలికచంద మంతయును బంజరకీరము లేర్పరించినన్.

41


క.

విని వనిత లహహ నిర్భయ, మున నేమరి యుండి మోసపోతిమి గదరే
యని వని కందఱు గొబ్బునఁ, జని చెలి నందంద వెదుకఁ జాఁగి కడంకన్.

42


సీ.

ఈకప్పురపుఁదిప్ప యెక్కి యొక్కంతసే, పెలనాగ వల నొప్ప నిలిచియుండె
నీగుజ్జులేమావియివురుజొంపమునీడ, బడఁతి యించుకసేపు పవ్వళించె
నీమిటారపుఁజందమామరాతిన్నెపైఁ, గోమలి యించుకసేపు గూరుచుండె
నీవేడబపుమొల్లపూవుక్రొంబొదరింటఁ, జాన యించుకసేపు సంచరించె


తే.

నీనిగారంపుద్రాక్షాలతానికాయ, కాయమానాంతరంబులకడ నొకింత
సేపు నాళీకపత్రాక్షి సేదఁ దీర్చు, కొనియెఁ గన్గొనరమ్మ యోకొమ్మలార.

43


సీ.

పాను పెక్కఁగ లేక బడలుచేడియ యెట్టు, లీకప్పురపుఁదిప్ప లెక్క నోపె
విరిదీఁగె సోఁకి వేసరుబాల యెట్టు లీ, కారుపూఁబొదరిండ్లు దూఱ నోపె
వీణాధ్వనుల కుల్కువెలఁదుక యెట్టు లీ, ఘనాపికారావము ల్వినఁగ నోపెఁ
దాలవృంతములకుఁ దలఁకుపైదలి యెట్టు, లీసురుగాడ్పుల కెదుర నోపెఁ


తే.

గేళికాగారములపొంతఁ గేళకుళులఁ, జొరవెఱచుజోటి యెట్టు లిచ్చోటిమేటి
తేటగొజ్జంగిపూనీటియేటికాల్వ, దాఁట నోపెనొ కదరమ్మ బోటులార.

44


సీ.

ఎద వ్రయ్య లొదవంగ నీదుండగపుగండుఁ, గోయిలరాపిండు గూయుచుండ
మేను చిల్లులు వోవ నీనాలివలిగాడ్పు, మూఁకలు పైపైని సోఁకుచుండఁ

తలదిమ్ము ఘటియిల్లఁ దవిలి యీతాబోటు, మొకరితుమ్మెదరిమ్ము మొరయుచుండఁ
గనుదోయి నెఱిఁ గప్పఁ గడఁగి యీబలితంపు, చుఱుకుఁగప్రపుబూది పఱచుచుండ


తే.

నొక్కతెయుఁ గోనఁ ద్రిమ్మరుచుండి నొండు, కొనుదొసంగులఁ బిమ్మటఁ గొనుచు మనలఁ
దలఁచి యమ్మక చెల్ల యవ్వెలఁది యెంత, వంత నడలెనొ కదరమ్మ యింతులార.

45


సీ.

ఈబిసంబులు చూచి హేలావతీమణి, పాఁపకూటువ లంచు భ్రమసెనేమొ.
యీపికంబులఁ జూచి యిందీవరేక్షణ, చెడుగుసోఁకుడు లంచు జడిసెనేమొ
యీనెమళ్ళను జూచి మానినీతిలకంబు, బలుకార్మెకము లంచుఁ బఱచెనేమొ
యీకెందలిరుఁ జూచి రాకేందుబించాస్య, దవవహ్ని యనుచు లోఁ దలఁకెనేమొ


తే.

యహహ పసిబిడ్డ కిట్టిఘోరాల్తి యొదవె, నేమి సేయుద మే మంద మెటకుఁ బోద
మెవ్వరిని వేఁడుకొంద మిం కిపు డటంచు, నోలి దిరుగుచుఁ జని చని యొక్కచోట.

46


సీ.

ముసుఁగు వాయఁగఁ ద్రోచి కసరి దిగ్గన లేచి, యఱ్ఱెత్తి నలుగడ లరయుదాని
మాటి కబ్రపుజాలి నాటి క్రొవ్వేఁడిక, ల్నీటిజా ల్గొనగోట మీటుదాని
హెచ్చారుమరునంపచిచ్చఱసెకఁ గంది, యుసు రంచు నిట్టూర్పు లుచ్చుదాని
బెడిదంపుమదకీరరావముల కుల్కి, పెల్లుగా మదిఁ దల్లడిల్లుదాని


తే.

నుసురు లూడాడ విసవిస విసరి ముసరి, దొసఁగు లెసగించుసురుగాడ్పుతుటుముదాడి
కడలి తద్దయు గడగడ వడఁకుదాని, వేల్పురాకన్నెఁ గాంచి రావెలఁదు లపుడు.

47


తే.

కాంచి దవ్వులనుండియే కడఁకఁ బఱచి, పొదవికొని యశ్రుజలపూరమున మెఱుఁగుఁ
బోఁడిమైతాప మార్చుచుఁ బ్రోడ లైన, యనుఁగుఁగెందలిరాకుఁబోం డ్లాదరమున.

48


తే.

చెంగలువపూలు మేలుసంపెంగవిరులు, పడఁతి మిన్నకుఁ జుట్టి రా బడిసి వైచి
కప్పురపుబూది నిటలభాగమున బెట్టి, యఱుతఁ గురువేరు గట్టి నెయ్యమున ననిరి.

49


ఉ.

కొమ్మరొ ముమ్మరంపువెత గ్రుందుచు ని ల్లెడఁబాసి యిమ్మెయిన్

మ మ్మఱ చేసి యొంటిగ వనంబున కేటికి వచ్చి తమ్మ నె
త్తమ్ములఁ గేరునీమృదుపదంబులు గందెఁ గదమ్మ మేలుమే
లమ్మకచెల్ల నీబలుగయాళితనమ్ములు చెప్పఁ జిత్రముల్.

50


క.

కన్నెల నెందఱినేనియుఁ, గన్నులఁ జూచితిమి గాని కటకట యిటులన్
మున్నెన్నడు నీపగిది, న్మున్నఱికలఁ బొరలుమానినులఁ జూచితిమే.

51


సీ.

కుజనులఁ జేరి చొక్కుచు శీధుపానంబు, సేయుచండాలు లీచెనఁటితేఁటు
లడవులఁ దెరువరు లడలఁ గేకలు పెట్టి, పఱచుశిఖండు లీబర్హిణములు
పలుగాకిమూఁకలో బ్రతికి పంచమరీతి, నెసఁగుకాలాకృతు లీపికములు
విషము విదుల్చుచు వెస ఘనవిముఖతఁ, జనుజాలపదము లీసారసములు


తే.

పూని నిరతంబు చెలరేగి పుణ్యతరుల, ఫలము లెల్లను బడఁద్రోయు పక్షపాతు
లీశుకంబులు హా వెఱ పింత లేక, వనజదళనేత్ర యిం దేల వచ్చి తమ్మ

52


తే.

ఆయెఁ గానిమ్ము మంచిది యబల యింకఁ, గొంక వలవదు నీమదికోర్కె లెల్లఁ
దీఱు నిప్పుడు వనిలోనఁ దూఱి పూలు, గోయుదము రమ్ము తహతహ కొంత దీఱ.

53


తే.

అనుచు వనజాతలోచన నత్తెఱఁగున, నాడి సంగడిపూఁబోఁడు లంత నచటఁ
దరలి పుష్పాపచయబుద్ధి దలముకొనఁగ, వరుస నందఱు శృంగారవనము చొచ్చి.

54


తే.

క్రొమ్ముడులు దిద్ది కంచెలల్ గుదియఁ గట్టి, మొలల నవరత్నమయకాంచికలు బిగించి
యందియ ల్పాదకటకము ల్పొందుపఱచి, యొండొరుల మీఱి వేడుక ల్మెండుకొనఁగ.

55


మ.

అళులం జోపుదుఁ బువ్వుఁదేనియల నెయ్యం బొప్పఁగాఁ గ్రోలుచున్
ఫలము ల్మెక్కుచుఁ దీవపందిరులలోఁ బల్మాఱుఁ గ్రీడించుచున్
గలకంఠంబులఁ దోలుచున్ సుమపరాగం బుద్ధతిం జిమ్ముచుం
దలిరున్ జొంపము లెల్లఁ ద్రుంచుచు సుధాధామాననల్ నెమ్మదిన్.

56


మ.

వలిగప్రంపుటనంటిబోదియలక్రేవ న్గుజ్జులేమావిమ్రా
కులనీడన్ బలుచాకపందిరులలో గొజ్జెంగపూనీటివా
కలపొంతం గురువింద పెన్ బొదలలో గాటంపుఁజెంగల్వబా
వులపజ్జ న్నెలరాలదిన్నియలఁ బ్రోవు ల్గూడి క్రీడించుచున్.

57


సీ.

మిహికాంశుముఖి యోర్తు సహకారభూజంబు, కలికి యొక్కతె తిలకద్రుమంబు
కరిరాజయాన యొక్కతె సింధువారంబు, కోమలి యొక్కతె కురువకంబు

శతపత్రపత్రలోచన యోర్తు వకులంబు, సుందరి యొక్కతె యశోకతరువు
కలకఁఠకంఠి యొక్కతె ప్రేంఖణంబును, సన్నుతాంగి యొకర్తు పొన్నమ్రాను


తే.

సఖి యొకతె గోఁగు నొకయింతి చంపకంబు, నలరు లెత్తించి రెలమిఁ జే నంటి చూచి
యూర్చి కౌగిటఁ బెనఁచి క ల్లుమిసి తాఁచి, పాడి నగి పల్కి యాననప్రభలు నెఱపి.

58


తే.

మఱియు వనియెల్లఁ గలయఁ ద్రిమ్మరి యుడుగక, మెదలుటక్కరిగండుఁదుమ్మెదలు వొలయఁ
బొదలు గాటంపుఁగ్రొవ్విరిపొదలు దూఱి, నవలు గోసిరి సరసిజాననలు చెలఁగి.

59


సీ.

పొన్నపువ్వులు గోసెఁ బూఁబోఁడి యొక్కతె, మొగలిరేకులు ద్రుంచె ముగుద యొకతె
కుందము ల్చిదిమె నిందిందిరాలక యోర్తు, చంపకంబులు గిల్లెఁ జాన యొకతె
స్థలజలజవ్రజంబులు గోసెఁ జెలి యోర్తు, భండీరములు ద్రుంచెఁ బడఁతి యొకతె
దాసనంబులు గోసెఁ దరుణీమణి యొకర్తు, పాటలంబులు గోసె బోటి యొకతె


తే.

హాళి దైవార దైవతాబ్జాస్య లెల్ల, రేసి తమనాభినఖదంతనాసికాంఘ్రి
భుజరదచ్ఛదతనుగంధములకు సాటి, గా వివి యటంచు నిరసించుకరణి నపుడు.

60


తే.

చెఱకువిల్లును గ్రొమ్మావిచిగురువాలు, నలరుఁదూపులుఁ బూని కోకిలశుకాలి
బలములోఁ దూఱి తా మనోభవుఁడ నంచు, సతుల బెదరించె నొకసరోజాతవదన.

61


తే.

కురులు జడ యల్లి మందారకుసుమ మునిచి, కప్పురపుబూది మైఁ బూసి గొప్పమల్లె
విరిసరు ల్దాల్చి తా మహేశ్వరుఁడ నంచు, దాని నదలించె నొకమత్తదంతియాన.

62


వ.

వెండియుఁ దమలోన.

63


రగడ.

వనిత వనితరు లలమి నేరుపు లన వల నగుననలు ద్రుంచుము
తనరుతనరుచి నెఱపుచున్నది దబ్బ దబ్బఱ గాచు కాంచుము
వలదు వల దురుగతి యనంటుల వంతవంతల కెల్ల నీరము
కలికి కలికివెడందకన్నులఁ గప్పుఁ గప్పురపున్ దుమారము
మేల మేల లతాంగి వలిదుమ్మెదలు మెదలెడుపొదలఁ దూఱెదు
చాలఁ జా లగుచున్నబాలరసాలసాలము లెక్కి జాఱెదు

పూని పూ నిలు వెల్ల ననచిన పొన్నపొన్నల నీడ నాడక
మాని మానిను లెల్ల మెల్లన మల్లి మల్లియ లాఁగి రోడక
తెఱవ తెఱవడిఁ బూని కదలిచి తేని తేనియసోనవానలు
నెఱయు నెఱయువిదలకు వేడుక నించు నించుక యలరుఁగోనలు
సారసారససౌరభము వెదచల్లు చల్లనికొలనిచెంతను
జేరి చేరిక నాడుకొందము చెలువ చెలు వలరఁగ నొకంతను
దలరెఁ దలరెడువిరులు దొరకినదాఁక దాకఫలంబు లేరక
యలసి యలసికతామయంబులయంద యందఱు నుంటి రూరక
మాను మానును మొల్లక్రొంబొద మఱుగు మరుగురుపదము భామిని
కాన కాననఁబోండ్లు చనియం గదలఁ గదలక నిలిచి రామిని
నెన్న నెన్నడుఁ జూడ మిటు పరు వేల వేలతరంబు పువ్వులు
కన్నె కన్నెఱఁ జేసి కోపము గ్రమ్మఁ గ్రమ్మఱఁ జనెదు దవ్వులు
కొమ్మ కొమ్మదుపూఁతసంపెఁగకొమ్మ కొమ్మని తఱమి చూపకు
మమ్మ మ మ్మఱ చేసి తేఁటుల మాటిమాటికి నెడలు వాపకు
మహిల మహిల కడిందియలరుల మనికి మనికిత ముడిగి చూడుము
బహుల బహులలకొఱకు నెల్లెడఁ బర్వి పర్విడఁ బోక వీడుము
సేనసేనలు గూడి ముద్దులు చిలుకఁ జిలుకలు మొఱయు నిచ్చటఁ
జాన జా నగుననలు వెదుకఁగఁ జాగి జా గిటు లేమి ముచ్చట
యేమె యేమెడ యైనఁ జని వన మెల్ల మెల్లన గాళు చేసెదు
రామ రామకలీలఁ గ్రాలుసర మ్మురమ్మునఁ దీసి వ్రేసెదు
పొగడ పొగడఁగఁ దగు నహా నినుబోఁటిబోటికి దీనితావులు
తగవె తగవె మరుండు పొదలకుఁ దారి తారి తొలంగుదీవులు
మధుపమధుపవనేందులను బగ మాన మానసమునఁ దలంతమె
మధురమధురసకుసుమములు పలుమాఱు మారున కిడి భజింతమె.

64


తే.

అనుచు వనకేళి సలిపి లతాంగు లెల్లఁ, జాల నలరులు దలిరులు సంగ్రహించి
ఘర్మజలబిందువులఁ దోగి కడఁక మెఱయ, నంత జలకేళి గావింప నదను దలఁచి.

65


సీ.

యక్షనాయకునిభాండాగారమునఁ బోలె, మకరకచ్ఛపవరమహిత మగుచు
గమలామనోహరుకరతలంబునుబోలెఁ, బటుశంఖచక్రవిస్ఫార మగుచు
బృందారకాధీశుమందిరంబునుబోలె, ననిమిషామృతపరివ్యాప్త మగుచుఁ
గామనీయకతారకాపథంబునుబోలె, ఘనరాజహంససంకలిత మగుచు

తే.

భూరిదిఙ్మండలముఁబోలెఁ బుండరీక, కుముదసంసక్త మగుచు సంక్షుద్రలీలఁ
జాల నొప్పారుసారకాసార మొకటి, గాంచి రపు డవ్వియచ్చరకమలముఖులు.

66


సీ.

సమదరథాంగభాస్వరపయోధరయు స, మీచీనపాఠీనలోచనయును
శైవాలవల్లరీజాలధమ్మిల్లయు, వికచనవీనారవిందముఖియు
నతులగంభీరతరావర్తనాభియు, రంగదుత్తుంగతరంగవళియు
విలసన్మహోదగ్రపులిననితంబయు, డిండీరదరహాసమండితయును


తే.

గంబుకంఠియుఁ గలహంసగామినియును, రామకమిళిందమాలికారోమలతయు
నగుసరోవరలక్ష్మి యయ్యబ్జముఖుల, కతులితామోద మొసఁగె నయ్యవసరమున.

67


తే.

అమరనారీశిరోమణు లతితరప్రహర్షమానస లై యపు డక్కడింది
తమ్మికొలను నిరీక్షించి తత్తటమున, వసనమణిమయభూషణావలులు వెట్టి.

68


చ.

గడితపుఁగావిపావడలు గట్టి కుచంబులబంటి నీటిలోఁ
దడయక చొచ్చి హెచ్చరిక దార్కొన నుమ్మడి నోలలాడుచున్
దొడరి పిసాళిజక్కవలఁ దుమ్మెదదాఁటుల నంచబోదలన్
మడువునఁ బాఱఁ దోలుచు సమగ్రవిలాసవిహారలీలలన్.

69


చ.

కరివరయాన యోర్తు లిసకాండము చిమ్మనగ్రోవి చేసి య
బ్బురముగ నోర్తు మీఁదఁ దనపుక్కిటినీరము చల్లి నీటిలో
సరగ మునింగె దానికచసంతతి యంచును నాఁచుఁదీవ ని
బ్బరముగ లాగె నచ్చెలువ పైదలు లందఱు నవ్వి రొక్కటిన్.

70


తే.

ఉవిద యొక్కతె వెతికిలనుండి నీటఁ, దేలుచో నొక్కరాయంచ తివిరి తమ్మి
మొగ్గ యంచును దానిచన్మొగడ వొడువఁ, గలికి యలికి యొకించుక యులికిపడియె.

71


క.

నలినకుముదాదికము ల, త్తలునీమణు లెల్లఁ గోయుతఱి నొకచెలి చే
తుల ముట్ట దయ్యె నలినం, బులు కన్నులఁ జూడ దయ్యెఁ బో కుముదంబుల్.

72


ఉ.

చంపకగంధి యోర్తు మదషట్పదపంక్తులఁ దోలె నంచలన్
బెంపఱఁ జేసె నొక్కజలభృద్ఘనవేణి మృనాళనాళముల్
ద్రుంపఁదొడంగె నెచ్చరికతో నొకమత్తగజేంద్రయాన కం
పింపఁగఁజేసె నొక్కశశిబింబనిభానన చక్రవాకులన్.

73


చ.

మెలఁతుక యోర్తు తమ్మివిరిమీఁదటితేఁటులఁ జోప నయ్యళుల్
చెలివదనాంబుజంబునకుఁ జేరినఁ గేళిసరోరుహంబుచేఁ
బలుమఱు దోలుకొన్న విడి పాఱక యున్నఁ గలంగి దానిపైఁ

దలఁగక చల్లె వేనలిని దాల్చిన గాటపుఁగ్రొత్తసంపెగల్.

74


క.

అలివేణి యొకతె యొకతొ, య్యలిపై నోల యిడి పఱచి యంబుజషండం
బుల నడుమ డాఁగె బానిం, బలిమిం బోనీక పట్టి పడఁతి గలంచెన్.

75


క.

అప్పులఁ బడి యొకచేడియ, తెప్పునఁ దేలంగ లేక తిరుగుడుపడుచోఁ
గొ ప్పొడిసి తిగిచె నొకచెలి, యప్పులఁ బడువారిబ్రదుకు లట్టివ కావే.

76


తే.

ముగుద లుమ్మడి సరసిలో మునిఁగితేలు, నపుడు కచముల జాఱు నీ రనువు మీఱెఁ
గలికిమిన్నలక్రొవ్వెద ల్ఘనము లగుటఁ, బెరసి ధారాళవర్షము ల్గురిసె ననఁగ.

77


చ.

నెలఁతలు నీటిలోనఁ దమనీడలు గన్గొని చిల్వచెల్వ లం
చెలమిని గౌఁగిలించుకొన నేగెడుచందము దోఁప బాహుశా
ఖలు నెఱిఁ జూచి యీఁదుచును గ్రన్నన లోనికి డిగ్గి డిగ్గియం
గలఁగఁగఁ ద్రొక్కి యేమియును గానక యబ్బురమంది రందఱున్.

78


సీ.

కరిరాజయాన యొక్కతె గాసివెట్టఁ దా, మరసాక్షి హరిమధ్య మఱుగు దూఱెఁ
దుహినాంశువదన యోర్తు గలంపఁ జక్రసు, స్తని యహిరోమాళి వెనుక నీఁగె
మదకీరవాణి యోర్తు దలంకఁ జేయ బిం, బోష్ఠి సాంకవగంధియొద్దఁ జేరెఁ
గలకంఠకంఠి యొక్కతె నొంపఁ దలిరాకుఁ, బోఁడి రామాంగి దాపున వసించెఁ


తే.

గమలకల్హారకువలయకుముదసమద, యాంచితామోదమేదురోద్యత్సరోవ
రాంతరంబున లీలావిహారసరణి, నమర హిమరుగ్వదన లోలలాడునపుడు.

79


క.

మునుఁగుచుఁ దేలుచు నీఁదుచు, ననువుగ నుదకంబుఁ జల్లులాడుచుఁ బరువుల్
గొని యోల లిడుచు చొండొరుఁ, జెనకుచుఁ జేడియలు క్రీడఁ జేసిరి నెమ్మిన్.

80


ఆ.

అంతఁ గొలను వెడలి యింతులు దరిఁ జేరి, కుంతలంబు లార్చుకొని విభూష
ణాంబరాదికంబు లలరించుకొని సంత, సమున మరల వనికిఁ జని యొకెడల.

81


తే.

వలపుఁగప్రంపుటనఁటిమ్రాఁకులకెలఁకుల, జాలువాఱెడుచలువగొజ్జంగినీటి
యేటికాల్వల నే పొందు మేటిదాక, తీవ వలిగొన్న గుజ్జులేమావిక్రింద.

82


తే.

కొమరు దళుకొత్తఁ జెఱకుఁగంబములు నిలిపి, యలరు పందిరి వైచి కెందలిరుటాకుఁ
దోరణంబులు గట్టి సింగార మెలయఁ; గమ్మగేదంగిరేకుద ళ్లిమ్ముపఱచి.

83


క.

నును పగుమృగమదపంకం, బున దీనియ దిద్ది కప్రపుంబొడి మ్రుగ్గుల్
నినిచి లవలిదళములపై, మనసిజరతిసతుల వ్రాసి మఱి యద్దరులన్.

84


తే.

తద్బలంబుల వ్రాసి గంధప్రసూన, ధూపదీపప్రముఖషోడశోపచార
ముల నిరంతరభక్తిచే బూజ సేసి, చిగురుఁబోఁడులు డాకొని పొగడి రపుడు.

85

క.

దండము నీ కిదె జగదు, ద్దండభుజాదండనిహితతతసుమనఃకో
దండవినిర్జితసకలా, జాండస్థితజంతుజాత హరిసంజాతా.

86


సీ.

ఎడప కెప్పుడుఁ గన్ను లెఱ్ఱఁజేయుబలంబు, గంటి సేయక యెద నంటుతూపు
వట్టిమ్రాఁకులు చివు ర్వెట్టించుదళవాయి, మి న్నంది యేపున మెలఁగుతేరు
తునిఁగియు మొలచునద్భుతపుఁగన్నులవిల్లు, తనకుఁ దా మొఱయుబిత్తరపునారి
చుఱుకు మీఱఁగఁ బండ్లు గొఱుకు ఱెక్కలజక్కి, నీళ్లలో జాడలు నెమకు సిడము


తే.

గలిగి యలిగినపతుల శృంగారవతుల, రతులఁ బెనయించి హాళిమై నతుల గతులఁ
గేరు నేరుపు నీకె చేకూఱె నౌర, మహితసుకుమార మార రమాకుమార.

87


క.

కొంకక యెపుడును నీపద, పంకరుహధ్యానరూఢిఁ బరఁగుదు మదనన్
సంకల్పసిద్ధి యిడుము వి, శంకటశృంగారవిభవ సంకల్పభవా.

88


క.

కమలభవభవముఖామర, సముదయ మళు కొందు నీనిశాతప్రసవా
స్త్రముల కిఁక నన్యు లెదురే, సమదోద్యత్కీరగమన శంబరదమనా.

89


తే.

హాళిఁ జలపట్టి మృదుకుసుమాశుగముల, యతులదృఢమానసములు వ్రయ్యలుగఁ జేయు
నీపరాక్రమరూఢి వర్ణింపఁ దరమె, విరహిణీపాంథజనజైత్ర విష్ణుపుత్ర.

90


చ.

పనివడి యింత నీయెదురఁ బల్మఱుఁ దెల్పఁగ నేల బాల న
జ్జనవరసార్వభౌముఁడు వశంవదుఁ డై కడు గారవించి నీ
పనులఁ గరంగఁ జేయు నెడ బాళి దలిర్పఁగ నీకు నెంతయున్
ననిచినకూర్మి నుత్సవ మొనర్చుఁ జుమీ సరసీరుహాంబకా.

91


తే.

అనుచు నతనుని బ్రార్థించుకొని మెఱుంగుఁ, బోఁడు లక్కన్నెఁ దోడ్కొనిపోయి నిజని
కేతనము చేర్చి యతితరప్రీతి మెఱయ, నరయుచుండిరి మఱి తదనంతరమున.

92


క.

బంధూకప్రసవవిభా, బంధురుఁ డై యపుడు పద్మబంధుఁడు గ్రుంకెన్
సింధుపరమణీవేణీ, బంధంబున జాఱుపికిలిబంతియపోలెన్.

93


సీ.

చరమాద్రిశిఖరసంచరదభ్రచరవధూ, శ్రేణి గట్టినతోఁపుఁజీర లనఁగ
నంబరారణ్యభాగంబునఁ దళుకొత్తు, గుజ్జులేమావిచిగు ళ్లనంగ
నంభుదీశ్వరురాణిహర్మ్యాగ్రభిత్తిపైఁ, బొలుపారుజేవురుపూఁత లనఁగ
దిక్సతీమణులు మత్తిలి చల్లు లాడెడు, గడితంపుబగ్గుండిపొడు లనంగఁ


ఆ.

దిమిరమత్తేభరాజ ముద్వృత్తి బయలు, వెడలుచో మేనఁ గనుపట్టు వితతగైరి

కప్రభాచ్ఛట లనఁగ నఖండలీల, సంజకెంజాయ లలరె దిశాముఖముల.

94


చ.

తఱి యనులోహకారకుఁ డుదగ్రతఁ బశ్చిమశైలశృంగమున్
గుఱికొని వేలుపుందెరువు గొప్పపిరంగునఁ జాయమందులోఁ
గొఱలెడువిన్నుమానికపుగుండు ఘటించి యగాదు చేసినం
దఱచుగఁ గ్రమ్ముక్రొంబొగ లనంగ జగంబునఁ బర్వెఁ జీఁకటుల్.

95


తే.

రవళిఁ గువలయహితుఁ డగురాజు స్వారి, వచ్చునెడల విభావరీవనరుహాక్షి
చెలఁగి చల్లినముత్తెంపుసేసఁబ్రా ల, నంగఁ జుక్కలు దట్టమై నింగిఁ బర్వె.

96


చ.

విరహుల గెల్వఁ గోరి ననవిల్తుఁడు బల్తుఱు తూని పుష్పలి
ట్పగభృతకేకిసంఘములఁ బం పిడి తానును విశ్వరూప మ
చ్చెరువుగఁ దాల్చెనో యనఁగఁ జీఁకటి లోకము లెల్ల నిండెఁ ద
త్కరపరిముక్తకుందవిశిఖంబు లనం దనరారెఁ దారకల్.

97


క.

చిత్తజుఁడు జగముపై దం, డెత్తుచు నని యిడ్డ మదపుటేనుఁ గనంగా
హత్తుకొని దిశలఁ దిమిరము, ముత్తెపుఁజౌడోలి యనఁగ మొనసెం దారల్.

98


ఉ.

కోకతతు ల్వియోగహతిఁ గూయఁ దొడంగె దివి న్సుధాంశుమే
ల్రాక మదిం దలంచి దినలక్ష్మి వడిం దమఱేని హేళి ను
గ్రాకృతి మీఱునుష్ణకరుఁ డంచు సహింపక యేటఁ ద్రోఁచె నం
చాకులవృత్తి విష్ణుపద మంటి మొగి న్మొఱ వెట్టుకైవడిన్.

99


సీ.

గురులఘువర్ణవైఖరులు గణింపక, విశ్రమస్థలములు వెదుకఁ బోక
కనదలంకారలక్షణము లెఱుంగక, పదములఁ గడుఁదొట్రుపాటు విడక
సాధుసుశ్లోకప్రసంగము ల్గానక, సరససన్మార్గచర్చలు దలఁప
కర్తృకర్మక్రియాగతులపై మతి లేక, లలితప్రబంధలీలలు తెలియక


తే.

తమము నిండార ధూర్తవర్తనులఁ గూడి, తవిలి విహరించి రప్పు డుద్దామవృత్తిఁ
గుకవులనుబోలె గణనఁ జెందకయ భాగ్య, భాజనము లైన జారనారీజనములు.

100


చ.

ఎనయఁగ మచ్చు చల్లి భ్రమయించి కడున్ వివరంబు సించి లోఁ
గొని మఱి మక్కువ ల్దడవి.కొంచు సుఖోన్నతిఁ జొక్కి యున్నచో
ననువు దలంచి దోఁచుకొని రప్పుడు ముప్పిరిగొన్న వేడ్కలన్
ధనికులసొమ్ము లుమ్మడిని దస్కరులు న్వెలముద్దుగుమ్మలున్.

101


సీ.

అనిమిషేంద్రవధూటి హర్మ్యాగ్రవీథిపైఁ, గొఱలు మేలుపసిండికుండ యనఁగఁ
బ్రాచీదిగంగనాఫాలభాగంబునఁ, బొదలుకుంకుమచుక్కబొ ట్టనంగ

రజనీజలజపాణి రహిఁ గేల నిడి యాడు, బలుదమ్మికెంపురాబంతి యనఁగ
విరహులపై దాడి వెడలుచు మరుఁ డిమ్ము, కొలిపినశకలాతు గొల్లెన యన


తే.

విన్ను ద్రిమ్మరి ననఁబోండ్లు, వెన్నునజ్జఁ, బూజ సల్పిన కెందమ్మిపూ వనంగ
గొమరుదళుకొత్తఁ దూరుపుకొండమీఁద, డంబు మీఱుచు నిందుబింబంబు వొడమె.

102


క.

వినుపుడమిం జిగిరిచి జిగి, ననువారెడుగుజ్జుమావి యన శశిబింబం
బొనరార నందుబొందుగ, గొనబారెం గందు గండుఁగోయిల యనఁగన్.

103


మ.

సరసం బై వసుగంధసంకలిత మై సన్మార్గసంవర్తి యై
పరరుఙ్మండలహారి యై శతభిషక్ప్రాణప్రియం బై విభా
స్వరలీలం దమ మెల్లఁ బో నిడుచు ఠేవం బూర్ణచంద్రోదయం
బరు దై శోభిలె నత్తఱిం గువలయాహ్లాదంబు గావించుచున్.

104


క.

మరుఁ డొకట నఖిలపథికాం, బురుహదళేక్షణల నేయఁ బూనినతెలిదా
మరవీరి యన నంత సుధా, కరబింబము ధవళరుచులఁ గర మలరారెన్.

105


క.

తిమిరపిశాచం బాశా, రమణీమణి నాక్రమించి రాయిడిఁ బెట్టన్
సమయోగ్రమాంత్రికుఁడు వే, గమ చల్లినబూది యనఁగఁ గౌముది యొప్పెన్.

106


సీ.

బహుళజీవంజీవపటలి దూపలు దీఱెఁ, గవ వీడి జక్కవల్ కడలఁబాఱె
గడితంపుచిమ్మచీఁకటులు దిగ్గన జాఱె, శశికాంతమణితతు ల్జాలువాఱెఁ
దెరువరిగములపై మరుఁడు గైదువు నూఱె, విరహిణీనికరంబు వెతలఁ దారెఁ
గులటల కాత్మ నగ్గలపుఖేదం బూరెఁ, దొగలేమ కరిదిసోయగము మీఱెఁ


తే.

గమలముకుళాంతరముల భృంగములు దూఱెఁ, దవిలి క్రీడించుభోగులతాప మాఱె
ధర నశేషజనామోదకరము లగుచుఁ, బండువెన్నెల లెల్లెడ నిండుటయును.

107


తే.

అప్పు డమరాంగనలు మనోహరవిలాస, లీలఁ జెలరేగి మద్యంబు గ్రోలఁ గోరి
కనకపాత్రల శీధువు నునిచి యునిచి, కూర్మి నందఱు నొక్కచోఁ గూరుచుండి.

108


ఆ.

కనకమయగలంతికల నాసవము ముంచి, యాసుకొనుచు సొలసి వీనుగవలు
మూసికొనుచుఁ గందముల నిచ్చగించుచు, విప్పు మీఱ గ్రుడ్లు ద్రిప్పుకొనుచు.

109


క.

అహహా యని సొలయుచుఁ గడు, హిహిహీ యని నవ్వుకొనుచు హేలాగతిమై
నుహుహూ యని వడకుచు న, మ్మిహికాకరవదన లాము మీఱఁగ మఱియున్.

110


తే.

సుధ యిఁ కేటికి నిపు డివ్వ సుధఁ దనర్చు

మదిర దొరకెను మనభాగ్య మదిర యనుచు
నమరవరవర్ణినులు కోర్కె లనుమర నప్పు
డానఁ దొడఁగిరి మధు వెద నాన వెడలి.

111


క.

ఆసవముచవి యెఱుంగక, యాసవభాగములు గోరి యడ లొంది రహా
వాసవముఖు లైనస్వరా, వాసవరుల్ దెలివి లేనివారలు గారే.

112


సీ.

మధుదైత్యమదనుఁ డిమ్మధువు గ్రోలక కదా, యతితరం బైనకార్శ్యంబు నొందె
మదనవిద్వేషి యిమ్మదిర యానక కదా, కడిది మీఱఁగ నీలకంఠు డయ్యె
వాసవుఁ డీయాసవంబు ద్రావక కదా, తనువున దురంగత్వము వహించె
నరుణగభస్తి యీసుర భజింపక కదా, ప్రబలయక్ష్మామయబాధఁ గుందెఁ


తే.

గరటిముఖునకుఁ గడుఁబెద్దకడుపు యక్ష, నాథునకుఁ గుష్ఠరోగంబు నాటుకొనియెఁ
జెనఁటు లై శీధుపానంబు సేయ కున్న, కతన మనభాగ్యమున నిది గలిగె భళిర.

113


వ.

అని మఱియుం దమలోన.

114


తే.

చంద్రికలు గాయు పరిపూర్ణచంద్రుఁ జూచి, యోయి వెన్నెలదొర బావ యురక నన్నుఁ
జూచి నగియెద వే మంచు, సుదతి యొకతె, యెంచి పకపక యిహిహీ యటంచు నవ్వె.

115


క.

తనమదిరాకలశంబులు, గొన నీ కేయోజ యనుచుఁ గొమ్మ యొకతె యా
మున నొకచెలికుచకలశము, లనివారణఁ బట్టి లాగులాడుచు నుండెన్.

116


సీ.

కుమ్మరిసారెలాగున నేల దిర్దిరఁ, దిరిగె నంచును వ్రేలు ద్రిప్పె నొకతె
వలరాచబావకన్నులు మూసి గిలిగింత, లిడియె నంచును బొబ్బ లిడియె నొకతె
చోరుఁడై కోరలో జొచ్చి యాసవ మెత్తు, కొని చనె విధుఁ డంచుఁ గుందె నొకతె
వలిగాలి పయ్యెద దొలఁగించి కులుకుగు, బ్బలు నొక్కెనని రిత్త యులికె నొకతె


తే.

రిక్కచా ల్మింట నంటి యమ్మక్క దన్ను, వెక్కిరించె నటంచు నా మెక్కి మిగులఁ
జొక్కి నిక్కుచు దిక్కులు నిక్కి చూచి, వెక్కసంబుగ నపు డోర్తు వెక్కిరించె.

117


క.

అల్లదె జాబిలి దన కీ, క ల్లిడు మని మ్రొక్కి నన్నుఁ గన్గిలిపెడి నో
చెల్ల కనుంగొను మని యొక, పల్లవకర వలుక నోర్తు పకపక నవ్వెన్.

118


చ.

వెడవిలుకాఁడ పోఁకముడి విప్పకు గుబ్బలు ముట్ట రాకు క్రొ

మ్ముడి సడలింపఁ బోకు జిగిమోవియు నానకు మే లయారె రే
యొడయఁడు చూచుచుండ నిధి యోజయె నీ కని నిల్వరింపఁ
దొడఁగె నొకర్తు మైమఱచి తూరెకు మద్యమదంబు పెంపునన్.

119


తే.

అపుడు నాశ్యామసాంద్రచంద్రాతపంబు, హాళిఁ బొడగాంచి చాల విరాళిమించి
నింగిఁ బొంగి కరంబు వెలుంగుచున్న, నీరజారాతి నిట్లు నిందింపఁ దొడఁగె.

120


క.

రాజీవలాంఛనుఁడ వగు, రాజువు నీ విట్లు క్రోధరససహితుఁడ వై
రాజీవరిపుఁడ నంచున్, రాజీవాక్షులఁ గలంప రాకు శశాంకా.

121


సీ.

క్షీరవారాశికి గారాపుకొమరుండ, వాదిలక్ష్మికిఁ బ్రియసోదరుఁడవు
మురదానవారికి ముద్దుమఱందివి, హరున కుదగ్రచూడాగ్రమణివి
దక్షప్రజాధినేతకుఁ గూర్మియల్లుఁడ, వశ్రాంతబుధజనాహ్లాదకరుఁడ
వసమబాణునకు నెయ్యఁపుమేనమామవు, జగముచుట్టమునకు సంగడీఁడ


తే.

విట్టినీ వయ్యయో నయ మింత లేక, సారెసారెకు నజ్ఞులచందమునను
సుందరులమీఁద వేఁడిమి చూపఁ దగునె, గురుజనాత్యంతనుతిపాత్ర కుముదమిత్ర.

122


క.

శ్యామావధూప్రియుండవు, శ్యామలపక్షంబు నీకు సైఁప దటంచున్
శ్యామల నేఁచకు మే సు, శ్యామఁ జుమీ తుహినధామ జగదభిరామా.

123


సీ.

కువలయప్రియుఁ డని కొనియాడుటకుఁ జాలఁ, జక్రాహితత్వంబు సలుపకున్న
బుధవత్సలుం డని పొగడుట కెంతేని, గురువిరోధంబునఁ గొఱలకున్న
గోత్రాభ్యుదయుఁ డనుకొనుటకు నాత్మస, త్సంతతి నడఁగింప దలఁపకున్న
మనుమార్గవర్తి యంచు నుతించుటకు రాజ, కాంతావలుల బిట్టు కఱఁచకున్న


తే.

రాజశబ్దంబు నీకు స్వార్థముగఁ జెల్లుఁ, గాక యూరకె లోకాపకారి వగుచు
నెఱయు నీరాజశబ్దంబు నేతిబీర, కాయచందంబు గాదె ప్రాలేయకిరణ.

124


క.

వీచి తమిం జక్రావళి, నేఁచెదు తెరువరులు సతులు నిల నడ లొందన్
హా చంద్ర యేమి చెప్ప ని, శాచరకృత్యములు నీకు సహజములు గదా.

125


చ.

గురువరవర్ణినీమణిని గూడినద్రోహి వటం చెఱింగియున్
బరువడి లింగధారి వని భావమునం దలపోసి యేమొ ని
న్గిరిశుఁడు నెత్తిఁ బెట్టుకొనెఁ గీడు దలంపక చంద్ర యెట్టిదు
శ్చరితుల నైనఁ బ్రోచుఁ గద శంభుఁ డహా తనుఁ గొల్చువారలన్.

126


సీ.

బడబానలంబుతో జడధిలోన మెలంగి, కాలకూటంబుతోఁ బైలు వెడలి
సెకకంటియెకిమీనిసిక లోన నెలకొని, యుదయాద్రిదవశిఖి నొరసి వెలికి

రాహుదంష్ట్రాంకురోగ్రవిషాగ్నిఁ బెనఁకొని, ప్రతిమాసమును జండభానుఁ బొదివి
యక్ష్మోపతాపమహాతాపమునఁ గ్రాఁగి, మునితపోవహ్నిచే మును జనించి


తే.

నట్టినీ వెవ్వరికి నైన నహహ మహిని, జల్లనై యుందు వను టెల్లఁ గల్ల గాదె
యజ్ఞు లెఱుఁగక శీతాంశుఁ డండ్రు గాని, గురువధూటీమనోహారి సరసిజారి.

127


సీ.

అర్జునాశుగలీల నలరుట కబ్జచ, క్రములఁ జేఁబట్టుట గాంచినావొ
శ్రీవత్సలాంఛనసిద్ధి వహించుస, త్సంతతిఁ బ్రభవింపఁ జాలినావొ
విధుసమాహ్వయము వావిరిఁ బూనుటకు నేపు, చెడిపోవఁ గుజనుల నడఁచినావొ
విష్ణుపదారూఢి వెలయుట కేడ్తెఱ, మధుమదోన్మాదంబు మాన్చినావొ


తే.

కువలయోద్ధారకాభిఖ్యఁ గొఱలుటకును, గరుణ మీఱ వియోగులఁ గాచినావొ
హస్తిమశకాంతరము గాఁగ హరికి నీవు, జోక యగుదువె మది జనించుటనె చంద్ర.

128


క.

హరునితల మట్టితిని గురు, తరుణిం బట్టితివి నీకు దైవము గురుఁడుం
బరికింప నాస్తి యగుచో, విరిఁబోఁడుల నేచు టెంత వింత శశాంకా.

129


తే.

జనులు శ్రీతోడఁ బుట్టితివనుచు నిన్ను, నెన్నుదురు గాని యామర్మ మెఱుఁగ లేరు
కాలకూటంబుతోడ నాభీలలీలఁ, బుట్టినాఁడవు గద నీవు భువి మృగాంక.

130


సీ.

చెలియలియింటిబల్సిరి యెల్ల హరియించి, తండ్రికి భంగంబు తగులుపఱచి
సత్సంతతులఁ బ్రకాశం బంతయు నడంచి, కడు సడ్డకుని గ్రిందు పడఁగఁజేసి
తమ్ముల కార్తి దట్టమ్ముగ నొడఁ గూర్చి, వదినెబిడ్డనితోడ వాదు పూని
యేపు మీఱ మఱంది హృదయంబు భేదించి, గురునిసంసారంబు గూలఁ ద్రోసి


తే.

కుజనులను బెంపు సేయుచుఁ గొఱఁత లేక, తమిని విహరించు దుష్టవర్తనుఁడ వీవు
తెరువరులచోట నీకుఁ జుట్టరిక మింక, నెవ్విధంబున సమకూఱు హిమమయూఖ.

131


తే.

గురునిసతిఁ గొని రమయింటిసిరి హరించి, చెలఁగి విషబిందుబృందముల్ చిలుకుచుండు
నాతతాయివి నీకుఁ దొయ్యలులమీఁద, నగ్గి చల్లుట యరుదె నీహారకిరణ.

132


తే.

సతుల నేఁచకు నీసౌరు సన్నముగను, గదిసి నినుఁ బట్టికొని పెద్దగాము మ్రింగ
నీనిలువు నీరుగాను నీ మేను పెక్కు, తునియలుగ దొండి నీ మేను నెనయఁ జంద్ర.

133


తే.

అనుచు సురనారి సరసీరుహారి దూఱి, కేరి తనుఁజేరి పూవులకోరు లేయు
నించువిల్కానిఁ దద్బలోపేతముగఁ గు, రించి యిట్లని మిగుల నిందించి పలికె.

134


క.

వలఱేఁడ కడిఁదిసిరి గల, బలుదొరకొమరుఁడ నటంచు భామామణులం

గలఁచకు నీపని యీశుఁడు, చలపట్టి యొకింతలోనె చక్కంజేయున్.

135


సీ.

అచలకార్ముకము నారాయణాస్త్రంబును, బగడతాలుపునారి పుడమితేరు
ప్రాఁబల్కు తేజీలు ప్రమథబలంబును, వెలుఁగొంద నలరు బల్వేల్పుమీఁదఁ
జెఱగువిల్లును విరిచిలుకును జమిలిము, క్కాలినారియు వలిగాడ్పుతేరు
చిలుకతత్తడియుఁ గోయిలమూఁకయును గ్రాలఁ, జలమున మార్కొని గెలుపు గొన్న


తే.

జగమగండవు నీ విట్లు తగవు మాలి, భీరువులమీఁదఁ దొడరు టేపెద్దతనము
వలదు లెస్సగ మదిలోనఁ దలఁచుకొనుము, నిరుపమాభంగశృంగార హరికుమార.

136


క.

జగములకుఁ దల్లి దండ్రియు, నగుసిరికి న్హరికిఁ బుట్టినట్టిదొరవు నీ
కగునే తోఁబుట్టువు లని, తగ వెన్నక సతుల నేఁపఁ దతసుమచాపా.

137


సీ.

వసుమతీజనుల సువర్ణకలాపము, ల్హరియించుతులువ నీవరసచివుఁడు
గురుతల్పగమనుఁ డై సరవిఁ జక్రద్వేష, మూనుఖలుండు నీ మేనమామ
మాన కెల్లప్పుడు మధుపానమదమునఁ, బొదలుదుర్మదులు నీ మొదలిబంట్లు
జగము లెఱుంగ హెచ్చరికఁ బైకొని బ్రహ్మ, ఘాత యొనర్చుటక్కరిని నీవు


తే.

జాతివైరస్యగతుఁడు నీసంగడీఁడు, భళి మహాఘోరదురితాన్వితులరు మీరు
విరహిణుల నేచు టిది యెంత వింత తలఁప, వంచితాశేషగీర్వాణ పంచబాణ.

138


తే.

అకట భవదంబ లాగృహంబుసిరి హ, రించుతెక్కలి శశి నాదరింపఁ బోకు
మదన మును “సర్వనాశాయ మాతుల” యని, చిందు రాణింప స్మృతులు వచింప వినవె.

139


సీ.

విషయలిప్తంబు లై వెలయునారాచంబు, లూరక మొఱయుచు నుండునారి
యిలఁబడి నూరాఱ్లు మొలచునబ్రపుబిల్లు, పెల్లార్చి పొదలెడునల్లమూఁక
నీళ్ళలో జాడలు నెమకెడుటెక్కెంబు, కడు నగ్గి చాయల నడరు సురియ
యడవిఁ గాచుక యుండు గడుసరి సంగాతి, యీల వెట్టిన నొద్ద వ్రాలు సచివుఁ


తే.

డొరుల కేరికిఁ గనఁబడకుండురూపు, దనరఁ బాంథులచిత్తవిత్తములు దోఁచు
తస్కరుఁడ వీవు ముగుదలఁ దఱము టరుదె, కుంఠితామర్త్యనగచాప కుసుమచాప.

140


సీ.

హరికి బుత్రకుఁడ వై యవతరించుటయును, శివునిచేఁ బన్నంబు జెందుటయును
విషమకాండప్రాప్తి విహరించుటయు ఘన, కాలరూపంబునఁ గ్రాలుటయును

వజితపరాశ్రాంతవాహుఁడ వగుటను, భయదాతనూద్వృత్తిఁ బరఁగుటయును
బ్రజలమారకుఁడ వై బాధించుటయు సదా, ఖండధర్మనిరూఢి నుండుటయును


తే.

దలఁచి చూచిన నీకును ధర్మరాజు, నకును భేదం బిఁ కెద్ది యెన్నఁడు వియోగి
జనుల గారింపఁ బోవఁ డాఘనతరుండు, చంచలాక్షీమనోహారి శంబరారి.

141


సీ.

శిరమున నిద్దంపుఁజిన్నిక్రొన్నెల గాదు, పొలుపారు గేదంగిపువ్వు గాని
గళమున నాభీలకాలకూటము గాదు, శ్రీమించుమృగమదరేఖ గాని
తనువున భూతిగంధవిలేపనము గాదు, మలయుచందనకర్దమంబు గాని
వీఁపున గాటంపువెడదకెంజెడ గాదు, డంబారువేణీభరంబు గాని


తే.

రహి నురమ్మున భుజగహారములు గావు, మల్లికాసూనపుష్పదామములు గాని
యకట మకరాంకశంకరుఁ డనెడుశంకఁ, జెలఁగి నామీఁద నిటు దాడి సేయవలదు.

142


వ.

అని మఱియుం గోపావేశంబున.

143


సీ.

నెఱి మించి నీవిల్లు విఱిగి ధూళి నడంగ, మలయక నీరూపు మాసిపోను
బడిబడి నీబలం బడవిపాలై చన, నే పైన నీటెక్కె మేటఁ గలయఁ
గొమ్మలఁ బొదవు నీయమ్ము దు మ్మై పోవఁ, దూలీ నీయరదంబు మూలవట్టఁ
గదిసి నీ చెలికాని గాము పుట్టుక మ్రింగ, నిలఁ బాసి నీగుఱ్ఱ మెగసి పోవ


తే.

నకట దర్పక ఘోరదర్పాతిరేక, మెనయఁ బని పూని విరహిణీజనవధంబు
సేయుచుండెదు నీ కిది చేటు సుమ్ము, పెళ్లు పడి యింక నామునఁ ద్రుళ్లవలదు.

144


తే.

అని మనోభవు నాడి యయ్యలరుఁబోఁడి, వేఁడి మీఱఁగఁ బయిపయి వీచుచున్న
మలయధరణీధరాలయమందగంధ, వహుని నిందింపఁ దొడఁగె భావమునఁ గినిసి.

145


క.

ఇల మరుదాఖ్యుఁడవు మహా, బలుఁడవు క్రూరుఁడవు నీకుఁ బౌరుష మే చలం
బెలయఁగ నబలలఁ గలఁచుట, మలయమహీధరసమీర మందవిహారా.

146


తే.

విషధరము నిన్నుఁ గబళించి విడువ దానిఁ, జెనఁకి సాధింప నేమియుఁ జేతఁ గాక
విషధరాభిఖ్య గలమేఘవిసరములను, దరమెదవు శూరుఁడవె నీవు ధర సమీర.

147


సీ.

మున్ను మహాబిలంబున సముద్భవ మొంది, శైలాగ్రమున నుండి బైలు వెడలి
ఘనవనాంతరముల ననయంబు మెలఁగుచు, నమితనికుంజగుల్మములఁ దూఱి
జంతుకోటికిఁ బ్రభంజనలీలఁ జూపుచు, విస్ఫుటమృగచరవృత్తి నలరి
పాంథులగుండియ ల్పగులంగ వడఁచుచు, వితతమహాబలోద్ధతి నెసంగి

తే.

చెలఁగి విహరించుగబ్బిబెబ్బులివి నీవు, దాడి మెఱయంగ భీరులఁ దఱము టరుదె
యజ్ఞు లెల్ల జగత్ప్రాణుఁ డండ్రు గాని, కామినీమారణోత్సాహ గంధవాహ.

148


ఉ.

మానక మానినీమణుల మాటికి నేఁచెదు నాలిగాడ్ప వై
శ్వానరుఁ గూడి నీబ్రదుకు బైలుగ నేల చరించె దిట్లు నీ
మేను దునింగి పోవ నెఱి • మీఱెడునీమురి మూల ముట్ట
పూనిక బుగ్గి గాను నిను బొంపఱఁ బాము మెసంగ నక్కటా.

149


వ.

అని యనిలుఁ బలికి.

150


సీ.

ఇలమీఁద నిల్వక యెగసి పోయెద వేమె, కీరమా నిన్ను సంకెలల వేయ
నెపుడు చూచినఁ గన్ను లెఱ్ఱఁ జేసెద వేమె, కోయిలా నీయిల్లు గూలిపోను
గేకలు వెట్టుచుఁ గేరి యాడెద వేమె, బర్హి నీమురి చెట్లపాలు గాను
గొమ్మలఁ గదపుచుఁ గోరి మోసెద వేమె, తుమ్మెదా నీత్రుళ్లు తుప్ప లెక్క


తే.

ఘనులఁ గన నోడి కడలకుఁ జనియె దేమె, యంచ నిను శ్వేతరుగ్భార మలమికొన న
టంచు బలుచందముల శపియించి పలికి, చంచలేక్షణ కడు సంచలించుటయును.

151


క.

ఆళీజను లపు డింతికి, హాళిని శిశిరోపచార మలరించి రొగిన్
నాళీకనాళకిసలమ, ధూళీపాళీసితాభ్రధూళిచ్ఛటలన్.

152


సీ.

శైలస్తని యొకర్తు చందనగంధంబు, రంభోరు వొకతె కప్రపురజంబు
హిమకరానన యోర్తు హిమజలపూరంబు, లతకూన యొకతె పల్లవచయంబు
వరవర్ణి యొకర్తు సరసకాశ్మీరంబు, ఘనవేణి యొకతె ముక్తాసరములు
ప్రసవగంధి యొకర్తు మసృణమరందంబు, జలజాక్షి యొకతె కింజల్కధూళి


తే.

కలితశృంగారసరసి యొక్కతె మృణాళ, నాళశైవాలవల్లరిజాబకములు
గూర్చి యచ్చానమైతాప మార్చుకొఱకు, సలిపి రెంతయు శిశిరోపచారవిధులు.

153


సీ.

బంగరుగిండ్లపైఁ బటిక పూసినరీతి, గబ్బిగుబ్బల మంచిగంద మలఁది
యిందీవరములపై హిమజలంబులు నించు, దారిఁ గన్దోయిఁ బన్నీరు చిలికి
యబ్ఙరాగములపై హరినీలములు గూర్చు, గతిఁ గేల శైవాలలతలు పెనఁచి
రతనంపుటరఁగుపై రంగవల్లులు దీర్చు, సరణిఁ బే రెద ముత్తెసరులు వైచి


తే.

మేటితుమ్మెదగముల కామెతలు పెట్టు, కరణిఁ గురులను బుప్పొడి గలయఁ జల్లి
తరుణరంభాదళోశీరతాళవృంత, జాలముల వీచుచుండి రాజలజముఖులు.

154

తే.

మంచిగందంబు బూది యై మహిని రాలె, నింకె బన్నీరు చూత్కార మెసఁగ మేన
నలరులుఁ జివుళ్లుఁ బొడిపొడి యయ్యెఁ గమల, నాళములు వాడి వత్త లై డీలువడియె.

155


క.

అపు డందు మదనమోహిని, చపలేక్షణ కేలువట్టి సరభసముగ నా
డీపరిక్ష చేసి ఘనవా, ఙ్నిపుణత మెఱయంగ నొక్కవెలఁతుక కనియెన్.

156


సీ.

పూర్ణచంద్రోదయంబునఁ బోవ దింతయు, నెడప కంతంతకు హెచ్చుఁ గాని
వాతరాక్షసయుక్తి వదలదు తద్దయు, మించి యంగదలఁ గుందించుఁ గాని
పస నెసంగువసంతకుసుమాకరంబునఁ, బాయదు మఱిమఱి ప్రబలుఁ గాని
యేపొద్దు మదనకామేశ్వరంబున మాన, నేరదు గాటమై నెఱయుఁ గాని


తే.

నీలకంఠరసంబున వ్రీలి చనక, లోఁగఁ జేయు నహా యింక లోకనాథ
రసమహాయోగమునఁ గాని రమణిమేని, విరహతాపజ్వరం బెల్ల విడువదమ్మ.

157


వ.

అదియునుం గాక.

158


సీ.

పొడ గానరాక పైఁబడుమనోభూతంబు, నుగ్రమంత్రంబుల నుడుపవలయు
నలమెడుసోఁకు దయ్యంబు నహీనక్రి, యావిధానంబుల నడఁపవలయు
రేలెల్ల బైలఁ జరించుగామునకు వే, ల్పుల నెల్లఁ బ్రార్థించి పొగడవలయు
నడవులఁ జెట్లపై నామనిఁ జెలఁగుబ, ల్వేఁటకు ఘనులు రప్పింపవలయుఁ


తే.

గాక యుండిన నీతనుగ్లాని మాని, మానినీమణి యెట్లు సమ్మదము నొందు
ననుచు వచియించి వారు దానును గడంగి, వెండియును జల్వపనులు గావించుచుండె.

159


తే.

అట్లు మఱిమఱి శైత్యకృత్యము లొనర్ప, నంతకంతకు నగ్గలం బై మనోభ
వానలం బుప్పతిలి నహా యంచు నులికి, యిందుముఖి నెచ్చెలులఁ జూచి యిట్టులనియె.

160


సీ.

వడగాడ్పులకుఁ దోడు కడుఁ జండ్రనిప్పులు, పైని బోయకురమ్మ పడఁతులార
వలకాఁకలకుఁ దోడు కళపిళ నుడుకునూ, నియలు చల్లకురమ్మ నెలఁతలార
వెన్నెలసెకకుఁ దో, డున్నసున్నం బెల్ల, మెదిచి మెత్తకురమ్మ మెలఁతలార
విరితూపులకుఁ దోడు వెడఁదకైదువ లెదఁ, గదియఁ జేర్పకురమ్మ సుదతులార


తే.

కటకటా నేఁడె పగదీర నిటుల నేఁచఁ, జెల్లునె యటంచుఁ బల్మఱుఁ దల్లడిల్లు
ననలుఁ బన్నీరు మంచిగందంబుఁ దలిరు, టాకులును జూచి మది నోడి యలరుఁబోఁడి.

161


తే.

పులుల భూతంబులను బెద్ద చిలువగములఁ, దెచ్చి దరి నిల్పి బెదరింపఁ జొచ్చినా రి

దేమి చెలులార యంచు బి ట్టెన్నుచుండు, శిఖిపికమృణాళములఁ జూచి చిగురుఁబోఁడి.

162


వ.

అని మఱియును.

163


సీ.

కనకాభిషేకంబు గావించి గద్దఱి, తేఁటికూటువులఁ బ్రార్థించరమ్మ
సాంకవగంధమంచల్లీల నర్పించి, కీరరాజముల నగ్గింపరమ్మ
ఘనవైభవోన్నతి నెనయించి కాదంబ, వితతులఁ బలుమఱు వేఁడరమ్మ
ధవళాంశుకస్ఫూర్తి దనరించి టక్కరి, జక్కవగములకు మ్రొక్కరమ్మ


తే.

కాకయుండినఁ గొద లేనిఢాక మెఱయ, మూఁకలుగఁ గూడి దొసఁగుల ముంచుచుండు
నహహ చెలులార తొంటి నెయ్యంబు విడక, కనికరము మీఱ నివ్వేళ మనుపరమ్మ.

164


వ.

అని యిత్తెఱంగున మదనవేదనాభరాక్రాంత యై చింతిలునింతిం గనుంగొని కలంగి
సంగడికత్తె లత్తఱి నంగభవాదుల నుద్దేశించి యిట్లనిరి.

165


క.

కొమ నాము మీఱఁ బైకొని, సుమనారాచంబు లేసి స్రుక్కింపకు క్రూ
రమనా రతిగమనా ధృతి, శమనా మదకీరగమన శంబరదమనా.

166


క.

పంచముఖమధ్య యని బా, ధించెదు హరిమధ్య యీసతీమణి మదనా
కొంచింపక కమలేక్షణ, యంచుఁ గలంచెదు పొలంతి హరిణాక్షి శశీ.

167


క.

పంచప్రాణంబులు నీ, వంచు న్మది నమ్మి యున్న యన్నులమిన్నన్
వంచించి కలంచెద విది, మంచిదె భువనైకశూర మలయసమీరా.

168


క.

మాతరుణీమణి నొకపెను, భూతమ వై సోఁకి యార్తిఁ బొదవించె దహా
భూతమవో వాతమవో, నీతెఱఁ గెఱుఁగంగ రాదు నిజముగఁ బవనా.

169


ఆ.

తల్లి పాఱవైచి తరల నన్యులపంఛ, బ్రతికి కూఁతవట్టి కొతుక కీవు
కన్ను లెఱ్ఱఁ జేసి యన్నులఁ గని కారు, కూఁత లఱచె దేమి కోకిలంబ.

170


క.

పసినిసు వగుమామగువల్, విసికింపకు మనుచు నెంత వేఁడినఁ బైపై
ముసరుచు మఱిమఱి మొరసెదు, భసలమ నీ కింత యెగసిపా టేమిటికిన్.

171


ఆ.

పరులపంచఁ జేరి బ్రతికి పలాశవృ, త్తి మ్మెలంగుకోకిలమ్మునకుఁ బొ
సంగుఁ గాక యింటఁ జక్కెర ల్దిని మని, వెగటు చిలుక నీకుఁ దగునె చిలుక.

172


సీ.

బింబోష్ఠి యని నీవు పెనఁగ రాకు శుశంబ, సాంకవగంధి యీపంకజాక్షి
పంకజాక్షి యటంచుఁ బదరకు తేఁటి చం, పకజాలనాస యీపల్లవాంఘ్రి

పల్లవాంఘ్రి యటంచు బాధింపకు పికంబ, రామాంగి యీబిసప్రచయబాహ
బిసబాహ యని రాకు వెస వంచ జలదశి, రోరుహ యీమహిరోమరాజి


తే.

యహిపరోమాళి యంచు డాయకుము నెమ్మి, కార్ముకభ్రూలతిక యీచొకారపుఁజెలి
యనుచు శుకభృంగపరభృతహంసనీల, కంఠనికురుంబములఁ దద్ద కనలి పలికె.

173


వ.

అబ్బోటికత్తియ లత్తఱి నబ్బిత్తరిం జూచి యిట్టు లనిరి.

174


సీ.

మలయునెమ్మేను పెన్మంట నుక్కఱిపోయె, విలు పలుతునియ లై యిలను బడియెఁ
బస చెడి శరపరంపరలు దుత్తుము రయ్యె, నీ టారుటెక్కియం బేటఁ గలసె
గడుసరిమూఁక కారడవులపా లయ్యెఁ, దూలుచు నరదంబు మూలవట్టె
బలితంపువార్వంబు బైలు వట్టి చరించెఁ, జెలికాఁడు దెసఁ జెంది చెట్లు దూఱె


తే.

నింతి యిం కెక్కడిమరుం డొకింత యైన, నళుకు పూనక వానిపైఁ దలఁపు మాని
మానసంబున నిపుడు మామాట నమ్మి, యసదృశానందలీలల నెసఁగవమ్మ.

175


వ.

అనిన నక్కుమారీమణి వారిం గని యి ట్లనియె.

176


తే.

ప్రాణసఖులార నే నెంతపాపజాతి, రాతిగుండియదాననో రాతిరెల్లఁ
గడిఁదివలవంతసెకలయగ్గలపునార్తి, నెంతఁ బడలెనొ కదరె యయ్యెమ్మెకాఁడు.

177


ఉ.

కంతుదురాపతాపహతి గ్రాఁగుచు నజ్జగవన్నెకాఁడు న
న్నెంతతుటారికత్తె యని యెగ్గులు వల్కెనొ యెంతయుల్కెనో
వంతలఁ బెట్టి మమ్ము నెడఁబాయఁగఁ జేసితి రమ్మలార మీ
పంతము దీఱ జాలి మదిఁ బాయ దహా యిఁక నేమి సేయుదున్.

178


తే.

అకట నా చెల్మికై యతఁ డాసతోడఁ, జేరి వలరాచపనికి న న్గోరి వేఁడు
కొనినఁ గా దని త్రోచి వచ్చినమహోగ్ర, పాతకం బింక నేవంక బాపుకొందు.

179


తే.

కన్ను లలరార నవ్వన్నెకానిముద్దు, నెమ్మొగం బింక నెన్నఁడేనియు నొకపుడు
గనుఁగొనెడునట్టి మేటిభాగ్యంబు నాకుఁ, గలుగునో లేదొ కదరమ్మ పొలఁతులార.

180


క.

అక్కరుణానిధికౌఁగిటఁ, దక్కఁ బెనంగొననివలఁతితన మేల కడున్
మిక్కుటపుఠీవి యేలా, చక్కఁదనం బేల యుదుటుజవ్వన మేలా.

181


వ.

అని మఱియు సైరింపరానిదుఃఖావేశంబున.

182


తే.

వ్రీడవతి యేడ్చె నెలుఁగెత్తి వెక్కివెక్కి, యశ్రుపూరంబు కుచగిరు లంటి పాఱఁ
గిన్నరీపాణి పంకజాంకితసువర్ణ, వల్లకీరావసదృశభాస్వద్గళమున.

183

తే.

అప్పు డబ్బాల నెదఁ జేర్చి యనుఁగుఁజెలులు, చీరచెఱఁగున వెడఁదకన్నీరు దుడిచి
కురులు సవరించి తళుకుఁజెక్కులు పుడుకుచు, హితవచోరూఢి మెల్లన యిట్టులనిరి.

184


ఉ.

అమ్మకచెల్ల యిట్టు లెడరారఁగ నేమిటి కేడ్చెదమ్మ చొ
క్క మ్మగునెమ్మొగంబు కసుగందెఁ గదమ్మ కపోలపాళిప
త్రమ్ము లుదారబాష్పజలధారలఁ దోఁగెఁ గదమ్మ లెమ్మ మా
యమ్మ రయమ్మ నీ కిఁక సమగ్రమనోరథసిద్ధి యయ్యెడున్.

185


తే.

సుదతి నిక్కంబు వినుము నీసోయగంబు, కన్ను లారంగఁ బొడగని చన్నకతన
సూటి దప్పక నిన్నటిచోటి కెలమి, ఱేపు గ్రమ్మఱ నమ్మన్నుఱేఁడు వచ్చు.

186


క.

వచ్చిన నతనికి నీకుం, జెచ్చెర సంగతి ఘటిల్లుఁ జెలు వలరఁగ ఱే
పచ్చటి కరుగుద మూరక, విచ్చలవిడి నుండవమ్మ వెడఁగుంగొమ్మా.

187


వ.

అని యబ్బాలికాచూళికాలలామంబు నారీజనకదంబంబు మందమందమధురాలాపం
బుల నూరడించుచుండె నని నారదునకు శారదావల్లభుం డెఱింగించిన నతం డతని
నవ్వలికథావిధానం బె ట్లని యడుగుటయును.

188


మ.

కలుషాంభోధినిషంగ ఘోరతరసంగ్రామాంగణాభంగ భూ
వలయోత్తుంగశతాంగ నిస్తులకృపావాసోజ్జ్వలాపాంగ దు
ష్కలుషధ్వాంతపతంగ శైలతనయాసంశోభితార్ధాంగ ని
ర్మలజూటాంతరగంగ సన్మణివిభారంగద్భుజంగాంగదా.

189


తోటకము.

పురదైత్యవిదారణ పుణ్యగుణా, శరదబ్జనిభాకృతి సాధుమతీ
సురరాడ్ద్రుహిణార్చిత సూరినుతా, చరణాయుధవిగ్రహ శైలగృహా.

190


తరల.

సమరభీషణ సత్యభాషణ సర్పరాజవిభూషణా
ప్రమథనాయక భద్రదాయక పద్మలోచనసాయకా
విమతభంజన విశ్వరంజవ వేదవేద్యనిరంజనా
సమదవారణచర్మధారణ సజ్జనావనకారణా.

191


గద్యము.

ఇది శ్రీమత్కుక్కుటేశ్వరకరుణాకటాక్షనిరీక్షణసంలబ్ధసరసకవితాసామ్రా
జ్యధురంధర ఘనయశోబంధుర కౌండిన్యసగోత్రపవిత్ర కూచిమంచిగంగనామాత్య
పుత్త్ర సకలసంస్కృతాంధ్రలక్షణకళాకౌశలాభిరామ తిమ్మకవిసార్వభౌమప్రణీతం
బైనరసికజనమనోభిరామం బనుశృంగారరసప్రబంధంబునందుఁ జతుర్థాశ్వాసము.