పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

స్వీయ చరిత్రము.

లేల యియ్యఁబడినవో తెలుపవలసినదని మామండలన్యాయాధిపతిగారి నడిగిరి. న్యాయవాదిపట్టాలవిషయమునఁ గొన్ని ముఖ్యాంశములను దెలుపుటకయి 1879 వ సంవత్సరము జనవరినెల 23 వ తేది మధ్యాహ్నము మూడుగంటలకు తమన్యాయసభకు రావలసినదని మామండలన్యాయాధిపతిగారు గతదినము మధ్యాహ్నమున నా కాజ్ఞాపత్రమును బంపిరి. పట్టాలవిషయమున నేమో చెప్పవలసియుండునని నా కాయాజ్ఞాపత్రికవలన బోధపడినను, ఉన్నతన్యాయసభవా రావిషయమున మండలన్యాయాధిపతిగారి నడిగినవార్తగాని నేను చెప్పవలసినవిషయ మేమో యదిగాని నాకుఁ దెలియలేదు. అందుచేత నే నేమి చెప్పవలెనో యేమి చేయవలెనో నాకేమియుతోఁచలేదు. ఇంగ్లీషుభాగమునకు ముఖ్యముగా వ్రాయుచు నాకుఁ బ్రాణమిత్రులుగా నుండిన గవర్రాజు గారైనను నాకాలోచనచెప్పుట కప్పుడు పట్టణములో లేక పట్టపరీక్ష నిచ్చు నిమిత్తమయి చెన్న పట్టణమునకుఁ బోయి యుండిరి. గవర్రాజుగారు గాక యింగ్లీషుభాగమున కేలూరి లక్ష్మీనరసింహముగారును, అప్పుడప్పుడు చిర్రావూరి యజ్ఞన్న శాస్త్రులుగారును వ్రాయుచుండిరి. నాకాజ్ఞాపత్రిక వచ్చినసంగతి యూరనంతటను ప్రకటనముకాఁగా నన్నుఁ జూచుటకయి నా మిత్రులైన కన్నమురెడ్డి పార్థసారథినాయఁడుగారును ఏలూరి లక్ష్మీనరసింహముగారును మాయింటికి వచ్చిరి. మేము ముగ్గురమును గలసి యప్పుడు చిర్రావూరి యజ్ఞన్న శాస్త్రిగారి యింటికిఁబోయితిము. ఆజ్ఞాపత్రికను జూచి యాయనయు విస్మయపడెనే కాని నా కేమియు తగిన యాలోచన చెప్పలేకపోయెను. అప్పటికి సాయంకాలమైనది. పోఁతగట్టుమీఁద గోదావరియొడ్డున నడువవలెనని మేము నలుగురమును బైలుదేఱితిమి. తాత్కాలికముగా మండలన్యాయసభలో సిరస్తాదారుగా నుండినకాజ రామకృష్ణారావుగారు దారిలో మా కెదురుపడిరి. ఆవఱ కాయన నాకు పరమమిత్రుఁడుగానుండినందున, ఆయనవలన సర్వమును దెలియునన్న నమ్మకముతో నే నాయనను బలుకరించితిని. ఆయన నామాట వినిపించుకోక యజ్ఞన్న శాస్త్రి గారివంకఁజూచి "నే