పుట:Womeninthesmrtis026349mbp.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాధ్యాయము

43

(కపిలవర్ణముగల కేశములుగల్గినదానిని, పెద్దశరీరము గలదానిని, రోమములు హెచ్చుగ గలదానిని, మిక్కిలి మాట్లాడుదానిని, పచ్చనికన్నులు గలదానిని వివాహమాడరాదు.)

ఏకన్యయొక్క యక్కకు వివాహము కాలేదో యట్టి కన్యను వివాహమాడరాదని స్మృతులు చెప్పుచున్నవి. అట్లు వివాహమాడబడిన కన్యతకు 'అగ్రేదిధిషువు' అని పేరు.

    జ్యేష్ఠాయాం యద్యనూఢాయాం
    కన్యాయత్రో హ్యాతేనుజా!
    సాచాగ్రేదిధిషూర్జ్ఞేయా
    పూర్వాచదిధిషూస్మృతా.

(జ్యేష్ఠసోదరి యవివాహితయై యుండగానే కన్య వివాహమాడునో, యాకన్య 'అగ్రేదిధిషు' వని చెప్పబడును. అజ్యేష్ఠసోదరికి దిధిషువని పేరు)

దేవలస్మృతి యీ నిర్వచనము నిచ్చుచున్నదని మాధవాచార్యులు (పరాశరమాధవీయము 4-24 ) చెప్పుచున్నారు. కాని యా దేవలస్మృతి మనకిపుడు లభ్యమగుట లేదు.

అగ్రేదిధిషువును వివాహమాడినవాడు పండ్రెండు దినములు కృచ్ఛ్రములు చేసికొనవలెనని వసిష్ఠస్మృతి చెప్పుచున్నది.