రసికజనమనోభిరామము/షష్ఠాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

ఓం నమః కామేశ్వర్యై

రసికజనమనోభిరామము

షష్ఠాశ్వాసము



రుచిరపీఠనగరా
గార శుభాకార భక్తగణమందారా
సూరిజనాధార సమీ
ద్ధీరా వరతామ్రచూడదివ్యశరీరా.

1


వ.

అవధరింపుము నిలింపమహామునీంద్రునకుం బితామహుం డి ట్లని చెప్పం దొడంగె
నట్లు ఋతుధ్వజక్షితితలాధీశ్వరుం డిష్టోపభోగంబులం దనియుచుండి యొక్క
నాఁడు వధూసమేతుం డై వాహ్యాళి వెడలి ఘోరకాంతారప్రదేశంబు ప్రవేశించి.

2


సీ.

ఘనసారచందనాగరుతరుచ్ఛాయలఁ, గమనీయనవరత్నకందరములఁ
గనకారవిందసంగతసరస్తటముల, సదమలామృతఝరీసైకతములఁ
బ్రాకటద్రాక్షాలతాకుడుంగంబులఁ, గుముదబంధూపలకుట్టిమములఁ
బరిణతమాకందపరిసరస్థలములఁ, బ్రసవచాంపేయకప్రాజ్యవనుల


తే.

సారనీహారనీరప్రపూరతీర, ముల మెలంగుచు నమ్మహీతలవిభుండు
మంజువాణికి నచట సమగ్రవైభ, వములు దమి మీఱఁ జూపుచు రమణఁ బలికె.

3


క.

అల్లదె చూచితే వలపులఁ, బె ల్లడరుచు లేజవాదిపిల్లులు వని రం
జిల్లెడు నవదూతలతా, పల్లవరుగ్భాసమానపదరదవసనా.

4


తే.

నడలఁ దొడలఁ గుచంబుల దొడరి తన్ను, గెలిచి తని యేమొ నీచెంత నిలువ నోడి
పఱచుచున్నది యదె చూడు భద్రకరిణి, చకితసారంగశాబకచారునయన.

5


క.

సముదంచితవాలవ్యజ, నములన్ వీచుచును శ్రమకణము లుడిపెడునీ
చమరీతతిఁ గనుఁగొంటివె, సమదమధువ్రతవితానచారుశిరోజా.

6


శా.

హేరాళంబుగ నీదుకన్నుఁగవతో నీ డొందఁగా లేక కాం

తారక్షోణిని జేరి తద్దయు మనస్త్రాసంబు దీపింప న
య్యారే దిక్కులు చూచుచుం బఱచెడిన్ హాళి న్విలోకింపుమా
సారంగం బదె ప్రావృషేణ విలసత్సౌదామనీవిగ్రహా.

7


క.

నీకౌనుదీఁగె కెన గా, లే కేమొ కలంగి కడుఁ జలింపుచు గుహలన్
దాఁకొనియె సింగ మదె యా, లోకింపుము మదచకోరలోచన దానిన్.

8


తే.

తొడరి నీముద్దుకెమ్మోవి దొండపం డ, టంచు భావించి యేమొ డాయంగఁ జేరి
కులుకుచున్నది చూడు రాచిలుకగమి ప్ర, భాతవికసితశతపత్రపత్రనేత్ర.

9


క.

శృంగారరసము చిలుకుచు, సంగీతకళారహస్యచాతురిఁ దగునీ
భృంగాంగనఁ గనుఁగొంటివె, గంగారంగత్తరంగకమనీయవళీ.

10


తే.

చెలువు మీఱెడునీకొప్పు జలద మనియుఁ, దనురుచు ల్మించు లంచును దలఁచి యేమొ
యాడుచున్నది నెమ్మి యల్లదిగొ చూడు, కుంభికుంభోల్లసత్కుచకుంభయుగళి.

11


క.

కలరవ మల్లదె రతులం, గలయునెడ న్నీ వొనర్చు గళరవముక్రియం
బలుకుచు నున్నది విను నవ, జలజాతదళోపమానసదమలచరణా.

12


ఉ.

భిల్లసరోజలోచనలు పింఛపటంబులు గట్టి బిట్టు శో
భిల్లుచు నల్లవారె వనిఁ బెల్లుగ గానము సేయుచున్నవా
రుల్లము పల్లవింప నిపు డొయ్యన చూడుము కార్తికీనిశా
హల్లకబంధుమండలనిభామలకోమలవక్త్రపంకజా.

13


సీ.

మల్లికామాధవీమంజరీమధుమదా, నందితసుందరేందిందిరములఁ
బరిపక్వసహకారఫలరసాస్వాదన, లోలలీలాశుకజాలకముల
విమలసరస్తోయకమలనాళాహార, లాలసమత్తమరాళతతులఁ
గలితామ్రపల్లవగ్రాసావలేపవి, భాస్వరసుస్వరపరభృతముల


తే.

బహుతరఝరీతరంగనిర్భరనినాద, ఘనఘనాఘననినదశంఖాముహుఃప్ర
ణర్తితానేకకేకిబృందములఁ జూడు, రమ్యశుభగాత్రి గంధర్వరాజపుత్త్రి.

14


సీ.

మేటిగొజ్జెఁగనీటియేటివాఁగులు దాఁటి, మలయుపూసంపెఁగమ్రాఁకు లెక్కి
ఘనసారకదళికావనముల విహరించి, పొదలుక్రొవ్విరిమల్లెపొదలు దూఱి
సరిఫుల్లకేతకీప్రసవవాసన లాని, సదమదాంబుజసరస్తటుల మెలఁగి
కమ్మజవాదిగందమ్ములు చేకొని, లవలీనికుంజగుల్మములు దరిసి

తే.

మందమందప్రయాణము ల్సందడింపఁ, దొడరి ఘర్మాంబులేశంబు లుడిపికొనుచు
వీచుచున్నవి గాడుపు లేచి చూడు, తప్తచామీకరోపమోద్దీప్తగాత్రి.

15


వ.

అని చూపుచుం జని చని యొక్కరమ్యప్రదేశంబున నిలింపదంపతు లింపుపొంపులు
దీపింపఁ గ్రీడించినజాడ లీక్షించి మఱియు నయ్యంగనామణి కి ట్లనియె.

16


క.

చూడుము గంధర్వవధూ, చూడామణి యిందు దివిజసుందరులుఁ బతు
ల్వేడుక లలవఁగ మదన, క్రీడల విహరించినట్టిరీతులు వరుసన్.

17


క.

ధేనుకబంధంబున నొక, చానయుఁ బల్లపుఁడుఁ గ్రీడ సలిపిరి తమి ని
చ్చో నారుకరపదంబులు, గానంబడెఁ జూడు వికచకంజాతముఖీ.

18


క.

పురుషుఁ డొకచెలిని గరపద, కరణంబునఁ గూడె నెలమిఁ గనుఁగొను మిదె క
ప్పురపుజిగిలె న్శిరోముఖ, గురుకుచభుజముద్ర లంటుకొన్నవి తరుణీ.

19


శా.

అంభోజనన యోర్తు ప్రోడ యగుచున్ హాళి న్మనోభర్తతోఁ
బుంభావాసమబాణకేలి నిచటన్ భోగించె నెంతేని సం
రంభం బొప్పఁగఁ జూడు వేనలివిరుల్ రాలె న్వసంతాగమా
రంభోజ్జృంభితమత్తకోకిలవధూరాజద్వచోవైభవా.

20


తే.

కరపదంబులు చాఁచి చెంగావిమోవి, శయ్య నిడి యున్న చెలిని మార్జాలకరణ
మునఁ బ్రియుఁడు గూడె నిందుఁ దాంబూలరాగ, కుంకుమాంకంబు లలరెఁ గన్గొనుము చెలియ.

21


తే.

శూలచితబంధమున నొక్కవాలుఁగంటి, విటుని గవగూడెఁ జూడు మివ్విరులసెజ్జ
నొక్కకా ల్చేర్చి యున్నచొ ప్పొప్పు మీఱె, హారిపరిపక్వబింబఫలాధరోష్ఠి.

22


మ.

ప్రియుఁడుం గామినియుం గడంక లెలయం. బ్రేంఖావతీనామకో
చ్చయబంధంబునఁ గూడి రిరువురు సెజ్జం గూర్మి హెచ్చం బద
ద్వయము ల్దొట్రుపడ న్మెలగినవినోదం బెల్లఁ గన్పట్టెడిం
బ్రియ మారం గనుఁ గొమ్ము మత్తమధులిడ్బృందాభవేణీభరా.

23


చ.

అలరఁగ సింహవిక్రమమహాకరణంబున నొక్కమానినీ
తిలకము పల్లవుం గదిసెఁ దెల్లముగాఁ బరికించి చూడు మో
జలజదళాక్షి యివ్వికచచంపకభూజముచెంత నెంతయుం,
బొలు పలరారి మూఁడుపదము ల్లుదు రొప్పఁ గనంగ నయ్యెడిన్.

24


క.

కను మవలంబితకరణం, బునఁ గూడిరి సతియు వల్లభుఁడు నిదె యొకగో

డను లాక్షారస మొకగో, డను జందనకర్దమంబు డాకొనెఁ బడఁతీ.

25


క.

అని యిత్తెఱఁగున వనజా, ననకుం జూపుచు ధరాధినాథాగ్రణి కా
ననభూమధ్యంబున సం, జనితామోదమున మెలఁగుసమయమునందున్.

26


సీ.

కఠినాద్రిశిఖరనీకాశమూర్ధముతోడఁ, గుఱువజుంజుఱుపల్లనెఱులతోడ
సానుభాగోన్నతస్ఫారవక్షముతోడ, దంష్ట్రాకరాళవక్త్రంబుతోడఁ
దాళభూమీరుహోత్తాలబాహులతోడఁ, గడిఁది మీఱువెడందకడుపుతోడఁ
గొఱవులక్రియ రగుల్కొనుమిడిగ్రుడ్లతో, నచలోపమానదేహంబుతోడ


తే.

భువనభయచాట్టహాసవిస్ఫురణతోడ, ఘోరుఁ డనునొక్కనిశిచరవీరుఁ డప్పు
డక్కజంబుగఁ దెరువున కడ్డు దాఁకి, దాఁక మెఱయంగ నమ్మహీధవుని జూచి.

27


ఉ.

ఓరి నృపాలకాధమ యయో భయ మింతయు లేక యిట్లు కాం
తారధరాతలంబున నితంబిని గూడి మెలంగె దింక మ
ద్ఘోరనిశాతభల్లములఁ గూల్చి వడి న్భుజియింతుఁ గాక ని
న్నూరక పోవ నిత్తునె ప్రీయోక్తుల నేమిట నైన మెత్తునే.

28


ఉ.

కానక కాన కివ్వికచకైరవపత్రవిశాలలోచనం
బూనికతోడఁ దోడుకొని మున్నఱికం బఱతెంచి తింక నీ
ప్రాణము దక్కఁ జూచుకొని బంటుతనం బటు గట్టిపెట్టి యి
మ్మానిని డించి వేగఁ జనుమా నిను నూరక పోవ నిచ్చెదన్.

29


చ.

అనవుడు ధారుణీరమణుఁ డౌర నిశాట కడిందిబంట వై
పొనుపున నిల్చి యాగడపుఁబోకలఁ బోయెదు నేఁడు నిన్ను మ
ద్ఘనవిశఖానలోజ్జ్వలశిఖావిసరంబులపాలు చేసి కా
లునిపురిఁ జేర్చెద న్నిఖిలలోకజనాభిహితం బొనర్చెదన్.

30


ఉ.

ఆమునఁ ద్రుళ్లుకొంచు దనుజాధమ నోరికి వచ్చినట్టు లే
మేమొ దురోక్తు లాడె దిది యెక్కువబంటుతనంబె నేఁడు నా
తో మొనకట్టి యాలమునఁ దూలక నిల్వుము ని న్మధుద్విష
త్కామవిరోధు లడ్డపడి కాచినఁ బ్రోవఁగనీక త్రుంచెదన్.

31


తే.

అనిన వాఁ డప్డు రోషతామ్రాక్షుఁ డగుచు, వింట గొనయంబు సంధించి మంట లెగయు
కఱుకుమొనవాఁడితూపు లక్కజము మీఱ, జానిపైఁ బదియైదు పఱపె.

32

చ.

పఱపిన నల్గి యద్ధరణిపాలుఁడు సింగిణి యెక్కువెట్టి బ
ల్కఱకులకోరు లాఱు నరఘస్మరుపై నిగుడించి యార్చినం
గొఱకొఱతోడ వాఁడు నొకక్రూరశరం బరివోసి యేసి యు
క్కఱ నొనరించె భూవిభు నుదగ్రపరాక్రమలీల గ్రాలుచున్.

33


సీ.

సురవైరిపై ధరావరుఁ డొకయిరువది, ములుకులు నిగడించి మురి యడంచె
ధరణీశుమీఁదఁ గ్రమ్మఱ రక్కసుఁడు నూఱు, తూపులు పఱపించి యేపు డించె
నృపతిపై మఱి యామినీచరపతి, బదిచిల్కు లడరించి కుదిలపఱిచె
రజనీచరునిమీఁద రాజవర్యుం డొక్క, వేయిబాణము లేసి పీచ మడఁచె


తే.

దొనల నలుఁగులు దివియుట తొడుగుటయును, నేయుటయుఁ గాఁడుటయుఁ బయి కెగయుటయును
గాన రాకుండ నబ్రంబు గాఁగ నట్లు, పెనఁగుచుండిరి బీరంబు లినుమడింప.

34


శా.

క్షోణీపాలుఁడు చిమ్మునమ్ములెడఁ ద్రుంచు న్నిర్జరారాతి గీ
ర్వాణద్వేషణుఁ డేయు బాణము లెడన్ వారించు భూజాని త
త్తూణీరంబుల నిండుకొన్న విశిఖస్తోమం బొకింతంత సం
క్షీణం బై చనఁ బోరి రిర్వురు నిటు ల్చిత్రాతిచిత్రంబుగన్.

35


క.

గొదగొని దనుజాధముఁ డొక, గదఁ కొని నడతేర నృపశిఖామణి వానిం
బదిలుఁ డయి కదిసి కొదుగక, గుదియం జడియంగ మోది కుదియం జేసెన్.

36


క.

శూలంబుల భీషణకర, వాలంబుల నుగ్రభిండివాలంబుల నా
భీలగదాముద్గరశర, జాలంబులఁ దవిలి పోరు సలిపిరి మిగులన్.

37


వ.

ఇ ట్లనేకప్రకారంబులం బిఱుతివియక మూఁ డహోరాత్రంబు లెడతెగక తొడరి
పోరుచుండి రప్పుడు.

38


తే.

అవనిజాని సమగ్రరోషారుణితవి, నేత్రుఁ డయి వానిఁ బోనీక నిశితచంద్ర
హాసమున మస్తకముఁ దెగవేసి యవనిఁ, గూల్చె నమరులు చదలున నిల్చి పొగడ.

39


వ.

అయ్యవసరంబున.

40


క.

వలనుగ విభునకుఁ దనపైఁ, గలకూరిమి యరసి చూడఁగా వలె నంచున్
దలఁగి తదంతికమున నొక, యలరుం బొదరింట నింతి యడఁగి వసించెన్.

41


క.

జనవరుఁ డటువలె రక్కసుఁ, దునుమాడి రయంబ మరలి తొయ్యలి నచ్చో
టునఁ గానక గుండియ ఝ, ల్లని లీలగ నబ్బురంపుటార్తి యెసంగన్.

42

క.

ఎక్కడి కేగెనొ హా యిపు, డొక్కతెయుం దెరువు వట్టి యువతివతంసం
బక్కట నాపై నింతయు, నక్కటికము లేక కూర్మి యారడిఁ బోవన్.

43


క.

చంచలలోచన యెం దరు, దెంచెనొ ననుఁ గావలేక దృఢబలవిలస
త్పంచశరనిశితవిశిఖా, కుంచితహృత్కమల యగుచు గొడవలు బెరయన్.

44


సీ.

అలికిఁ గేకులహళాహళికి గద్దఱిపి కా, వలికి మందపుఁగరువలికిఁ గసరు
చిలికి సారెకుఁ జేరి కులికి యార్చుపిసాళి, కలికి రాచిలుక తెక్కలికిఁ దొగల
చెలికిఁ గప్రపుబూతి వలికి మారునిపూవు, ములికి మొత్తములయంకిలికి నంచ
కలికిమిన్నలబల్రవలికి శారికలర, వలికి నామని పెద్దపులికి మృదుల


తే.

వలికిఁ బన్నీటివాఁకయుబ్బలికి గంధ, ఫలికి వికసితసుమవనస్థలికిఁ గూర్మి
వెలికిఁ గ్రమ్మఁగఁ జిలుకలకొలికి యెంత, యలికి యులికెనొ మముఁ దూలఁ బలికి నేడు.

45


ఆ.

ఏమి సేయువాఁడ నిపు డిందుముఖిజాడ, గానరాదు చూడఁ జానతోడ
నెడసి తాళఁ జాల నెవ్వార లివ్వేళ, నళుకు మాన్చి మనుపఁగల రటంచు.

46


ఉ.

హా యను మారసంగరకళాతిశయానమితాప్సరస్సమూ
హా యనుఁ దప్తకాంచనసమంచితచంచలచంచలాభదే
హా యను దివ్యరత్నఖచితాంగదదీప్తమృణాళనాళబా
హా యను నెట్టు లోర్తు నహహా రుచిరాస్యసరోరుహా యనున్.

47


క.

ఎన్నఁడు చూతు నయో నిన్, గన్నులపండువుగ నిఁకఁ జొకారపునవలా
మిన్నా పూఁబొన్నా కడు, నెన్నికఁ గనుమరునియాముటేనుఁగుగున్నా.

48


క.

కులనారీమణుల న్వెల, యెలనాగలు నీక జోకయే తలఁప నహా
కల నైన నీమనోభవ, కలనావైఖరులు మఱవఁగలనా లలనా.

49


క.

ఇంతయుఁ గనికర మూనక, వంతల నిడి చనఁగఁ దగునె వలిగొజ్జెఁగపూ
బంతీ యింతీ సొగసుల, దొంతీ క్రొందుంటవింటిదొరమదదంతీ.

50


ఉ.

కూరిమి మీఱ నీకులుకుగుబ్బల ఱొమ్మున నాని సారెకున్
జీరిక మోవి ముద్దు గొని చెక్కులు గీటి కడుఁ గడిందియొ
య్యారము చూపుకోపు నెఱియ న్మదిఁ బాయ దిఁ కేమి సేతు నా
హా రమణీ మయోభవునిహారమణీ రమణీశిరోమణీ.

51


చ.

కటకట యిప్పు డింత యలుకా యులుకా బలుకానలోన న

న్నటమట నొందఁ జేయఁ దగవా నగవా పగవాడనే యిఁ కె
న్నటికిని నిన్నుఁ బాయఁ గలనా లలనా వలనా కలంచ నేఁ
డెటువలెఁ దాళువాఁడఁ బొలఁతీ వలఁతీ కలతీరు దెల్పుమా.

52


వ.

అని మఱియుం దనలోన ని ట్లని పలవింపం దొడంగె.

53


చ.

తవిలి కలంచుగాటపువెతం గడి నోటికిఁ బోదు కంటికిం
బవలును రేయిఁ గూడ నొకపారెయుఁ గూరుకు రా దనుంగు లౌ
నువిదలఁ గూడి వేడుకల నుండఁగ నేమియుఁ బ్రేమ లే దహా
శివశివ యింక దన్మృదుకుశేశయలోచనఁ జూడఁ గల్గునే.

54


ఉ.

సన్నలఁ జాయల న్వలపు చల్లుతెఱంగులు మేమెఱుంగులుం
జిన్నియొయారపుంగొనబుఁజిన్నెలు నెన్నిక గన్నవన్నెలుం
గన్నులఁ గట్టిన ట్లగుచుఁ గన్నులవింటివజీరుతేజి యౌ
నన్నులమిన్న చె న్నెపుడు హా మదిఁ జాల విరాలి గొల్పెడిన్.

55


చ.

కిలకిలలాడుచుం దఱిని గేళి మెలంగుతెఱంగు జాణ యై
వలపులు చిల్కి కుల్కి చెలువంబుగఁ బల్కుహొరంగుసారె వి
చ్చలవిడిఁ బొంగి యంగభవసంగరలీలఁ జెలంగుభంగులుం
దలఁచిన గుండె ఝల్లు మను దాని హొయ ల్గణుతింప శక్యమే.

56


సీ.

కురులు గమ్మలు సరు ల్గుబ్బలు నటియింప, గడగడ నసదులేఁగౌను వడఁకఁ
జెక్కులజిలిబిలి చెమ్మట ల్జాల్గొన, నుదుటికస్తురిబొట్టు పదనుకొనఁగఁ
గంకణకింకిణీకటక ధ్వను లెసంగ, గళరవసీత్కారములు చెలంగ
నఱమోడ్పుకనుదోయి చుఱుకుఁజూపులు మీఱఁ, గలపంపుమైపూఁత గరఁగి పాఱఁ


తే.

బొదవి చెక్కులు గీటి కెంబెదవి యాని, కులికి కిలకిల నగి ముద్దుచిలుకఁ బలికి
వలచి వలపించి యుపరతిఁ గలయుజాణ, దాని నెడఁబాసి యేజాడఁ దాళువాఁడ.

57


సీ.

ఒకమాటు పైటకొం గోరగాఁ దొలఁగించి, మెఁఱుగుగుబ్బలయంద మెఱుఁగఁజేయు
నొకమాటు క్రొమ్ముడి యొప్పుగా ముడి విప్పి, నిప్పుగాఁ గ్రమ్మఱఁ గొప్పు దిద్దు
నొకమాటు కూరిమి ప్రకటంబు సేయుచుఁ, గులుకుఁబల్కుల ముద్దు చిలుకుచుండు
నొకమాటు గాటంపుటొఱపు రాణింపఁగా, జిలిబిలిసొలపుఁజూపులఁ గరంచు


తే.

నొక్కమాటు మనోభవాయోధనక్రి, యాప్రవీణతఁ జూపి బి ట్టలరఁ జేయు
నౌర మది నొక్కతఱి నైన నక్కడింది, మగువనెఱజాణతనములు మఱువరాదు.

58


సీ.

చిలుకలకొలికి ముద్దులగుమ్మ వన్నెల, గని చొకారపుమానికములమూట

తొలుకఱిక్రొమ్మించుతలిరుజొంపపుమావి, పగడపుఁదీఁగె సోయగపుఁగొలను
కులుకుమిటారి తళ్కుపసిండికీల్బొమ్మ, వలపులదీవి చెంగలువబావి
యన్నులమిన్న యొయారమ్ములకొటారు, మరునిపూఁదూపు చేమంతిబంతి


తే.

చికిలిక్రొమ్మించుటద్దంబు పికిలిచెండు, కప్పురపుఁదావి యొప్పులకుప్ప యనఁగ
నలరుజగవన్నెలాడి యయారె దాని, చెలువు మదిఁ బాయ దిఁక నేమి సేయువాఁడ.

59


శా.

ప్రాంతారామధరానిరంతరవిహారస్ఫారలీలారతిన్
సంతోషింపక యిమ్మహాగహనసంచారభ్రమం బేల నై
యెంతే దవ్వుగ నేగుదెంచుటకు నేఁ డిచ్చోట నా కేల య
య్యింతిం గూర్చితి వేల పో నిడితి విం కెట్లోర్తు హా దైవమా.

60


తే.

అనుచు మఱియు సహింపంగ నలని గాని, కంతుసంతాపభరమున గ్రాఁగి వేఁగి
మేర మీఱెడుచేతోవికార మొదవ, నంగజబలంబుఁ గూర్చి యి ట్లనుచుఁ బలికె.

61


సీ.

డెంద మార్తిఁ గలంగి కుంద మాటికి నేఁచ, నందమా మము నీకుఁ జందమామ
యలుక లూరఁగఁ జెందు చిలుక నూరక యుబ్బి, పలుక మేరయె మీకుఁ జిలుకలార
మొకము చూడక పెద్దమెకముల ట్లరిదివా, లకము లూనెద రేల పికములార
ముదము మీఱఁగఁ గాని పదము వాడెద రింత, మదము మీ కేల షట్పదములార


తే.

మారుఁడా మందగంధసమీరుఁడా మ, యూరమా సారచంద్రికాపూరమా మ
రాళమా మత్తశారికాజాలమా యి, దేల మము నేఁచెద రటంచుఁ దూలి మఱియు.

62


క.

మరుఁడా విచలితసకలా, మరుఁడా గరుడాసనునికొమరుఁడా సుమతో
మరుఁడా విరహులపై వే, మరు డాయఁగ రాకు క్రూరమతిఁ బామరుఁడా.

63


క.

నిలు డాయ రాకు మలయా, నిలుఁడా నవకమలినీవనీసౌరభసం
కలుఁడా పటుబలుఁడా చం, చలుఁడా ఖలుఁడా వియోగిజనతానలుఁడా.

64


క.

మామా యను విరహులఁ జల, మా మాటికి నేఁచఁ జందమామా గామా
మామానినీకుమారుని, మామా మామాట సేయుమా మా నెనయన్.

65


ఆ.

సంతనగ వియోగిసంతతిపై నలు, సంత దయయు లేక సంతసమున
సంతపింపఁ జేయు సంతత క్రూరమా, సంత రాకు మిఁక వసంత నీవు.

66


క.

మతమా నీ కెపుడు నిదే, వ్రతమా తెరువరులఁ జెనక వచ్చెదవు మధు
వ్రతమా ఫరభృతమా పరి, వృతమాద్యత్కీరకురరపృతనాశతమా.

67


వ.

అని యనేకప్రకారంబుల మనోవికారంబునం బలికి కలికిం బరికింపం గోరి వనాం
తరంబు దూఱి.

68

సీ.

కిలకిలమనుచు రాచిలుకలు పలుకుచోఁ, గలికిపల్కు లటంచు నులికి యళుకుఁ
గవగొని కొదమజక్కవ లేగుచో ముద్దుఁ, బడఁతిగుబ్బ లటంటుఁ బట్టఁ దివురుఁ
దమి మీఱ నెమ్మి మొత్తము లాడుచో దంతి, గమనవేనలి యంచు భ్రమసి చూచుఁ
జెలరేఁగి గండుఁగోయిలపిండు గూయుచో, నబలయెలుం గని యాలకించు


తే.

నంచబోదలు మొగి నడతెంచుచోటఁ, జంచలేక్షణనెన్నడ లంచు నెంచుఁ
బంచశరఘోరసాయకాకుంచితాతి, చంచలాత్మీయహృదయుఁ డై జనవిభుండు.

69


తే.

అట్లు వనవీథిఁ దిరుగుచు నంతకంత, కగ్గలం బగుమారార్తి నడలి బడలి
మృగవిలోచన నరయుచు మృగఖగాగ, మాదికంబుల ని ట్లని యడుగఁ దొడఁగె.

70


సీ.

అలులార చెంచుతొయ్యలులార జక్కవ, చెలులార చూడరె జలజముఖిని
దరులార చిలుకబిత్తరులార కుసుమమం, జరులార చూడరె సరసమతిని
గవులార కరటిపుంగవులార యచలసా, నువులార చూడరె యువతిమణిని
వనులార చిలువజవ్వనులార మత్తకే, కినులార చూడరె వినయవతిని


తే.

బికములార మృగేంద్రశాబకములార, కొంచలార కొలంకురాయంచలార
జింకలార జగాగొరవంకలార, చూడరే నేఁడు చేడె నీజాడలందు.

71


వ.

అని మఱియును.

72


క.

మద మారఁగ ముద మారఁగఁ, బద మానఁగనీక పెల్లుపడి మొరసెదు ష
ట్పదమా పదమా ఘనవన, పదమార్గమునం బయోజపదమాటునకున్.

73


క.

అలుకా మదిఁ బూనెదు చెలి, కలుకా మామీఁద నిట్టు లఱ చేసి యహా
చిలుకా బలుకానల గా, సిలు కారణ మేమి ముద్దుచిలుకం జెపుమా.

74


క.

పికమా యభినవమణిదీ, పికమాడ్కి వెలుంగునిందుబింబానన యో
పిక మాలి యెందుఁ గుందెనొ, చికమకలం బెట్ట కిపుడు చెపుమా మాకున్.

75


క.

కోరిక లీరిక లెత్తఁగఁ, జేరిక నూరకయె వలచి శివశివ యిపు డా
నారి కడుఁ గేరి కదలెన్, శారిక నీ వాపెతెఱఁగు సరగునఁ జెపుమా.

76


క.

హారీతపికమయూరీ, శారీతతులార వలపు సడలదు మీ రిం
దేరీతి నుండేనో మా, నారీతిలకంబుఁ జూచినారే చెపుఁడా.

77


క.

జీవము మా కిపు డారా, జీవముఖీమణియె బంధుజీవమ జీవం
జీవమ భయవిచలితరా, జీవమ దైవమ యెఱుంగఁ జెప్పఁగ నేలా.

78


క.

సారంగమ రంగన్మద, సారంగమ భూరిగంధసారంగమ హా
సారసమా నవనికసిత, సారసమా చూపఁ గదరె సారసమాక్షిన్.

79

క.

పలుమాఱు విన్న వించినఁ, జెలిమార్గ మొకించు కయినఁ జెప్పవు నీకుం
జలమా తలమా గొబ్బునఁ, గలమాట వచించు మందగంధానిలమా.

80


ఉ.

సాలములార చంపకరసాలములార కదంబనింబహిం
తాలములార తూలపురతాలములాక తమాలమాలతీ
జాలములార మీ రిపుడు జాలము సేయక యాదరించి చూ
బాలకురంగులోచన నభంగురలీలఁ గనంగఁ జేయరే.

81


క.

ఈడా నీఫలములతో, నీ డగువలిగుబ్బ లలరునిభగామిని దా
నీడక యీడకు వచ్చెను, వేడుక దనరార మాకు వేగమె చెపుమా.

82


క.

మాకందమ శృంగారర, మాకందము వేగఁ జూపు మాకందమహా
మాకంద మలరగ నవసుష, మాకందళితాంబురుహదళాయతనేత్రన్.

83


సీ.

అన్నులతలమిన్నఁ గన్నారఁ జూపరె, పొన్నలార వెడందజిన్నలార
రతనంపుగని యిందు రాదు గదా గుజ్జు, మావులార కడిందిమోవులార
చిలుకలకొల్కి మీచెంత నీఁగదు గదా, మల్లులార తమాలవల్లులార
సొగసులదొంతి నిం దగపడఁ జేయరే, ప్రబ్బలార సురంగుదబ్బలార


తే.

కలికి తొలుకఱి క్రొమ్మించుకరణి మించు, మురువు రాణించు నదియించు ముద్దుగుమ్మ
రాదు గద యిందు వలపుఁగప్రంపుటనఁటి, మోకలాక చొకారంపుదాఁకలార.

84


క.

అని యనివారిత మగువల, పునఁ బునరవిజృంభమాణపుండ్రేక్షుశరా
సనబాధాపరవశుఁ డై, వనిఁ ద్రిమ్మరుచుండె నంత వనితామణియున్.

85


క.

జనవరునకుఁ దనపైఁ గల, ఘనతరమోహాంధకారగౌరవముఁ గనుం
గొని మదిఁ గరఁగి తటాలున, ననపొదరి ల్వెడలి దాపునం గనుపట్టెన్.

86


క.

కనుపట్టిన రమణిం బొడ, గని పోయినసొమ్ము మరలఁ గనుపడ్డతెఱం
గునఁ బొంగి నేలఱేఁ డా, ననఁబోఁడులమిన్నఁ జూచి నగుచుం బలికెన్.

87


క.

ఒప్పులకుప్పరొ నీపై, నెప్పుడు మది నిలిపి యుండి యిట నావలనం
ద ప్పేమి గలిగె నూరక, చెప్పక రాఁ దగునె యులికి చిలుకలకొలికీ.

88


సీ.

చాన నీకెమ్మోవిపానకం బానక, తెర లెడుబలుదూప దీఱిపోదు
బాల నీబాహుమృణాలము ల్చేర్పక, యతనుతాపవికార మాఱి చనదు
భామ నీకుచదుర్గసీమ వసింపక, ఘోరమారబలార్తి గ్రుంగఁ బడదు

చెలి నీకృపారసోజ్జ్వలవృష్టి పర్వక, సమధికకామసస్యము ఫలింప


తే.

దహహ యిఁక నైనఁ దహతహ నడలనీక, నీకవుంగిట న న్నహర్నిశము నునిచి
ప్రేమ దైవార వేనుఱుఁ గాముకేలి, నోలలాడించి యేలుము నీలవేణి.

89


సీ.

అలికులవేణి శరాసనభ్రూవల్లి, మలయజాతోమోద పులినజఘన
లికుచవక్షోజ నాళీకపత్రేక్షణ, కోకిలకలవాణి కుందరదన
రాకేందువదన శరశ్చంద్రికాహాస, గజరాజగామిని కంబుకంఠి
పల్లవపాణి శంపాలతావిగ్రహ, బిసబాహువల్లరి విద్రుమోష్ఠి


తే.

భుజగరోమాళి నవతిలపుష్పనాస, తారకోదారనఖర రంభోరుకాండ
పంచముఖమధ్య మృదులదర్పణకపోల, గురుకృపాలీల నను నేలుకొనవె బాల.

90


వ.

అని యనంగశరాసారధారాపూరపూరితశరీరుం డగుచుం దఱిసి గాఢపరీరంభచుంబ
నాదిసంభోగలీలావిహారంబుల నన్నితంబినీమణిం గూడి క్రీడించి యయ్యి౦తియుం
దానును గ్రమ్మఱ నిజపటకుటీరాంతరంబు చేరి యిష్టోపభోగంబులం దనియుచుండె
నంత.

91


క.

కంతునిభమూర్తి యగుభూ, కాంతాగ్రేసరునితోడఁ గలసి ప్రహర్ష
స్వాంత యయి యుండుచో న, క్కాంతాజనరత్నమునకు గర్భం బయ్యెన్.

92


క.

చిట్టుములు నోకిలింతలు, నిట్టూర్పులు దళముకొనియె నెమ్మదిఁ గోర్కుల్
బి ట్టొదవె గుట్టుపట్టుకు, మ ట్టగుజఘనంబు ప్రబలె మహిళామణికిన్.

93


క.

మేలిననచెండ్లతో నెన, పోలుపఁ దగుచిగురుటాకుఁబోఁడి మెఱుంగుం
బాలిండ్లు చూడఁ జూడఁగఁ, దాళఫలోపమము లగుచుఁ దద్దయు బలిసెన్.

94


తే.

నేలచేడియ యవ్వేల్పువాలుఁగంటి, యుదరమునఁ బుట్ట నూహించి ముదముతోఁ బ్ర
వేశ మొందుచు నున్నదో వెస ననంగఁ, బొలఁతుకకు మంటిచొరవ మిక్కిలియుఁ బొసఁగె.

95


క.

ఘనజఘనస్తనమధ్యం, బున నడుఁకెడుతరుణినడుము భూపతి చేప
ట్టినకతన నబ్బురపుఠీ, వినిబెంపు వహించి విఱ్ఱవీఁగుచు నుండెన్.

96


తే.

చిలుకతేజీవజీరుచేఁ జెలఁగుమేలి, జాళువాబొంగరములపైఁ గ్రాలుచున్న
వలుదవేలుపురాచరాములుకు లనఁగ, నెలఁతుకలమిన్నచనుమొనల్ నలుపు మీఱె.

97


క.

చిగురాకు దొండపండును, బగడంబును దమ్మికెంపు బంధూకము నీ
డగు ననఁ దగునుమవాతెఱ మిగులం దెలుపారె నపుడు మీనేక్షణకున్.

98

తే.

అలఁతిచీమలచాలుతోఁ దుల యొనర్ప, వఱలునాళీకపత్రాక్షి మెఱుఁగుటారు
బాలనీలభుజంగంబుఁ బోలి యపుడు, గాటమై పూఁటపూఁటకుఁ గారుకొనియె.

99


ఆ.

పొన్నపువ్వుదీటు పోల్చులోకులమాట, నోటు చేసి వేల్పుబోటినాభి
విస్తరిల్లె నపుడు వెడఁదబావిని బోల్చు, నేర్పుకాండ్రమాట నేటు చేసి.

100


సీ.

తళుకులేఁజెక్కుటద్దములు వెల్వెలఁ బాఱె, నిద్దంపునెమ్మేను తద్ద డస్సె
నడు కొకయామ డై నడలు దొట్రిలఁజొచ్చెఁ, దృణము మేరునగంబుతెఱఁగు దోఁచెఁ
దట్టంపుటొఱపుము త్తరులస్రుక్కులు దేఱెఁ, దరిలేనియలఁతి నిద్దురలు మీఱె
బలుముత్తియంపుఁజేరులు చాల వ్రేఁ గయ్యెఁ; దొడవు లొక్కొకకొన్ని సడలి జాఱె


తే.

జడత వాటిల్లె బడలిక సంఘటిల్లె, వన్నె గొద యయ్యె నెలుఁ గింత సన్నగిల్లె
నిన్నుద్రిమ్మరిరాముద్దుటన్నుమిన్న, కెన్న నాపన్నసత్త్వ యై యున్నకతన.

101


వ.

అట్లు గర్భంబు దాల్చి యద్దివిషద్వధూరత్నం బొకశుభముహూర్తంబున జగజ్జనాభి
వంద్య యగుబాలారత్నం బుదయించినం గాంచి దానిం దదంతికగృహాంతరంబున
నునిచి యి ట్లనియె.

102


క.

బాలా యిగ్గుహలోనికి, హేలామార్గమున నెవ్వఁ డేతెంచు నిజం
బాలలితోదారుఁడు త, త్కాలంబున నీకు మగఁడు గాఁగలఁడు సుమీ.

103


క.

అని తెలిపి సురవధూమణి, మనుజేంద్రుని జూచి నీవు మసలక పురికిం
జను మింక నిజనివాసం, బున కరిగెద నేను నృపతిపుంగవ నెమ్మిన్.

104


చ.

అనవుడు గుండె ఝల్లు మన నల్లన సోలి కడిందిజాలిలోఁ
బెనఁగొన వెచ్చ నూర్చుచును బెగ్గిలుచుం గడునుమ్మలించుచుం
గనుఁగవ నశ్రుబిందువులు గ్రమ్మఁగ గద్గదకంఠుఁ డై రయం
బునఁ జెలి చెట్ట పట్టుకొని భూపకులాగ్రణి పల్కెఁ గూరిమిన్.

105


ఉ.

అక్కట మిక్కుటంపువల పారఁ దవుల్కొని నెమ్మనంబునం
జక్కెరబొమ్మ నీచెలిమి శాశ్వత మంచుఁ దలంచుచుంటకున్
మక్కువ వీడ నాడి నను మారునిబారికి నప్పగించి నీ
వెక్కడి కేగఁ జూచె దిపుడే నినుఁ బోవ నిడంగ నేర్తునే.

106


ఉ.

అంగము లొక్కటై పొదువ నల్లికబిల్లిక లై కరంబు ను
ప్పొంగుచుఁ బెక్కునాఁడు లొకపూఁటయె కాఁగ మెలంగుచుంటి మి
బ్భంగిఁ గృపావిహీనమతిఁ బల్కె దయో నెన రింత లేక మే
ల్బంగరుబొమ్మ యింక నినుఁ బాసి క్షణంబును నిల్వ నేర్తునే.

107

చ.

అలుక యొకింత యెట్టితఱి నైన నెఱుంగక నిచ్చనిచ్చలుం
దలఁగనిక్రొత్తకూరుములు దార్కొన నంగజసౌఖ్యలీలలన్
మెలఁగుచునుంటి మిర్వురము నెమ్మి దలిర్పఁగ నేఁటిదాఁక నో
యలికులవేణి నన్ను విడనాడి చనంగఁ బదంబు లాడునే.

108


సీ.

కొమ్మ నీయధరామృతమ్ముఁ గ్రోలుటఁ జేసి, యాహారవాంఛ యింతైన లేక
చామ నీకుచదుర్గసీమ నుండుటఁ జేసి, స్మరబలభీతి లేశమును గనక
సుదతి నీసంభోగసుఖము గల్గుటఁ జేసి, బహుతరరాజ్యవైభవము వదలి
కలికి నీతనుకాంతికనక మబ్బుటఁ జేసి, ధనసంగ్రహేచ్ఛ కొంతయు నెఱుఁగక


తే.

ప్రతిదినంబును నీపొందు సత మటంచు, నమ్మి యితరానుభవవిధానమ్ము లెల్ల
విడిచి యుండుట కహహ న న్వీడనాడి, చనఁ దలంచుట నాయంబె చంద్రవదన.

109


క.

కరు లేటికి గడితపుబం, గరు లేటికి మఱియు మేల్నగరు లేటికి రా
సిరు లేటికి బలురతనపు, సరు లేటికి నిన్ను విడిచి చనునెడఁ దరుణీ.

110


ఉ.

తామరసాక్షి నమ్ము మిదె దైవము సాక్షిగ నీకుఁ జెప్పెదం
బ్రేమ దలిర్ప ని న్గలసి పెక్కుదినంబులనుండియున్ సము
ద్దామమనోజరాజ్యపరతంత్రత నుండితి నీవు లేనిచో
భూములు గీములు న్ఘనవిభూతులు నీతులు నాకు నేటికిన్.

111


చ.

తగిలినప్రేమ మాట జవదాఁటక యెన్నఁడుఁ బాయ మంచు నొ
ప్పుగఁ గవగూడి యెందు నఱ పూనక యుంటిమి యిప్పు డెంతయున్
వెగటుగ నాడి గుండియలు వ్రీలఁగఁ జేసెదు హా జగంబునన్
మగువల నమ్మరా దనెడుమాట నిజంబుగఁ దోఁచెఁ బో చెలీ.

112


చ.

ఇచ్చట నీకు నుండుట కొకించుక ముచ్చట లేక యుండినన్
మచ్చికతోడ నీక్షణమె మాపురికిం జనుదెమ్ము కాక యా
పచ్చనివింటిబల్తులువబారికి నగ్గము చేసి పోక నన్
జెచ్చెర నీదుటెంకి కఱ సేయక తోడ్కొనిపొమ్ము వచ్చెదన్.

113


క.

మానిని నిను నాపట్టపు, జానిగ నొనరించి సకలసామ్రాజ్యంబున్
మానుగ నీ కిడి కొలిచెద, నానాజనసహితముగ ననారతభక్తిన్.

114


ఆ.

అనినఁ గలికి పలికె నవనీశ నీకింత, చింత యేల కడిదివంత యేల
సంతసమునఁ బురిఁ జని నెమ్మి దైవార, నఖిలరాజ్యసుఖము లనుభవింపు.

115


తే.

నరపతివి నీవు నేను గంధర్వసతిని, దైవవశమున మనకు నిద్దఱికిఁ జెలిమి

యొదవెఁ గొన్నేఁడు లింక నిం దుండరాదు, పోయి వచ్చెద సెలవిమ్ము భూపతిలక

116


తే.

అనుచు నిటు లూరడించి యయ్యధిపుచేత, నాజ్ఞ గొని యింతి పఱతెంచె నాకమునకు
దళము కొలువంగఁ బసిఁడియందలము నెక్కి, జనకరుండును నిజపురంబునకుఁ జనియె.

117


క.

అంతట వనదేవత ల, త్యంతామోదమునఁ బనుప నసదృశతేజః
కాంతివిలాసంబుల గుహ, నెంతయుఁ గుశలమున బాల యెదుగుచునుండెన్.

118


సీ.

కురులు బొమ్మలమీఁదఁ గులికి పెంపెసలాడె, నెదఁ జిన్నిచన్నులు గదురు లెత్తెఁ
దావిమోవికిఁ గ్రొత్తతలిరుడాలు ఘటిల్లె, నూనూఁగునూఁగారు గాన నయ్యె
గనుదోయి నఱసిగ్గు కలికి చూపులు మీఱె, వలిచెక్కుఁగవకుఁ గ్రొందళుకు లొదవె
జిలిబిలిముద్దుపల్కులసొల పలరారె, మొగమునఁ జిన్నారినగవు లెసఁగె


తే.

నడలఁ గడ లేనిమురిపెంబు గడలుకొనియెఁ, గటియు జఘనంబు నొక్కింత ఘనతఁ జెందె
నాఁడునాఁటికి రాచపూఁబోఁడికొఱపు, మించులేజవ్వనం బంకురించుటయును.

119


క.

మఱియుఁ గుచంబులు గటియును, నెఱియు న్విస్తరిలె నాభి నిమ్నతఁ జెందెన్
మెఱుఁగారునారు గార్కొనె, నెఱజవ్వన మిందుముఖికి నిండారుటయున్.

120


వ.

ఆసమయంబున.

121


చ.

అలులుఁ బికంబులు నృకము లంచలు శారికలు న్నెమళ్లు వి
చ్చలవిడిఁ బొంగి చెంగటఁ బొసంగ హళాహళి సేయుచున్న ను
గ్మలి యొకయింతమన్మథవికారము నెమ్మది నంకురించినం
దలఁకక తల్లి చెప్పినవ ధంబుఁ దలంచి వినిశ్చలాత్మ యై.

122


చ.

గడితపునారచీరఁ గటిఁ గట్టి పటుస్ఫటికాక్షమాలికల్
మెడఁ గడు నించి దట్టముగ మేన విభూతి యలంది పెన్నెరుల్
జడలుగఁ దాల్చి డెందమునఁ జాల దిటం బగుభక్తిఁ బూని య
ప్పడఁతుక యబ్బురంబుగఁ దపం బొనరింపఁ దొడంగె నెంతయున్.

123


క.

అనిశము జలదళపవనా, శనవృత్తి న్మనుచు దివిజసంఘము వొగడం
దనకక బహుకల్పము లా, ననఁబోఁడులమిన్న తప మొనర్చుచు నుండెన్.

124


తే.

అని పితామహుఁ డెఱిఁగింప నమరమౌని, యంతట ఋతుధ్వజక్షమాకాంతపుత్త్రి

చంద మే మయ్యె నెఱిఁగింపు సరవి ననిన, నయ్యజుం డాతనికి నిట్టు లానతిచ్చె.

125


క.

విను మునిజనపంచానన, మును గౌతముఁ డనఁగ విప్రముఖ్యుఁ డొకఁడు భూ
జననుత నిష్ఠాపరుఁ డై, యనుపమవిద్యానిరూఢి నలరుచు నుండెన్.

126


క.

భూసురతతిలో వన్నెయు, వాసియు దీపింప నెలమి వర్తిలునెడలన్
నాసాహీనుం డొకసుతుఁ, డాసంయమి కుద్భవించె నద్భుతసరణిన్.


సీ.

అత్తెఱంగున వికృతాకారుఁ డై ప్రభ, వించినసుతు నిరీక్షించి తల్లి
దండ్రు లత్యంతచింతావ్యాకులస్వాంతు, లై యంత జాతకర్మాదివిధు లొ
నర్చి గౌతముఁ డనునామధేయం బిడి, యైదవయేఁట నయ్యర్భకునకుఁ
బ్రియమార్గమున నుపనయనంబు గావించి, యాదరంబున నుపాధ్యాయునొద్దఁ

127


తే.

జదువఁ బెట్టిన నిబిడ లజ్జాభరంబు, పేర్మి నొకయక్షరంబును బ్రేమతోడఁ
జదువుకొనఁ డయ్యె శిష్యులఁ గదిసి విహిత, మగుసహాధ్యాయితయుఁ గాంచఁ డయ్యె నతఁడు.

128


క.

గాయత్ర్యభ్యసనంబును, వాయుసఖోపాసనంబు వదలక యెపుడుం
జేయుచు నుండె ద్విజోత్తముఁ, డాయుర్వర్ధన మొసంగె నతనికి మిగులన్.

129


తే.

అగ్నికార్యంబువలన గాయత్రివలన, బ్రాహ్మణుం డనునామమంత్రంబుఁ బెరసెఁ
గాని విద్యావధూపరిగ్రహము లబ్బ, వయ్యె నమ్మేదినీనిర్జరాన్వయునకు.

130


వ.

అ ట్లగుటంజేసి మహావైరాగ్యం బూని యతండు.

131


సీ.

కాశీగయాప్రయాగములఁ గేదారంబు, బదరికాశ్రమము చంపకవనంబు
నైమిశారణ్యంబు నారాయణాశ్రమం, బరుణాచలము వేంకటాచలంబు
శ్రీపర్వతము కురుక్షేత్ర మవంతిక, కాంచి ద్వారావతి కాళహస్తి
మధుర శ్రీకూర్మంబు మాయ యయోధ్య య, హోబలంబును బురుషోత్తమంబు


తే.

మొదలు గల్గుమహాక్షేత్రములకు సారె, వచ్చుచును బోవుచును బెక్కువత్సరములు
గడపి యంతట నొకనాఁడు కౌతుకం బె, సంగఁ బఱతెంచె నీహారశైలమునకు.

132


వ.

అట్లు పఱతెంచి యమహామహీధరాగ్రభాగంబునం గొంతదడవు విహరించి యంత
నచ్చట నొక్కగుహఁ గనుంగొని.

133


క.

అగ్గుహలోపలి కెంతయు, దిగ్గన సొత్తెంచి యందు దృఢమానసుఁ డై

యగ్గలపుభక్తితో స, మ్యగ్గతిఁ దప మాచరింప నాత్మఁ దలంచెన్.

134


తే.

తలఁచి వర్తించుచో నొక్కదండ నొంటిఁ, దపముఁ గావించుచున్న వృద్ధప్రసూన
గంధి నత్యంతశిథిలవిగ్రహఁ బ్రపూత, బ్రహ్మచారిణిఁ జూచె నబ్రంబు దోఁప.

135


తే.

చూచి యేచినవేడ్క నజ్జోటిదరికిఁ, జేరి చేరికతో నమస్కృతి యొనర్చు
టయు నివారించి యాపద్మనయన యతని, నంచితాపాంగదృష్టి నీక్షించి పలికె.

136


క.

ధరణీసురవర నాకున్, వరుఁడవు గాఁగలవు నీవు వంచించుచు ని
క్కరణిన్ మ్రొక్కఁగఁ దగ దనఁ, గరములు ముకుళించి మౌని కామిని కనియెన్.

137


తే.

పెద్దదానవు తపమునఁ దద్ద నిలిచి, యున్నదానవు గుణముల మిన్న నీవు
తలిరుఁబ్రాయంబు నల్పవిద్యయును గలుగు, నేను నీ కెట్లు వరుఁడఁ గా నేర్తుఁ దరుణి.

138


సీ.

అనిన నమ్మానిని యమ్మౌనివరునితో, మును ఋతుధ్వజమహాజనవిభుండు
వల నొప్ప వేఁటకు వచ్చుటయును నితాం, తామోదలీల సుశ్యామ యనెడు
గంధర్వకన్యకఁ గాంచుటయును దాని, గాఢతరప్రేమఁ గలయుటయును
వారి కిర్వురకుఁ దా నారూఢిఁ బ్రభవించుటయుఁ దల్లి తనుఁ గడుఁబ్రియముతోడ


తే.

నగ్గుహాగేహమున నుంచి యబల యిచటి, కెవ్వఁ డేతెంచు నతఁడు నీ కెనయ మగఁడు
గాఁగలఁ డటంచుఁ బలికి నాకమున కెలమి, నేగుటయుఁ దెల్పి వెండియు నిట్టు లనియె.

139


తే.

మునివరేణ్య ఋతుధ్వజమనుజపతికిఁ, ద్రిదశకాంతకుఁ బుట్టినాఁ డ్మొదలు గాఁగ
నురుతపోనిష్ఠ నిచటనే యున్నదాన, నిచటి కెవ్వండు నెపుడు రాఁ డీవు దక్క.

140


తే.

వినుము మాతండ్రి యెనుబదివేలయేండ్లు, ధరణిఁ బాలించి యిచటనె తప మొనర్చి
నాకమున కేగె నవ్విభునందనుండు, నట్ల చనెఁ బదివేలేఁడు లవని యేలి.

141


తే.

నాఁటనుండియుఁ దరల కిచ్చోట నున్న, దాన నన్యుల కొసఁగినదానఁ గాను
దల్లిదండ్రులు లేనిస్వతంత్రురాల, రాజకన్యను వ్రతనిష్ఠఁ బ్రబలుదాన.

142


వ.

కావునఁ బురుషార్థిని నగునన్నుం బరిగ్రహింపు మనిన నాగౌతముఁ డి ట్లనియె.

143


తే.

వనజముఖి నేను వేయేండ్లవాఁడ నీవు, బహుసహస్రాబ్దములదాన వహహ వృద్ధ
వైననీకును బాలుఁడ నైననాకు, ఘటన యిం కెవ్విధమునఁ గాఁ గలదు చెపుమ.

144


ఆ.

అనిన నబల వలికె ననఘ ము న్నా కీవు, భర్త వై స్పజింపఁ బడితి వజుని
చేత నింక నొరుని, జేకొన నొల్ల న, ట్లగుట నన్నుఁ దెగడఁ దగదు నీకు.

145


తే.

తాపసోత్తంస న న్ననాదరణ చేసి, విడువఁ జూచెద వేని భావించి నీవు

గనుఁగొనుచునుండ నిపుడె నిక్కముగఁ దనువు, విడుచుదాన నటన్న లో నడలి యతఁడు.

146


క.

నాసాహీనుఁడ విద్యా, భ్యాసం బెన్నడు నెఱుంగ నంభోజముఖీ
యేసరణి నీమనోరథ, మే సమకూర్పంగ నేర్తు హిత వారంగన్.

147


తే.

మును సురూపంబు సద్విద్యయును దొరకినఁ, బిదప నీవచనంబు చేసెద నటన్న
నలరి నెయ్యంబు దైవార నతనిఁ జూచి, వృద్ధకామిని వెండియు నిట్టు లనియె.

148


క.

తపమున నాచే వాక్సతి, యపరిమితామోద యయ్యె ననలుఁడు నటులే
కృపఁ జూచువాఁడు వానికి, నిపు డతివిద్యయు సురూప మిడియెదరు సుమీ.

149


క.

అని పలికి యవ్వధూటీ, జనరత్నం బపుడు భక్తి చాతురి మెఱయన్
వనజాతభవునికూరిమి, ననఁబోఁడి న్వేఁడఁ దొడఁగె నమ్రతతోడన్.

150


సీ.

జయ చతుర్ముఖవక్త్రసౌధవిహారిణి, జయ సితాంభోరుహాసననిషణ్ణ
జయ మత్తకాదంబసైంధవగామిని, జయ కుందమందారసదృశవర్ణ
జయ దివ్యరత్నభూషణవిరాజర్దాత్రి జయ యామినీకరశకలమౌళి
జయ సమస్తామ్నాయసారసంవేదిని, జయ మౌనిహృదయకాసారహంసి


తే.

జయ పురందరముఖసుధాశనవితాన, భర్మకోటీరవిలసితపద్మరాగ
మణిమయూఖావళీరాజమాననూత్న, చరణపద్మద్వయాడంబ శారదాంబ.

151


సీ.

శుకదండవల్లకీముకురపుస్తకపాణి, లాలితనీలరోలంబవేణి
బహుళవిద్యాదానపాలితాంతర్వాణి, రుచిరావలోకనప్రచలితైణి
కవిజనస్తుతిపాత్రకలితగుణశ్రేణి, మత్తవనప్రియమంజువాణి
కటిభాగనిర్జితాఖండమహాక్షోణి, బాహుదండాగ్రశుంభత్కృపాణి


తే.

పరమకల్యాణి కమలసంభవునిరాణి, పరమపదసౌధనిశ్రేణి పరిచితేంది
రాముఖాఖిలగీర్వాణి రాజమాన, ఘనకృపాదృష్టి మముఁ బ్రోవఁ గదవె వాణి.

152


క.

తల్లీ యమరీలోకమ, తల్లీ మల్లీందుకుందదరసురభూరు
డ్వల్లీనిభశుభగాత్రి భ, వల్లీలాలోకనంబు వడి నింపఁ గదే.

153


మ.

చిరకారుణ్యమతీ మహాగుణవతీ శృంగారలీలారతీ
శరదబ్జాభశుభాకృతీ నయగతీ శశ్వత్ప్రభావోన్నతీ
సరసీజాతసముద్భవప్రియసతీ సాహిత్యవిద్యాధృతీ
నిరతాశేషజగన్నుతీ భగవతీ నిన్ మ్రొక్కెద న్భారతీ.

154


మ.

తనరార న్భవదీయుసత్కృపకుఁ బాత్రం బైనపాజ్ఞుం డిలన్
మనుజాధీశులచే ధనమ్ము గొని సామ్రాజ్యైకధౌరేయుఁ డై

యనవద్యస్థితి నొందుఁ బో "సుకవితా యద్యస్తి రాజ్యేన కి”
మ్మనువాచాకలనంబు నిక్కముగ నంబా కంబుకంఠీమణీ.

155


క.

అలఘుతరభక్తి నీపద, జలజాతము లాశ్రయింతుఁ జదువులజేజే
కలికీ పలుకుంజిలుకల, కొలికీ నీకరుణ యిరవు కొలుపుము నాపై.

156


మ.

అనవద్యాగమవేద్యు సద్రుచిరకల్యాణప్రదు న్దేవతా
జనచూడామణి నబ్జజాచ్యుతమహేశానస్వరూపున్ ద్విజా
వననైపుణ్యనిధిం గృశాను ననలు న్వహ్ని న్హుతాశి న్శిఖిన్
నిను సేవించెద నెప్పుడు న్ననుఁ గృప న్వీక్షింపు వైశ్వానరా.

157


వ.

అని యనేకప్రకారంబుల వాగ్దేవిం బ్రార్థించి వైశ్వానరుం బ్రసన్నుం జేసికొని య
మ్మునిపతి నతితరవిద్యారూపసంపన్నుం గావించిన నతం డత్యంతసంప్రీతచేతస్కుం
డై యప్పుండరీకనయనం గూడుకొని మనోజక్రీడావినోదంబులం బ్రమోదించుచుం
డె నంత.

158


తే.

ప్రతిదినంబును బ్రోవు లై శతసహస్ర, సంఖ్యలకు మాఱి యతిథు లాదంపతులను
గాంచువేడుకతోఁ బఱతెంచుచుండి, రట్లు చేసినవారల నాదరించి.

159


వ.

భయభక్తిసంభ్రమంబులు వెలయ సత్కారంబు లొనరించి వీడ్కొలుపుచుండి రం
దు బాలోన్మత్తయువజనంబులు కొందఱు వారిం గని నగి గేలి యొనర్చుచుండిరి మ
ఱియుం గొంద ఱావృద్ధాంగనం గనుంగొని.

160


క.

పడఁతిరొ నిజముగ నీతఁడు, కొడుకో మనుమండొ నీకుఁ గొంచింపక యే
ర్పడఁ దెలుపుము మా కనుచుం, గడు నగి రొకకొంద ఱుత్సుకత మీఱంగన్.

161


ఆ.

పల్వలోదకంబు బాలాతపము నిశా, యామదధీసమన్వితాశనంబు
వృద్ధభామినియును బ్రేతధూమంబును, బ్రతుకు దఱుఁగు నండ్రు ప్రాజ్ఞు లెల్ల.

162


క.

వృద్ధునకు యువతి విష మగు, వృద్ధసతికి యువజనుండు వెలయఁగ సుధ యౌ
సిద్ధ మని కొంద ఱపు డా, వృద్ధాగౌతముల కెగ్గు లెన్నిరి పెలుచన్.

163


వ.

అని పలుకుచుం గృతాతిథ్యు లై సమస్తమహర్షివరులును యథేచ్ఛాగతులం జనుచుం
డిరి తద్వచనంబు లాకర్ణించి యాదంపతు లత్యంతశోకవ్యాకులస్వాంతు లై యంత
నచ్చటం దరలి చనుదెంచి.

64


ఉ.

కారుమొసళ్లగుంపు తరగ ల్దివిఁ గ్రమ్మెడుపొంపుగండుమీల్
మీరి నటించుసొంపు రవళిం జలపక్షులు గేరుమంపు లోఁ
దారుఢులీకుళీరఫణిదర్దురకోటులపెంపు దద్ద దై

వారఁ జెలంగి పొంగెడునపారనిధిఁ గన్గొని రవ్వధూవరుల్.

165


సీ.

వృద్ధాంగనకు యువప్రియుఁ డబ్బెఁ బో యని, నగియెడులీల ఫేనములు గ్రాల
నజుచెయ్వు లిట్లె పో యని తద్ద ఘూర్ణిల్లు, జాడల నిబిడఘోషములు మీఱ
మునిదంపతులఁ గరంబులు చాఁచి డాయంగఁ, బిలుచుచందమున వీచులు దనర్పఁ
దగువారి కర్ఘ్యపాద్యము లిచ్చువడువున, శీకరాసారము ల్చిందుచుండ


తే.

వినయగతి వారలకు నెమ్మి విశ్రమింపఁ, బీరము ల్పెట్టుచాడ్పునఁ బృధులసైక
తములు రాణింప సొంపునఁ దనరుచున్న, యప్పయోరాశిఁ దఱిసి రయ్యలఘుమతులు.

166


సీ.

ఘనులఁ బ్రపూర్ణజీవనులఁ జేయువదాన్యుఁ, డవిగతామితబాడబాశ్రయుండు
తవిలి మర్యాద దాఁట కుండుఘనుండు, బహుతరవాహినీపరివృతుండు
ధీవరకోటి కధీన మౌధన్యుండు, సదమలగాంభీర్యసంయుతుండు
సరసపురోహితసమితి కాకరసీమ, భువనాంతరవ్యాప్తభూరికీర్తి


తే.

యహిమకరధాముఁ డసదృశోదగ్రరత్న, కంకణమహోర్మికోద్భాసికనిహితుండు
నగురసాధీశుఁ డెంతయు నబ్బురంపు, సంతస మొనర్చె నప్పు డాదంపతులకు.

167


వ.

అట్లు సముద్రదర్శనం బొనర్చి యుప్పొంగుచు.

168


మ.

“దళితాశేషమహాంహసే ఘనపయోధామ్నే సముద్రాయ శై
వలినీమండలనాయకాయ వరుణావాసాయ పద్మాలయా
లలనేశశ్వశురాయ పుణ్యనిధయే లావణ్యపూర్ణాయ ని
స్తులగాంభీర్యయుతాయ తే నమ" యటంచు న్మ్రొక్కి మోదంబునన్.

169


తే.

అవ్వధూవరు లందుఁ గృతావగాహు, లై రయంబునఁ జని యగస్త్యాశ్రమంబు
చేరి యమ్ముని నాన దర్శించినపుడు, గౌతముం డాయనకు మ్రొక్కి కడఁకఁ బలికె.

170


తే.

మునికులోత్తమ భువి భుక్తి ముక్తిదంబు, నఖిలవాంఛాప్రదంబు నైనట్టి పుణ్య
తీర్థ మెయ్యెది నాడెంపు, దేశ మెద్ది, తేటతెల్లంబుగా మాకుఁ దెలుపవలయు.

171


క.

అని ప్రార్థించిన గౌతముఁ, గనుఁగొని నెయ్యంబుతో నగస్త్యుఁడు వలికెన్
మునివర గౌతమి యఖిలవృ, జినములు దొలఁగించు నిష్టసిద్ధియుఁ జేయున్.

172


తే.

ధరణి నెన్నికఁ గన్న తీర్థముల కెల్ల, మిన్న యై గౌతమీగంగ వన్నె కెక్కు

నయ్యశేషాఘహారిణియందు మునుఁగు, జనుల కిహపరసుఖములు సంఘటిల్లు.

173


క.

కావున నీ విపు డచటికి, వేవేగం జనుము వేడ్క వెలయఁగ నేను
న్నీవెంటనె వచ్చెద నని, యావిమలాత్మకుఁడు తరలి యరుదెంచె వెసన్.

174


తే.

గౌతముండును భార్యాసమేతుఁ డగుచు, గౌతమికి నేగి యందలి గాఢనిష్ఠఁ
దప మొనర్చుచు నొకనాఁడు దవిలి యీశ్వ, రాద్యుతుల నమ్మహానది నభినుతించె.

175


క.

పురదానవమదహరణా, హరిహయనుతిచరణ రాజతాచలశరణా
చిరుకరుణాభరణా కి, న్నరపరివృఢశరణ నీకు నతి శశిభరణా.

176


సీ.

రవిశశిశిఖినేత్ర భువనరక్షణసూత్ర, పాలితమునిపుత్త్ర ప్రథనజైత్ర
విజితశాత్రవగోత్ర కుజనద్రుకరపత్ర, భవలతోగ్రలవిత్ర ధవళగాత్ర
దివిజోపవనచైత్ర కవిజనస్తుతిపాత్ర, ఘనతరవృషపత్ర ధనదమిత్ర
నిలయితసితగోత్ర నిభృతచక్షుశ్శ్రోత్ర, పరమపవిత్ర బంధురచరిత్ర


తే.

పంకరుహపత్రలోచనకంకపత్ర, వ్యాజసంసారసాగరయానపాత్ర
వృజనసంఘాతకాననవీతిహోత్ర, నినుఁ బొగడ నేర్తుమే భవానీకళత్ర.

177


వ.

అని మహేశ్వరుం బ్రణుతించి.

178


దండకము.

శ్రీమజ్జగన్నాథ లక్ష్మీమనోనాథ గాధేయకౌండిన్యశాండిల్యమాండవ్యవల్మీ
కజవ్యాసవాసిష్ఠగర్గాద్యశేషర్షిసంఘాతసంస్తూయమానస్థిరోదారచారిత్రదూరీకృతా
మిత్ర మిత్రేందువేధోమరుత్వజ్జలాధీశకీనాశదైత్యేశవాతార్థపేశానలాహీశముఖ్యాఖి
లామర్త్యకోటీ రవిస్ఫారతేజోవిరాజన్మహారత్నకాంతిచ్ఛటాజస్రనీరాజితోద్యత్ప
దాంభోజ భోజావనీజానిజానిర్మలస్వాంతనీరేరుహాంతర్విలీనప్రమత్తద్విరేభా ఘనా
భా సరోజాతనాభా శరచ్చంద్రకాకుందబృందారకాహారమందాకినీహారనీహారహీ
రేందుకోటీరసాటీ వాక్కామినీకాశనీకాశకీర్తిప్రకాశా నిరీశా హరీ శార్హ్గపాణీ కృ
పాణీ కృపానీరధీ సారథీ ధీరగాండీవభృత్సారథీ భూరిధర్మైకనిష్ఠాగరిష్ఠామితోత్కృ
ష్టసృష్టిప్రజాభీష్టసంధాయకా విశ్వవిశ్వంభరానాయకా విశ్రుతానంతనీరేజగర్భాం
డభాండావలీ పూరితోద్యత్పిచండారివక్షఃకులాధ్యక్షదుగ్గర్వనిర్వాపణాఖర్వభీమ
ప్రభావాభిరామా జగద్గీతనామా పదాంగుష్ఠనిష్ట్యూతగంగాంతరంగాంబుధారాలవా
సేచనక్షాళితబ్రహ్మహత్యాముఖక్రూరపాపా ప్రశస్తానులాపా నిరస్తోపతాపా పర
బ్రహ్మరూపా సమిద్ఘోరకోపా సుధాలాప నీలాపరంభసంభోగకేలీవిహారామితో
ల్లాసలీలాసమాలోలగోపాలలీలావతీబంధురోరోజకుంభద్వయీలిప్తకస్తూరికాసాంక
వామోదసంవాసితోదారదోరంతరాళా మహాభీమసంగ్రామసీమాకరాళా విపశ్చి

న్మనస్సారకాసారమాద్యన్మరాళా విరాడ్దివ్యఖేంఖోళ కాళిందికాతీరవానీరకుంజుద్రు
మాగారమధ్యోల్లసత్పుష్పశయ్యాతలాబాధరాధావధూసంతతాస్తోకనాళీకనాళీకకే
ళీకళాకౌశలామోద దామోదరా పుండరీకాక్ష వైకుంఠ శౌరీ నరాక్రూరగాంగేయరు
క్మాంగదానేకపేంద్రాంబరీషాంజనేయప్రభృత్యంఘ్రిభక్తావనోపాయపారీణ నారా
యణా వాసుదేవా చిదానంద గోవింద బృందావనాంతర్విహారా నృసింహా హృషీ,
కేశ హేమాంబా దేవదేవా మహాదేవ నీదివ్యలీలావినోదప్రకారంబు లెన్నంగ
నెవ్వారికిం దీరు ధీరాత్ము లై యాగమాంతార్థవిజ్ఞాను లై జ్ఞానవైరాగ్యసంపన్ను
లై నిర్గుణత్వంబునం బొల్చుయోగు ల్పృథివ్యంబు తేజోనిలద్యోమయం బై చరస్థావ
రంబైనసర్వప్రపంచంబు నీమూర్తిగా నాత్మ భావించిని న్గాంతు రష్టాపదం బొక్క
టైయుండి నానాసరిస్కా గరూపంబులం బొల్చుపోల్కెర్ బరతుండ నొక్కండ
టైయుండి నీ వెల్లరూపంబులం దాల్చి వర్తింతు వో సామి నీ కగ్ని వక్త్రంబు తా
రాపథం బుత్తమాంగంబు దిక్కుల్ చెవుల్ భానుజైవాతృకుల్ నేత్రము ల్తోయ
ధుల్ కుక్షి నాకంబు కంఠంబు వేదంబు లుక్తుల్ ధరిత్రీతలం బంఘ్రియుగ్మం
బు గాయత్రి కీల్గంటు వైసస్వతుం డాత్మ యోగీశ్వరుల్ రోమము ల్గంధవా
హుండు ప్రాణంబు బృందారకు ల్బాహువు ల్భారతీదేవి దా జిహ్వ యుం గా జగ
ద్రూపి వై యేవుతోడం బ్రదీపింతు వౌ నీవ యంభోజగర్భాచ్యుతేశాకృతు ల్దా
ల్చి శశ్వద్గతి న్విశ్వసృష్టిస్థితిధ్వంసనక్రీడల న్మీఱు దౌ వెండియు న్దుష్టసంహారశిష్టా
వనార్ధం బనేకాకృతు ల్పూని రాణింతు వాది న్విసారంబ వై యంబురాశిం బ్రవే
శించి క్రూరాత్ముఁడౌ సోమకుం ద్రుంచి వేదంబు లన్వేధ కొప్పింపవా కూర్మరూ
పంబుతో నేపునన్ మందరోర్వీధ్రముం బూని జేజేల నెల్ల న్సుధాహారసంతుష్టిఁ దే
లింపవా సూకరాకారముం బూని యక్షీణశౌర్యప్రభాదక్షు హేమాక్షు శిక్షించి
ధాత్రీతలం బెల్ల దంష్ట్రాగ్రభాగంబునం దాల్పవా మర్త్యపారీంద్రదేహుండ వై స్వ
ర్ణదైతేయు నిర్జించి ప్రహ్లాదుఁ బాలింపవా వర్ణి వై తూర్ణ మంఘ్రిత్రయం బుర్వి య
రి్థించి వైరోచనుం క్రిందికి న్మట్టవా భృగ్వధీశుండ వై గండ్రగొడ్డంట ముయ్యేడు
మాఱు ల్నరాధీశులం గొట్టవా జానకీభర్త వై ఘోరదుర్వర్తనుం డైన యప్పంక్తి
కంఠాసురేంద్రు న్సమిద్భూమిఁ బోకార్చవా శీరి వై హాళి మీఱం బ్రలంబాదులం
ద్రుంపవా బుద్ధరూపంబుచే దైత్యనారీకదంబంబుల న్బన్న మొందింపవా సాది వై
మ్లేచ్ఛరాజన్యుల న్మోదుచు న్సాధులం బ్రోవనున్నావు నీవర్తనం బెల్ల లెక్కింప
మాబోంట్ల కెంతే నశక్యంబె నిన్ను న్బ్రశస్తేంద్రనీలోపలద్విట్ప్రతీకాశసమ్యక్తురుం

బోపరిస్నిగ్ధమాణిక్యరోచిశ్ఛటాంచత్కిరీటోత్తమాంగున్ సుధాకీర్ణరాకానిశాకేతు
బింబోపమస్మేరవక్త్రాగవిందు న్ముకుందు న్మనోజాతలీలాధనుస్సన్నిభభ్రూలతా
భాసురుం గృత్తదంభాసురుం బ్రాతరారంభవేళాసముజ్జృంభమాణారుణాంశుప్రభా
జాలనిర్భిన్నశుభ్రాబ్జదసంవర్తికాచారునేత్రు న్బుధస్తోత్రపాత్రు న్నలీనాగ్రచాంపేయ
జాలాభిరామస్వనాసు న్శరత్కౌముదీమందహాసు న్జపాబింబికాబంధుజీవప్రవాళా
బ్జరాగోపమానామృతాధారశోణాధరు న్శ్రీధరుం గుందబృందాచ్ఛదంతావళీభాస
మానుం బ్రభావాసనను న్జ్వలత్కుండలస్థాపితానర్ఘ్యరత్నద్యుతిప్రోల్లసద్గండ
భాగు న్యతీన్ద్రానురాగు న్మణిగ్రైవహారావళీవిస్ఫురత్కంబుకంఠు న్గదాశంఖచ
క్రాబ్జశార్ఙ్గాయుధోపేతదిక్కుంభిశుండాసదృక్పీనవృత్తాయతాజానుబాహు న్విహం
గేంద్రవాహు న్రమాకౌస్తుభాస్తోకముక్తామణీధామకాలంకృతోత్తుంగబాహాంతరా
ళుం గృపాళుం గళిందాత్మజాభంగరంగత్త్రిభంగు న్మదారాతిభంగు న్గరుత్మచ్ఛిలా
బద్ధభర్మోర్మికాకంకణాలంకృతస్నిగ్ధహస్తాంబుజాతు న్జగన్మోహనాకారరేఖాప
రాభూతపాఠీనకేతు న్సముద్దామసౌదామనీదామశంకాకరస్వర్ణచేలావృతోద్యత్క
టీరు న్మునీంద్రాత్తచేతోంబురుట్కర్ణికాంతఃకుటీకు న్హలాంభోజశంఖధ్వజానీకక
ల్యాణరేఖావృతాంచత్పదున్ శ్రీప్రదున్ హృత్పయోజాతమధ్యంబున న్నిల్పి సే
వింతు మత్యాదరం బొప్ప మ మ్మేలు మీశా నమస్తే నమస్తే నమస్తే నమః.

179


వ.

అని శ్రీమన్నారాయణుం గొనియాడి.

180


క.

శర ణొందెద నిను గంగా, పరిపూర్ణకృపాంతరంగ భవ్యతరంగా
గిరిశజటాంతరసంగా, పరిచితచక్రాంగ దురితపటలవిభంగా.

181


క.

ఆదిత్యయక్షఫణిర, క్షోదానవసిద్ధసాధ్యసురనుతవిలస
త్పాదారవిందయుగళీ, గోదావరి ననుఁ బవిత్రకుం జేయఁగదే.

182


తే.

మగ్నమాతంగ మదజలోన్మత్తభృంగ, యతిదయాపాంగ శంభుజటాగ్రరంగ
కలితశుభసంగ ఘోరదుష్కలుషభంగ, గౌతమీగంగ తరళరంగత్తరంగ.

183


తే.

అని నుతించుమునీంద్రున కపుడు నిఖిల, భువనపావని పొడగట్టి భూసురేంద్ర
మంత్రపూతంబు లైనట్టి మజ్జలముల, నీవధూమణిఁ దడపుము నియమ మొప్ప.

184


తే.

అత్తెఱంగునఁ జారురూపాన్విత యగు, మగువచే నభిషిక్తుఁడ వగుము నీవు
నిఖిలకల్యాణలక్షణాన్వితుఁడ వగుచు, మరల రూపంబు దాల్చెదు మహిమ మెఱయ.

185


తే.

అనుచు గౌతమి కృపఁ బల్క నట్లు చేసి, దంపతులు శోభనాకారసంపదల నె
సంగి రెంతయు గౌతమీసలిలసేచ, నమున మానసములఁ బ్రమోదము దలిర్ప.

186

తే.

అపు డగస్త్యవసిష్ఠగర్గాదిమునులు, ప్రేమ దైవాఱ వారలఁ బెండ్లి సేయఁ
దలఁచి యొకదివ్యనగరంబు తత్క్షణంబ, సొంపు దీపింప నచట నిర్మింపఁజేసి.

187


తే.

చంద్రతారాబలప్రశస్తముగఁ బొసఁగి, యి మ్మలరునొక్కశుభముహూర్తమ్ము నిశ్చ
యించి పౌరులఁ బురి యలరించుటకును, బూన్చుటయు వారు సంతసంబునఁ జెలంగి.

188


సీ.

గోడల నెల్ల రంగుగఁ జిత్తరులు వ్రాసి, ముంగిళ్ల ముత్యాలముగ్గు లునిచి
తోరంబుగాఁ బచ్చతోరణంబులు గట్టి, దరి లేనిచలువపందిరులు వైచి
యంగళ్ల మేలుక ట్లమరించి వేదిక, లలికి మేడలు మిద్దె లలరఁ జేసి
కదళికాస్తంభము ల్కనకకుంభంబులు, దల దువారంబులఁ దగులుపఱచి


తే.

యగురుఘనసారధూపము ల్మిగుల వైచి, సతులుఁ బురుషులు నతులితోత్సాహలీల
గంధమాల్యాభరణవస్త్రకలితు లగుచు, నలరుచుండిరి కడుఁ దదనంతరమున.

189


ఆ.

సవిత హస్తమించె సంజ కెంపుదలిర్చెఁ, దమము గ్రమ్ముకొనియెఁ దార లెసఁగెఁ
జంద్రుఁ డుదయ మయ్యెఁ జంద్రిక ల్విలసిల్లె, నపుడు మునులు మిగులహర్ష మొనర.

190


సీ.

ఝల్లరీనిస్సాణశంఖభేరీకాహ, ళలు దూర్యములు ధరఁ మ్రోయ
బిఱుసులుఁ జివ్వలు బెడఁగుచంద్రజ్యోతు, లును నభం బెల్ల వెలుంగఁ జేయ
ఘనమర్దలధ్వను లెనయ నాడెఁపువార, రమణీమణులు నర్తనములు సలుప
జగ మంతయును బట్టపగలు గావించుచుఁ, గరదీపికాసముత్కరము వఱల


తే.

సకలనగరాంతరాగతజనపరంప, దానిరంతరకలకలారవము దిగిభ
నివహకర్ణపుటంబులఁ జెవుడుపఱుప, సదమలానందకరమహోత్సవము వెలయ.

191


వ.

వివాహోచితకృత్యంబు లాచరింపఁ దీర్పరు లైనపురంధ్రీభూసురోత్తముల నియో
గించుటయును.

192


తే.

మిన్న యై యున్నయారాచకన్నియకును, బుణ్యనిధి యగుభూసురపుంగవునకు
మంగళస్నాన మాచరింపఁగ నొనర్చి, రెలమిఁ గొందఱు ముత్తెదువలు గడంగి.

193


మ.

వరరత్నాభరణావలు ల్దొడిగి సౌవర్ణాంబరంబు ల్హొయల్
బెరయం గట్టి పటీరచంద్రమృగనాభీపంకము ల్మేనులన్
గర మొప్పార నలంది క్రొవ్విరిసరుల్ గాటంబుగా వైచి వా
విరిఁ గైచేసిరి కాంత లానృపసుతావిశ్వంభరాదేవులన్.

194


తే.

అపుడు కల్యాణవేదిపై నమలరత్న, పీఠమున విప్రుఁ గూర్చుండఁబెట్టి కాళ్లు

గడిగి మధుపర్కము లొసంగి కన్యఁ దెచ్చి, రమణ నిర్వురకును గంకణములు గట్టి.

195


క.

ఉడువీథిఁ జూచి యాజకు, లడరఁగ సుముహూర్తవేళ యయ్యె నటంచున్
గుడజీరకములు శిరమున, నిడి కన్నియఁ జూపి రామహీదేవునకున్.

196


క.

మునుకొని విప్రోత్తము లె, ల్లను గము లై పలికి రపుడు లక్ష్మీనారా
యణ సావధాన యనుచుం, దనరఁగ సుముహూర్తసావధాన యటంచున్.

197


మ.

ఘనగంభీరవిరావసంకలితు లై క్ష్మాదేవతాముఖ్యు లె
ల్లను మోదంబున నవ్వధూవరులమ్రోలం గూటువ ల్గూడి డా
కొని "సర్వే మునయ స్సురాగ్రహయుతాః కుర్వంతు వా మ్మంగళ”
మ్మని లగ్నాష్టకము ల్పఠించిరి శుభోదంచత్ప్రకారంబునన్.

198


క.

కల్యాణపాత్రికల సా, కల్యముగ నివాళు లునిచి గఱితలు గౌరీ
కల్యాణంబులు పాడిరి, కల్యాంచితమాధురీప్రకారము వెలయన్.

199


ఉ.

పల్లవపాటలాధరశుభప్రభ లొప్పఁగ మేల్పయంటలన్
బెల్లుగ గుబ్బచన్గనలు పెంపెసలాడఁ గడిందివేడుకల్
మొల్లము మీఱఁ గ్రొత్తతెలిముత్తియపున్రతనంపుసేసఁబ్రాల్
చల్లుచుఁ బేరఁటాండ్రు ధవళంబులు పాడిరి కొంద ఱయ్యెడన్.

200


శా.

ఆ రాజన్యకుమారికంఠమున గోత్రాదిత్యవర్యుండు సొం
పాగ న్మంగళసూత్ర మప్పుడు నితాంతామోది యై కట్టి వి
స్తారోత్కంఠత నాగమోక్తికము వాచాప్రౌఢి మీఱన్ "ధ్రువం
తే రాజా వరుణోధ్రువ" మ్మనుచు ధాత్రీనిర్జరు ల్వల్కఁగన్.

201


క.

లలనాలలామశిరమున వలనుగ భూసురవరుండు వసుధామరు నౌ
దలఁ గలకంఠియు ముత్యపుఁదలఁబ్రా ల్వోసిరి ముదంబు దళుగుకొత్తంగన్.

202


తే.

అంతరిక్షంబునం దిల నఖిలజనులు, సొరిదితోడ నరుంధతిఁ జూచుచుందు
రప్పు డచటనె చెలఁగి జాయాపతుల క, రుంధతిని జూపి రొజ్జయల్ రూఢి మీఱ.


వ.

మఱియు నగ్నిప్రతిష్ఠాపనాదివిధు లాగమోక్తప్రకారంబునం గావింపుచుఁ గ్రమం
బునఁ జనఁ బంచవాసరంబులు గడపి యున్న యాదంపతుల దీవించి యగస్త్యాదిమ
హర్షులు యథాస్థానంబులకుం జని రంత.

204


క.

అతిభోగభాగ్యమహిమా, న్వితు లై యతిథులను నిచ్చనిచ్చలు గరుణా
మతిఁ బ్రోచుచు అద్దంపతు, లతులప్రాభవనిరూఢి నలరిరి ధాత్రిన్.

205


క.

అని కమలజుఁడు ఋతుధ్వజ, జనపాలకుచరిత దివిజసంయమి కెలమిన్

వినిపించిన విని యాతఁడు, మనమున నత్యంతహర్షమగ్నుం డయ్యెన్.

206


సీ.

రహి మీఱ బ్రహ్మపురాణోక్త మగుచు గో, దావరీఖండంబు దనరు నందు
వృధ్రస్స్రవంతీసరిత్వతీసంగమ, మాహాత్మ్య మెపుడు సన హిమ నదియ్
రసికజనమనోభిరామం బనెడు పేరఁ, దెనుఁగున శాలివాహనశకాబ్ద
ములఁ గరిగిరిరసభూసంఖ్యఁ దద్దయు, వఱలుప్రమోదూతవత్సరమున


తే.

నీప్రబంధంబు రచియించి నీ కొసఁగితి, నిందుశేఖర నీకృప నిది ధరిత్రి
నాసుధాకరతారార్క మగుచుఁ గవిజ, నోత్తములయిండ్ల నేప్రొద్దు నుండుఁ గాత.

207


చ.

పరమకృపాలవాల నిజభక్తజనావనశీల శత్రుభీ
కరఖరశూల భావభవగ..నివారణమూల శోభనా
కరగుణజాల భవ్యతరంగం... గజాజినచేల తాపసో
త్కగనుతిలోల నిర్మధితకాల నిశాముఖలాస్యఖేలనా.

208


క.

పవనాశన హరబుద్ధో, పవనావళినవవసంత ప్రథికమహీభృ
ద్పవనా భవనాళీకో, ద్భవనానాక్రతుభుగవన పరివృతభువనా.

209


మాలిని.

శరనిధివరతూణా సత్యవాక్యప్రమాణా
పరిహృతసుమబాణా పంకజాతాక్షబాణా
పరికలితకృపాణా భక్తరక్షాధురీణా
సరవృషజుహురాణా పాణీపద్మాంచదేణా.

210


గద్యము.

ఇది శ్రీమత్కుక్కుటేశ్వరకరుణాకటాక్షనిరీక్షణసంలబ్ధసరసకవితాసామ్రా
జ్యధురంధర ఘనయశోబంధుర కౌండిన్యసగోత్రపవిత్ర కూచిమంచిగంగనామాత్యపు
త్త్ర సకలసంస్కృతాంధ్రలక్షణకళాకౌశలాభిరామ తిమ్మకవిసార్వభౌమప్రణీతం
బైనరసికజనమనోభిరామం బనుశృంగారరసప్రబంధంబునందు సర్వంబును షష్టా
శ్వాసము.

శ్రీకామేశ్వరీపరదేవతార్పణ మస్తు.