పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

129

వచ్చినదనియు, బీదవారిలో నెవ్వరయిన నొకశాఖవారితో నింకొకశాఖవారు వియ్యమందెడుపక్షమున తాను ధన సాహాయ్యమును జేసెదననియు, చెప్పెను. ఈప్రకారముగానే వివాహాదులయందు భూరిసంభావనలు మొదలయిన దుర్వ్యయముల నొకానొకఁడు సంస్కారప్రియత్వము చేతనే మానివేసినను జను లాతనిని లోభియనియే భావించి గేలి చేయుదురుగాని సంస్కారప్రియుఁడని యెంచి శ్లాఘనచేయరు. ఆకాలమునందు రాజమహేంద్రవరమునను తత్ప్రాంతములయందును వివాహాదిశుభకార్యములయందు బంధుమిత్రాదులను భోజనములకుఁ బిలుచునప్పు డందఱిని యజమానుఁడు స్వయముగాఁ బోయి పిలిచి రావలెను. ఒక్కఁడు ప్రతిగృహమునకును బోవుట మిక్కిలికష్టముగా నుండుచు వచ్చెను. స్వయముగాఁ బోయిపిలువక యెవ్వరినైనను బంపి పిలిపించినపక్షమున నెవ్వరును భోజనములకురారు. ఈకష్టమును వారించుటకయి మేము రెండు సభలుచేసి, భోజనములకుఁ బిలుచుటకయి స్వయముగాఁ బోవుటకుమాఱుగా నాహ్వానపత్రికలను బంచుట యుచితమనియు తన్మూలమున కాలహరణమును కష్టమును తొలఁగుటయే కాక యనేకవిధముల సౌలభ్యము కలుగుననియు బోధించితిమిగాని, అట్లు పూర్వాచారవిరుద్ధమైనపని చేసి చాకలవానిచేతను మంగలివానిచేతను చీట్లుపంచి దొరలవలె భోజనములకు పిలిపించినయెడల బ్రాహ్మణజాతిగౌరవమే పోవు నని పూర్వనాగరికులు వాదించి మాప్రయత్నము సాగనీయక పోయిరి. ఇఁక నట్టివారితో వాదముచేసి యుక్తిబలము చేత వారి నొప్పించుట యసాధ్యమని యెంచి యీనూతనపద్ధతి కనుకూలముగా నున్న వాఱమందఱమును జేరి మాలోమేము పత్రికల మూలముననే భోజనములకు పిలుచుకొనుట కేర్పాటు చేసికొని యట్లుచేయఁ జొచ్చితిమి.

మనదేశములో శవములను స్మశానములకుఁ గొనిపోయెడువిధమును, శవములను ఖననము చేసెడువిధమును, నాగరికులచే గర్హింపఁ దగినవిగానున్నవి. ఎంతగౌరవము కలవారినైనను, ఎంతధనముగలవారినైనను, మరణము కలుగఁ గానే రెండు వెదురు కఱ్ఱలమీఁదవేసి కట్టి పిల్లలును స్త్రీలును జడిసికొను