పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

వేదము వేంకటరాయశాస్త్రులవారి జీవితము


వెనుక వితంతువివాహవాదముల నన్నిటిని చేర్చి యొక గ్రంథముగా వ్రాసియుంచుకొనిరి. ప్రకటించుట ధనసాధ్యమైన విషయము. కావున ప్రకటనము ఆలస్యమగుచుండెను. ఇట్లుండగా తిరువలిక్కేణిలో నొక రావుగారు ఈవాదములను మరల రేపి కొంతప్రచారము జరిపించి, కొందఱు పెద్దలచేత చందాలు వేయించి (ఏతత్సందర్భమున తమకును కొంత ఋణనివర్తియగునట్లు చేసికొని) లోకమును బాగుపఱుపనెంచియుండిరి. ఈరావుగారియింట ప్రతి శనివార ఆదివారములు పండితగోష్ఠులును వాదప్రతివాదములును జరుగుచుండెడివి. ఒక పండితుడు అది పనిగా శాస్త్రులవారికడకువచ్చి వారు వ్రాసి యుంచుకొనియుండిన యాగ్రంథములలోని విషయములనుచూచి వ్రాసికొనుచు, శాస్త్రులవారినడిగి సందేహములను తీర్చుకొనుచు, శాస్త్రులవారి కాలమునంతయు హరించుచుండెను. అతడు ఆరావుగారియింట ఉపన్యాసములు సయితము చేయుచుండెను. శాస్త్రులవారు తమ కాలమంతయు నిట్లు పోవుటకు సహింపక ఒకదినము ప్రొద్దుననే బయలుదేరి ఆపుస్తకమునే ఆతని కిచ్చివేసిన బాగుండుననియు ఇక నాదినమునుండి ఆతడు తనకడకురాడనియు తలంచి తిరువలిక్కేణికి బయలుదేరిరి. అతనియింటికిపోగా నాతడు యింటలేడు. ఆతనిబంధు వొకడుండి 'అయ్యా, ఆయన ఫలాని రావుగారియింటికి పోయియున్నారు. తాము అక్కడికిపోకండి. తమకు అక్కడ అవమానంజరుగుతుంది' అనెను.