పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ప్రకరణము.

97

దఱికి న్యాయవాది పట్టాలనిమ్మనివ్రాసిరికాని పరీక్షాసిద్ధులుకారన్న కారణముచేత మామండలన్యాయాధిపతిగారు వారికిపట్టాలనియ్యలేదు. అయినను మామండలన్యాయాధిపతిగా రటుతరువాత పరీక్షాసిద్ధులు కానివారికి కొందఱికి పట్టాల ననుగ్రహించిరిగాని యొకప్రాడ్వివాకుఁడు వ్రాసినమీఁదట నిచ్చిన పట్టాలను మరల లాగుకొనిరి. అంతట నొక క్రొత్త సిరస్తాదారు వచ్చెను. ఈయనమంత్రిత్వకాలములో న్యాయవాదిపట్టా లెల్లవారికిని కొల్లలుగా నీయఁబడఁ జొచ్చెను. మొట్టమొదట న్యాయవాదులయొద్ది లేఖకులకు మాత్రమే పట్టా లియ్యఁబడెను; తరువాత న్యాయవాదులయొద్దినుండి యోగ్యతాపత్రికలను దెచ్చుకొన్నవారి కందఱికిని పట్టా లియ్యఁబడెను. ఇట్లు కొన్ని మాసములలో దాదాపుగా నెనుబదిమందికి పట్టాలను బడయుభాగ్యము లభించెను. వీరిలో నొక్కరును పరీక్ష నిచ్చినపాపమునఁబోయినవారు లేరు; పెక్కండ్ర కింగ్లీషు భాషావాసన యైనను లేదు. ఇట్లు పదిమందికి మండల న్యాయసభలోను, డెబ్బదిమందికి ప్రాడ్వివాకన్యాయసభలలోను పట్టాలు లభించినవి. ఎక్కడనో యెవ్వరోకాని లోకములో సాధారణముగా లాభములేనిపనిలోఁ బ్రవేశించువా రుండరు. అందుచేత మామండలన్యాయసభలోని న్యాయవాదులు కొందఱు తా మావఱ కంతగా ధనార్జనము చేయఁగలిగినవారు కాక పోయినను యోగ్యతాపత్రికాప్రదానమూలమున ధనసంపాదనము చేయఁగల వా రైరి. దేవుఁడు వర మిచ్చినను పూజారి వర మియ్యఁడన్న సామెత సుప్రసిద్ధమే కదా ! పైయట్లు చౌకగా యోగ్యతాపత్రికలను సంపాదించుకొనిన వారికిసహితము కొందఱకు పట్టాలు రాకుండెను. వారివిన్నపములు దొరగారిని జేరుటకయి మధ్య నింకొకముడుపు చెల్లింపవలసి యుండెను. ఈరెండవ ముడుపును చెల్లింపనివారిపేరులు మండలన్యాయాధిపతి గారి సమక్షమునకుఁ బోనే పోవు. ఈయక్రమమును సహింపక మావివేకవర్ధని పరీక్షాసిద్ధులు కాని వారికి పట్టాల నిచ్చుట యన్యాయమని ఘోషింప నారంభించెను. దాని మొఱ్ఱను విని 1878 వ సంవత్సరాం తమున నున్న తన్యాయసభవా రట్లు పట్టా