పుట:Womeninthesmrtis026349mbp.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాధ్యాయము

29

   గృహస్థస్తుయదాపశ్యేద్వలీ పలిత మాత్మన:
   అపత్యస్యైవచాపత్యంతదారణ్యం సమాశ్రయేత్

(మ 6-2)

(గృహస్థెప్పుడు తన ముడతలను, తలనెఱపును, మనుమని చూచునో యపుడరణ్యమునకు పోవలెను.)

ఇట్లు వానప్రస్థములో చేరునప్పటికి ననగా నాయువులో మూడవభాగము (ఏబదియొకటవయేడు) ప్రవేశించునప్పటికి మనుమడు కలుగవలెననిచో నాతడు సుమారిరువది యారేండ్లపుడు కుమారుని కనవలెను. ఈ విధముగా సుమారిరువదియైదవయేట పురుషునకు వివాహమగుట స్మృతి సమ్మతమని తేలుచున్నది. దీని ననుసరించియే మనువు ముప్పదేండ్ల వాడు పండ్రెండేండ్ల దానిని నిరువదినాల్గేండ్లవా డెనిమిదేండ్ల దానిని వివాహమాడవచ్చునని చెప్పినాడు.

   త్రింశద్వర్షోద్వహేత్కన్యాం హృద్యాం ద్వాదశవార్షికీం
   త్య్రష్టవర్షోష్టవర్షాంవా ధర్మేసీదతిసత్వర:

(మ 9-94)

(ముప్పడేండ్లవాడు మనోహారిణియైన పండ్రెండేండ్ల కన్యను వివాహమాడవలెను. ముందుగ వేదాధ్యయనము పూర్తిచేసి గార్హస్థ్యధర్మమును నిర్వహించుటకు వ్యర్థముగ కాలయాపనము చేయుట కిష్టములేనివాడు ఇరువదినాల్గవయేట నెనిమిదేండ్ల దానిని వివాహ మాడవచ్చును.)