పుట:Womeninthesmrtis026349mbp.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

80

స్మృతికాలపుస్త్రీలు

     దంద్రంవ్యాధితం మూర్ఖం భర్తారంయం౽వమన్యతే
     సాశునీజాయతే మృత్వాసూకరీచ పున: పున:
(పరాశర 4-16)

(దరిద్రుడు, వ్యాధితుడు, మూర్ఖుడు, నగు భర్తనే స్త్రీ యవమానించునో యామె కుక్కయై జన్మించును. అనేక జన్మలలో కుక్కయు పందియు నగుచుండును.)

పైన వర్ణింపబడిన పాతివ్రత్యము స్థిరమైనదనుట ప్రధానాంశము. ఈ స్థిరత్వము వధువునకు వివాహములోనే బోధింపబడును. ఎట్తి పరిస్థితులలోను గూడ నామె భర్తను వీడక రాతివలె స్థిరముగ నుండవలెననుటకై యామెను వివాహములో నొకరాతిపై నెక్కింతురు.

అశ్మానమాస్థావ యత్యాతిష్ఠేతి

(ఆ.గృ.సూ. 2-5-2)

'ఆతిష్ఠేమమశ్మానమశ్మేనత్వగ్ స్థిరాభవ' అనుమంత్రమును చదువుచు నామెను రాతిపై నెక్కింపవలెనని దీనియర్థము. 'ఈ రాతి నధిష్ఠింపుము, దీనివలనే స్థిరురాలవుగ నుండుము' అని యీ మంత్రమున కర్థము.

పురుషుడుకూడ భార్య నట్లే యెన్నడును వదలరాదు. కాని భార్య యెట్టిదైనను నాతడు వదలరాదను నియమము లేదు. సాధ్వినెన్నడును వదలరాదను నియమము మాత్రము గలదు.