పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాస్త్రులవారు ఆశ్లోకమునకు ఆయర్థము పొసగదనియు నది విపరీతార్థమనియు, 'శుక్లాంబరధరం' అనుశ్లోకమును గాడిదపరముగా నర్థముచెప్పిన నెట్లుండునో అట్లుండుననియు చెప్పెరి.

'ఎల్లాగండీ శాస్త్రులవారు, 'శుక్లాంబరధరం' అనేశ్లోకాన్ని మీరు గాడిదపరంగా ఎల్లాచెప్తారు. అని వారు ఆక్షేపించిరి.

అంతట శాస్త్రులవారు ఇట్లారంభించిరి. "శుక్ల=తెల్లనై నటువంటి, అంబర=వస్త్రములను, ధర=ధరించినదియు; అనగా మోయుచున్నట్టిదియు, చాకలిమూటలను మోయుచున్నట్టిదియు; విష్ణుం=వ్యాపించుచున్నట్టిదియు, ఒకచోటనుండక తిరుగుచునేయుండునట్టిదియు, శశివర్ణం=బూడిదరంగు గలిగినదియు, అనగా తెల్లగానుండునట్టిదియు, చతుర్భుజం=నాలుగు కాళ్లుగలదియు, ప్రసన్నవదనం=దానిముఖము ఎంత ప్రసన్నము! అట్టిదానిని అన్ని విఘ్నములును ఉపశమించుటకొఱకు థ్యానించుచున్నాను." అని.

"అయితే విఘ్నంరాకూడదని గాడిదనెందుకండీ థ్యానించడం" అని యాతడు మరల నాక్షేపించెను.

"ఓగాడిదా, మాయుపన్యాసమునకు అడ్డు రాకుమా, మేము ప్రారంభించినపనికి మాటిమాటికి అడ్డురాకుమా' అని మాప్రార్థన" అని బదులుచెప్పిరి. ఈవాక్యముతో సభయెల్ల గొల్లున నవ్వసాగెను, ఆప్రాశ్నికుడు మఱి నోరెత్తక కూర్చుండెను.