పుట:Womeninthesmrtis026349mbp.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30

స్మృతికాలపుస్త్రీలు

పురుషుని వివాహవయస్సును నిర్ణయించుటకు మఱొక మార్గము కలదుగాని యది యింత విశదమైనది కాదు. ఎట్లన బ్రాహ్మణున కెనిమిదవయేటను, క్షత్రియునకు పదునొకండవ యేటను, వైశ్యునకు పండ్రెండవయేటను నుపనయనము చేయవలెనని యన్నిధర్మశాస్త్రములును చెప్పుచున్నవి.

ఉపనయనం బ్రాహ్మణస్యాష్టమే

(గౌ. 1-5)

ఏకాదశద్వాదశయోః క్షత్రియవైశ్యయోః

(గౌ. 1-8)

పిమ్మట పండ్రెండు కాని యిరువదినాల్గు కాని ముప్పదియాఱు కాని సంవత్సరములు బ్రహ్మచర్యముచేసి వివాహము చేసికొనవలెనని యున్నది.

    ద్వాదశవర్షాణ్యేకవేదే బ్రహ్మచర్యంచరేత్
    ప్రతిద్వాదశవర్షంవా సర్వేషు.

(గౌ.ధ.సూ.2-51, 52)

దీనిని బట్టి పురుషుడిరువదేండ్లకు లోపున వివాహమాడరాదని మాత్రమే తేలుచున్నది. కావున నిది పైనవేయబడిన లెక్కకు విరుద్ధముకాదు.

__________