పుట:Womeninthesmrtis026349mbp.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్మృతికాలపు స్త్రీలు

నవమాధ్యాయము

గౌరవము, స్వాతంత్య్రము

దాంపత్యము, కర్మకాండ, ధనము మున్నగు వంశములలో స్త్రీలకెట్టి స్థానమును స్మృతు లంగీకరించుచున్నవో యిదివరలో చూచియుంటిమి. కాన వారి గౌరవ స్వాతంత్య్రములు గూడ కొంతవఱకు మనకు వ్యక్తములైనవి. స్త్రీల గౌరవస్వాతంత్య్ర విషయములలో పూర్వాధ్యాయములలో పేర్కొనబడని యంశములను పేర్కొనబడినవానిలో ముఖ్యములగు వానిని నీయధ్యాయమున పరిశీలింతము.

జీవితములోని వివిధసందర్భములలో వివిధపరిమాణములుగల గౌరవము స్త్రీల కంగీకరింపబడినట్లే వివిధపదవులలోనుండు స్త్రీలకు గూడ వివిధపరిమాణములుగల గౌరవ మంగీకరింపబడినవి. అనగా తల్లికొక విధమగు గౌరవమును, భార్యకొక విధమగు గౌరవమును, కూతునకొకవిధమగు గౌరవమును వితంతువునకొక విధమగు గౌరవమును ఇట్లే యొక్కొక స్థానములోనున్న స్త్రీకొకవిధమగు గౌరవమును నంగీకరింపబడినవి. అందందఱికంటె మాతకు చూపబడిన గౌరవము సర్వాధికమై యొప్పుచున్నది.